రజనీకాంత్ ఎన్డీయే వెంటే ఉంటారు...
చెన్నై: రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం ఖరారు కాగా, తాజాగా ఆయన ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపై కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితుడు, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తి స్వయంగా వెల్లడించారు. శుక్రవారం గురుమూర్తి ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రజనీకాంత్ త్వరలో రాజకీయాల్లోకి వస్తారని తెలిపారు. ఆయన కొత్త పార్టీ పెడతారని, రజనీ రాకతో చిన్న పార్టీలన్నీ కనుమరుగు అవుతాయని అన్నారు. అంతేకాకుండా రజనీకాంత్ ఎన్డీయే వెంటే ఉంటారని గురుమూర్తి తెలిపారు.
కాగా రజనీకాంత్ రాజకీయాల్లో రావాలని కొన్నేళ్లుగా అభిమానులు, పార్టీలకతీతంగా నాయకులు కోరుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం గత లోక్సభ ఎన్నికల సమయంలో చెన్నైలోని రజనీ ఇంటికి వెళ్లి ఆయన మద్దతు కోరారు. అయినా రాజకీయ రంగ ప్రవేశంపై రజనీకాంత్ తన మనసులోని మాటను ఎప్పుడూ బయటపెట్టలేదు. అయితే ఇటీవల అభిమానులతో ఆయన సమావేశమయ్యారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకునే సన్నాహాల్లో భాగంగానే రజనీకాంత్ ఇవన్ని చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఆయన సన్నిహిత మిత్రుడు చేసిన ప్రకటనతో రజనీ రాజకీయ ప్రవేశం ఖాయమన్న ప్రచారం పతాకస్థాయికి చేరింది. రజనీకాంత్ తన జన్మదినమైన డిసెంబర్ 12వ తేదీన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేస్తారని ఆయన స్నేహితుడొకరు వెల్లడించారు. రాజకీయాల్లోకి రావాలని రజనీ నిర్ణయించుకున్నారని, అభిమానులతో మరోసారి సమావేశమైన తరువాత డిసెంబర్ 12వ తేదీన బ్రహ్మాండమైన బహిరంగ సభను ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆయన మీడియాకు తెలిపారు.