రజనీకాంత్ అభిమానుల ఆగ్రహం
రజనీకాంత్ అభిమానుల ఆగ్రహం
Published Mon, Jun 26 2017 8:09 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
►సామాజిక మాధ్యమాల్లో అభిమానుల ట్వీట్లు
►స్వామిపై చర్యలకు పట్టు
►అర్జున్ సంపత్ హెచ్చరిక
సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు రజనీ అభిమానుల్లో ఆక్రోశాన్ని రగిల్చాయి. ఆందోళనల బాటకు దూరంగా సామాజిక మాధ్యమాల్లో ట్విట్లతో స్వామిపై దాడికి దిగారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని కమలం పెద్దలపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. రజనీని విమర్శించడం మానుకోకుంటే, తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని స్వామికి హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్ హెచ్చరించారు.
చెన్నై : దక్షిణ భారత చలనచిత్ర సూపర్ స్టార్ రాజకీయ ఆరంగ్రేటంపై రాష్ట్రంలో తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. తలైవా వస్తారన్న ఆశతో ఎదురుచూసే వాళ్లు, వ్యతిరేకించే వాళ్లు ఒకే స్థాయిలోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రజనీని ఉద్దేశించి బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ‘రజనీ ఆర్థిక నేరగాడు.. రాజకీయాల్లోకి రాకూడదు’ అన్నట్టు సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించడం తలైవా అభిమానుల్లో ఆక్రోశాన్ని రగిల్చింది. ఆందోళనతో తమ ఆగ్రహాన్ని ప్రదర్శించేందుకు నిర్ణయించినా, తలైవా అభిమానం వారిని కట్టిపడేసింది. తనను విమర్శించే వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనలు చేయకూడదని కథానాయకుడు విధించిన ఆంక్షలతో అభిమాన సేనలు వెనక్కుతగ్గారు. అయితే, సామాజిక మాధ్యమాల్లో స్వామిపై దాడికి దిగడం గమనార్హం.
అభిమాన సేనల్లో ఆగ్రహం
రజీన అభిమానులు తమ ఆగ్రహాన్ని ఆందోళనతో కాకుండా ట్విట్లతో చూపించారు. ఫేస్ బుక్, ట్విటర్ వంటి తలైవా సేనల్లో ఆక్రోశం సామాజిక మాధ్యమాల్లో రజని అభిమాన గ్రూప్స్, ప్రపంచ రజనీ అభిమాన సంఘం, తదితర సంఘాల పేరిట స్వామిపై ముప్పేట దాడి చేశారు. బాబు అనే అభిమాని తన ట్వీట్‌లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీలో కూర్చుని పదే పదే ఎవరి మీద పడితే వారి మీద ఆరోపణలతో ›ప్రకటనలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. సురేష్ అనే అభిమాని కాస్త సున్నితంగా, రాజకీయాల్లో పెద్ద వాడిగా ఉంటూ, ఇదేంటీ.. నీచపు రాజకీయాలు అని మందలించారు. గణేషన్ అనే అభిమాని మరింత దూకుడుగా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటే, తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ నాయకుడు అభిమానం, ఆంక్షలు కట్టి పడేసి ఉన్నాయని లేకుంటే, తామేమిటో రుచి చూపించి ఉంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరి కొందరు అభిమానులు అయితే, రజనీ కోసం గాలం వేస్తున్న కమలం పెద్దలు ఏమయ్యారని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి రావాలని, తమతో చేతులు కలపాలని పదేపదే పిలుపు నిస్తున్న ఆ పెద్దలు, సుబ్రహ్మణ్య స్వామిని కట్టడి చేయడంలో ఎందుకు విఫలం అవుతున్నారని మండి పడ్డారు. నిజంగా రజనీ మీద అభిమానం ఉంటే, సుబ్రహ్మణ్య స్వామిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఇక, హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్ ఒక అడుగు ముందుకు వేసి తస్మాత్ జాగ్రత్త అన్న హెచ్చరికతో ప్రత్యేక ప్రకటనను విడుదల చేయడం గమనార్హం. ఇక నైనా, రజనీని విమర్శించడం మానుకోకుంటే, స్వయంగా రంగంలోకి దిగి ఆందోళనలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Advertisement
Advertisement