రజనీకి స్వామి షాక్
♦ ఆయనో ఆర్థిక నేరగాడు
♦ ఆధారాలు ఉన్నాయి
♦ రాజకీయాల్లోకి రావొద్దు
♦ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు
సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా.. రారా అని తమిళనాడుతోపాటు దేశమంతా ఎదురుచూస్తున్న తరుణంలో బీజేపీ అగ్రనేత సుబ్రహ్మణ్యస్వామి ఆయనకు షాకిచ్చారు. నీవో ఆర్థికనేరగాడివి, రాజకీయాల్లోకి రావొద్దు అంటూ హెచ్చరికను పోలిన సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. స్వామి అంతటితో సరిపెట్టుకోలేదు...రజనీకాంత్ ఆర్థికనేరాలకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయనే బాంబును సైతం పేల్చారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో గత నెలలో ఐదు రోజులపాటు రజనీకాంత్ అభిమానులతో సమావేశమయ్యారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. తమిళనాడులో అవినీతి పెరిగిపోయింది, రాజకీయ వ్యవస్థ దెబ్బతినిందని ప్రసంగించారు. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తాను అంటూ సంకేతాలు ఇచ్చారు. నాకంటూ ఒక వృత్తి, బాధ్యతలు ఉన్నాయి, మీకు కూడా వృత్తి, ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి..వాటిని నిర్వర్తించండి అని ఉద్బోధించారు. యుద్ధం వస్తుంది...మాతృభూమిని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండండి అంటూ సందేశం ఇచ్చారు.
యుద్ధం అనే మాటలను అసెంబ్లీ ఎన్నికలుగా అందరూ విశ్లేషించుకున్నారు. ఇటీవల 16 మందితో కూడిన అన్నదాతల బృందం రజనీకాంత్‌ను ఇంటి వద్ద కలసి జాతీయ స్థాయిలో నదులన్నింటినీ అనుసంధానం చేయాలన్న వారి కోర్కెకు మద్దతు తెలిపారు. అన్నదాతల కోర్కెను ప్రధాని దృష్టికి తీసుకెళతానని, నదుల అనుసంధానానికి రూ.కోటి నిధులను విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమని రజనీకాంత్ ప్రకటించారు. చెన్నై విమానాశ్రయంలో ఇటీవల మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, రాజకీయ ప్రవేశంపై వివిధ పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నాను, ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు, రాజకీయాల్లోకి రావాలని తీర్మానించుకుంటే ముందుగా మీడియాకు చెబుతానని అన్నారు.
రాజకీయాల్లోకి రాదలుచుకుంటే బీజేపీలో చేరాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించారు. అయితే ఆ తరువాత తాను అలా అనలేదని ఖండించారు. రాజకీయాల్లో రాదలుచుకుంటే ఇదే సరైన సమయమని తమిళనాడుకు చెందిన బీజేపీ అగ్రనేత గురుమూర్తి వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన శూన్యతను పూడ్చేందుకు రజనీ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆహ్వానం పలికారు.
మోకాలొడ్డుతున్న స్వామి:
అయితే బీజేపీ నేతలంతా రజనీకాంత్‌కు స్వాగతం పలుకుతుండగా, అదే పార్టీకి చెందిన మరో అగ్రనేత సుబ్రహ్మణ్యస్వామి మోకాలొడ్డుతున్నారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీతో రాజకీయ ప్రవేశంలా రజనీ వైఖరి ఉందని,æ బీజేపీలోకి వస్తారని తాను భావిస్తున్నానని అన్నారు. అయితే ఆర్థిక నేరాలకు పాల్పడిన రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి ఎంత మాత్రం వీల్లేదని స్వామి వ్యాఖ్యానించారు. తనవి కేవలం ఆరోపణలు కాదు, ఆధారాలు ఉన్నాయని అన్నారు.
రాజకీయాల్లోకి రావాలనే ఆశలను రజనీ వదులు కోవాలని హెచ్చరికలాంటి సూచన చేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్, కేంద్ర మాజీ మంత్రులు రాజా, దయానిధి మారన్, కరుణానిధి భార్య దయాళుఅమ్మాళ్, కుమార్తె కనిమొళి తదితరులపై అవినీతి ఆరోపణలు చేసి కేసులు పెట్టిన ఘనత సుబ్రహ్మణ్య స్వామిదే. వారిలో కొందరు జైళ్లలో మగ్గిపోతుండగా, మరికొందరు సీబీఐ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా సుబ్రహ్మణ్యస్వామి కన్ను రజనీకాంత్‌పై ఆర్థికనేరాల అస్త్రం ప్రకటించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.