- పంచాయతీల దుస్థితి
- పన్నుభారం మోపినా అదే పరిస్థితి
- పాలకవర్గాలు లేనిచోట మరింత అధ్వానం
- పట్టించుకునే నాథుడే కరువు
అమలాపురం : పంచాయతీల్లో ఇంటి పన్నుతోపాటు పనిలో పనిగా ఆస్తి విలువ కూడా పెంచిన చంద్రబాబు సర్కారు సామాన్యులపై మోయలేనంత భారం మోపింది. ఇలా పన్నులు పెంచడం ద్వారా పంచాయతీల సాధారణ నిధులు పెరుగుతాయని, చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. తీరా చూస్తే పెంచిన పన్ను మొత్తాన్ని నిలబెట్టి వసూలు చేస్తున్న పంచాయతీ పాలకులు, అధికారులు.. ఆయా గ్రామాల్లో సమస్యల పరిష్కారాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నారు. కోటి రూపాయల ఆదాయం పెరిగిన పంచాయతీల్లో సహితం వేల రూపాయల్లో ఖర్చయ్యే పనులు కూడా చేపట్టడం లేదు. ప్రజారోగ్యానికి కీలకమైన తాగునీటి సరఫరా, మురుగునీటి డ్రైన్ల ఆధునికీకరణ వంటి వాటిని పట్టించుకోవడంలేదు. రోడ్ల గురించైతే చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. గోతులు పడి, కొద్దిపాటి వర్షానికే అవి బురదమయమవుతున్నాయి. చాలా గ్రామాల్లోని శివారు ప్రాంతాల్లో తాగునీరందడంలేదు. విద్యుద్దీపాలు కూడా వెలగక అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ నగరాలను ఆనుకొని ఉన్న పలు గ్రామాల ఆదాయం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు పట్టణాలకన్నా నగరాలను ఆనుకొని ఉన్న పంచాయతీల్లో అపార్ట్‌మెంట్లు, భవనాల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. హైవేలు, ప్రధాన రహదారులకు చేరువలో కమర్షియల్ కాంప్లెక్సులు సహితం ఏర్పాటవుతున్నాయి. దీంతో ఈ పంచాయతీల ఆదాయం రెండు మూడు రెట్లు పెరిగింది. విచిత్రంగా ఇక్కడే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొరేషన్లలో ఆయా పంచాయతీలను విలీనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం, దీనిని వ్యతిరేకిస్తూ కొంతమంది కోర్టులను ఆశ్రయించడంతో అక్కడ ఎన్నికలు లేకుండా పోయాయి. ఫలితంగా ఆయా పంచాయతీల్లో అధికారుల పాలనే సాగుతోంది. ప్రజల తరఫున ఎన్నికైన పాలకవర్గాలు లేకపోవడంతో సమస్యలు పట్టించుకునేవారే లేకుండా పోయారు. అనపర్తి మేజర్ పంచాయతీ పరిస్థితి కూడా అంతే. వందలు, వేల రూపాయల పన్నులు చెల్లిస్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక‍్తం చేస్తున్నారు.
ఏ పంచాయతీ చూసినా సమస్యలే..
- రాజమహేంద్రవరం నగరపాలక సంస్థను ఆనుకొని ఉన్న పంచాయతీల ఆదాయం రెండు మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం నగర విస్తరణ అంతా పంచాయతీల్లోనే సాగుతోంది. ముఖ్యంగా హకుంపేట, ధవళేశ్వరం, బొమ్మూరు, కోలమూరుల్లో అపార్ట్‌మెంట్ల సంస్కృతి గణనీయంగా పెరిగింది. ఇంటి పన్నులు పెంచడంతో ›ప్రతి పంచాయతీ ఆదాయం రూ.కోటికి పైగా పెరిగింది. అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ప్రధాన డ్రైన్ల నిర్మాణం జరగడం లేదు. దీంతో జనావాసాలను మురుగునీరు ముంచెత్తుతోంది. ఈ పంచాయతీలకు పాలకవర్గం లేదు. నగరంలో విలీన ప్రతిపాదనతో ఈ పంచాయతీలకు ఎన్నికలు లేవు. అధికారుల పాలనలో వీటిల్లో అభివృద్ధి అతీగతి లేకుండా పోయింది.
- కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ ఆదాయం రూ.3 కోట్లకు చేరింది. ఇంద్రపాలెం, వాకలపూడి, వలసపాకల, తూరంగి పంచాయతీల ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఆదాయంతోపాటు ఈ గ్రామాల్లో సమస్యలు కూడా పెరుగుతున్నా పట్టించుకునేవారే లేరు. రమణయ్యపేటలో డ్రైనేజీ సమస్యల తీవ్రంగా ఉంది. నూతన నిర్మాణాలకు అనుగుణంగా ఇక్కడ డ్రైనేజీలను విస్తరించకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. కొద్దిపాటి వర్షం వస్తే చాలు రహదారులు ముంపునకు గురవుతున్నాయి.
- అనపర్తి పంచాయతీకి ప్రస్తుతం పాలకవర్గం లేదు. దీనిని ప్రభుత్వం నగర పంచాయతీగా ప్రకటించగా, వివాదం కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలు లేకుండాపోయాయి. ఒకవిధంగా ఇది మున్సిపాలిటీతో సమానం. అధికారుల పాలన పుణ్యమా అని స్థానికుల సమస్యలను పట్టించుకునేవారే లేరు. పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా తయారైంది.
- సామర్లకోట మండలం వేట్లపాలెంలో పంచాయతీ ఆదాయం గతంలో రూ.52 లక్షలు కాగా, ఇప్పుడు ఆదాయం రూ.1.20 కోట్లు. ఆదాయం రెట్టింపైనా ఇక్కడ డ్రైన్లు, రోడ్లు అధ్వానంగా కనిపిస్తున్నాయి.
- అమలాపురం మండలం ఈదరపల్లి పంచాయతీ ఆదాయం రూ.8 లక్షలు కాగా, ఇప్పుడు ఏకంగా ఐదురెట్లు పెరిగి రూ.40 లక్షలు అయ్యింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నాయి. కామనగరువు పంచాయతీ ఆదాయం రెండు రెట్లు పెరిగినా సమస్యలు పరిష్కారం కాలేదు.
- జిల్లాలోని కీలకమై గ్రామ పంచాయతీల్లో రావులపాలెం ఒకటి. కోనసీమకు ఒకవిధంగా వాణిజ్య రాజధాని. ఈ పంచాయతీ ఆదాయం రూ.1.24 కోట్లకు పెరిగింది. ఇక్కడ ప్రధాన డ్రైన్, దాని నిర్వహణ తీరు చూస్తే ప్రజలపై పాలకులకు ఏపాటి శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. పట్టణంలో దోమలు పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.