శ్రావణ గోదావరి
-
ఆరో రోజు 36,474 మంది స్నానాలు
-
పెరుగుతున్న వరద
-
అప్రమత్తమైన అధికారులు
-
ఆలయాలకు శ్రావణ కళ
సాక్షి, రాజమహేంద్రవరం:
శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో గోదావరి అంత్యపుష్కరాల్లో ఆరో రోజు భక్తకోటి పుణ్యస్నానాలతో పులకించింది. ఘాట్ల వద్ద ఉన్న ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. ఆరో రోజు జిల్లా వ్యాప్తంగా 36,474 మంది భక్తులు స్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరంతోపాటు కోటిపల్లి, రాజోలు, అంతర్వేది, అయినవిల్లి తదితర ఘాట్లకు భక్తులు తరలివచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలు పుణ్యస్నానాలు చేస్తున్నారు. రాజమహేంద్రవరంలోని ఎనిమిది ఘాట్లకు 25,574 మంది భక్తులు వచ్చారు. మిగతా ఘాట్లకంటే పుష్కరఘాట్‌కు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఇక్కడ 16,910 మంది భక్తులు స్నానాలు ఆచరించారు. మధాహ్నం 12 గంటల తర్వాత భక్తుల రాక మందగించింది. ఆసియాలోనే అతి పెద్ద కోటిలింగాల ఘాట్ భక్తులు లేక వెలవెలబోతోంది. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరికి వరద పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజమకుమారి ఘాట్ల వద్ద పరిస్థితిని పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు ఇచ్చారు. భద్రత నిమిత్తం రేవులో ఏర్పాటు చేసిన పడవల్లో మత్యకారులతోపాటు పోలీసు సిబ్బందిని ఉంచుతున్నారు. వరద ఉధృతికి పడవలు కొట్టుకుపోకుండా తాడుతో ఘాట్లలో ఉన్న ఇనుప పిల్లర్లకు కట్టారు. జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి టి.ఉదయ్‌కుమార్ ఘాట్లను పరిశీలించారు.
వాలంటీర్ల సేవలకు ప్రాధాన్యం ...
గోదావరి అంత్యపుష్కరాల్లో 2800 మందితో పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది. వీరిలో ఉభయ గోదావరి జిల్లాల సిబ్బంది ఉన్నారు. కృష్ణ పుష్కరాల నేపథ్యంలో బయట ప్రాంతాల సిబ్బందిని అక్కడకు పంపేందుకు అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. అర్బన్ జిల్లా పోలీసులతోనే ఆదివారం నుంచి ఘాట్ల వద్ద బందోబస్తు నిర్వహించనున్నారు. ఫలితంగా స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు, వివిధ కళాశాలలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ విద్యార్థుల సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. చివరి మూడు రోజులు ఒడిస్సా, పశ్చిమబెంగాల్ భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో యంత్రాంగం అప్రమత్తమవుతోంది.
హారతికి పోటెత్తిన భక్తులు..
శ్రావణ శుక్రవారం కావడంతో పుష్కరఘాట్ వద్ద నిర్వహిస్తున్న గోదావరి హారతిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంత్యపుష్కరాల సందర్భంగా ఆనం కళా కేంద్రంలో నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. శుక్రవారం రాజమహేంద్రవరం షిరిడి సాయి నాట్య కళా సమితి ప్రదర్శించిన సత్య హరిశ్యంద్ర నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కోటిలింగాల ఘాట్ వద్ద ఉన్న తెరపై నగరపాలక సంస్థ ఇద్దరు మిత్రులు చిత్రాన్ని ప్రదర్శించింది.
జిల్లాలో ఘాట్ల వారీగా స్నానాలు ఆచరించన భక్తుల సంఖ్య
ఘాట్ భక్తుల సంఖ్య
1.కోటిలింగాలఘాట్ 5,265
2.పుష్కరఘాట్ 16,910
3.మార్కండేయఘాట్ 217
4.టీటీడీ ఘాట్ 278
5.శ్రద్ధానందఘాట్ 96
6.పద్మావతిఘాట్ 399
7.గౌతమిఘాట్ 1,069
8.సరస్వతిఘాట్ 1,340
9.రామపాదాల రేవు 1.315
10.మునికూడలి 637
11.కోటిపల్లి 1,132
12.అప్పనపల్లి 2.610
13.అంతర్వేది 1,500
14.వాడపల్లి 970
15.జొన్నాడ 2,850