- పల్లెపల్లోనూ ‘బెట్టింగ్’ బంగార్రాజులు
– రూ. లక్షల నుంచి రూ. కోట్లలోకి...
- విజేతలకు ఆన్‌లైన్‌లోనే పేమెంట్లు
– విస్తృత నెట్‌వర్క్‌తో వల విసురుతున్న బృందాలు
– పెడదారి పడుతున్న యువత
– ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్న పోలీసులు
ప్రధాన పట్టణాలకే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్ ఇప్పుడు పల్లెలనూ పట్టి పీడిస్తోంది. ధనవంతుల మధ్య సాగే లావాదేవీలు సామాన్య, మధ్య స్థాయి వర్గాలనూ భాగస్వామ్యులుగా చేస్తున్నాయి. విద్యార్థులు కూడా ఈ ఊబిలో కూరుకుపోతున్నారు. ఆన్‌లైన్ల ద్వారా ఈ జోరు ఊపందుకుంటోంది.
రాజమహేంద్రవరం క్రైం: క్రికెట్ బెట్టింగ్ ఒకప్పుడు డబ్బున్నవారికే పరిమితమయ్యేది. ఇప్పుడు పేద, మధ్య తరగతి యువత కూడా ఈ ఊబిలో కూరుకుపోతోంది. జిల్లాలో ప్రధాన నగరాలైన కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం తదితర పట్టణాలతోపాటు క్రమేపీ పల్లెలకు కూడా పాకింది. క్రికెట్ మ్యాచ్ చూడడమంటే ఒకప్పుడు వినోదం ... ప్రస్తుతం విస్తృతమైన నెట్‌వర్క్‌తో వ్యాపారంగా మారిపోయింది. ప్రతి మ్యాచ్‌కు చిన్నపాటి గ్రామం నుంచి కూడా లక్షల్లో నగదు చేతులు మారుతోందంటే ఏ స్థాయిలో ఈ వ్యాపారం సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
.విస్తృత నెట్‌వర్క్‌తో...
బెట్టింగ్ బృందాలు విస్తృతమైన నెట్‌వర్క్‌తో ముందుకు సాగుతున్నాయి. ప్రతి గ్రామంలో తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం ఖాళీగా ఉన్న యువతను నెలవారీ జీతాలతో ఎంపికచేసుకుంటున్నాయి. వెయ్యికి రూ.50 కమీషన్‌పై బెట్టింగ్ వసూళ్ళు చేస్తున్నట్లు చెబుతున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోని ఒక చిన్న మండలం నుంచే ఇటీవల జరిగిన ఒక కీలక మ్యాచ్‌కు సంబంధించి రూ.85 లక్షలు చేతులు మారినట్లుగా విశ్వసనీయ సమాచారం.
ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్న పోలీసులు..
ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమవుతున్నారు. ఒకప్పుడు ఒక గదిలో భారీగా సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు వంటి సరంజామాతో బెట్టింగ్ నిర్వహించేవారు. అయితే ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అని మొబైల్ బెట్టింగ్ బృందాలు రంగ ప్రవేశం చేశాయి. వీళ్ళు తరచూ ప్రదేశాలు మార్చుతూ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో వీరిని పట్టుకోవడం కష్టమవుతోందని పోలీసులు చెబుతున్నారు.
ఐపీఎల్ మ్యాచ్‌లకు కోట్లలో...
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) క్రికెట్ మ్యాచ్‌లకు బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఇంజినీరింగ్, వైద్య కళాశాల విద్యార్థులు ఈ బెట్టింగ్‌లలో జోరుగా పాల్గొనేలా బెట్టింగ్ ముఠాలు పావులు కదుపుతున్నాయి. గెలిచే జట్లుపైన, ఆ జట్టులో అత్యధిక స్కోర్ సాధించే క్రికెటర్‌పైనా, సిక్సర్లు, ఫోర్లుపైనా బెట్టింగ్‌లు కడుతుంటారు. ఫోన్ ద్వారా సాగే ఈ బెట్టింగ్ వ్యవహారమంతా ఆన్‌లైన్ ద్వారా పేమెంట్లు మార్పిడి జరుగుతోంది. సకాలంలో డబ్బులు చెల్లించని వారిని బుకీలు బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయి. ఈ వేధింపులను తాళలేక గత ఏడాది రాజమహేంద్రవరంలోని మెయిన్ రోడ్డులో హోల్ సేల్ ప్లాస్టిక్ వ్యాపారి కుమారుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది.
.అధికంగా అర్బన్ జిల్లాలోనే...
రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో మూడు పోలీస్ స్టేషన్లలో మూడు బెట్టింగ్ ముఠాలను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు.
- వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీవై కాలనీ వద్ద ఒక భవనంలో బెట్టింగ్ ముఠా స్థావరంపై దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేసి రూ. 1.60 లక్షలు, 8 సెల్‌ఫోన్లు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు.
- టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల్‌కట్ తోటలో ఒక క్రికెట్ బెట్టింగ్ ముఠాలో ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ . 92 వేలు నగదు, ఒక సెల్‌ఫోన్, ద్విచక్ర వాహనం, స్వాధీనం చేసుకున్నారు.
- త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాస్కర నగర్‌లో ఒక దంత వైద్యుడి ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ 1.48 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.