- చిన్నారుల కోసం..కార్యకర్తల బాట
- వచ్చే నెల 1 నుంచి ‘మన అంగన్‌వాడీ పిలుస్తోంది’
- 15 వరకు ప్రజల్లోకి కార్యక్రమాలు
- ఉత్తర్వులు జారీ చేసిన శిశు సంక్షేమ శాఖ కమిషనర్
రాయవరం (మండపేట) : పూర్వ ప్రాథమిక విద్యలో భాగంగా నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు కూడా చిన్నారుల కోసం తల్లిదండ్రుల వద్దకు వెళ్లనున్నాయి. అంగన్‌వాడీలు జూన్ ఒకటో తేదీ నుంచి బుడతల బాట పట్టనుంది ‘మన అంగన్‌వాడీ పిలుస్తోంది’ పేరుతో 15 రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు.
27 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో..
జిల్లాలో 28 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 5,546 అంగన్‌వాడీ కేంద్రాల్లోని కార్యకర్తలు, ఆయాలు చిన్నపిల్లలుండే ఇళ్ల వద్దకు వెళ్లనున్నారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ ఈ నెల 23న ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్లు నిండి మూడో సంవత్సరంలోకి అడుగిడిన చిన్నారులంతా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉండేలా వారి తల్లిదండ్రులను ఒప్పించేందుకు వీరంతా సమాయత్తమవుతున్నారు.
కార్యక్రమం జరుగుతుందిలా..
- జూన్ ఒకటో తేదీన అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారుల వివరాలపై నివేదిక తయారు చేస్తారు.
- 2వ తేదీన అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తారు.
- 3న గ్రామ పెద్దలు, చిన్నారుల తల్లిదండ్రులకు ప్రీస్కూల్ నిర్వహణపై అవగాహన కల్పిస్తారు.
- 5న గృహ సందర్శనాల ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లిదండ్రులను కలిసి వారిని అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించేలా ఒప్పించడం. - 6వ తేదీన జిల్లాలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాల భవనాలను ప్రారంభోత్సవం చేస్తారు.
- 7వ తేదీన అంగన్‌వాడీ కేంద్రాల్లోని ప్రీ స్కూల్‌కు సంబంధించిన మెటీరియల్‌తో ఎగ్జిబిషన్ ఏర్పాటు.
- 8,9 తేదీల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ పూర్తి చేసిన ఐదేళ్లు నిండిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి సర్టిఫికేట్లు అందజేసి ఒకటో తరగతిలో చేర్పించనున్నారు.
- 12వ తేదీ నుంచి 15వ వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో చేరిన ఐదేళ్లలోపు చిన్నారులందరితో అక్షరాభ్యాసం కార్యక్రమం చేపట్టనున్నారు.
వయస్సు ప్రకారం తరగతులు..
కాన్వెంట్లలో చిన్నారుల వయస్సుల ప్రకారం తరగతులు నిర్వహించనున్నారు. ప్రైవేటు కాన్వెంట్ల పోటీని తట్టుకునేందుకు వీలుగా అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా కాన్వెంట్ విద్యను అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎల్‌కేజీ, యూకేజీ తరహా విద్యను అందించేందుకు ప్రయత్నాలు చేస్తే మరిన్ని సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పలువురు విద్యావేత్తలు భావిస్తున్నారు.
విజయవంతం చేస్తాం..
జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి జరగనున్న ‘మన అంగన్‌వాడీ పిలుస్తోంది’ కార్యక్రమాలను విజయవంతం చేయాలి. గ్రామ సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్య, వైద్య, పంచాయతీరాజ్ తదితర శాఖల సహకారం తీసుకోవాలని ఇప్పటికే పీవోలకు ఆదేశాలిచ్చాం. ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గతేడాది అంగన్‌వాడీ కేంద్రాల్లో 30 వేల మంది చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్చుకున్నాం. ఈ ఏడాది మరింత ఎక్కువ మందిని అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు ప్రయత్నాలు చేపడుతున్నాం. చిన్నారులకు కాన్వెంట్ విద్యతోపాటు పౌష్టికాహారాన్ని పొందేలా చూస్తున్నాం. – టి.శారదాదేవి, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్, కాకినాడ.