‘బాబు’కు ఇంధ్రభవనం పేదలకు ‘చంద్ర’గ్రహణం
‘బాబు’కు ఇంధ్రభవనం పేదలకు ‘చంద్ర’గ్రహణం
Published Tue, Apr 18 2017 11:20 PM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM
- మూడేళ్లుగా ఇళ్ల కోసం లక్ష దరఖాస్తులు
- ఇందులో 60 వేలు ఆన్‌లైన్లో
- విమర్శలు వెల్లువెత్తగా జిల్లాకు 23 వేల ఇళ్లు మంజూరు
- మొదలు పెట్టిన ఇళ్లకు అరకొర చెల్లింపులు
- వై.ఎస్.హయాంలో ప్రతి ఏటా ఇళ్ల మంజూరే
- తరువాత వచ్చిన సీఎంల హయాంలో మంజైరైన వాటికీ గతి లేదు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిరుపేద, మధ్య తరగతి వర్గాలకు సొంత ఇంటి కల ఒక కలగానే మిగిలిపోయింది. ఎన్నికల్లో ఓట్ల కోసం ఎడాపెడా హామీలు గుప్పించేసిన చంద్రబాబు ఎన్నికలయ్యాక గాలికొదిలేశారు. సీఎం గద్దెనెక్కి మూడేళ్ల కాలంలో ముచ్చటగా మూడు ఇళ్లు కూడా నిర్మించిన దాఖలాలు జిల్లాలో లేవు. సొంత ఇంటి కల సాకారం చేసుకునేందుకు వేలాది మంది దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా ఒక్కటంటే ఒక్క ఇల్లు నిర్మించిన పాపాన పోలేదు. పేదల గోడు మాట దేవుడెరుగు సీఎం మాత్రం ఇంద్రభవనం లాంటి భవంతిలో ఇటీవలనే గృహ ప్రవేశం కూడా చేశారు.
ఎదురు చూపులు ... ఎండమావులు
సొంత ఇల్లు నిర్మించుకోవాలని మూడేళ్లుగా జిల్లాలో సుమారు లక్ష మంది దరఖాస్తు చేసుకుని గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. ఇది అధికారికంగా గృహనిర్మాణ సంస్థకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య మాత్రమే. ఈ లక్ష దరఖాస్తుల్లో సుమారు 60 వేల దరఖాస్తులను గృహనిర్మాణ సంస్థ ఆన్‌లైన్‌లో నమోదు చేసింది. గ్రామాల్లో పర్యటనలకు వెళుతున్న సందర్భంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న వారి నుంచి నిరసన ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ నేతలు మొత్తుకోగా ప్రభుత్వం ఆరు నెలలు క్రితం జిల్లాకు 23 వేల 348 ఇళ్లు మంజూరు చేసింది. వీటిలో 17 వేల 390 ఇళ్ల నిర్మాణాలను గత అక్టోబరు నెలలో లబ్థిదారులు ప్రారంభించారు. నెల రోజుల తరువాత నవంబరు నెలలో ఇళ్లు మొదలుపెట్టిన వారికి మాత్రం మొదటి విడత ఆన్‌లైన్‌లో అరకొర చెల్లింపులతో సరిపెట్టేశారు. మొదటి విడతగా ఒక్కో ఇంటికి 50 నుంచి 100 బస్తాలు సిమెంట్, రూ.6000లు నగదు చెల్లించారు. అంటే ఇళ్లు మొదలుపెట్టాక మొక్కుబడిగా ఒక నెల బిల్లులంటూ ఆర్భాటం చేసి ఆ తరువాత లబ్థిదారులను గాలికొదిలేశారు. 2016 డిసెంబర్ నుంచి నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు చెల్లించడం లేదు. ఆ రకంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 3.40 కోట్లు లబ్ధిదారులకు చెల్లించాల్సి ఉంది. పెండింగ్ బిల్లులు చెల్లించకపోగా డిసెంబరు నెల నుంచి ఇంతవరకు అంటే ఐదు నెలలుగా ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్న లబ్థిదారులకు చంద్రబాబు సర్కార్ చిల్లిగవ్వ విడుదల చేసిన దాఖలాలు లేవు. గడచిన మూడేళ్లుగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టకుండా ఆర్భాటపు ప్రచారాల్లో ప్రభుత్వం మునిగితేలుతుందన్న విమర్శలున్నా దున్నపోతుపై వర్షం పడ్డ చందంగా నేతలు పట్టించుకోవడం లేదు.
ఆ రోజులే వేరు...
చంద్రబాబు సర్కార్ మూడేళ్లలో ఒక్క ఇల్లూ నిర్మించని పరిస్థితి ఇలా ఉంటే మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004 నుంచి ప్రతి ఏటా దరఖాస్తు చేసుకొన్న ప్రతి లబ్ధిదారునికీ ఇల్లు మంజూరు చేశారు. వైఎస్ సీఎంగా ఉన్నంత కాలం జిల్లాకు ప్రతి ఏటా 60 వేలకు పైనే ఇళ్లు మంజూరు చేస్తూ వచ్చారు. మంజూరు చేయడమే కాకుండా ఒక్క రూపాయి బిల్లు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తూ వచ్చారు. వై.ఎస్. హఠాన్మరణం తరువాత కిరణ్ కుమార్‌రెడ్డి, రోశయ్య సీఎంలుగా ఉండగా నిర్మించిన సుమారు 18 వేల ఇళ్లు ఇప్పటికీ పలు దశల్లో నిలిచిపోయి మొండిగోడలతో వెక్కిరిస్తున్నాయి. ఈ ఇళ్ల లబ్థిదారులకు సుమారు రూ.12 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. చంద్రబాబు గద్దెనెక్కాక ఈ బకాయిల ఊసే ఎత్తడం లేదు. సరికదా కొత్తగా మంజూరుచేసి నిర్మాణం చేపట్టిన ఇళ్లకు కూడా పైసలు ఇవ్వడం లేదు. ఫలితంగా లబ్థిదారులు లబోదిబోమంటున్నారు. ఇళ్లు మంజూరయ్యాయి నిర్మాణాలు చేపట్టాలని హడావిడి చేశారు. తీరా ఇళ్లు మొదలుపెట్టాక బిల్లులు విడుదల చేయకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేక లబ్థిదారుల పరిస్థితి అయోమయంగా తయారైంది.
Advertisement
Advertisement