యువతను మత్తులో ముంచేశారు..
యువతను మత్తులో ముంచేశారు..
Published Wed, Jul 19 2017 11:49 PM | Last Updated on Fri, May 25 2018 2:29 PM
గంజాయి, నిషేధిత మందుల విక్రయాల గుట్టురట్టు
ఆరుగురు నిందితుల అరెస్ట్
రూ.2 లక్షలు స్వాధీనం
కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : తీగ లాగితే.. డొంక కదిలింది. ఏజెన్సీ నుంచి గంజాయి యథేచ్ఛగా జిల్లా నుంచి అక్రమంగా రవాణా అవుతున్నట్టు స్పష్టమైన నేపథ్యంలో.. తాజా సంఘటనను పరిశీలిస్తే.. గంజాయితోపాటు మత్తు కలిగించే మందులు జిల్లాలోనే గుట్టుగా విక్రయిస్తున్న వైనాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. యువత, విద్యార్థులు, కూలీలకు వీటిని విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో తేల్చారు. జిల్లా ప్రజలను దిగ్భ్రాంతి చెందేలా ఉన్న ఈ కేసు వివరాలను మంగళవారం జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ విలేకరులకు వివరించారు. యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాలు, గంజాయి మత్తులో ముంచి నిందితులు అక్రమార్జన చేస్తున్నారని అన్నారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఆయన వెల్లడించిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
మత్తు పదార్థాలు, గంజాయి యువతకు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో...నగరంలోని రేచర్లపేట, మిలటరీ రోడ్డులో ఉంటున్న పాత నేరస్తుడు బెజవాడ రవి ఇంటిపై పోలీసులు.. అర్బన్ తహసీల్దార్ బాలసుబ్రహ్మణ్యం, వీఆర్వోలతో కలిసి దాడి చేశారు. అక్కడ అంతర జిల్లా నేరస్తుడు పెమ్మాడి శివప్రసాద్ గంజాయి అమ్ముతుండగా అరెస్ట్ చేశారు. వీరి నుంచి 25 కిలోల గంజాయి, రూ.2,03,020 లక్షలు, 189 టోసెక్స్ కాఫ్ సిరఫ్, 197 ఎస్‌కుల్ప్ కాఫ్ సిరఫ్ బాటిళ్లు, 3,465 నిట్రోవిట్ 10 ఎంజీ, 170 నిట్రోసన్ 10.5 ఎంజీ ట్యాబెట్లు, 5 ఎవిల్ ఇంజెక‌్షన్లు, 10 లుపెజెరిక్, 3 ఫినెర్‌జెన్ ఇంజెక‌్షన్లు, 10.2 ఎంఐ సిరంజ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
మెడికల్ షాపుల సిబ్బందిని కూడా...
డాక్టర్ల ప్రిస్కెప్షన్ లేకుండానే అధిక పరిమాణంలో వందల సంఖ్యలో ట్యాబెట్లు, కాఫ్ సిరప్‌లను నిందితులకు విక్రయిస్తూ యువత ఆరోగ్యం చెడిపోవడానికి కారణమవుతున్న సాయిరామ్ మెడికల్స్‌కు చెందిన దాసరి సత్యనారాయణ(అంగర), శ్రీమౌనిక మెడికల్, జనరల్ స్టోర్‌కు చెందిన కంకటాల వెంకట మల్లేశ్వరరావు (అంగర), ప్రసాద్ అండ్ సన్స్‌కు చెందిన నండూరు సత్యభాస్కరరావు (భీమవరం), దుర్గాభవాని మెడికల్స్‌కు చెందిన నడిపూడి దుర్గాప్రసాద్ (ఏలూరు)లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
అత్యధిక ధరలకు విక్రయం...
రూ.100 ధర ఉండే దగ్గు మందును రూ.200 నుంచి రూ.300కు విక్రయిస్తున్నారు. సిరఫ్ బాటిల్‌ని తాగితే రెండు రోజుల పాటు మత్తులో ఉంటారు. నిట్రోవిట్ ట్యాబ్లెట్‌ను రూ.3 నుంచి రూ.4కు కొని రూ.100కు విక్రయిస్తున్నారు. మూడు ట్యాబ్లెట్స్ ఒకేసారి వేసుకుంటే రెండు, మూడు రోజుల వరకు మత్తులో ఉంటారు.
ఆ ఇద్దరూ.. పాత నేరస్తులే
ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఇద్దరూ పాత నేరస్తులే. కాకినాడ రేచర్లపేట మిలటరీ కాలనీకి చెందిన బెజవాడ రవి, జగన్నాథపురం గౌరీశంకర్‌పేటకు చెందిన అంతర జిల్లా నేరస్తుడు పెమ్మాడి శివప్రసాద్ గంజాయిని సిగరెట్లలో కూరి యువత, విద్యార్థులకు విక్రయిస్తున్నారు. అంగర, భీమవరం, ఏలూరు వంటి వేర్వేరు ప్రాంతాల నుంచి మెడికల్ షాపుల నుంచి సంపాదించిన టోసెక్స్, ఎస్‌కుల్ప్ కాఫ్ సిరప్‌లు, నిత్రోవిట్, నిట్రోసన్ టాబ్లెట్లు, ఎవిల్ ఇంజెక‌్షన్లను యువత, విద్యార్థులు, కూలీలకు విక్రయిస్తున్నారు. ప్రిస్కెప్షన్ లేకుండా మత్తు ట్యాబ్లెట్లు, దగ్గు సిరప్, పలు రకాల ఇంజెక‌్షన్లను ఈ మెడికల్ షాపుల నుంచి వారు సులువుగా సంపాదిస్తున్నారు.
జీవితాలు నాశనం చేసుకోవద్దు
మత్తు పదార్ధాలు, గంజాయి వంటి ఉత్పేరకాలకు బానిసలుగా మారి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని విద్యార్థులకు ఎస్పీ గున్ని సూచించారు. అక్రమార్జన కోసం వీటిని విక్రయిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. యువతను వ్యసనపరులుగా మారుస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. విద్యార్జన కోసం కళాశాలలకు వెళుతోన్న విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. మత్తుకు బానిసలుగా మారిన విద్యార్థులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి వారిని సన్మార్గంలో నడచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాలలు, ముఖ్య కూడళ్ల వద్ద గస్తీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాల పరిసర ప్రాంతాల్లో కళాశాలల నిర్వాహకులు నిఘా పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్ధాలు విక్రయిస్తున్న నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన క్రైం డీఎస్పీ పల్లపురాజు, సీఐ ఈశ్వరుడు, ఎస్సైలు హరీష్‌కుమార్,కేవీ రామారావు, సీహెచ్ సుధాకర్, ఎం.ఏసుబాబు, హెచ్‌సీ గోవిందరావు, పీసీ చిన్నా,శ్రీరామ్,అజేయ్,వర్మా,రాము, బాబు, మారుతిలను అభినందించారు.
Advertisement