మడ అడవుల పరిరక్షణ కార్పొరేట్ సంస్థలదే
మడ అడవుల పరిరక్షణ కార్పొరేట్ సంస్థలదే
Published Tue, Jul 25 2017 10:32 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
– సదస్సులో కలెక్టర్ కార్తికేయ మిశ్రా
కాకినాడ సిటీ : జిల్లాలోని మడ అడవుల పరిరక్షణ ద్వారా వాతావరణ సమతుల్యాన్ని కాపాడడానికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా పిలుపునిచ్చారు. మంగళవారం కాకినాడలోని హోటల్ రాయల్‌పార్క్‌లో ఎగ్రీ ఫౌండేషన్ ప్రీ కార్పొరేట్ సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలో సుందర్‌బన్ తరువాత జిల్లాలో ఉన్న మడ అడవులు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయని వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. జిల్లాలో ఆయిల్, సహజవాయువు, ఫెర్టిలైజర్స్ షిప్పింగ్ పోర్ట్స్ వ్యవహారాలు నిర్వహిస్తున్న కార్పొరేట్ సంస్థలు వాతావరణ పరిరక్షణ కోసం మైక్రో ప్లాను రూపొందించి వాటిని అమలు చేయాలన్నారు. కోరంగి మడఅడవుల పరిరక్షణకు కార్పొరేట్ సంస్థలు చేపట్టాల్సిన అంశాలపై ఒక ప్రణాళిక రూపొందించాలని వన్యప్రాణి విభాగం డీఎఫ్‌ఓను కలెక్టర్ కోరారు. చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎం.రవికుమార్ మాట్లాడుతూ ఎగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోస్తా జీవ పరిరక్షణ కోసం ఆయిల్, సహజవాయువు, ఆక్వా కల్చర్, టూరిజం, ఫెర్టిలైజర్స్, ఫిషరీస్ వంటి ఏడు సంస్థలను గుర్తించామన్నారు. ఆక్వాకల్చర్ నిపుణులు డాక్టర్ డి.పద్మావతి రూపొందించిన పిన్‌ఫిష్ అట్లాస్ పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖాదికారి నందిని సలారియా, ఓఎన్‌జీసీ ఇడి అలోక్ సుందర్, కోరమండల్ జీఎం జ్ఞానసుందరం, వన్యప్రాణి విభాగ డీఎఫ్‌ఓ ప్రభాకరరావు, ట్రైనీ కలెక్టర్ ఆనంద్, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement