మనిషికి రెండు చేతులు ఉన్నట్లే..ప్రతి మనిషి జీవితానికీ రెండు చేతులు ఉంటాయి.ఒకటి నిలబెట్టే హ్యాండ్.ఇంకోటి పడగొట్టే హ్యాండ్. కట్నం వేధింపులు.. భర్త మరణం..ఆడపిల్లకు జన్మనివ్వడం.. శివదేవి లైఫ్‌లో అన్నీ పడగొట్టే హ్యాండ్సే! అయినా ఆమె నిలబడింది. ఇంతింతై.. వనితింతై అన్నట్లు ఎదిగింది.ఏమీ మిగల్చని జీవితంలోంచి...చుట్టూ ఉన్న బతుకుల్ని తన అక్షరాలతో దిద్దేంతగా ఎదిగింది!
శివదేవి.. ఉత్తరప్రదేశ్, బందా జిల్లాలో ఇప్పుడు అందరికీ తెలిసిన పేరు. ఓ దశాబ్దం కిందట శివదేవి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసి అత్తింటికి పంపించారు. అప్పుడు వాళ్లు అనుకున్నది చక్కటి వియ్యం అందుకున్నామని. అయితే కూతురి అత్తింటి వారు మాత్రం కయ్యానికి కాలు దువ్వారు! ఇంకా పెళ్లి పీటల మీద ఉండగనే కట్నం చాల్లేదంటూ గొంతెమ్మ కోరికలతో కొత్త కోడలిని హడలెత్తించారు. కయ్యాల మధ్యనే వియ్యాల వారింట్లో కూతుర్ని వదిలి పెట్టారు శివదేవి తల్లిదండ్రులు.
కాపురం కష్టాలమయం అని తెలుస్తున్నప్పటికీ పుట్టింటివాళ్లకు భారం కాకూడదని కాలం నెట్టుకొచ్చింది శివదేవి. ఈ కష్టాలు చాలవన్నట్లు ఆమె భర్త అనారోగ్యంతో హఠాత్తుగా మరణించాడు. అప్పటికామె నిండు గర్భిణి. ‘అమ్మగారు అడుగు పెట్టింది.. ఇలా జరిగింది’ అనే దెప్పిపొడుపుల మధ్య పాపాయికి జన్మనిచ్చింది. అసలే డబ్బు పిచ్చి పట్టి ఉన్న అత్తగారిల్లు. ఆ ఇంట్లో సంపాదించే వ్యక్తి పోయాడు. పైగా పుట్టింది ఆడపిల్ల. ఒక నిస్సహాయురాలైన మహిళకు ఇంతకంటే నరకం ఇంకేం కావాలి? శివదేవిది అదే పరిస్థితి. భవిష్యత్తు అర్థం కావడం లేదు. ఏదో ఒకటి చేయకపోతే బతకలేనని మాత్రం తెలుస్తోంది.
పోతే అటే పో... ఇక రాకు!
ఆదివాసీ, దళిత మహిళలకు వృత్తివిద్యలో శిక్షణనిస్తారని తెలుసుకుంది శివదేవి. అది ఆరు నెలల కోర్సు, ఆ కోర్సులో చేరి చదువుకుంటానని అత్తగారిని అడిగింది. ‘చదువు, శిక్షణ అంటూ వెళ్లాలనుకుంటే... వెళ్లు. ఇక తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టకు’ అని కసిరింది అత్త. ఇంట్లోనే ఉండడమా, ట్రైనింగ్‌కి వెళ్లడమా అనే సందిగ్ధం నుంచి శివదేవి త్వరగానే బయటపడింది. అప్పటికే ఇంట్లో ఓ సారి ఆమె మీద హత్యాప్రయత్నం జరిగింది. ఆ రోజు... తాను తినాల్సిన భోజనం విషపూరితమైంది. అప్పటికి ఇంట్లో అందరూ భోజనం చేశారు.
ఆ రోజు భోజనం ఎందుకు విషపూరితమైందో ఆ భగవంతుడికే తెలుసు. తాను ఆ రోజు ఆ భోజనం తినకపోవడానికి కారణమూ ఆ దైవలీల మాత్రమే. పూజ చేసుకున్నాను, వాయనం తీసుకోమంటూ పక్కింటి వాళ్ల కోడలు పిలిచింది. ఆ రోజు అక్కడే భోజనం చేసింది తాను. తాను పక్కింట్లో భోజనం చేసినట్లు తెలిసిన తరవాత తన భోజనాన్ని అత్త రహస్యంగా పారవేయడమూ కంటపడింది. దానిని తిన్న ఇంటి పిల్లి మరణించడం కూడా. ఆ సంఘటన కళ్ల ముందు మెదలగానే శివదేవి ఒక నిర్ణయానికి వచ్చేసింది. తనకు, తన బిడ్డకు ఆ ఇంట్లో రక్షణ లేదు.
రక్షణ ఇవ్వలేని ఇంటికోసం ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన అవసరం లేదనుకుందామె. తన పుట్టింటి వాళ్లను ‘ఆ ఆరు నెలలు పాపాయిని దగ్గర ఉంచుకుంటే, నేను ఆరు నెలల పాటు ట్రైనింగ్‌కి వెళ్తాను. ఆ తర్వాత నా జీవితానికి ఒక దారి ఏర్పరుచుకుంటాను. నా కాళ్ల మీద నేను నిలబడతాను’ అని అడిగింది. కూతుర్ని ఆ రొంపిలో నుంచి ఎలా బయటకు తీసుకు రావాలో తెలియక ఆవేదనతో నలిగిపోతున్న శివదేవి తల్లిదండ్రులు, ఆమె బిడ్డను చేతుల్లోకి తీసుకున్నారు.
రిపోర్టర్‌గా ఉద్యోగం!
ఆరు నెలల శిక్షణలో శివదేవికి తన మీద తనకు నమ్మకం వచ్చింది. ఎప్పుడో స్కూల్లో చదివి మర్చిపోయిన అక్షరాలను మళ్లీ పరిచయం చేసుకుంది. కోర్సు పూర్తయింది. చదవడం, రాయడంలో పట్టు వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియదు. బతుకు పోరాటం ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో తెలియడం లేదామెకి. తన ఫ్రెండ్ అనసూయ సలహా ప్రకారం ‘ఖబర్ లహరియా’ పత్రిక ఆఫీసుకు వెళ్లింది. బుందేలీ భాషలో ప్రచురితమవుతుంది. అణగారిన వర్గాల మహిళల సమస్యలకు అద్దం పట్టే పత్రిక అది.
అభ్యుదయ భావజాలం కలిగిన మహిళల బృందం ఆ పత్రిక నడుపుతున్నది. శివదేవితో మాట్లాడిన తర్వాత ఆమె పుస్తకాల చదువుకంటే లోకాన్ని, మహిళల కష్టాలను బాగా చదివిందని అర్థమైంది పత్రిక నిర్వహకులకు. పెద్ద పెద్ద పుస్తకాలు చదవకపోయినప్పటికీ ఆమె పితృస్వామ్య,పెట్టుబడిదారీ సమాజాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పగలుగుతోంది. ఆమె చూసిన జీవితాలను, వాళ్ల స్థితిగతులను రిపోర్ట్ చేస్తే చాలనుకున్నారు ఖబర్ లహరియా నిర్వహకులు. ఆమెకు రిపోర్టర్‌గా ఉద్యోగం ఇచ్చారు.
రాళ్లు రప్పల మధ్య ప్రయాణం
శివదేవి రిపోర్ట్ చేయాల్సిన సంఘటనలన్నీ గ్రామీణ ఉత్తరప్రదేశ్‌లోనే ఉంటాయి. దారి డొంక లేని, బస్సు ముఖం చూడని మారుమూల గ్రామాలకు వెళ్లాలి. నోట్ ప్యాడ్, పెన్ను ఉన్న బ్యాగ్, తలకు స్కార్ఫ్ చుట్టుకుని సైకిల్‌మీద వెళ్తుంటే దళిత వాడలు ఆశ్చర్యంగా చూశాయామెను. ఈ సంగతి ఆ నోటా ఈ నోటా అత్తగారింటికి చేరింది. వాళ్ల అసహనం హద్దులు దాటింది. కానీ ఆమె మీద దాడి చేయడానికి.. ఇప్పుడామె ఉన్నది తమింటి నాలుగ్గోడల మధ్య కాదు. అప్పటి నిస్సహాయ బేల కాదు.
ఆమెను నిలువరించడం తమకు సాధ్యమయ్యే పని కాదని పళ్ల బిగువున భరించారు. ఇన్నింటినీ చూస్తూ తాను నిర్ణయించుకున్న దారిలో కొనసాగింది శివదేవి. రాళ్లు రప్పలతో నిండి ఉన్నది శివదేవి ఉద్యోగ ప్రయాణం మాత్రమే కాదు, ఆమె జీవిత ప్రయాణం కూడా. గ్రామాల్లో సాగుతున్న ఇసుక మాఫియా, బడి లేని గ్రామాలు, బస్సు లేని జనావాసాలు, మహిళల మీద దాడులు, అత్తింటి ఆరళ్లు.. అన్నింటినీ రిపోర్టు చేసింది. ఇవన్నీ ఒక ఎత్తయితే... 2014 లోక్‌సభ ఎన్నికలు ఆమె ఎదుర్కొన్న అతి పెద్ద సవాల్.
పోలీసులు నవ్వారు
ఐదేళ్ల కిందటి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆమె గ్రామాల్లో విస్తృతంగా పర్యటించింది. దళిత వాడలను చైతన్యపరచడానికి మహిళా పాఠకులను వారధిగా చేసుకుందామె. ఓటు నిర్ణయం తమదే అయి ఉండాలని... పీడనకు, ప్రలోభాలకు తల ఒగ్గకుండా ధైర్యంగా నిలబడాలని దళితులను చైతన్య పరుస్తూ వ్యాసాలు రాసింది ఖబర్ లహరియా పత్రిక. ఆ పత్రిక కాపీలను మహిళలకు చేర్చడం ద్వారా దళిత సమాజాన్ని చైతన్యవంతం చేయాలనేది ఆమె ఆలోచన. ‘ఖబర్ లహరియా’ ప్రతులను గ్రామాలకు తీసుకెళ్లి పంచుతోందని అక్కడి అగ్రవర్ణాల వాళ్లకు తెలిసింది.
ఉత్తరప్రదేశ్‌లో పితృస్వామ్య, భూస్వామ్య భావజాలం ఎక్కువ. అక్కడి గ్రామపెద్దలకు శివదేవి చేస్తున్న పని ఏమాత్రం నచ్చలేదు. కొంతమంది దుండగులు ఆమెను అటకాయించి, ఆమె దగ్గరున్న పత్రిక కాపీలను, ఆమె కెమెరా ఫోన్‌ను లాక్కుని, ఆమెను అసభ్యంగా తిడుతూ, మరోసారి ఈ ఛాయలకు రావద్దని, వెళ్లిపొమ్మని బెదిరించారు. ఆమె పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తనకు ఎదురైన సంఘటనను తెలియచేస్తూ తనకు రక్షణ కల్పించమని కోరుతూ కంప్లయింట్ రాసిచ్చింది.
అక్కడి పోలీసులు సంగతంతా విని ఆమె రాసిన ఫిర్యాదు కాపీని కనీసం చదవకుండా ఓ పక్కన పడేసి, ఆమెను గేలి చేస్తూ నవ్వారు. అయినా శివదేవి క్లిష్టమైన రిపోర్టింగ్‌ని మానుకోలేదు. ఆమెకు పత్రిక కూడా అండగా నిలిచింది. ఆమెకు జిల్లా అంతటా గుర్తింపు రావడానికి కారణం ఆమె రిపోర్ట్ చేసిన సాహసోపేతమైన కథనాలే. ఇప్పుడు మళ్లీ లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఆమె కలానికి మళ్లీ పని ఒత్తిడి పెరిగింది. ఈ పనిని సమర్థంగా నిర్వహించడానికి ఖబర్ లొహారియా నిర్వహకులు ఆమెకు స్కూటీ కొనిచ్చారు. డౌన్ పేమెంట్ కట్టి, మిగిలిన వాయిదాలు ఆమె చెల్లించుకునే పద్ధతిలో వాహనాన్ని ఇచ్చారు. ఆ సంస్థలో ఇలాంటి గుర్తింపును అందుకున్న తొలి ఉద్యోగి శివదేవి.
– మంజీర
రాని ఇంగ్లిష్‌తోనే నెగ్గుకొచ్చింది!
శివదేవి ప్రస్తుతం జీవితం.. పదేళ్ల కఠోర శ్రమకు ఫలితం. 2010లో శిక్షణలో చేరినప్పటి నుంచి ఆమె ఏ రోజూ పని చేయకుండా విశ్రమించింది లేదు. తనకు వచ్చిన కొద్దిపాటి చదువుతోనే రాయదలుచుకున్న విషయాన్ని చక్కగా రాయగలిగిన పట్టు రావడానికి ఆమె పడిన శ్రమ తక్కువేమీ కాదు. ఇంగ్లిష్ రాని శివదేవికి ప్రభుత్వాఫీసుల్లో అధికారులు ఇంగ్లిష్‌లో మాట్లాడినప్పుడు ఎదురైన ఇబ్బందులు కూడా తక్కువేమీ కాదు. అత్తింటి వాళ్లు తనను, తన బిడ్డను చంపేయాలనుకున్నారు. ఆమె బతికి చూపించాలనుకుంది. సమాజం నుంచి గౌరవాలందుకుంటూ బతికి చూపిస్తున్న ధీరవనిత శివదేవి. దళితవాడల్లో తల్లిదండ్రులు ఇప్పుడు తమ పిల్లలకు ఆమెను ఆదర్శవంతంగా చూపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment