Dalit women
-
‘ములక్కారం’పై ధిక్కారం.. గుండెను కోసే రవిక సుంకం
‘తంగలాన్’ సినిమాలో దళిత స్త్రీలకు మొదటిసారి రవికెలు ఇచ్చినప్పుడు వారు వెలిబుచ్చే ఆనందం, సంబరం ప్రేక్షకులకు కన్నీరు తెప్పించింది. స్త్రీలపై పీడన చరిత్రలో అనేక విధాలైతే దళిత స్త్రీలకు పై వస్త్రం ధరించే హక్కు లేకుండా చేయడం మరో పీడన. రవికె ధరించాలంటే దళిత స్త్రీలు ‘ములక్కారం’ పేరుతో సుంకం కట్టాల్సి వచ్చేది. దీనిని ఎదిరించడానికి తన రొమ్ముల్ని కోసుకుంది నాంజెలి అనే స్త్రీ. కన్యాకుమారిలో దళిత స్త్రీలు ‘రవికె కట్టు ఉద్యమాన్ని’ నిర్వహించారు. ఈ తరం విద్యార్థులు తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది.‘తంగలాన్’ సినిమాలో ఉత్తర ఆర్కాట్ జిల్లాలోని దళితులకు భూమి ఉండదు. ఊరిలో భాగం ఉండదు. అలాగే బట్ట కూడా ఉండదు. ఒంటి నిండా బట్ట లేకుండా ఉంచడం వారిని ‘గుర్తించడానికి’ ఒక సంకేతం. పురుషులు ‘మోకాళ్లకు దిగని’ అంగవస్త్రాన్ని మాత్రమే కట్టుకోవాలి. స్త్రీలు రవిక లేకుండా మోకాళ్ల పైకి చీర చుట్టుకోవాలి. వారి భూమిని వారి నుంచి లాక్కుని వారినే కూలివాళ్లుగా మార్చి పని చేయిస్తుంటాడు జమీందారు.ఒకవేళ ఎవరికైనా భూమి ఉంటే అందులో పంట పండితే అది ఇల్లు చేరదు. నిప్పుకు ఆహుతి అవుతుంది. ఈ బాధలు పడలేక బ్రిటిష్ వారి కింద ఊడిగం చేసి బంగారు గని కార్మికులుగా పని చేసి బాగుపడదామనుకుంటారు దళితులు. అందులో భాగంగా తంగలాన్ (విక్రమ్) నాయకత్వంలో దళితులను కోలార్‌కు వలస తీసుకెళతారు. అక్కడ విక్రమ్ కష్టం చూసి, నాయకత్వ లక్షణాలు చూసి ముందు అతన్ని దుస్తులతో గౌరవిస్తాడు. ప్యాంట్ షర్ట్ ఇస్తాడు.కూలి డబ్బు తీసుకొని గుర్రమెక్కి వచ్చిన విక్రమ్ తన వాడ మహిళల కోసం తెచ్చే ఒకే ఒక కానుక రవికలు. వాటిని చూసి మహిళలు తమ జీవితాల్లో ఇలాంటి రోజొకటి వస్తుందా అన్నట్టు చూస్తారు. రవిక తొడుక్కునే స్వేచ్ఛను మొదటిసారి అనుభవిస్తూ పులకించిపోతారు. ఒంటి నిండా బట్ట కట్టుకుంటే వచ్చే గౌరవాన్ని పొందుతారు. 1850 కాలం నాటి కథగా దీనిని దర్శకుడు పా.రంజిత్ చూపుతాడు. అయితే ఆ కాలం దాటి ఇన్నేళ్లు గడిచినా ఇంకా కొన్ని తెగలలో స్త్రీలకు ఎద పై వస్త్రం దొరకడం, తొడిగే ఆర్థిక స్థితి రాకపోవడం విషాదం. అదే సమయంలో తమ హక్కును గుర్తెరిగి వక్షాన్ని కప్పుకునే హక్కు కోసం నినదించే స్త్రీలనూ మనం గుర్తు చేసుకోవాలి.అరిటాకుల్లో వక్షోజాలుకేరళ, తమిళనాడుల్లోని ట్రావెన్కోర్ రాజ్యాన్ని పరిపాలించిన శ్రీమూలమ్ తిరుమాళ్ (1885–1924) కాలంలో జరిగిన ఘటన ఇది. ఆ రోజుల్లో ట్రావెన్కోర్ రాజ్యంలో దళితుల మీద 110 రకాల పన్నులుండేవి. మగవాళ్లు శిరోజాలు పెంచుకుంటే ‘తలక్కారం’ అనే పన్ను కట్టాలి. స్త్రీలు వక్షోజాలు కప్పుకుంటే ‘ములక్కారం’ అనే పన్ను కట్టాలి. అసలే పేదరికంలో ఉన్న దళితులు ఈ పన్నులు కట్టలేక బాధలు అనుభవించేవారు. నాంజెలి అనే మహిళ తన ఇంటి ముందుకు వచ్చిన పన్ను వసూలు వ్యకికీ, అలాగే రాజుకు జీవితకాల పాఠం నేర్పాలని అనుకుంది.అరిటాకుల్లో బియ్యం పెట్టి కట్టాల్సిన పన్నుకు బదులు పదునైన కొడవలితో కోసుకున్న తన వక్షోజాలను పెట్టి ఇచ్చింది. అరిటాకుల్లో కోసిన వక్షోజాలు కేరళలో పెనుకంపనం కలిగించాయి. ఆ విధంగాప్రాణత్యాగం చేసిన నాంజెలి వల్ల వెంటనే రాజు వక్షోజ పన్నును తొలగించాడు. తొలగించింది పన్నే తప్ప దళిత స్త్రీలకు, నాడార్ స్త్రీలకు రవిక తొడుక్కునే హక్కు ఇవ్వలేదు. దాని కోసం పోరాటం సాగిస్తే ముడివేసుకునే రవికలు ధరించేందుకు అనుమతి లభించింది. ఆ తర్వాత చాలా కాలానికి అందరిలాంటి రవికలు ధరించారు. 1990ల వరకూ కూడా తమిళనాడు, కేరళలోని దళితులలో వృద్ధ మహిళలు రవిక ధరించేవారు కాదు. వారికి ఆ అలవాటు మెదడులో నిక్షిప్తమైపోవడమే కారణం.రవిక కట్టే ఉద్యమంఆ సమయంలోనే కన్యాకుమారి జిల్లాలో దళిత స్త్రీలు ‘రవిక కట్టే ఉద్యమాన్ని’ భారీ ఎత్తున లేవదీశారు. దీనిని ‘మారు మరక్కమ్ సమరం’ అని పిలిచారు. దీనికే ‘చన్నార్ తిరుగుబాటు’ అని పేరు. పై కులాల వాళ్ల ముందు స్త్రీలైనా, పురుషులైనా నగ్నమైన ఛాతీతో ఉండటమే మర్యాదగా నాటి సమాజం నిశ్చయిస్తే రేగిన తిరుగుబాటు అది. పరిశోధకులు ఈ విషయమై సాగించిన అధ్యయనంలో ‘దళిత మహిళలకు చనిపోయిన మహిళల ఒంటిపైన ఉండే దుస్తులు ఇచ్చేవారు. కాన్పు సమయంలోని దుస్తులు ఇచ్చేవారు. వాటినే దళిత మహిళలు ధరించేవారు. శుభ్రమైన కొత్త బట్టలు ఇస్తే దళితులు కట్టుకోవడానికి సంశయించి పక్కన పడేసేవారు. వాటిని ఎప్పటికీ తొడుక్కునేవారు కాదు. అంతగా వారిని బట్టలకు దూరం ఉంచారు’ అని తెలియజేశారు.యూనిట్లో అందరూ ఏడ్చారు‘ఈ సన్నివేశం మాకు చెప్పేటప్పుడు ఆ కాలంలో ఆ స్త్రీల అనుభూతిని వివరించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. కాని సన్నివేశంలో నటిస్తున్న స్త్రీలందరం ఒకే రకమైన ఉద్వేగంతో ఉన్నాం. రవిక తొడక్కుండా ఉండటం అంటే ఏమిటో తెలియని మేము ఆనాటి స్త్రీల వేదనను అర్థం చేసుకుని మొదటిసారి తొడుక్కున్నట్టు నటించాం. మొదటి, రెండవ టేకే ఓకే అయింది. మా నటన చూసి యూనిట్లో సభ్యులు సంతోషంతో కన్నీరు కార్చారు’ అంది నటి పార్వతి. ఆమె ఈ సినిమాలో విక్రమ్ భార్య గంగమ్మగా నటించింది. -
నడిరోడ్డుపై దళిత మహిళను లాఠీతో చితకబాదిన పోలీసు
పాట్నా: బిహార్‌లో నడిరోడ్డుపై ఓ దళిత మహిళను పోలీసు లాఠీతో చితకబాదాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. విపక్ష బీజేపీ మండిపడింది. బిహార్‌లో నేరస్థులను వదిలేసి సామాన్య ప్రజలపై పోలీసులు లాఠీఛార్జీ చేస్తున్నారని ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులు వివరణ కూడా ఇచ్చారు. సితామర్హికి చెందిన ఓ బాలిక కిడ్నాప్ కేసులో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో రక్షించిన బాలిక కోసం ఇద్దరు మహిళలు పోటీ పడ్డారు. తమ బాలికేనని ఇరువురు గొడవకు దిగారు. పోలీసులు విడిపించినా గొడవ ఆపలేదు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ క్రమంలోనే పోలీసులు లాఠీఛార్జీ చేశారని ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. అయితే.. పోలీసుల చర్యను స్థానికులు తప్పుబడుతున్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: భారత సంతతి కుటుంబం మృతి కేసులో కీలక అంశాలు -
ఇంకెప్పటికి మారతాం?!
ఆ కేంద్రపాలిత ప్రాంతం మొత్తంలో ఏకైక మహిళా ఎమ్మెల్యే ఆమె. అక్కడి ప్రభుత్వంలో ఉన్న ఒకే ఒక్క మహిళా మంత్రి కూడా ఆమే! తీరా, అలాంటి వ్యక్తి కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందంటే ఏమనాలి? మామూలు పరిస్థితుల్లో రాజీనామా చేయడం కాదు... లింగ, కుల దుర్విచక్షణల్ని తట్టుకోలేక రాజీనామా చేశానంటున్నారు. ఆ ఆరోపణలు దిగ్భ్రమ కలిగిస్తున్నాయి. పుదుచ్చేరిలోని ఏకైక దళిత, మహిళా ఎమ్మెల్యే సి. చంద్ర ప్రియాంక ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారారు. అయితే, ఆమె అసమర్థత రీత్యానే పదవి నుంచి తప్పించామని అధికార కూటమి అంటోంది. ఏమైనా, ఈ మహిళా మంత్రి రాజీనామా ఉదంతం స్త్రీలు, వెనుకబడిన కులాల పట్ల మన వ్యవస్థలోని చిన్నచూపును మరోసారి చర్చకు పెడుతోంది. దాదాపు 40 ఏళ్ళ విరామం తర్వాత పుదుచ్చేరిలో మంత్రి పదవి దక్కిన మహిళ చంద్రిక అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముప్ఫై మంది సభ్యుల పుదుచ్చేరి అసెంబ్లీలో కారైక్కాల్ ప్రాంతంలో రిజర్వుడు స్థానమైన నెడుంగాడు నుంచి ఎన్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి సారథ్యంలోని ఎన్డీఎ ప్రభుత్వంలో 2021లో ఆమెకు మంత్రి పదవి దక్కింది. ‘మంచి ఆలోచనలతో, కష్టపడి పనిచేయాలని రాజకీయాల్లోకి వచ్చాన’న్న చంద్రిక పురుషాధిక్య రాజకీయ ప్రపంచంలో వివక్షకు గురయ్యానని ఆరోపించారు. ప్రజాదరణ ఉన్నా కుట్రల్ని తట్టుకొని, ధనశక్తి అనే భూతంపై పోరాడడం తేలిక కాదని గ్రహించినట్టు ఆమె తన రాజీనామా లేఖలో ఆవేదన చెందారు. ప్రతిపక్ష కాంగ్రెస్, డీఎంకె, వామపక్షాలు ప్రభుత్వాన్నీ, సీఎం ‘దళిత వ్యతిరేక వైఖరి’నీ తప్పు బట్టాయి. అయితే, కీలకమైన మంత్రి పదవిని చంద్రిక సమర్థంగా నిర్వహించట్లేదనీ, ఆరునెలలుగా చెబుతున్నా పట్టించుకోవట్లేదనీ, అందుకే ఆమెను పదవి నుంచి తప్పించామనీ, కేంద్రానికి లేఖ పంపగానే అది తెలిసి ఆమె ముందే రాజీనామా చేశారనీ అధికార పక్షం చెబుతోంది. చిత్రమేమిటంటే, అధికారపక్షం చెబుతున్న ఈ కథనాన్నే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరైన మరో మహిళ తమిళిసై సౌందరరాజన్ పేర్కొనడం! దుర్విచక్షణ ఉన్నట్టు తెలీదనీ, తనకు చెబితే పరిస్థితిని చక్కదిద్దేదాన్ననీ గవర్నర్ అన్నట్టు తమిళ పత్రికల కథనం. అయితే, మన దేశంలో అలాంటివి లేవనుకోవడం వట్టి భ్రమ. ఆ మాటకొస్తే, ఎవరూ బయటపడకపోయినా చంద్రిక కథ లాంటిదే... ఈ దేశంలోని పలు వురు మహిళా నేతల వ్యధ! పురుషాధిక్య ప్రపంచంలో, అందులోనూ రాజకీయాల్లో ఎన్నో సహించి, భరిస్తే కానీ స్త్రీలు తమకంటూ చిన్నచోటు దక్కించుకొని, గొంతు విప్పలేరన్నది నిష్ఠురసత్యం. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, చట్టం చేయడానికి సైతం దశాబ్దాలు పట్టిన రాజకీయ వ్యవస్థ మనది. అది అమలయ్యేదెన్నడో నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితి. ఈ పరి స్థితుల్లో చంద్రిక లాంటి వారి ఉదంతాలు ఒక మేలుకొలుపు. ఆమె ఆరోపణలు సంపూర్ణ అసత్యాలని కొట్టిపారేయలేం. స్వతంత్ర భారత శతవసంతాల నాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలనేది పాలకులు ప్రవచిస్తున్న లక్ష్యం. 2047 కల్లా అది సాధ్యం కావాలంటే, జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళల పాత్ర, వారి ప్రాతినిధ్యం కీలకం. కానీ, అధిక శాతం పార్టీలు, ప్రభుత్వాల చేతలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. గమనిస్తే, 1970ల వరకు లోక్‌సభలో మహిళా ప్రాతినిధ్యం 5 శాతం వద్దే తచ్చాడుతూ వచ్చింది. 2009లో గానీ అది రెండంకెలకు చేరు కోలేదు. రాజ్యసభలో అయితే 1951 నుంచి ఇప్పటి దాకా ఏనాడూ మహిళల సంఖ్య 13 శాతమైనా దాటలేదు. రాష్ట్ర శాసనసభల్లోనైతే సగటు మహిళా ప్రాతినిధ్యం 10 శాతం కన్నా తక్కువే. మహిళా మంత్రుల సంఖ్యలోనూ మన దేశంలో ఇదే పరిస్థితి. గత మూడు దశాబ్దాల పైచిలుకులో కేంద్రంలో మంత్రిపదవులను చేపట్టిన స్త్రీలు నాటి మహిళా ప్రాతినిధ్యంతో పోలిస్తే 11 శాతమే. క్యాబినెట్ హోదా దక్కినవారైతే 7 శాతమే. రాజకీయ పాలనలో కాదు, ప్రభుత్వ అధికార యంత్రాంగంలోనూ ఆడవారి వాటా మరీ తీసికట్టు. మొత్తం 30 లక్షల పైచిలుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 11 శాతమే స్త్రీలు. కార్యనిర్వాహక, శాసన నిర్మాణ వ్యవస్థలతో పోలిస్తే, భారత న్యాయ వ్యవస్థలో లింగ సమానత మరీ కనాకష్టం. 1950 నుంచి చూస్తే, సుప్రీమ్ కోర్ట్ జడ్జీల్లో కూడా ఆడ వాళ్ళు 3 శాతమే. ప్రతిచోటా ఉన్నత స్థాయికి చేరడానికి అతివలకు అనేక అవరోధాలు. ఈ గణాంకాలన్నీ ఇప్పటికీ మహిళల పట్ల మనకున్న దుర్విచక్షణకూ, మారని మన పితృస్వామ్య భావజాలా నికీ నిలువుటద్దాలు. దానికి తోడు దళితులు, వెనుకబడిన వర్గాల స్త్రీల పరిస్థితి మరీ కష్టం. ఈ నేపథ్యం నుంచి పుదుచ్చేరి ఉదంతాన్ని చూసినప్పుడే సమస్య లోతులు స్పష్టమవుతాయి. దాదాపు 156 దేశాల్లో సగటున 23 శాతం మహిళా మంత్రులుంటే, భారత్ తద్భిన్నం. కేంద్రంలో పేరుకు మహిళా మంత్రుల సంఖ్య పెంచినా, వారికి రక్షణ, పరిశ్రమలు, రైల్వేలు, రవాణా, వ్యవసాయం లాంటి కీలక శాఖలు అప్పగించడం అరుదు. ఈ పరిస్థితిని మార్చాలంటే, మహిళా రిజర్వేషన్ చట్టాలు తెస్తే సరిపోదు. కులం, మతం, ప్రాంతం, జెండర్ అంశాల్లో పార్టీల, ప్రజల ఆలోచన మారాలి. వెనుకబడిన వర్గాల, స్త్రీల సమర్థతను శంకించడం క్షమార్హం కాదు. అవకాశమిచ్చి, ప్రోత్సహిస్తే, పలువురు నేతల కన్నా వారే సమర్థులు. పాలిచ్చి పెంచిన అమ్మలు మనల్ని పాలించ లేరా? కుటుంబానికి ఇరుసుగా మారి, మొత్తం సమాజాన్ని నిలబెడుతున్న స్త్రీలు సమర్థులు కారా? వారికా సమర్థత లేదనుకోవడం మూర్ఖత్వం. మకిలిపట్టిన మనసుల్లోని మనుస్మృతి భావజాలం! -
చెన్నై తొలి దళిత మహిళా మేయర్: ఆమెకు అభినందనలు
నార్త్ చెన్నై అంటే తమిళ సినిమాల్లో రౌడీల పుట్టిల్లుగా చూపిస్తారు. మురికివాడలు.. ఇరుకు గల్లీలు పంపుల దగ్గర స్త్రీల బాహాబాహీ అలాంటి చోట నుంచి ఇప్పుడు 29 ఏళ్ల ఆర్.ప్రియ మేయర్‌గా నగరాన్ని పాలించడానికి వచ్చింది. తమిళనాడు సి.ఎం. స్టాలిన్ స్ఫూర్తితో రాజకీయాలలో వచ్చిన ప్రియ చెన్నై మేయర్ పీఠం పై కూచున్న తొలి దళిత యువతిగా చరిత్ర సృష్టించింది. చెన్నైకు ఆర్.ప్రియ 49వ మేయర్. అంటే ఆమెకు ముందు 48 మంది మేయర్లు ఆ నగరానికి పని చేస్తే వారిలో ఇద్దరే మహిళా మేయర్లు. 1957లో కాంగ్రెస్ నుంచి తారా చెరియన్, 1971లో డి.ఎం.కె నుంచి కామాక్షి జయరామన్‌లు మాత్రమే మేయర్లుగా పని చేశారు. మిగిలిన వారంతా పురుషులే. ఇక దళిత మహిళ ఈ స్థానంలో కూచోవడం అనేది చరిత్రలోనే లేదు. కాని ఆర్.ప్రియ దళిత మహిళగా ఆ రికార్డును తన సొంతం చేసుకుంది. ఇదంతా ఆమెకు రాసి పెట్టినట్టుగా క్షణాల్లో జరిగిపోయింది గాని సరైన సమయంలో తాను రాజకీయాల్లో దిగాలి అని ప్రియ భావించడం వల్ల కూడా ఈ ఘనత సాధ్యమైంది. చెన్నై నగరానికి గత ఐదేళ్లుగా కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు. స్టాలిన్ ప్రభుత్వం వచ్చాక ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికలు నిర్వహిస్తే గ్రేటర్ చెన్నైలోని 200 వార్డులలో 153 స్థానాలు డి.ఎం.కెకు వచ్చాయి. ఇంకో 25 స్థానాలు డి.ఎం.కె మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. అన్నా డిఎంకెకు కేవలం 15 వార్డులు దక్కాయి. ఈసారి ఎన్నికలలో చెన్నై మేయర్ పదవిని దళిత మహిళకు రిజర్వ్ చేయడం వల్ల నార్త్ చెన్నై 74వ వార్డు (తిరువికనగర్) నుంచి గెలిచిన ఆర్.ప్రియకు ఏకగ్రీవంగా ఈ పదవి దక్కింది. మార్చి 4, శుక్రవారం ఆమె మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసింది. ‘చెన్నైకి మేయర్‌గా చేసిన స్టాలిన్ మార్గదర్శనంలో నేను మేయర్‌గా పని చేసే అవకాశం రావడం గొప్ప విషయం’ అంది ప్రియ. ఆమె కుటుంబం డిఎంకెకి వీరభక్తులు. ఆమె తండ్రి ఆర్.రాజన్ ముప్పై ఏళ్లుగా పార్టీలో పని చేస్తున్నాడు. ఇంట్లో రాజకీయ వాతావరణం ఉండటంతో 18 ఏళ్ల వయసులో ప్రియ కూడా డి.ఎం.కె కార్యకర్త అయ్యింది. ‘అయితే నేను నిజంగా పార్టీ పనుల్లో చురుగ్గా పాల్గొంది స్టాలిన్ సి.ఎం అయ్యాకే. ఆయన పాలనా పద్ధతులు గమనించాక నా ప్రాంత సమస్యలు తీరాలంటే ఇదే అదను అని నాకు అనిపించి నేను కూడా పని చేయడం మొదలుపెట్టాను’ అంది ప్రియ. ఎం.కాం చేసిన ప్రియకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. ‘నిజానికి ఎలక్షన్లకు ముందే నా గెలుపు ఖాయమైపోయింది. నా ప్రాంత సమస్యలను వేటి వేటిని తీరుస్తానో నేను చెప్పాక అందరూ నాకే ఓటు వేస్తామని చెప్పేశారు’ అంది ప్రియ. సాధారణంగా నార్త్ చెన్నై ప్రాంతం చాలా ఏళ్లుగా సౌకర్యాల ఏర్పాట్లలో నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది. ఆ ప్రాంతం నుంచి ఇప్పుడు ఏకంగా మేయరే రావడం అందరూ ఎన్నో అంచనాలతో ప్రియ వైపు చూస్తున్నారు. ‘మా ఏరియా స్త్రీలు వేసవిలో 100 రూపాయలు ఖర్చు పెట్టి ఆటోల్లో 4 కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. ముందు దీనిని మార్చాలి. పారిశుద్ధ్యం ముఖ్యం. అలాగే పిల్లలకు ఆటస్థలాలు ఏర్పాటు చేయాలి. స్టాలిన్ యువ శక్తికి పూర్తి అవకాశం ఇస్తున్నారు. నేను బాగా పని చేయాలనుకుంటున్నాను’ అంది ప్రియ. స్టాలిన్ ప్రభుత్వం ఈసారి స్త్రీలకు పట్టణ, నగర పాలనా వ్యవస్థల బాధ్యతలు అప్పజెప్పడంలో శ్రద్ధ పెట్టింది. తమిళనాడులో మొత్తం 11 మేయర్ పదవులను, 5 డిప్యూటీ మేయర్ పదవులను స్త్రీలకు కేటాయించింది. కోయంబత్తూరు మేయర్‌గా మధ్యతరగతికి చెందిన ఏ.కల్పన అనే మహిళను ఎంపిక చేసింది. అయితే జయలలిత హయాంలో స్త్రీలు పదవుల్లోకి వచ్చాక వారి భర్తలు, తండ్రులు, సోదరులు పెత్తనం చెలాయించి ఆ గెలిచిన స్త్రీలను వెనక్కు నెట్టడం కొన్నిచోట్ల కనిపించేది. ‘అలా నా విషయంలో జరగదు. ఇప్పుడు స్త్రీలు తమ ఇళ్ల పురుషులకు ఆ అవకాశం ఇవ్వరు. వారు తమ పూర్తి శక్తి సామర్థ్యాలతో పని చేయాలనుకుంటున్నారు. మీరే చూస్తారుగా’ అంది ప్రియ. ఆమె నిర్ణయాలు చెన్నైకి మేలు చేస్తాయని ఆశిద్దాం. నిజానికి ఎలక్షన్లకు ముందే నా గెలుపు ఖాయమైపోయింది. నా ప్రాంత సమస్యలను వేటి వేటిని తీరుస్తానో నేను చెప్పాక అందరూ నాకే ఓటు వేస్తామని చెప్పేశారు. – ఆర్.ప్రియ -
'పెళ్లికి ముందు బంగారం.. పెళ్లి తర్వాత అంటరానిదానినా..?'
ఇద్దరు ప్రేమికులు పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన కొన్ని రోజులకే ఆ భర్త పూర్తిగా మారి సైకోలా తయారయ్యాడు.ఆ యువకుడు అగ్రకులానికి చెందిన వాడు కావడంతో ఎస్సీ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావని గ్రామస్తులు ఎగతాళి చేస్తున్నారని పునరాలోచనలో పడ్డాడు. భార్యతో నిత్యం గొడవపడేవాడు. ఈ క్రమంలోనే నువ్వు అంటరానిదానివని సదరు యువతిని కులం పేరుతో దూషించాడు. తనను ప్రేమించి వివాహం చేసుకున్న వ్యక్తే అలాంటి మాట అనడంతో ఆ భార్య సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సంఘటన గుజరాత్లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గుజరాత్‌లోని మెహ్సానా జిల్లా జోతానా తాలుకాకు చెందిన సదరు జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. యువతి వయసు 20 ఏళ్లు. యువకుడి వయసు 24 ఏళ్లు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో మెమాగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే ఆ అమ్మాయి ఎస్సీ సామాజిక వర్గం.. కాగా యువకుడు అగ్ర కులానికి చెందిన వాడు. ఐనప్పటికీ పెద్దలను ఎదురించి ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలయింది. దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కూడా సూటిపోటి మాటలతో వేధించేవారు. అలా అందరూ తనను వెక్కిరించడంతో అతడు కూడా సదరు యువతిని పెళ్లి చేసుకొని తప్పు చేశానని భావించాడు. పెళ్లికి ముందు బంగారం అని పిలిచిన వాడే పెళ్లి చేసుకున్నాక అంటరానిదానివని అనడంతో ఆమె ఎంతో మనోవేదనకు గురయింది. ఈ క్రమంలోనే ఓ రోజు రాత్రి అతడు శృంగారం కోసం వస్తే ఆమె నిరాకరించింది. నన్ను అంటరానిదానినంటూ కులం పేరుతో దూషిస్తావా? నేను నీతో శృంగారం చేయనని తెగేసి చెప్పింది. ఇక దాంతో అతడు కోపంతో భార్యను ఇష్టానుసారం కొట్టి బలవంతంగా అనుభవించసాగాడు. అలా కొన్ని రోజుల పాటు ఇంట్లో ఆ యువతిని రేప్ చేసి చిత్రహింసలకు గురిచేశాడు. అయితే ఇదే క్రమంలో ఇటీవల ఐరన్ రాడ్డుతో తలపై కొట్టడంతో ఆమె ఆస్పత్రి పాలయింది. అనంతరం మెహ్సానాలోని పుట్టింటికి వెళ్లిపోయింది. కోలుకున్న తర్వాత గత్లోడియా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
హాథ్రస్ కేసులో చార్జ్‌షీట్
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన హాథ్రస్ కేసులో సీబీఐ చార్జ్‌షీటు దాఖలు చేసింది. యూపీలోని హాథ్రస్ జిల్లాలో జరిగిన దళిత యువతిపై అత్యాచారం, హత్యకు సంబంధించి నలుగురిపై సీబీఐ నేరారోపణ చేస్తూ శుక్రవారం కోర్టులో చార్జ్‌షీటు ఫైల్ చేసింది. రెండు నెలల దర్యాప్తు అనంతరం నిందితులు సందీప్, రవి, లవ్‌కుశ్, రాము సెప్టెంబర్14న దళిత యువతిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు సీబీఐ పేర్కొంది. చార్జ్‌షీటులో వీరిపై అత్యాచారం, హత్య, సామూహిక అత్యాచారం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద నేరారోపణ చేసింది. ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే గరిష్ఠంగా మరణ శిక్ష విధిస్తారు. చనిపోయిన యువతి వాంగ్మూలం, సాక్ష్యాలు, ఇతర సాక్షుల స్టేట్మెంట్ల ఆధారంగా విచారణ పూర్తి చేసినట్లు సీబీఐ తెలిపింది. సీబీఐ చార్జ్‌షీటుతో అసలు నేరమే జరగలేదన్న యూపీ పోలీసుల వాదన తేలిపోయినట్లయింది. అత్యాచారమే జరగలేదన్న పోలీసుల వాదనపై అప్పట్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు యువతి అంత్యక్రియలపై అలహాబాద్ హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి పోలీసులకు అక్షింతలు వేసింది. -
దళిత మహిళలకు బాబు క్షమాపణ చెప్పాలి
తాడికొండ: నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుంటున్నందుకు నిరసన తెలిపేందుకు వస్తున్న దళిత మహిళలపై టీడీపీ గూండాలతో దాడి చేయించిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు అన్నారు. బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజధాని తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధర్నాలో పాల్గొనేందుకు వస్తున్న దళిత మహిళలను తన పార్టీ గూండాలతో ట్రాక్టర్లతో తొక్కించి చంపుతామని బెదిరింపులకు పాల్పడడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ఈ తప్పుడు చర్యలకు విగ్గు రాజు వంతపాడుతూ అబలలను నోటికి పట్టని మాటలనడం సభ్య సమాజం సిగ్గుపడాల్సిన అంశమని చెప్పారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే రఘురామకృష్ణంరాజుకు ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతామన్నారు. రాజధానిలో ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాటం ఆగదని తెలిపారు. విజయవాడ బార్ అసోసియేషన్‌కు చెందిన పలువురు న్యాయవాదులు బహుజన పరిరక్షణ సమితి దీక్షలకు మద్దతు తెలిపారు. పలువురు మాట్లాడుతూ..దళిత, ముస్లిం మైనార్టీలకు చెందిన లంక, అసైన్డ్ భూములను బెదిరింపులతో కారుచౌకగా కొనుగోలు చేసి పూలింగ్‌కు ఇచ్చి భారీగా లబ్ధి పొందారన్నారు. కాగా, పలువురు మహిళలు ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మకు చెప్పుల దండవేసి, చెప్పులతో కొట్టి, కాళ్లతో తన్ని దహనం చేశారు. -
ఢిల్లీ వెళ్తామన్న ‘హాథ్రస్’ కుటుంబం
హాథ్రస్: భద్రతా కారణాల రీత్యా తాము ఢిల్లీ వెళ్లి, అక్కడి నుంచే న్యాయ పోరాటం చేస్తామని హాథ్రస్ బాధిత కుటుంబం చెప్పింది. హాథ్రస్ ఘటనలో మరణించిన దళిత యువతి సోదరుడు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని ఆ కుటుంబానికి న్యాయ సాయం అందిస్తున్న సీమా కుష్వాహ కూడా స్పష్టం చేశారు. అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ ఎదుట ఆమె శనివారం హాజరయ్యారు. అనంతరం బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడుతూ.. బాధిత కుటుంబం ఈ కేసును ఢిల్లీకి గానీ, ముంబైకి గానీ తరలించి విచారణ జరిపించాలని కోరుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి భద్రత కల్పిస్తున్న ఎస్డీఎం అంజలి గంగ్వార్ కుటుంబ సభ్యులను కలిసి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. రేషన్‌ను అందిస్తామని చెప్పారు. పొలంలోకి వెళ్లేందుకు భద్రత కావాలని కుటుంబ పెద్ద అడిగారని, అందుకు అంగీకరించామని అంజలి తెలిపారు. -
భయంతో బతకలేం.. ఊరొదిలి పోతాం!
హాథ్రస్: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన, హాథ్రస్ దళిత యువతిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి కుటుంబ సభ్యులు, ఇప్పుడు ఊరు విడిచి వెళ్ళే దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. తమ బిడ్డకి ఈ దారుణం జరిగిన తరువాత తాము భయంగుప్పిట్లో బతుకుతున్నామని, ఊరు విడిచి వెళ్ళిపోవడం తప్ప మరో గత్యంతరం లేదని బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటన తరువాత తమ కుటుంబానికి సాయం చేసేందుకు గ్రామంలోని ఏ ఒక్కరూ ముందుకు రాలేదని బాధితురాలి తండ్రి, సోదరుడు మీడియా ముందు వాపోయారు. తమ కుటుంబాన్ని గ్రామస్తులు పదే పదే నిందిస్తోన్నారని, అందుకే భోల్గరీ గ్రామాన్ని వీడి వెళ్ళిపోనున్నట్టు వారు వెల్లడించారు. ఈ ఘటన తరువాత గత కొద్ది రోజులుగా తాము భయంతో బతుకుతున్నామని, ఇక ఇక్కడ బతికేందుకు అవకాశమేలేదని, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి, ఎవరైనా తమ బంధువుల ఇంట్లో తలదాచుకోవాలని భావిస్తున్నట్టు బాధితురాలి తండ్రి తెలిపారు. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని అందుకే గ్రామం వీడిపోవాలనుకుంటున్నట్టు బాధితురాలి కుటుంబసభ్యులు చెప్పారు. గ్రామంలోని ఎవ్వరూ తమ కుటుంబాన్ని పట్టించుకోలేదని ఆమె సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు. -
హాథ్రస్ భాధిత కుటుంబానికి గాంధీల పరామర్శ
-
దోషులను కఠినంగా శిక్షిస్తాం
ముదినేపల్లి రూరల్ (కైకలూరు)/సాక్షి, అమరావతి: ప్రేమ పేరుతో దళిత యువతిని మోసం చేసిన యువకుడిని, అతడికి అండగా నిలుస్తున్నవారిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. ప్రేమికుడి చేతిలో మోసపోయిన కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం ఐనంపూడికి చెందిన దళిత యువతిని ఆదివారం ఆమె ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్)తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా యువతి మోసపోయిన వైనం, ఇల్లును నిందితులు తగులబెట్టడం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వాసిరెడ్డి పద్మ ఏమన్నారంటే.. ► యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ► యువతికి జరిగిన అన్యాయంపై ప్రభుత్వం సత్వరమే స్పందించి ఆర్థిక సాయం అందించడంతోపాటు అన్ని విధాలా అండగా నిలిచింది. ► రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని టీడీపీ రాజకీయం చేస్తోంది. రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోంది. ► దళితులపై దాడులు చేసేవారిపై కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ► కాగా, ప్రభుత్వం తమకు ధైర్యం ఇచ్చి అండగా నిలబడిందని బాధిత కుటుంబం సీఎంకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు సీఎంవో అధికారులు ఆదివారం ట్వీట్ చేశారు. -
అత్తమామలు, మరిది, మరదలు ఆమెపై దాడి..
ఇబ్రహీంపట్నం: ప్రేమ పేరుతో వంచనకుగురైన దళిత యువతికి అండగా ఉంటామని ఎస్సీ, ఎస్టీ కమి షన్ సభ్యుడు చిలుకమర్రి నర్సింహ్మ తెలిపారు. ఆ ర్డీఓ అమరేందర్‌రెడ్డి, ఏసీపీ యాదగిరిరెడ్డి సమక్షంలో బాధితురాలు అరుణకు జరిగిన అన్యాయంపై ఇ బ్రహీంపట్నంలో గురువారం విచారణ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచాల మండలం కాగజ్‌ఘాట్ గ్రామానికి చెందిన అరుణను అదేగ్రామానికి చెందిన దూసరి వెంకటేశ్‌గౌడ్ ప్రేమించి పెళ్లి చేసుకుని మాల్ గ్రామంలో కాపురం పెట్టినట్లు చెప్పారు. మూడు నెలలు గడిచిన అనంతరం భార్య అరుణను వదలిపెట్టి పరారయ్యాడని తెలిపారు. భర్త వెంకటేశ్ అచూకీ కోసం కాగజ్‌ఘాట్‌లోని అతని ఇంటికి అరుణ వెళ్లగా.. అత్తమామలు, మరిది, మరదలు ఆమెపై దాడిచేశా రని తెలిపారు. బాధితురాలిని మోసగించిన వెంకటేశ్‌ను, అరుణపై దాడిచేసిన వారిని 24 గంటల్లో అరెస్టు చేయాలని ఏసీపీ యాదగిరిరెడ్డికి సూచించారు. మోసానికి గురైన దళిత మహిళకు ప్రభుత్వం నుంచి రూ.8 లక్షల 25 వేలు అందజేస్తామన్నారు. బాధితురాలికి తక్షణ సహాయంగా రూ.25 వేలు అందజేస్తామని ఆర్డీఓ అమరేందర్‌రెడ్డి తెలిపారు. యు వతిని మోసం చేసిన, దాడికి పాల్పడిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలి పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. -
మహిళా ఎమ్మెల్యేకు చేదు అనుభవం; పేడతో శుద్ధి!
తిరువనంతపురం : కేరళలో అధికార పార్టీ మహిళా ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. రోడ్ల అధ్వాన్న స్థితిని ప్రశ్నిస్తూ పీడబ్ల్యూడీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన ఆమెను యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా అవమానించారు. ఆమె కూర్చున్న చోటి నుంచి వెళ్లి పోయాక ఆవు పేడతో ఆ స్థలాన్ని శుద్ధి చేశారు. కేరళలోని త్రిసూరు జిల్లా నట్టికా ఎమ్మెల్యే గీతా గోపి శనివారం పీడబ్యూడీ కార్యాయలం వద్ద నిరసనకు దిగారు. గుంతలు పడిన రోడ్ల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి సీఎం పినరయి విజయన్ దృష్టికి తీసుకువెళ్తానని అధికారులను హెచ్చరించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ యువ నాయకులు కొంతమంది గీతా గోపి కూర్చున్న స్థలాన్ని నీళ్లతో కడిగి ఆవు పేడతో శుద్ధి చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఆమె ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దళితురాలైన కారణంగానే వారు తనను ఇలా అవమానించారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఘటనను కేరళ కళలు, సాంస్కృతిక మంత్రి ఏకే బాలన్ తీవ్రంగా ఖండించారు. ఉత్తర భారత దేశంలో సాధారణంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయని... ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సహించబోమని పేర్కొన్నారు. -
ఇంతింతై వనితింతై
మనిషికి రెండు చేతులు ఉన్నట్లే..ప్రతి మనిషి జీవితానికీ రెండు చేతులు ఉంటాయి.ఒకటి నిలబెట్టే హ్యాండ్.ఇంకోటి పడగొట్టే హ్యాండ్. కట్నం వేధింపులు.. భర్త మరణం..ఆడపిల్లకు జన్మనివ్వడం.. శివదేవి లైఫ్‌లో అన్నీ పడగొట్టే హ్యాండ్సే! అయినా ఆమె నిలబడింది. ఇంతింతై.. వనితింతై అన్నట్లు ఎదిగింది.ఏమీ మిగల్చని జీవితంలోంచి...చుట్టూ ఉన్న బతుకుల్ని తన అక్షరాలతో దిద్దేంతగా ఎదిగింది! శివదేవి.. ఉత్తరప్రదేశ్, బందా జిల్లాలో ఇప్పుడు అందరికీ తెలిసిన పేరు. ఓ దశాబ్దం కిందట శివదేవి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసి అత్తింటికి పంపించారు. అప్పుడు వాళ్లు అనుకున్నది చక్కటి వియ్యం అందుకున్నామని. అయితే కూతురి అత్తింటి వారు మాత్రం కయ్యానికి కాలు దువ్వారు! ఇంకా పెళ్లి పీటల మీద ఉండగనే కట్నం చాల్లేదంటూ గొంతెమ్మ కోరికలతో కొత్త కోడలిని హడలెత్తించారు. కయ్యాల మధ్యనే వియ్యాల వారింట్లో కూతుర్ని వదిలి పెట్టారు శివదేవి తల్లిదండ్రులు. కాపురం కష్టాలమయం అని తెలుస్తున్నప్పటికీ పుట్టింటివాళ్లకు భారం కాకూడదని కాలం నెట్టుకొచ్చింది శివదేవి. ఈ కష్టాలు చాలవన్నట్లు ఆమె భర్త అనారోగ్యంతో హఠాత్తుగా మరణించాడు. అప్పటికామె నిండు గర్భిణి. ‘అమ్మగారు అడుగు పెట్టింది.. ఇలా జరిగింది’ అనే దెప్పిపొడుపుల మధ్య పాపాయికి జన్మనిచ్చింది. అసలే డబ్బు పిచ్చి పట్టి ఉన్న అత్తగారిల్లు. ఆ ఇంట్లో సంపాదించే వ్యక్తి పోయాడు. పైగా పుట్టింది ఆడపిల్ల. ఒక నిస్సహాయురాలైన మహిళకు ఇంతకంటే నరకం ఇంకేం కావాలి? శివదేవిది అదే పరిస్థితి. భవిష్యత్తు అర్థం కావడం లేదు. ఏదో ఒకటి చేయకపోతే బతకలేనని మాత్రం తెలుస్తోంది. పోతే అటే పో... ఇక రాకు! ఆదివాసీ, దళిత మహిళలకు వృత్తివిద్యలో శిక్షణనిస్తారని తెలుసుకుంది శివదేవి. అది ఆరు నెలల కోర్సు, ఆ కోర్సులో చేరి చదువుకుంటానని అత్తగారిని అడిగింది. ‘చదువు, శిక్షణ అంటూ వెళ్లాలనుకుంటే... వెళ్లు. ఇక తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టకు’ అని కసిరింది అత్త. ఇంట్లోనే ఉండడమా, ట్రైనింగ్‌కి వెళ్లడమా అనే సందిగ్ధం నుంచి శివదేవి త్వరగానే బయటపడింది. అప్పటికే ఇంట్లో ఓ సారి ఆమె మీద హత్యాప్రయత్నం జరిగింది. ఆ రోజు... తాను తినాల్సిన భోజనం విషపూరితమైంది. అప్పటికి ఇంట్లో అందరూ భోజనం చేశారు. ఆ రోజు భోజనం ఎందుకు విషపూరితమైందో ఆ భగవంతుడికే తెలుసు. తాను ఆ రోజు ఆ భోజనం తినకపోవడానికి కారణమూ ఆ దైవలీల మాత్రమే. పూజ చేసుకున్నాను, వాయనం తీసుకోమంటూ పక్కింటి వాళ్ల కోడలు పిలిచింది. ఆ రోజు అక్కడే భోజనం చేసింది తాను. తాను పక్కింట్లో భోజనం చేసినట్లు తెలిసిన తరవాత తన భోజనాన్ని అత్త రహస్యంగా పారవేయడమూ కంటపడింది. దానిని తిన్న ఇంటి పిల్లి మరణించడం కూడా. ఆ సంఘటన కళ్ల ముందు మెదలగానే శివదేవి ఒక నిర్ణయానికి వచ్చేసింది. తనకు, తన బిడ్డకు ఆ ఇంట్లో రక్షణ లేదు. రక్షణ ఇవ్వలేని ఇంటికోసం ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన అవసరం లేదనుకుందామె. తన పుట్టింటి వాళ్లను ‘ఆ ఆరు నెలలు పాపాయిని దగ్గర ఉంచుకుంటే, నేను ఆరు నెలల పాటు ట్రైనింగ్‌కి వెళ్తాను. ఆ తర్వాత నా జీవితానికి ఒక దారి ఏర్పరుచుకుంటాను. నా కాళ్ల మీద నేను నిలబడతాను’ అని అడిగింది. కూతుర్ని ఆ రొంపిలో నుంచి ఎలా బయటకు తీసుకు రావాలో తెలియక ఆవేదనతో నలిగిపోతున్న శివదేవి తల్లిదండ్రులు, ఆమె బిడ్డను చేతుల్లోకి తీసుకున్నారు. రిపోర్టర్‌గా ఉద్యోగం! ఆరు నెలల శిక్షణలో శివదేవికి తన మీద తనకు నమ్మకం వచ్చింది. ఎప్పుడో స్కూల్లో చదివి మర్చిపోయిన అక్షరాలను మళ్లీ పరిచయం చేసుకుంది. కోర్సు పూర్తయింది. చదవడం, రాయడంలో పట్టు వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియదు. బతుకు పోరాటం ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో తెలియడం లేదామెకి. తన ఫ్రెండ్ అనసూయ సలహా ప్రకారం ‘ఖబర్ లహరియా’ పత్రిక ఆఫీసుకు వెళ్లింది. బుందేలీ భాషలో ప్రచురితమవుతుంది. అణగారిన వర్గాల మహిళల సమస్యలకు అద్దం పట్టే పత్రిక అది. అభ్యుదయ భావజాలం కలిగిన మహిళల బృందం ఆ పత్రిక నడుపుతున్నది. శివదేవితో మాట్లాడిన తర్వాత ఆమె పుస్తకాల చదువుకంటే లోకాన్ని, మహిళల కష్టాలను బాగా చదివిందని అర్థమైంది పత్రిక నిర్వహకులకు. పెద్ద పెద్ద పుస్తకాలు చదవకపోయినప్పటికీ ఆమె పితృస్వామ్య,పెట్టుబడిదారీ సమాజాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పగలుగుతోంది. ఆమె చూసిన జీవితాలను, వాళ్ల స్థితిగతులను రిపోర్ట్ చేస్తే చాలనుకున్నారు ఖబర్ లహరియా నిర్వహకులు. ఆమెకు రిపోర్టర్‌గా ఉద్యోగం ఇచ్చారు. రాళ్లు రప్పల మధ్య ప్రయాణం శివదేవి రిపోర్ట్ చేయాల్సిన సంఘటనలన్నీ గ్రామీణ ఉత్తరప్రదేశ్‌లోనే ఉంటాయి. దారి డొంక లేని, బస్సు ముఖం చూడని మారుమూల గ్రామాలకు వెళ్లాలి. నోట్ ప్యాడ్, పెన్ను ఉన్న బ్యాగ్, తలకు స్కార్ఫ్ చుట్టుకుని సైకిల్‌మీద వెళ్తుంటే దళిత వాడలు ఆశ్చర్యంగా చూశాయామెను. ఈ సంగతి ఆ నోటా ఈ నోటా అత్తగారింటికి చేరింది. వాళ్ల అసహనం హద్దులు దాటింది. కానీ ఆమె మీద దాడి చేయడానికి.. ఇప్పుడామె ఉన్నది తమింటి నాలుగ్గోడల మధ్య కాదు. అప్పటి నిస్సహాయ బేల కాదు. ఆమెను నిలువరించడం తమకు సాధ్యమయ్యే పని కాదని పళ్ల బిగువున భరించారు. ఇన్నింటినీ చూస్తూ తాను నిర్ణయించుకున్న దారిలో కొనసాగింది శివదేవి. రాళ్లు రప్పలతో నిండి ఉన్నది శివదేవి ఉద్యోగ ప్రయాణం మాత్రమే కాదు, ఆమె జీవిత ప్రయాణం కూడా. గ్రామాల్లో సాగుతున్న ఇసుక మాఫియా, బడి లేని గ్రామాలు, బస్సు లేని జనావాసాలు, మహిళల మీద దాడులు, అత్తింటి ఆరళ్లు.. అన్నింటినీ రిపోర్టు చేసింది. ఇవన్నీ ఒక ఎత్తయితే... 2014 లోక్‌సభ ఎన్నికలు ఆమె ఎదుర్కొన్న అతి పెద్ద సవాల్. పోలీసులు నవ్వారు ఐదేళ్ల కిందటి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆమె గ్రామాల్లో విస్తృతంగా పర్యటించింది. దళిత వాడలను చైతన్యపరచడానికి మహిళా పాఠకులను వారధిగా చేసుకుందామె. ఓటు నిర్ణయం తమదే అయి ఉండాలని... పీడనకు, ప్రలోభాలకు తల ఒగ్గకుండా ధైర్యంగా నిలబడాలని దళితులను చైతన్య పరుస్తూ వ్యాసాలు రాసింది ఖబర్ లహరియా పత్రిక. ఆ పత్రిక కాపీలను మహిళలకు చేర్చడం ద్వారా దళిత సమాజాన్ని చైతన్యవంతం చేయాలనేది ఆమె ఆలోచన. ‘ఖబర్ లహరియా’ ప్రతులను గ్రామాలకు తీసుకెళ్లి పంచుతోందని అక్కడి అగ్రవర్ణాల వాళ్లకు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లో పితృస్వామ్య, భూస్వామ్య భావజాలం ఎక్కువ. అక్కడి గ్రామపెద్దలకు శివదేవి చేస్తున్న పని ఏమాత్రం నచ్చలేదు. కొంతమంది దుండగులు ఆమెను అటకాయించి, ఆమె దగ్గరున్న పత్రిక కాపీలను, ఆమె కెమెరా ఫోన్‌ను లాక్కుని, ఆమెను అసభ్యంగా తిడుతూ, మరోసారి ఈ ఛాయలకు రావద్దని, వెళ్లిపొమ్మని బెదిరించారు. ఆమె పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తనకు ఎదురైన సంఘటనను తెలియచేస్తూ తనకు రక్షణ కల్పించమని కోరుతూ కంప్లయింట్ రాసిచ్చింది. అక్కడి పోలీసులు సంగతంతా విని ఆమె రాసిన ఫిర్యాదు కాపీని కనీసం చదవకుండా ఓ పక్కన పడేసి, ఆమెను గేలి చేస్తూ నవ్వారు. అయినా శివదేవి క్లిష్టమైన రిపోర్టింగ్‌ని మానుకోలేదు. ఆమెకు పత్రిక కూడా అండగా నిలిచింది. ఆమెకు జిల్లా అంతటా గుర్తింపు రావడానికి కారణం ఆమె రిపోర్ట్ చేసిన సాహసోపేతమైన కథనాలే. ఇప్పుడు మళ్లీ లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఆమె కలానికి మళ్లీ పని ఒత్తిడి పెరిగింది. ఈ పనిని సమర్థంగా నిర్వహించడానికి ఖబర్ లొహారియా నిర్వహకులు ఆమెకు స్కూటీ కొనిచ్చారు. డౌన్ పేమెంట్ కట్టి, మిగిలిన వాయిదాలు ఆమె చెల్లించుకునే పద్ధతిలో వాహనాన్ని ఇచ్చారు. ఆ సంస్థలో ఇలాంటి గుర్తింపును అందుకున్న తొలి ఉద్యోగి శివదేవి. – మంజీర రాని ఇంగ్లిష్‌తోనే నెగ్గుకొచ్చింది! శివదేవి ప్రస్తుతం జీవితం.. పదేళ్ల కఠోర శ్రమకు ఫలితం. 2010లో శిక్షణలో చేరినప్పటి నుంచి ఆమె ఏ రోజూ పని చేయకుండా విశ్రమించింది లేదు. తనకు వచ్చిన కొద్దిపాటి చదువుతోనే రాయదలుచుకున్న విషయాన్ని చక్కగా రాయగలిగిన పట్టు రావడానికి ఆమె పడిన శ్రమ తక్కువేమీ కాదు. ఇంగ్లిష్ రాని శివదేవికి ప్రభుత్వాఫీసుల్లో అధికారులు ఇంగ్లిష్‌లో మాట్లాడినప్పుడు ఎదురైన ఇబ్బందులు కూడా తక్కువేమీ కాదు. అత్తింటి వాళ్లు తనను, తన బిడ్డను చంపేయాలనుకున్నారు. ఆమె బతికి చూపించాలనుకుంది. సమాజం నుంచి గౌరవాలందుకుంటూ బతికి చూపిస్తున్న ధీరవనిత శివదేవి. దళితవాడల్లో తల్లిదండ్రులు ఇప్పుడు తమ పిల్లలకు ఆమెను ఆదర్శవంతంగా చూపిస్తున్నారు. -
మూడేళ్లకే తెగిన మూడుముళ్ల బంధం
సాక్షి, చెన్నూరు : ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ దళిత యువతి భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన చెన్నూరు మండలం కొండపేట గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనపై పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని కొండపేట దళితవాడకు చెందిన ఏటూరి శిరీష (20), అదే గ్రామంలోని అగ్రకులానికి చెందిన ఆదినేని సుబ్రమణ్యంలు ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించకపోవడంతో 2017లో సుబ్రమణ్యం శిరీషను వివాహం చేసుకుని వేరుగా నివాసం ఉంటున్నాడు. అప్పట్లో శిరీష తల్లిదండ్రులు తమ కుమార్తె తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసుకూడా నమోదైంది. అనంతరం కొద్దిరోజుల తర్వాత శిరీష, సుబ్రమణ్యంలు కొండపేటకు చేరుకుని స్థానికంగా నివాసముండేవారు. ఈ నేపథ్యంలో మద్యానికి బానిసగా మారిన సుబ్రమణ్యం నిత్యం భార్యతో గొడవపడుతూ పుట్టింటి నుంచి డబ్బులు తీసుకు రావాలని వేధించేవాడు. ఈ క్రమంలో తాజాగా శనివారం కూడా భార్యభర్తలు గొడవ పడ్డారు. దీంతో పుట్టింటికి వెళ్లిన శిరీషాను భర్త కొండపేటకు తీసుకొచ్చాడు. భర్త వేధింపులతో విసిగి వేశారిపోయిన ఆమె శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. డీఎస్పీ విచారణ : కడప డీఎస్పీ మాసుంబాషా ఆదివారం మండలంలోని కొండపేటకు వెళ్లి సంఘటన గురించి మృతురాలి తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం చెన్నూరు పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఘటనపై విచారించారు. -
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సీఐ
సాక్షి, ఒంగోలు సిటీ: మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు నానా దుర్బాషలాడిన ఒంగోలు తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం అమరావతిలో ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆమె ఆయన్ను కలిశారు. సీఐ అనుచితంగా ప్రవర్తించిన తీరు..బెదిరింపులు..దౌర్జన్యానికి సంబంధించిన ఇతర ఆధారాలు, సీడీలతో సహా కమిషనర్‌కు సుజాత అందజేశారు. తాను ఎస్సీ మహిళనని, తనను పది మందిలో, నడిబజారులో సీఐ అనరాని మాటలు అన్నారని ఆమె కమిషనర్ ఎదుట చెప్పారు. గురువారం ఒంగోలు మంగమూరు రోడ్డులోని ఓ అపార్టుమెంట్ వద్ద ఎన్నికల ప్రచారంలో ఉండగా సీఐ గంగా వెంకటేశ్వర్లు తన సిబ్బందితో వచ్చి అసభ్యకర పదజాలంతో తనను దూషించారని గంగాడ సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలతో ప్రచాం చేస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుందన్నారు. అక్కడున్న మహిళలను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీని వెనకేసుకొచ్చి తనపై దౌర్జన్యంగా వ్యవహరించారని ద్వివేదికి సుజాత ఫిర్యాదు చేశారు. ప్రశ్నించినందుకు నడి బజారులో జీపు ఎక్కండంటూ దౌర్జన్యం చేశారన్నారు. సీఐతో గౌరవంగా మాట్లాడుతున్నా ఆయన మాత్రం కక్ష సాధింపుగా వ్యవహరించారన్నారు. దళిత మహిళనని కూడా చూడకుండా పలువురి సమక్షంలో అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కింది స్థాయి సిబ్బంది ఇది తప్పని వారించినా ఆయన అదుపులోకి రాలేదన్నారు. అక్కడే ఉన్న పార్టీ మహిళా విభాగం ఒంగోలు నియోజకవర్గ నేత బైరెడ్డి అరుణ కలుగజేసుకుని సీఐ చేష్టలను ప్రశ్నిస్తే ఆమె పట్ల కూడా సీఐ అనుచితంగా ప్రవర్తించారని సుజాత ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సీఐ వ్యవహరించిన తీరుకు సంబంధించిన ఆధారాలు, సీడీలు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినయ్‌చంద్‌కు అందజేశామన్నారు. తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లుపై గతంలోనూ ఎన్నో ఆరోపణలు ఉన్నాయని, బాధితులు ఎందరో తమ గోడు వినిపించుకున్నా తనకు ఉన్న పలుకుబడితో వాటి నుంచి తప్పించుకున్నాడని సుజాత ఆరోపించారు. తక్షణం సీఐని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆయన్ను ఇలాగే కొనసాగిస్తే అరాచకాలు జరుగుతాయని, ఒంగోలులో ఆయన నిర్వహించే ఏకపక్ష విధులతో సమస్యలు వస్తాయని ద్వివేదీకి వివరించారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని గంగాడ సుజాతకు ఎన్నికల కమిషనర్ హామీ ఇచ్చారు. గుంటూరు రేంజి ఐజీ రాజీవ్‌కుమార్ మీనాతో పాటు, డీజీపీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారు. గంగా వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలని కోరారు. గంగాడ సుజాతతో పాటు వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, బైరెడ్డి అరుణ, స్వామిరెడ్డి పాల్గొన్నారు. తొలి నుంచీ వివాదాస్పదమే.. ఒంగోలు తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు తొలి నుంచీ వివాదాస్పదంగానే విధులు నిర్వర్తిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్ష పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రతీ అంశంలో ఆయన తాను పోలీసు అధికారినన్న సంగతి మరిచి అధికార పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. గతంలో వైఎస్సార్ సీపీ పిలుపులో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఒంగోలు రైల్వేస్టేషన్లో రైలురోకో చేస్తున్న అప్పటి పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు పట్ల అనుచితంగా ప్రవర్తించి సీఐ గంగా వెంకటేశ్వర్లు టీడీపీ మనిషిగా అప్పుడే ముద్రవేసుకున్నారు. -
చిప్పగిరి తహసీల్దార్‌పై దాడి
కర్నూలు , ఆలూరు: చిప్పగిరి మండల తహసీల్దార్ సూర్యనారాయణ ప్రసాద్‌పై ఆ మండలంలోని బెల్డోణ గ్రామానికి చెందిన దళిత మహిళలు సోమవారం దాడి చేశారు. ఆలూరులో వాసవీ కల్యాణ మండపం లో మీకోసం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరవుతున్నారని ఆ గ్రామానికి చెందిన దళితులు చేరుకున్నారు. అయితే ఈ సమావేశానికి తహసీల్దార్ కూడా హాజరయ్యారు. ఈ గ్రామంలో 1971లో దళితులకు సర్వే నంబర్ 146లో 4.66 సెంట్లను కాలనీకి కేటాయిం చారు. ప్రస్తుతం ఇదే సర్వే నెంబరులోని 85 సెంట్ల మిగులు భూమి రోడ్డు సమీపంలో ఉంది. రోడ్డుకు ఇరుపక్కల అదే గ్రామానికి చెందిన రామకృష్ణ ,సురేష్ మరికొందరికి పట్టాలను గత మూడు నెలల క్రితం తహసీల్దార్ మంజూరు చేశారు. తమ స్థలాన్ని షెడ్యూల్డ్ తెగల కులస్తులకు ఎలా కేటాయిస్తారని దళితులందరూ పలుమార్లు తహసీల్దార్‌కు విన్నవించారు. అయినా ఆయన దళితుల మాట పెడచెవిన పెట్టినట్లు తెలుస్తోంది. సోమవారం ఆలూరులో మీ కోసం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి తహసీల్దార్ సూర్యానారయణ ప్రసాద్‌తో మహిళలు వాగ్వాదానికి దిగారు. కోపోద్రిక్తులై చొక్కా పట్టుకొని పిడిగుద్దులు గుద్దారు. అనంతరం తమకు న్యాయం చేయాలని సమస్యసను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. చేసిన తప్పును వెంటను సరిదిద్దుకోపోతే చర్యలు తప్పని తహసీల్దార్‌ను కలెక్టర్ హెచ్చరించారు. రెండు రోజుల్లోగా సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. -
దళిత మహిళపై టీడీపీ ఎంపీటీసీ దాడి
శ్రీకాకుళం, టెక్కలి: టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు దళితులు, సామాన్య ప్రజలపై దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. వీటితో పాటు దళిత మహిళలపై జరుగుతున్న లైంగికదాడులు, విచక్షణ రహిత దాడులు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. తాజాగా సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామంలో టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు వల్లభ వసంతరావు, గొనప అప్పిలితో పాటు మరికొంతమంది అనుచరులు గ్రామానికి చెందిన దళిత మహిళ యజ్జల పద్మపై చేసిన విచక్షణ రహిత దాడితో ఆమె తీవ్రంగా గాయాలపాలై టెక్కలి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనపై అధికార పార్టీకి చెందిన నాయకులపై కేసులు నమోదు చేయడానికి పోలీసులు వెనుకంజ వేస్తున్నారంటూ దళిత సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు యజ్జల పద్మ తెలిపిన వివరాలు ప్రకారం... బోరుభద్ర గ్రామంలో తనకు కొంత భూమి ఉందని కౌలు విషయంలో గ్రామానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు వల్లభ వసంతరావు తన భూమిని ఆక్రమించుకునే ప్రయత్నాలు చేయడంతో ఇటీవల ఆర్డీవోకు ఫిర్యాదు చేశానని ఆమె వెల్లడించారు. దీంతో కక్ష కట్టిన వసంతరావు తన అనుచరుడు గొనప అప్పిలితో కలిసి ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తన ఇంట్లోకి ప్రవేశించి చిన్నపాటి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారంటూ బాధితురాలు వాపోయింది. మెడ పట్టుకుని గోళ్లుతో రక్కి కొట్టడంతో వారి కాళ్లపై పడి తనను ఏం చేయవద్దంటూ బతిమలాడినా కనీసం మానవత్వ లేకుండా దాడి చేశారని ఆరోపించింది. దీనికి ఇంటి బయట నుంచి బొడ్డ రాము, వజ్జ జగన్నాయకులు, వల్లభ మల్లి, మార్పు సహదేవుడు, వల్లభ నర్సింహమూర్తి, గొనప వెంకట్రావు, వల్లభ చిన్నవాడు తదితరులు ప్రోత్సహించారని తెలిపింది. దాడి విషయం తెలుసుకున్న కేఎన్పీఎస్ దళిత సంఘం ప్రతినిధులు బి.ప్రభాకరరావు, వై.గోపి, బి.మోహనరావు తదితరులు ఆస్పత్రి వద్దకు సోమవారం చేరుకుని బాధితురాలిని ఓదార్చారు. సమాచారం తెలుసుకున్న సంతబొమ్మాళి ఏఎస్ఐ ఎన్.కృష్ణతో పాటు సిబ్బంది టెక్కలి ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన దళిత మహిళపై దాడికి పాల్పడిన టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు వసంతరావుతో పాటు ఆయన అనుచరులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు బి.ప్రభాకరరావు, వై.గోపి, బి.మోహనరావు డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులు టీడీపీ కార్యకర్తలు కావడంతో, కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు హస్తం ఉందని ఆరోపించారు. సంతబొమ్మాళి మండల రెవెన్యూ అధికారులు చేసిన తప్పుల వల్లే ఇటువంటి సంఘటన జరిగిందన్నారు. తక్షణమే నిందితులపై కేసులు నమోదు చేయకపోతే బాధితురాలి పక్షాన ఉధృతమైన పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు. -
ఆకాశంలో సగం.. భద్రత శూన్యం
ఏ దేశం, ఏ రాష్ట్రం వర్ధిల్ల డానికైనా స్త్రీయే ప్రధాన కారణం. స్త్రీని గౌరవించిన రాష్ట్రాలు, దేశాలు, స్త్రీకి ప్రాధాన్యమిచ్చిన అన్ని వ్యవస్థలు వర్ధిల్లుతూ వచ్చాయి. అయితే ఈనాడు దేశంలోనూ, రాష్ట్రంలోనూ స్త్రీల ఉత్పత్తి శక్తిపై తీవ్రమైన దాడి జరుగుతుంది. స్త్రీని కేవలం గృహిణిగా మార్చి వారిని ద్వితీయులుగా పురుషుల మీద ఆధారపడి బ్రతికేవారిగా మార్చివేసి, టి.వి.సీరియల్స్ చూసి ముచ్చటించుకొనే వారిగా నెట్టివేశారు. మధ్య తరగతి స్త్రీలంటే పనీపాటాలేని వారు అన్నట్లు తేల్చివేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో స్త్రీలపై దాడులు, దమనకాండలు, అరాచకాలు, గృహ హింస నిరంతర దుష్క్రియగా మారింది. స్త్రీల రక్షణ మీద, స్త్రీలకు పని కల్పించడం మీద చంద్రబాబుకు చూపులేదు. స్త్రీ విద్యపై నిరంతరం గొడ్డలివేటు పడుతూ వుంది. కుటుంబం, మత సాంప్రదాయం, పురుష పెత్తనంతో పాటు ప్రభుత్వం స్త్రీ విద్యకు పూర్తిగా విరుద్ధంగా పనిచేస్తుంది. ఆరు, ఏడు తరగతుల్లోనే అమ్మాయిలు ఎందుకు డ్రాప్ ఔట్ అవుతున్నారనే కనీస ఆలోచన లేని ప్రభుత్వాలు స్త్రీ విద్యకు అడుగడుగునా ముళ్ళ కంచె వేస్తున్నాయి. ఇక దళిత స్త్రీలు వ్యవసాయ కూలీలుగా ఆర్థిక పేదరికాన్ని ఎంత అనుభవిస్తున్నారో కులాధిపత్యం దారుణ అణచివేతను అంతకంటే ఎక్కువ అనుభవిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ కార్మికులైన దళిత స్త్రీలు ఊరిబయట పూరిగుడిసెల్లో బతుకుతున్నారు. వారికి ఇళ్లస్థలాలు లేవు. పోషకాహార లోపం వల్ల బలహీనులవుతున్నారు. పగలంతా చెమటోడ్చి, పొలాల్లో పనిచేస్తే దళిత స్త్రీలకు మరీ తక్కువ కూలి ఇస్తున్నారు. వ్యవసాయ పునాది దెబ్బతినడంతో దళిత స్త్రీలు ఇతర జిల్లాలకు వెళ్ళి కూలి చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు భూస్వాములు వాళ్ళ చావిళ్ళలో కుక్కి పశువులతో సమానంగా చూస్తున్న ఘటనలు గుండెలను తొలిచివేస్తాయి. చంద్రబాబుకు సమాజాన్ని లోతుగా చూడటం రాదు. ఆయన ఉపరితలం మనిషి. ఆయన కళ్ళ ముందు మెరిసే జిలుగు వెలుగులను చూసి సమాజమంతా ఇలాగే వుందని అనుకుంటాడు. అనేక గృహాల్లో జరుగుతున్న హింస, నెత్తుటి చారల వెనుక ఆయన నిర్వహిస్తున్న మందు షాపుల బార్లు వున్నాయని ఆయనకు తెలియదా!. అనేక దుర్వ్యసనాలకు కాణాచిగా రాష్ట్రాన్ని దుర్గంధపూరితంగా మార్చివేస్తున్న చంద్రబాబు స్త్రీ హింసను సామాన్యంగా తీసుకోవడం ఆశ్చర్యమేస్తుంది. గృహ హింస నిరోధక చట్టం 2005 ఏ పోలీస్ స్టేషన్ సరైన పద్ధతిలో అమలు జరపడం లేదు. మరోవైపున ఇండ్లలో పనిచేసే అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. వీరు లైంగిక వేధింపులకే గాక, యజమానురాళ్ళ వేధింపులకు కూడా గురవుతున్నారు. ప్రభుత్వం అనేక విషయాల్లో ఇంటింటికీ తిరిగి లెక్కలు తీస్తుంది కానీ ఈ ఇండ్లలో పనిచేస్తున్న బాలకార్మికుల గురించి, వారి వేధింపుల గురించిన ఏ విధమైన సమాచారం ప్రభుత్వానికి లేదు. సినీరంగంలో చిన్నచిన్న వేషాలు వేసి జీవిస్తున్న యువతుల మీద కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. వారిలో వున్న కళను గుర్తించకుండా వారి దగ్గరకు పనికోసం వచ్చిన జూనియర్ ఆర్టిస్టులను వేధిస్తున్నారు. జూనియర్ ఆర్టిస్టులకు హెల్త్ కార్డులు లేవు, లైఫ్ ఇన్సూరెన్స్ లేదు, వారి జీవితానికి భద్రత లేదు. వారిని వేధిస్తున్నవారు పెద్ద పెద్ద ధనవంతులు అవ్వడంతో, బడా పెట్టుబడిదారులు కావడంతో వారి కేసును తీసుకొనే పోలీస్ స్టేషన్ లేదు. ఒకవేళ తీసుకున్నా ఆ పలుకుబడిగల నిర్మాతల, దర్శకుల ఒత్తిడితో ఆ కేసు నిలవదు. వారికి నిర్దిష్ట పారితోషికం లేదు. అభద్రతలో వారు జీవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వారిపై శ్రమదోపిడీ, శారీరక దోపిడీ జరుగుతుంది. రాష్ట్రంలో వృత్తికారులైన స్త్రీల విషయం మరీ దయనీయంగా మారిపోయింది. చేనేతను ధ్వంసంచేసి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ పవర్లూమ్ మగ్గాలను ప్రోత్సహించడంతో చేనేత స్త్రీల బతుకులను చంద్రబాబు దెబ్బతీశారు. ఇక కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి స్త్రీలు పనిలేక వ్యవసాయ కూలీలుగా మారినా వారి పరిస్థితి కూడు, గూడు లేని స్థితికి నెట్టబడింది. గిరిజన ప్రాంతాల్లోనైతే ఊళ్ళకు ఊళ్ళు మంచాలెక్కాయి. రెండు మందు బిళ్ళలిచ్చే దిక్కు లేకుండా పోయింది. అసలు రాష్ట్రంలో పాలన వుందో, పడకేసిందో తెలియని పరిస్థితి. చంద్రబాబు చూపు ధనవంతులపైన, సొంత కులం పైనే ఉంటోంది. రాష్ట్రంలో స్త్రీ అణచివేతలు అన్ని రంగాల్లో పెరిగిపోతున్న ఈ దశలో స్త్రీలు కూడా ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు దృష్టి సారించాలి. ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా చంద్రబాబును గద్దె నుంచి దించివేయడం కూడా స్త్రీ ఉద్యమంలో భాగమే. తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సాంస్కృతిక ఆర్థిక రాజ కీయ విప్లవానికి స్త్రీ నడుం కట్టాల్సివుంది. స్త్రీ మేలుకున్నప్పుడే దేశానికి నిజమైన విముక్తి. వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, వ్యవస్థాపక అధ్యక్షుడు, నవ్యాంధ్రపార్టీ ‘ 98497 41695 -
లైంగిక వేధింపుల కేసులో జడ్జి అరెస్ట్
హైదరాబాద్/తుంగతుర్తి: ప్రేమపేరుతో దళిత యువతిని మోసం చేసిన జడ్జిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్టులో జడ్జిగా పనిచేస్తున్న సత్యనారాయణరావు హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో ఉంటున్న ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన సివిల్ కోర్టు మహిళా న్యాయవాది రజిని ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ఇటీవల సత్యనారాయణరావు మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయమై సత్యనారాయణరావును నిలదీయగా అతడితో పాటు ఆయన తల్లి రజినీపై దాడి చేసి కులం పేరుతో దూషించారు. దీంతో ఈ నెల 4న ఆమె చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అక్కడి పోలీసులు సత్యనారాయణరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, రేప్ కేసు నమోదు చేశారు. హైకోర్టు అనుమతితో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. -
దళితులను హింసిస్తున్న కలెక్టర్
నెల్లూరు(సెంట్రల్): దళిత మహిళా ప్రజాప్రతినిధులుగా ఉన్న తమకు ఎటువంటి అధికారాలు ఇవ్వకుండా చెక్పవర్లు రద్దు చేయించి మానసికంగా తమను హింసిస్తున్నారని పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ ఆరోపించారు. నెల్లూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం కలెక్టర్ తీరుకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎటువంటి పొరపాటు జరగకపోయినా, ఏ నేరం చేయక పోయినా, ఎక్కడా అవినీతికి పాల్పడకపోయినా తమ చెక్‌పవర్ రద్దు చేయించి మహిళలను, దళితులను అణగదొక్కడానికి కలెక్టర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగా చట్ట విరుద్ధమైన , న్యాయ సమ్మతం కాని పనులు చేయమని చెప్పిన మాటలకు తాము నిరాకరించడం తప్పుగా భావించిన కలెక్టర్ తమ చెక్ పవర్ రద్దు చేయించడం తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. కలెక్టర్ స్థానంలో ఉన్న వ్యక్తి గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా పెత్తనం చేయడం శోచనీయమన్నారు. గతంలో ఎంతో మంది కలెక్టర్లు జిల్లాలో పనిచేశారని, ప్రస్తుత కలెక్టర్ తీరు, అసమర్థంగా పాలన ఇంత వరకు ఎవరూ చేయలేదన్నారు. ప్రశ్నించే ప్రజాప్రతినిధులపై అధికారులతో విమర్శలు చేయిస్తూ, దళిత మహిళలమైన తమ మనోభావాలను దెబ్బతీయడం సరికాదన్నారు. కలెక్టర్ పద్ధతి మార్చుకోక పోతే జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు ఏకమై కలెక్టరేట్‌ను దిగ్బంధం చేసి మా హక్కుల కోసం పోరాటం చేస్తామే తప్ప, మీ లాంటివారిని విడిచి పెట్టబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో వెంకటాచలం సర్పంచ్ మణెమ్మ, వెంకటాచలం ఎంపీపీ అరుణమ్మ మరి కొంత మంది మహిళలు పాల్గొన్నారు. -
దళిత మహిళలపై ఇలాంటి దారుణాలెన్నో!
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత దేశంలో పుట్టుకతోనే దళిత మహిళలపై వివక్ష కొనసాగుతోంది. దళిత యువతులపై దారుణాలు జరుగుతున్నాయి. దళిత మహిళలను ఎప్పుడైనా ఏమైనా చేయవచ్చని, ఏం చేసినా చెల్లిపోతుందని, తమకు వ్యతిరేకంగా నోరు విప్పేవారే ఉండరన్నది అగ్రవర్ణాల అహంకారం. నిర్జన ప్రదేశాల్లో దళిత బాలికలు, యువతులు కనిపిస్తే వారిపై అగ్రవర్ణాల మగాళ్లు ఎక్కడెక్కడనో చేతులు పెడతారు, ఏవేవో తడుముతారు. అనుకుంటే వారి ఇళ్లకు, వారి గదుల్లోకి, వారి పక్కలోకి వెళ్లగలమని భావిస్తారు. ఇందులో భయపడాల్సింది ఏమీ లేదని, తమను ఎవరు ఏమీ చేయలేరన్నది అగ్రవర్ణ మగవాళ్ల ఆలోచన’ అని మధ్యప్రదేశ్‌కు చెందిన సుమన అనే దళిత మహిళ వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ‘అధికారంలో ఉన్నా దళిత మహిళలకు రక్షణ లేదు. వారిని కూడా అగ్రవర్ణాల వారే నియంత్రిస్తుంటారు. దళితులపై జరిగిన దాడికో, దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలబడితే దళిత సర్పంచ్‌లను కూడా లక్ష్యంగా చేసుకొని హింసిస్తారు. చంపేస్తారు. ఓ గ్రామంలో దళిత మహిళపై జరిగిన దారుణాన్ని ఓ దళిత మహిళా సర్పంచ్ ప్రశ్నించినందుకు ఆమెను, ఆ మహిళను సజీవంగా దహనం చేశారు. మరో దారుణాన్ని ప్రశ్నించినందుకు ఓ దళిత సర్పంచ్ మేనల్లుడిని చితకబాదారు. ఈ రెండు సంఘటనల్లో ఎలాంటి కేసులు లేవు. శిక్షలు లేవు. నేను కూడా నా విధులను సక్రమంగా నిర్వర్తించాలని అనుకుంటాను. అగ్రవర్ణాల వారు చేయనీయరు’ అని అదే రాష్ట్రానికి చెందిన గాయత్రి అనే ఓ గ్రామ సర్పంచ్ చెప్పిన కథనం. ‘అగ్రవర్ణాల మహిళలు, దళిత మహిళలు ఒక్కటేనంటే, వారిద్దరు సమానమంటే నేను ఒప్పుకోను. 15 ఏళ్ల దళిత బాలికలపై 33.2 శాతం అత్యాచారాలు జరుగుతుంటే అగ్రవర్ణాల బాలికలపై 19.7 శాతం అత్యాచారాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ లెక్కలే తెలియజేస్తున్నాయి. దళిత మహిళలపై జరుగుతున్న దారుణాల్లో వందకు ఐదు కేసులు మాత్రమే కోర్టుకు వస్తున్నాయి. ముందుగా కేసులు దాఖలైనా ఒత్తిళ్ల మేరకు అవి కోర్టు వరకు చేరుకోవు’ అని హర్యానాలో పానిపట్‌లో సవిత అనే దళిత లాయర్ అభిప్రాయపడ్డారు. జెనీవా సదస్సుకు నివేదన వీరి అభిప్రాయాలను జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల 38వ సమావేశంలో ‘అఖిల భారత దళిత మహిళా అధికార్ మంచ్’ నాయకులు గురువారం నాడు వినిపించారు. జూన్ 19వ తేదీ నుంచి ఈ సమావేశాలు కొనసాగుతుండగా, తమ వాదనను వినిపించేందుకు తమకు ఈ రోజు అవకాశం లభించినట్లు మంచ్ ప్రధాన కార్యదర్శి ఆశా కోతల్ తెలిపారు. దేశంలో కుల వివక్ష కొనసాగుతోందని, ముఖ్యంగా దళితులను అంటరాని వారిగా చూస్తారని భారత ప్రభుత్వం ఏనాడు అంతర్జాతీయ వేదికలపై అంగీకరించలేదు. పైగా అదంతా అబద్ధమంటూ ఖండించేది. వివక్ష దాడుల గురించి ఇలా వివరించినప్పుడు అది తమ అంతర్గత విషయమని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటూ ముక్తిసరి మాటలతోనే వాస్తవాలకు మసిపూసేది. ఈ మాత్రం అంగీకరించడం కూడా డర్బన్‌లో 2001లో జాతి విద్వేశంపై జరిగిన ప్రపంచ సదస్సులోనే జరిగింది. కుల వివక్ష అంశాన్ని జాతి విద్వేశంతో సమానంగా చూడవద్దని నాడు సదస్సును కోరింది. భారత్‌లో కొనసాగుతున్న కుల వివక్షతపై ఐక్యరాజ్య సమితి జాతి వివక్ష నిర్మూలన కమిటీ సభ్యురాలు రీటా ఇసాక్ 2016లో విడుదల చేసిన నివేదికను కూడా భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ఖండించింది. పోగొట్టుకోవడానికి మా వద్ద ఏమీ మిగల్లేదు ప్రపంచ సదస్సుల్లో భారత్‌లో కొనసాగుతున్న కుల, లింగ వివక్షతలపై అంతర్జాతీయ హక్కుల సంఘాలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, నివేదికల్లో వివక్షత తీవ్రత ప్రతిబింబించడం లేదన్న ఉద్దేశంతో దళిత మహిళా అధికార మంచ్ తొలిసారిగా దళిత మహిళల అభిప్రాయాలను వారి మాటల్లోనే వ్యక్తం చేసింది. ‘వాయిసెస్ అగనెస్ట్ క్యాస్ట్ ఇంప్యునిటీ: న్యారెటీస్ ఆఫ్ దళిత విమెన్ ఇన్ ఇండియా’ శీర్షికతో సమావేశానికి సమర్పించింది. ‘కుల వ్యవస్థ చావు కేకలను వినేందుకు మేము గుండెలు దిటువు చేసుకొని ముందుకు వెళుతున్నాం. విజయం కోసం మేము అన్నీ వదులుకున్నాం. పోగొట్టుకోవడానికి మా వద్ద ఇంకా ఏమీ మిగల్లేదు’ అన్న వ్యాఖ్యలతో ఆ నివేదికను ముగించారు. -
బీజేపీ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
డెహ్రాడూన్ : భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఒకరిపై ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు అయ్యింది. దళిత మహిళలపై చెయ్యి చేసుకోవటం.. వారిని కులం పేరుతో దూషించిన ఘటనలో ఎమ్మెల్యే రాజ్‌కుమార్ థూక్రాల్ పై అభియోగాలు నమోదయ్యాయి. విషయం ఏంటంటే... స్థానికంగా ఉండే దళిత కుటుంబాలకు చెందిన ఒక యువతి, యువకుడు ప్రేమించుకుని పారిపోయారు. దీంతో ఆ ఇంటి పెద్దలు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. అయితే తన నియోజకవర్గం(రుద్రాపూర్) పరిధిలోనే ఈ ఘటన చేసుకోవటంతో సంధి కోసం థూక్రల్ ఆ కుటుంబ సభ్యులను తన ఇంటికి పిలిపించారు. ఈ క్రమంలో వారు ఆయన ముందే వాదులాడుకోగా.. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే మహిళలను దూషిస్తూ చెయ్యి చేసుకున్నారు. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుండటంతో పోలీసులు ఆదివారం రాజ్‌కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నాదేం తప్పు లేదు... ‘ఆ మహిళలిద్దరికీ సర్దిచెప్పేందుకు రెండు గంటలు శ్రమించా. అంతా సరే అనుకుని ఇంటి బయటకు వెళ్లాక వారు గొడవకు దిగారు. ఈ క్రమంలో వారిని నియంత్రించేందుకు ఎంతో ప్రయత్నించా. వీలు కాకపోవటంతోనే దురుసుగా ప్రవర్తించాల్సి వచ్చింది. వారిని దూషించిన మాట అవాస్తవం’ అని రాజ్‌కుమార్ మీడియాకు తెలియజేశారు. ఈ ఘటనలో రాజ్‌కుమార్‌ను వివరణ కోరుతు నోటీసులు జారీ చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్ తెలిపారు. In a video that has gone viral, #Uttarakhand #BJP MLA from Rudrapur seat, Rajkumar Thukral, can be spotted abusing & beating up Dalit women @IndianExpress pic.twitter.com/COzwiCmNGg — Kavita (@Cavieta) 11 March 2018 -
మహిళల ఉసురు తీస్తున్న 'కులం'
పురుషాధిపత్య సమాజంలో మహిళలు సామాజిక అణచివేతకు, లింగ వివక్షకు గురి అవుతున్నారనేది ఎవరూ కాదనలేని సత్యం. అయితే తాజాగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) విడుదల చేసిన నివేదిక మరింత ఆందోళనకు గురిచేసింది. దళిత మహిళలపై జరుగుతున్న లైంగిక, శారీరక దాడులు, వివక్షకు తోడు వారిని కులం కూడా కాటేస్తోందని యూఎన్ అధ్యయనం వెల్లడించింది. వారు నివసించే మురికివాడల్లోని పారిశుధ్యలేమి, అనారోగ్య పరిస్థితులు, అందుబాటులో లేని వైద్య సదుపాయాలు దళిత మహిళల ఆయుర్దాయాన్ని మింగేస్తున్నాయని తెలిపింది. ఆధిపత్యకులాలలోని మహిళలతో పోలిస్తే దళిత మహిళ కనీసం 15ఏళ్లు (14.6)ముందుగానే కన్నుమూస్తోందని ఐరాస నివేదిక తేల్చింది. దళిత మహిళ సగటున 39.5 ఏళ్లకే చనిపోతోంటే.. ఇతర కులాల మహిళల్లో ఇది 54.1 గా ఉంది. అంతేకాదు సామాజిక హోదా, ఇతర అంశాలు సమానంగా ఉన్నప్పటికీ కూడా ఈ గ్యాప్ 11 సంవత్సరాలుగా ఉంది. ఐక్యరాజ్యసమితి 2015 లో '2030 నాటికి జెండర్ ఈక్వాలిటీ' సాధించాలనే ఎజెండాను ఆమోదించిన రెండు సంవత్సరాల అనంతరం ఈ నివేదికను వెల్లడించింది. పేదరిక నిర్మూలన, ఆహారం, నీరు, పారిశుధ్యం, ఆరోగ్యం, భూమి, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం లాంటి 17 రకాల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) అమలులో సవాళ్లను ఈ అధ్యయనం పరిశీలించింది. దాదాపు 89 దేశాల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్ పేరుతో నిర్వహించిన అధ్యయనం ఈ విషయాలను ప్రకటించింది. సమాజంలో వెనుకబడి ఉన్న మహిళలు, బాలికలు తరచూ లింగ అసమానతలతోపాటు ఇంకా పలురకాల కష్టాలు అనుభవిస్తున్నారు. నిరుపేద కుటుంబాలలో నివసించే స్త్రీలు తమ పని సమయములో 24శాతం వంట చెఱకు, నీరు, ఆహారం, గృహ అవసరాలకోసం వినియోగిస్తుండగా, ధనిక కుటుంబాలలోని మహిళలు దీంట్లో సగ భాగాన్ని అంటే 12శాతం సమయాన్ని అలాంటి పనులకు కేటాయిస్తున్నారట. భారతదేశంలో 20-24 ఏళ్ల వయస్సులో ధనిక వర్గాలనుంచి వచ్చిన యువతులతో పోలిస్తే గ్రామీణ పేద యువతుల్లో పాఠశాలకు వెడుతున్నవారి సంఖ్య 21.8 రెట్లు తక్కువగా ఉంది. అలాగే 18 ఏళ్ళలోపు పెళ్లిళ్లు గ్రామీణ ఐదు రెట్లు ఎక్కువ. కౌమార దశలోనే తల్లులుగా మారుతున్న వారి సంఖ్య 5.8రెట్లు ఎక్కువ. సాంఘిక సోపానక్రమంలో తక్కువ విద్య, తక్కువ హోదా ఉన్న మహిళ మరింత శ్రమదోపిడీకి గురవుతుందనీ, భూమిలేని, షెడ్యూల్డ్ కులాలు, తెగల నుంచి వచ్చి ఉంటే ఈ దోపిడీ ఇంకా తీవ్రంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. 1990ల ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా మొత్తం అక్షరాస్యత రేటు, పాఠశాలలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, లింగ, సామాజిక అసమానతలు ఇప్పటికీ ఉన్నాయని నివేదించింది. ఇందుకు జనాభాలో 16.6శాతంగా ఉన్న షెడ్యూల్డ్ తెగలు 8.6శాతంగా ఉన్న షెడ్యూల్డ్ కులాల అక్షరాస్యత రేటు భారతీయ సగటు అక్షరాస్యత రేటు కంటే తక్కువగా ఉండటాన్ని నిదర్శనంగా పేర్కొంది. ఎస్.టి. మహిళల అక్షరాస్యత రేటు ఇప్పటికీ 50శాతం కంటే తక్కువగా, ఎస్సీ మహిళల్లో 57శాతం కంటే తక్కువగా ఉందని చెప్పింది. అందరికీ అభివృద్ధి అనే లక్ష్యాన్ని సాధించాలంటే మహిళల ముందస్తు పురోగతి ప్రాధాన్యతను యూఎన్ నివేదిక నొక్కి చెప్పింది. -
ఇంత తక్కువా..?
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీఎస్డీఎఫ్) అమలు తీరుపై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేటాయించిన నిధులు, ఖర్చు తీరును సమీక్షించి నివ్వెరపోయింది. మరో నెలన్నరలో వార్షిక సంవత్సరం ముగియనుండగా.. సగం నిధులు కూడా ఖర్చు చేయకపోవడంతో యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల తీరును పరిశీలించేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ రామ్‌శంకర్ కఠారియా ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ ఎల్.మురుగన్, సభ్యులు కె.రాములు, యోగేంద్ర పాశ్వాన్, సంయుక్త కార్యదర్శి స్మితా చౌదరి బృందం రెండు రోజులపాటు హైదరాబాద్‌లో పర్యటించింది. ఎస్సీ సంక్షేమ సంస్థలు, ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ శాఖలతో వేర్వేరుగా సమావేశమై పరిస్థితిని పరిశీలించింది. 2017–18లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి అమలు తీరును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితోపాటు ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో బుధవారం సమీక్షించింది. అయినా మారలేదు.. 2017–18లో ఎస్సీఎస్డీఎఫ్ కింద రూ.14,375 కోట్లు కేటాయించగా.. ఇప్పటివరకు రూ.7 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయడంపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. సగం కూడా ఖర్చు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. ఎస్సీ సబ్‌ప్లాన్ అమల్లో ఉన్నప్పుడూ పూర్తిస్థాయిలో నిధులు ఖర్చు చేయలేదని, ఈసారి ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు చేసినా పరిస్థితి మాత్రం మారలేదని పేర్కొన్నారు. కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేసినప్పుడే దళితులు అభివృద్ధి చెందుతారన్నారు. లక్ష్య సాధనలో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ స్పష్టం చేసింది. వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఆర్అండ్బీ, పరిశ్రమలు, రుణ వితరణ శాఖలు పురోగతిలో తీవ్ర వెనుకబాటును ప్రదర్శిస్తున్నాయని అభిప్రాయపడింది. ఎస్సీఎస్‌డీఎఫ్‌లో ఉన్న అన్ని శాఖల పనితీరులో అంతరాలున్నట్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపైనా సమీక్షించింది. డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. దళితులపై దాడులు పెరుగుతున్నాయ్ రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నా యని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. హత్యలు, అత్యాచారాలు ఎక్కువైనట్లు తెలిపింది. పోలీసుల తీరుతో బాధితులు నష్టపోతున్నట్లు అభిప్రాయపడింది. దాడి జరిగిన వెంటనే కేసు నమోదు చేయాలని, కానీ కేసుల నమోదు, దర్యాప్తులో జాప్యం జరుగుతోందని సభ్యులు పేర్కొన్నారు. అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదైతేనే బాధితులకు పరిహా రం వస్తుందని, కానీ నమోదులో జాప్యం జరగడంతో బాధితులకు పరిహారం సకాలంలో అందట్లేదన్నారు. కేసు నమోదు విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తోందని, బాధితులందరికీ కోర్టును ఆశ్రయించే చైతన్యం ఉండకపోవచ్చని అన్నారు. కేసుల నమోదులో జాతీయ సగటుతో పోల్చితే రాష్ట్రంలో తక్కువగా ఉందని కమిషన్ వైస్‌చైర్మన్ మురుగన్ అన్నారు. అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులు, పరిహారం తది తర వివరాలతో నివేదికను సమర్పించాలని రాష్ట్ర పోలీసు శాఖకు స్పష్టం చేసినట్లు చెప్పారు. బాలికల అక్షరాస్యత తగ్గింది రాష్ట్రంలో దళిత బాలికల అక్షరాస్యత క్రమంగా తగ్గుతోందని కమిషన్ తెలిపింది. కారణాలను అన్వేషించాలని, బాలికల అక్షరాస్యత తగ్గడం ప్రమాదకరమని పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఎస్సీ బాలికల డ్రాపౌట్ శాతం పెరుగుతున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల పనితీరు బాగుందని సభ్యులు కితాబిచ్చారు. దళిత యువతుల వివాహానికి సంబంధించి అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం సత్ఫలితాలిస్తుందన్నారు.