
కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్
సాక్షి, ఆసిఫాబాద్ : ఇచ్చిన అప్పు తిరిగి తీర్చమని అడిగినందుకు ప్రత్యర్థుల చేతిలో బలైపోయిన దళిత మహిళ దుర్గం సేవాంతను ఎలాగైనా మట్టుపెట్టాలని నిందితులు చూసినట్లు తెలుస్తోంది. మృతురాలి కుమారులు, బంధువులు స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం ఎలాగైనా ఆమెను చంపాలని నిందితులు భావించి ఒకసారి విఫలమై రెండోసారి కూడా అదే తరహాలో దాడి పాల్పడినట్లు తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సేవాంత ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టి హతమార్చాలని చూడడం.. బాధితురాలు కాలిన గాయాలతో చికిత్స పొందుతూ బుధవారం మరణించడం తెలిసిందే. అయితే ఈ ఘటన కన్నా ముందే ఆమెపై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 25 (గురువారం) రాత్రి మృతురాలు సేవంతా ఇల్లు కాలిపోయింది. ఇల్లు తగలబెట్టింది కూడా వీరేనని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ హత్యానేరంలో ప్రస్తుతం నిందితులుగా ఉన్న కామ్రే సాలుబాయి, బసరత్‌ఖాన్ మృతురాలికి ఇచ్చిన అప్పు విషయంలో తరచూ గొడవలు జరుగుతుండేవని చెబుతున్నారు. ఈ క్రమంలో కక్ష గట్టి ఇంటి తగలబెట్టడం అలా కుదరకపోవడంతో నేరుగా ఒంటిపై కిరోసిన్ పోసి చంపే ప్రయత్నం చేశారని కుటుంబసభ్యుల ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కానీ కేవలం ఇచ్చిన డబ్బుల కోసమే ఇంత ఘాతుకానికి పాల్పడ్డారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా వీరి మధ్య ఇతర వర్గ వైషమ్యాలు ఉన్నయా? అనేది కూడా విచారిస్తున్నామని పోలీసులు అంటున్నారు.
అప్పుడే పట్టించుకుని ఉంటే..
మొదట ఇల్లు కాలిపోయినప్పుడు పోలీసులు స్పందించి ఉంటే నిందితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టేవారు కాదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మొదట నిద్రిస్తున్నప్పుడు ఇంటికి నిప్పు పెట్టారు. అలా కుదరకపోవడంతో మరో ఐదురోజుల తర్వాత నిద్రిస్తున్న సేవాంతపైనే నేరుగా కిరోసిన్ పోసి హత్యచేయాలని ప్రణాళిక వేశారు. అయితే బాధితురాలు కేకలు విని కుటుంబ సభ్యులు అత్యవసర నంబర్ 100కు ఫోన్ చేయడంతో 108ద్వారా ఆసుపత్రి తరలించే ముందు స్థానిక తహసీల్దార్, ఎస్సై సమక్షంలో ఒకసారి, సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రిలో స్థానిక జూనియర్ సివిల్ కోర్టు మేజిస్ట్రేట్ గారి సమక్షంలో మరోసారి, స్థానిక మీడియా ప్రతినిధులు అడిగిన వారికి సేవంతా మరణించే కొంత సమయానికి ముందు ముగ్గురు పేర్లు కామ్రే సాలుబాయి, ఆమె కొడుకు సాయి, బెజ్జూరు మండల కోఆప్షన్ సభ్యుడు బసరత్‌ఖాన్ తనను చంపాలనికిరోసిన్ పోసి నిప్పంటించారని వెల్లడించింది.
వాంగ్మూలమే ప్రధాన ఆధారం
ఓ వ్యక్తి మరణించే ముందు చెప్పే వాంగ్మూలాన్ని చట్టం బలంగా నమ్ముతుంది. అదే క్రమంలో సేవాంత కేసులో కూడా ఆమె చివరిగా చెప్పిన మాటలే నిందితులను అదుపులోకి తీసుకోవడానికి ప్రధాన ఆధారంగా మారింది. దాని ఆధారంగానే ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. గురువారం కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య మృతురాలి ఇంటికి వెళ్లి ప్రాథమిక ఆధారాలు సేకరించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా విచారణ కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం అదుపులో ఉన్న ముగ్గురు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు హత్యానేరం కింద కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. నిందితులను ప్రస్తుతం విచారిస్తున్నామని పేర్కొన్నారు. దీని వెనక ఎవరూ ఉన్నా విడిచిపెట్టదిలేదని స్పష్టం చేశారు. ఈ ఘటన వెనక ఎవరూ ఉన్న వారందర్ని కఠినంగా శిక్షించాలని సీపీఐ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మృతురాలి కుటుంబ సభ్యుల్ని స్థానిక దళిత నాయకులతో కలిసి పరామర్శించారు. వారి వద్ద నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
సేవాంత కుటుంబానికి 20లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
అప్పు అడిగినందుకు ప్రత్యర్థులచేతిలో హతమైన దళిత మహిళ దుర్గం సేవాంత కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీపీఐ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన బెజ్జూరు మండలం మర్తిడికి చెందిన మృతురాలు దళిత మహిళ దుర్గం సేవాంత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె మృతి కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఆయన వెంట జిల్లా సీపీఐ నాయకులు అంబాల ఓదెలు, దళిత సంఘం నాయకులు ఉన్నారు.
దిక్కులేని వాళ్లం అయ్యాం..
ఇన్నాళ్లు మా నాన్న లేకున్నా అమ్మ మమ్మల్ని చదివించాలని ఆరాట పడేది. ప్రస్తుతం అమ్మ కూడా లేకపోవడంతో దిక్కులేని వాళ్లం అయ్యాం. ప్రస్తుతం నేను, చిన్న తమ్ముడు హైదరాబాద్‌లో చదువుకుంటున్నాం. ఇన్నాళ్లు అమ్మ డబ్బులు పంపింతే మా చదువు సాగేది. ఇప్పుడు భవిష్యత్ తలుచుకుంటే భయంగా ఉంది. మా అమ్మ చావుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి. ఈ ఘటనకు కారణమైన వారిని ఎవర్ని కూడా విడిచిపెట్టోద్దు. – శంకర్, మృతురాలి పెద్ద కొడుకు
Comments
Please login to add a commentAdd a comment