ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వైద్యశాస్త్ర విభాగానికి సంబంధించి ఇటీవలి కాలం (2017)లో... హైకోర్టు క్రిమినల్ అప్పీల్ నం. 326లో వెల్లడించిన ఆదేశాలను అనుసరించి, ఒక సమూల ప్రక్షాళనకై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. హైకోర్టు న్యాయమూర్తులు తమ తీర్పులో శవపరీక్షల నిర్వహణలో పాటించాల్సిన శాస్త్రబద్ధమైన ప్రమాణాలు, తదనంతరం తయారు చేసే నివేదికల నిబద్ధతపై విస్తృతంగా చర్చించారు. ఆధునిక సమాజంలో ప్రజల అసహజ మరణాలకు గల కారణాలను తెలుసుకోవడం, దోషులను శిక్షించడం, నేరాలను నివారించడం ప్రభుత్వాల బాధ్యత. ఈ ప్రక్రియలో పోలీసులు, కోర్టు లతో పాటు ఫోరెన్సిక్ వైద్యుల పాత్ర చెప్పుకోదగ్గది.
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున వైద్యుల నియామకాలు జరిగిన పుణ్యమా అని చాలాచోట్ల ఫోరె న్సిక్ వైద్యులు అందుబాటులో ఉండడంచేత శవపరీక్షలు నాణ్యతా ప్రమాణాలతో నిర్వహించడానికి అవకాశం ఏర్పడింది. అయితే హైకోర్టు ఆశించిన విధంగా న్యాయ వైద్య శాస్త్రంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడానికి నియమ నిబంధనావళి రూపొందించడం ఈ విశేషజ్ఞుల కమిటీకి పెద్ద కష్టమైన పని కాకపోయినప్పటికీ... దానిని ఆచరణలో పెట్టాలంటే మన శవాగారాలను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాల చోట్ల శవాలను భద్రపరిచే శీతల వ్యవస్థ (కోల్డ్ స్టోరేజ్) అవసరాలకు సరిపోయేలా లేదు.
మన మార్చురీలలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ.. ముఖ్యంగా ద్రవ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి వుంది. శవపరీక్షలు చేయడానికి కావల్సిన ఆధునిక పనిముట్లు చాలాచోట్ల అందుబాటులో లేవు. ప్రపంచం అంతా ఎలక్ట్రిక్ రంపాలతో పుర్రెలను తొలచి మెదడును పరీక్షిస్తుంటే, మనం మాత్రం పాత పద్ధతిలో ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం. కొన్ని అసహజ మరణాలను పరిశోధించడానికి బాడీ శాంపుల్స్‌ను దూరంగా ఉన్న ప్రయోగశాలలకు పంపాల్సి ఉంటుంది, అప్పటివరకు ఆ నమూనాలను పరిరక్షించడానికి డీప్ ఫ్రీజర్‌లు, అవి చెడిపోకుండా ఉండడానికి ప్రత్యేక సంరక్షక ద్రవ్యాలు అవసరం అవుతాయి. ఈ ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పన పని నాణ్యతను పెంచడానికి ఎంతగానో దోహదపడతాయి.
చదవండి: నిజంగా పవన్ కల్యాణ్‌కు ఆ ధైర్యం ఉందా?
ఆంధ్రప్రదేశ్‌లోని న్యాయ వైద్య శాస్త్ర ప్రయోగశాలలు (ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీస్) అనేక విష పదార్థాల కారణంగా మరణించినవారి శవపరీక్షలలో పరిమాణాత్మక ఫలితాలను అందించ లేకపోతున్నాయి. అనేక విషాలను గుణాత్మకంగా గుర్తించడంలో పేలవంగా ఉన్నాయి. కాలం చెల్లిన విశ్లేష ణాత్మక విషశాస్త్ర పద్ధతులు (ఎనటికల్ టాక్సికాలజీ) ఉపయోగించడమే దీనికి గల ముఖ్య కారణం. ఎఫ్‌ఎస్‌ఎల్‌లు న్యాయ వైద్య విభాగం మధ్య సరిగ్గా సమన్వయం లేక పోవడం కొన్ని కేసుల న్యాయ విచారణ విఫలమయ్యేందుకు కూడా కారణ మవుతోంది.
మొత్తంగా న్యాయ వైద్యశాస్త్ర విభాగం బాగుపడాలంటే... మన మార్చురీలలో, న్యాయ వైద్య ప్రయోగశాలల్లో, పోలీస్ వ్యవస్థలో, అలాగే సంబంధిత వ్యక్తులకు వృత్తి పట్ల అంకిత భావంలో పెను మార్పులు అవసరం.
– కట్టంరెడ్డి అనంత రూపేష్ రెడ్డి
సహాయ ఆచార్యులు, న్యాయ వైద్య శాస్త్రం– విష విజ్ఞాన శాస్త్రం, ఆంధ్ర వైద్య కళాశాల
Comments
Please login to add a commentAdd a comment