AP: రూ.3,364 కోట్లతో సకల వసతులు.. మారనున్న రూపురేఖలు | Nadu-Nedu Program In AP Welfare Hostels With Rs 3364 Crores | Sakshi
Sakshi News home page

AP: రూ.3,364 కోట్లతో సకల వసతులు.. మారనున్న రూపురేఖలు

Published Sat, Nov 19 2022 3:24 AM | Last Updated on Sat, Nov 19 2022 9:50 AM

Nadu-Nedu Program In AP Welfare Hostels With Rs 3364 Crores - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని హాస్టళ్ల రూపురేఖలు మార్చి, అత్యుత్తమ విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా రూ.3,364 కోట్లతో 3,013 సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల ఆధునీకరణకు నాడు–నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. హాస్టళ్లలో మంచి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కిచెన్‌లు సైతం ఆధునీకరించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలన్నారు. హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలని, సమాజంలో అట్టడుగున ఉన్న వారు చదువుకోవడానికి తగిన పరిస్థితులు కల్పించాలని చెప్పారు. బంకర్‌ బెడ్స్, తదితర అన్ని సౌకర్యాలు నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాలని, భవనాలను పరిగణనలోకి తీసుకుని వాటి డిజైన్లను రూపొందించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

‘హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలి. పిల్లలు చదువుకోవడానికి మంచి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. హాస్టళ్లలోకి వెళ్లగానే జైల్లోకి వెళ్లామనే భావన వారికి కలగకూడదు. చదువులు కొనలేని కుటుంబాల వారే పిల్లలను హాస్టళ్లకు పంపిస్తారు. అందువల్ల అలాంటి పిల్లలు బాగా చదువుకుని, బాగా ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలి. మన పిల్లలనే హాస్టళ్లలో ఉంచితే ఎలాంటి వసతులు, వాతావరణం ఉండాలనుకుంటామో సంక్షేమ హాస్టళ్లన్నింటినీ అలా తీర్చిదిద్దాలి.’
– సీఎం వైఎస్‌ జగన్‌ 

మూడు దశల్లో పనులు
మూడు దశల్లో హాస్టళ్ల ఆధునీకరణ పూర్తి చేయాలి. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు అన్నీ కలిపి మొత్తంగా 3,013 చోట్ల రూ.3,364 కోట్లతో నాడు–నేడు పనులు చేపట్టాలి. మొదటి దశలో మొత్తం సుమారు 1,366 చోట్ల పనులు చేపట్టాలి. దశాబ్దాలుగా వెనకబాటుకు గురైన కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని హాస్టళ్లన్నింటినీ తొలి విడతలోనే బాగు చేయాలి. తొలి విడత పనులు జనవరి నుంచి ప్రారంభించి, ఏడాదిలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి.
► హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు, కిచెన్లను కూడా ఆధునీకరించే పనులు చేపట్టాలి. కిచెన్‌కు అవసరమైన దాదాపు 10 రకాల వస్తువులను కొనుగోలు చేయాలి. హాస్టళ్ల పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు స్పష్టంగా కన్పించాలి. పిల్లలకు ఇవ్వాల్సిన వస్తువులను సకాలంలో నాణ్యమైన వాటిని అందించాలి. హాస్టళ్ల పర్యవేక్షణ పద్ధతిని సమూలంగా మార్చాలి. మండలాల వారీగా పర్యవేక్షణ ఉండాలి.

వెల్ఫేర్‌ అధికారులు, కేర్‌ టేకర్ల పోస్టులు భర్తీ చేయండి
 హాస్టళ్లలో ఉండాల్సిన సిబ్బంది కచ్చితంగా ఉండాలి. ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్‌ టేకర్ల పోస్టులను భర్తీ చేయాలి. గిరిజన సంక్షేమ గురుకులాల్లో 171 మంది హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారుల నియామకానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లలో క్లాస్‌–4 ఉద్యోగుల నియామకంపై దృష్టి పెట్టాలి. ప్రతి హాస్టల్‌ను పరిశీలించి, కల్పించాల్సిన సౌకర్యాలు, ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై ముందుగా సమాచారాన్ని తెప్పించుకోవాలి.
► హాస్టళ్ల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రతి హాస్టల్లో ఒక నంబర్‌ ఉంచాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక నంబర్‌ ఉంచాలి. అంగన్‌వాడీలలో నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ ఉండాలి. టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలి. 

అంగన్‌వాడీల్లో ఫ్లేవర్డ్‌ మిల్క్‌
► అంగన్‌వాడీలలో సూపర్‌వైజర్ల పోస్టులను భర్తీ చేసినట్టు అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు తెలిపారు. గత సమీక్షలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని ఈ సందర్భంగా వివరించారు. అంగన్‌వాడీలలో పాల సరఫరాపై నిరంతర పర్యవేక్షణతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు.
► అక్టోబర్‌ నెలలో నూటికి నూరు శాతం పాల సరఫరా జరిగింది. డిసెంబర్‌ 1 నుంచి ఫ్లేవర్డ్‌ మిల్క్‌ను అంగన్‌వాడీల్లో సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం’ అని వివరించారు. 
► మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫ్లేవర్డ్‌ మిల్క్‌ను సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్, ప్ర«భుత్వ ప్రధాన కార్యాదర్శి సమీర్‌ శర్మ, బీసీ సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు జి.జయలక్ష్మి, ముద్దాడ రవి చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీ డీడీసీఎఫ్‌ ఎండీ ఎ.బాబు, మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనారిటీ వెల్ఫేర్‌ డైరెక్టర్లు ఎ.సిరి, ఎం.జాహ్నవి, జీసీ కిషోర్‌ కుమార్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:  Jagananna Gorumudda: ‘గోరుముద్ద’లో కొత్త రుచులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement