hostels facilities
-
AP: రూ.3,364 కోట్లతో సకల వసతులు.. మారనున్న రూపురేఖలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని హాస్టళ్ల రూపురేఖలు మార్చి, అత్యుత్తమ విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా రూ.3,364 కోట్లతో 3,013 సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల ఆధునీకరణకు నాడు–నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లోనూ నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. హాస్టళ్లలో మంచి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కిచెన్లు సైతం ఆధునీకరించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలన్నారు. హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలని, సమాజంలో అట్టడుగున ఉన్న వారు చదువుకోవడానికి తగిన పరిస్థితులు కల్పించాలని చెప్పారు. బంకర్ బెడ్స్, తదితర అన్ని సౌకర్యాలు నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాలని, భవనాలను పరిగణనలోకి తీసుకుని వాటి డిజైన్లను రూపొందించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలి. పిల్లలు చదువుకోవడానికి మంచి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. హాస్టళ్లలోకి వెళ్లగానే జైల్లోకి వెళ్లామనే భావన వారికి కలగకూడదు. చదువులు కొనలేని కుటుంబాల వారే పిల్లలను హాస్టళ్లకు పంపిస్తారు. అందువల్ల అలాంటి పిల్లలు బాగా చదువుకుని, బాగా ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలి. మన పిల్లలనే హాస్టళ్లలో ఉంచితే ఎలాంటి వసతులు, వాతావరణం ఉండాలనుకుంటామో సంక్షేమ హాస్టళ్లన్నింటినీ అలా తీర్చిదిద్దాలి.’ – సీఎం వైఎస్ జగన్ మూడు దశల్లో పనులు ► మూడు దశల్లో హాస్టళ్ల ఆధునీకరణ పూర్తి చేయాలి. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు అన్నీ కలిపి మొత్తంగా 3,013 చోట్ల రూ.3,364 కోట్లతో నాడు–నేడు పనులు చేపట్టాలి. మొదటి దశలో మొత్తం సుమారు 1,366 చోట్ల పనులు చేపట్టాలి. దశాబ్దాలుగా వెనకబాటుకు గురైన కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని హాస్టళ్లన్నింటినీ తొలి విడతలోనే బాగు చేయాలి. తొలి విడత పనులు జనవరి నుంచి ప్రారంభించి, ఏడాదిలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. ► హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు, కిచెన్లను కూడా ఆధునీకరించే పనులు చేపట్టాలి. కిచెన్‌కు అవసరమైన దాదాపు 10 రకాల వస్తువులను కొనుగోలు చేయాలి. హాస్టళ్ల పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు స్పష్టంగా కన్పించాలి. పిల్లలకు ఇవ్వాల్సిన వస్తువులను సకాలంలో నాణ్యమైన వాటిని అందించాలి. హాస్టళ్ల పర్యవేక్షణ పద్ధతిని సమూలంగా మార్చాలి. మండలాల వారీగా పర్యవేక్షణ ఉండాలి. వెల్ఫేర్ అధికారులు, కేర్ టేకర్ల పోస్టులు భర్తీ చేయండి ► హాస్టళ్లలో ఉండాల్సిన సిబ్బంది కచ్చితంగా ఉండాలి. ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్ టేకర్ల పోస్టులను భర్తీ చేయాలి. గిరిజన సంక్షేమ గురుకులాల్లో 171 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో క్లాస్–4 ఉద్యోగుల నియామకంపై దృష్టి పెట్టాలి. ప్రతి హాస్టల్‌ను పరిశీలించి, కల్పించాల్సిన సౌకర్యాలు, ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై ముందుగా సమాచారాన్ని తెప్పించుకోవాలి. ► హాస్టళ్ల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రతి హాస్టల్లో ఒక నంబర్ ఉంచాలి. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక నంబర్ ఉంచాలి. అంగన్వాడీలలో నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ ఉండాలి. టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలి. అంగన్వాడీల్లో ఫ్లేవర్డ్ మిల్క్ ► అంగన్వాడీలలో సూపర్వైజర్ల పోస్టులను భర్తీ చేసినట్టు అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు తెలిపారు. గత సమీక్షలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని ఈ సందర్భంగా వివరించారు. అంగన్వాడీలలో పాల సరఫరాపై నిరంతర పర్యవేక్షణతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ► అక్టోబర్ నెలలో నూటికి నూరు శాతం పాల సరఫరా జరిగింది. డిసెంబర్ 1 నుంచి ఫ్లేవర్డ్ మిల్క్‌ను అంగన్వాడీల్లో సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం’ అని వివరించారు. ► మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్లేవర్డ్ మిల్క్‌ను సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్, ప్ర«భుత్వ ప్రధాన కార్యాదర్శి సమీర్ శర్మ, బీసీ సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు జి.జయలక్ష్మి, ముద్దాడ రవి చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీ డీడీసీఎఫ్ ఎండీ ఎ.బాబు, మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్లు ఎ.సిరి, ఎం.జాహ్నవి, జీసీ కిషోర్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: Jagananna Gorumudda: ‘గోరుముద్ద’లో కొత్త రుచులు -
పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి : నాడు-నేడు తొలి దశ పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కచ్చితంగా పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాడు-నేడు పనుల పరిశీలన కోసం విద్యాశాఖలో ఉన్నత స్థాయి విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెండో దశలో చేపడుతున్న పనుల్లో హాస్టళ్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. 2022 సంక్రాంతి నాటికి అన్ని హాస్టళ్లలో బంకర్ బెడ్లతో సహా, అన్ని సదుపాయాలు తప్పకుండా ఉండాలని పేర్కొన్నారు. మంచాలు, పరుపులు, బెడ్షీట్లు, బ్యాంకెట్లు, అల్మారాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నాడు-నేడు ‘మనబడి’పై సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాడు నేడు’ లో పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడొద్దని పేర్కొన్నారు. చదవండి: సోమశిల రెండో దశకు సీఎం జగన్ శంకుస్థాపన జూనియర్ కళాశాలలు రాష్ట్రంలోని ప్రతి మండలంలో తప్పనిసరిగా ఒక జూనియర్ కళాశాల ఉండాలని సీఎం జగన్ సూచించారు. ప్రస్తుతం 159 మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేవని, అందువల్ల ఆయా చోట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. మనం ఏం కోరుకుంటామో.. మన పిల్లలను హాస్టల్లో ఉంచితే ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటామో అవన్నీ కూడా అన్ని హాస్టళ్లలో ఉండాలని తెలిపారు. ముఖ్యంగా బాత్రూమ్లు చక్కగా ఉండాలని, వాటిని బాగా నిర్వహించాలని అన్నారు. మరమ్మతులు రాకుండా ఉండే విధంగా మెటీరియల్ వాడాలన్నారు. అన్ని బాత్రూమ్లలో హ్యాంగర్స్ కూడా ఉండాలని, గిరిజన ప్రాంతాల హాస్టళ్లలో బాత్రూమ్లలో నీళ్లు లేక, విద్యార్థులు బయటకు వెళ్లడం నేను స్వయంగా చూసినట్లు పేర్కొన్నారు. అందువల్ల హాస్టళ్లలో బాత్రూమ్ల నిర్వహణపై ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. చదవండి: పిల్లల్లో పెరుగుతున్న పౌష్టికాహార లోపం ఇప్పటికే హాస్టళ్లలో మెనూకు సంబంధించి యాప్ ఉండగా, బాత్రూమ్లపై కూడా యాప్ డెవలప్ చేయాలన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పనుల ఫలితాలు దీర్ఘకాలం ఉండాలని, కాబట్టి నిర్వహణలో ఎక్కడా అలక్ష్యం చూపొద్దని హెచ్చరించారు. ఆ విధంగా పెయింటింగ్‌తో సహా మెయింటెనెన్స్ ఉండాలని, భవిష్యత్తులో అంగన్వాడీలలో కూడా నాడు–నేడు కొనసాగుతుందన్నారు. కాబట్టి పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ వద్దని, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ, ఏ స్కూల్లో, ఏ సమస్య వచ్చినా ఎంత వేగంగా స్పందించి, దాన్ని బాగు చేశామన్న దానిపై మన ప్రతిభ, పనితీరు ఆధారపడి ఉంటుందన్నారు. చదవండి: బాధితులకు వరం.. జీరో ఎఫ్ఐఆర్ జగనన్న విద్యా కానుక: ‘ఈ కిట్‌లో ప్రతి ఒక్కటి కూడా నాణ్యత కలిగి ఉండాలి. స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫామ్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్ పంపిణీ. వచ్చే విద్యా సంవత్సరంలో జూన్ 12న స్కూళ్లు ప్రారంభం అవుతాయనుకుంటే పిల్లలకు జూన్ 1న పంపిణీ చేయాలి. ఆ మేరకు స్కూళ్లలో కిట్లు మే 15 నాటికి సిద్ధంగా ఉండాలి. జగనన్న గోరు ముద్ద–హాస్టళ్లు: హాస్టల్ పిల్లలకు ప్రతి రోజు ఒక వెరైటీ ఫుడ్ ఉండాలి, ఆ మేరకు ప్లాన్ చేయండి. మార్పు చేసిన మెనూ ప్రకారం పక్కాగా సరఫరా జరుగుతోందా? లేదా? అన్నది కూడా ఎంతో ముఖ్యం. ఆ ప్రకారం డిజైన్ చేసిన దాని ప్రకారం పెడుతున్నామా? లేదా? అన్నది మొదటి ప్రమాణం అని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కాగా, కార్యక్రమంలో నాడు–నేడు మనబడి కార్యక్రమంలో పనుల పురోగతిని అధికారులు సమావేశంలో వివరించారు. నాడు నేడు తొలి దశ పనులు కోవిడ్ కారణంగా కాస్త ఆలస్యమయ్యాయని, అయితే పనులు మాత్రం అత్యంత నాణ్యతగా కొనసాగుతున్నాయన్నారు. పేరెంట్ కమిటీలు, హెడ్మాస్టర్లు, సచివాలయాల ఇంజనీర్లు, టాటా ప్రాజెక్ట్స్ వంటి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ కంపెనీల ద్వారా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా సోషల్ ఆడిటింగ్ జరుగుతోందన్నారు. తొలి దశలో 15,715 స్కూళ్లలో మొత్తం రూ.1690.14 కోట్లతో పనులు జరుగుతున్నాయని, స్కూల్లో కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రెండు కేటగిరీలలో కిచెన్ల నిర్మాణం. రూ.5లక్షలు. రూ.15 లక్షలతో రెండు రకాల కిచెన్లు నిర్మాణం జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 9323 అంగన్వాడీలు స్కూళ్ల భవనాల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. 5735 ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో రూ.5 లక్షల చొప్పున కిచెన్ షెడ్ల వ్యయం రూ.287 కోట్లు, 1668 హైస్కూళ్లలో రూ.15 లక్షల చొప్పున కిచెన్ షెడ్ల వ్యయం రూ.250 కోట్లు ఖర్చు అవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ కమిషనర్ విజయ్‌కుమార్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వి.చినవీరభద్రుడుతో పాటు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అనుమానాస్పదస్థితిలో విద్యార్థి మృతి
సిద్దిపేట, న్యూస్‌లైన్: హాస్టల్ విద్యార్థుల ఆలనా పాలన ఎవరికీ పట్టడంలేదు. ఇందుకు తోర్నాల ఘటనే నిదర్శనం. ఉన్నతాధికారుల నిఘా లోపం, అధికారుల అలసత్వం.. పదిహేనేళ్ల బాలుడిని బలితీసుకుంది. సిద్దిపేట మండలం తోర్నాలలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో మంగళవారం తడ్కపల్లి వినోద్‌గౌడ్(15) అనే టెన్త్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. దుబ్బాక మండలం ధర్మాజీపేటకు చెందిన తడ్కపల్లి అంజాగౌడ్, పుష్ప దంపతుల కుమారుడు వినోద్‌గౌడ్ సిద్దిపేట మండలం తోర్నాల బీసీ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే హాస్టల్ భవనం పైఅంతస్తులో తోటి విద్యార్థులతో కలిసి నిద్రించాడు. ఏమైందో ఏమో కాని తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో విలవిల్లాడుతుండగా, పక్క విద్యార్థి మేలుకువ వచ్చి చూసి వినోద్ ఏదో ఆపదలో ఉన్నట్లు గ్రహించాడు. ఆ సమయంలో వసతిగృహ సంక్షేమాధికారి(వార్డెన్), ఇతర ప్రభుత్వపరమైన ఉద్యోగులు ఎవరూ లేరు. మహేశ్ అనే విద్యార్థి ఫోన్లో తెలుపడంతో వార్డెన్ బాలయ్య సిద్దిపేట నుంచి కారులో 4.15 గంటలకు హాస్టల్‌కు చేరుకొని అదే వాహనంలో ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. డ్యూటీ డాక్టర్ ప్రాథమిక చికిత్స చేశారు. వెంటిలేటర్ సౌకర్యం లేనందున హైదరాబాద్‌కు త్వరగా తరలించాలని సూచించారు. అయితే స్థానికంగా వెంటిలేటర్ సదుపాయమున్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా కొన్ని నిమిషాల్లోనే వినోద్ ఊపిరి విడిచాడు. విషయం తల్లిదండ్రులకు తెలపడంతో హుటాహుటిన వచ్చి గుండెలు బాదుకున్నారు. క్షవరం చేయించుకునేందుకు సాయంత్రం తన స్నేహితుడితో కలిసి వినోద్ బయటకు వెళ్లాడని, రాత్రి 10 గంటలకు వచ్చాడని కొందరంటుంటే...సాయంత్రం 6.30 గంటలకు భోజనం చేసి విశ్రమించాడని ఇంకొందరంటున్నారు. మధ్యాహ్నం తర్వాత కడుపునొప్పంటూ బాధపడ్డాడంటూ భిన్నకథనాలు వెలువడుతున్నాయి. బయటకు వెళ్లినప్పుడు ఏవైనా పాములాంటి విషపూరితమైనవి కాటేశాయా..? అసలేం జరిగిందనేది మిస్టరీగా మారింది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మృతికిగల కారణాలు తెలుస్తాయని సిద్దిపేట రూరల్ సీఐ ప్రసన్నకుమార్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. వినోద్‌కు విద్యార్థుల వీడ్కోలు హాస్టల్లో సీనియర్ విద్యార్థి అకాల మరణం తోటి విద్యార్థులను తీవ్రంగా కలిచివేసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళుతూ మధ్యలో తోర్నాల హాస్టల్లో కాసేపు ఉంచారు. అక్కడి బాలలు వినోద్ శవాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. తోటి మిత్రుడికి అంతిమ వీడ్కోలు పలికారు. అధికారుల నిర్లక్ష్యమే కారణం ప్రభుత్వమూ, దానిని నడిపించే యం త్రాంగమూ కోమాలో ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మార్క శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహించారు. హాస్టళ్ల నిర్వహణ అధ్వానంగా ఉందనడానికి వినోద్ ఆకస్మిక మృతే కారణమని, అధికారుల నిర్లక్ష్యానికి ఓ చురుకైన విద్యార్థి బలయ్యాడని వాపోయారు. ఆ రాత్రి వార్డెన్సహా సిబ్బంది ఎవరున్నా...వినోద్ బతికేవాడని పేర్కొన్నారు. బడుగూ బలహీన వర్గాల వసతి గృహాలు బాగోలేవని తాము ఎంత మొత్తుకున్నా...యంత్రాంగానికి చీమకుట్టినట్టయినా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె వెంకట్‌రెడ్డి, ప్రతినిధులు భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్, రమేశ్, నరేశ్ తదితరులు ఆర్డీఓ ఆఫీసులో విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. అధికారుల ఆరా... తోర్నాల ఘటనపై జిల్లా అధికారులు ఆరా తీస్తున్నారు. బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి బా లచందర్ ఇక్కడికి వచ్చి ప్రాథమిక విచారణ జరిపారు. సంఘటన పూర్వాపరాల గురించి వార్డెన్ బాలయ్యను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఆర్డీఓ ఆదేశం మేరకు తహశీల్దారు కూడా ఏరియా ఆస్పత్రిని సందర్శించి ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేశా రు. విమర్శలు సరికాదు.. సత్వరం స్పందించాను... నేను గుర్రాలగొంది బీసీ హాస్టల్ వసతిగృహ సంక్షేమాధికారిని. ఏడాది కిందట నాకు తోర్నాల వసతి గృహం అదనపు బాధ్యతలిచ్చారు. వినోద్ పరిస్థితి గురించి నాకు తెలిసిన వెంటనే కారులో వెళ్లి వైద్యశాలకు తీసుకొచ్చాను. ఆ టైంలో హాస్టల్లో ఔట్ సోర్సింగ్ వాచ్మెన్ ఉన్నాడు. జరిగిన ఘటన దురదృష్టకరం. నా ప్రయత్నం నేను చేశాను. విమర్శలు సరికాదు. - బాలయ్య, వసతి గృహ సంక్షేమాధికారి