సిద్దిపేట, న్యూస్‌లైన్: హాస్టల్ విద్యార్థుల ఆలనా పాలన ఎవరికీ పట్టడంలేదు. ఇందుకు తోర్నాల ఘటనే నిదర్శనం. ఉన్నతాధికారుల నిఘా లోపం, అధికారుల అలసత్వం.. పదిహేనేళ్ల బాలుడిని బలితీసుకుంది. సిద్దిపేట మండలం తోర్నాలలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో మంగళవారం తడ్కపల్లి వినోద్‌గౌడ్(15) అనే టెన్త్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. దుబ్బాక మండలం ధర్మాజీపేటకు చెందిన తడ్కపల్లి అంజాగౌడ్, పుష్ప దంపతుల కుమారుడు వినోద్‌గౌడ్ సిద్దిపేట మండలం తోర్నాల బీసీ హాస్టల్‌లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే హాస్టల్ భవనం పైఅంతస్తులో తోటి విద్యార్థులతో కలిసి నిద్రించాడు. ఏమైందో ఏమో కాని తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో విలవిల్లాడుతుండగా, పక్క విద్యార్థి మేలుకువ వచ్చి చూసి వినోద్ ఏదో ఆపదలో ఉన్నట్లు గ్రహించాడు.
ఆ సమయంలో వసతిగృహ సంక్షేమాధికారి(వార్డెన్), ఇతర ప్రభుత్వపరమైన ఉద్యోగులు ఎవరూ లేరు. మహేశ్ అనే విద్యార్థి ఫోన్‌లో తెలుపడంతో వార్డెన్ బాలయ్య సిద్దిపేట నుంచి కారులో 4.15 గంటలకు హాస్టల్‌కు చేరుకొని అదే వాహనంలో ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. డ్యూటీ డాక్టర్ ప్రాథమిక చికిత్స చేశారు. వెంటిలేటర్ సౌకర్యం లేనందున హైదరాబాద్‌కు త్వరగా తరలించాలని సూచించారు. అయితే స్థానికంగా వెంటిలేటర్ సదుపాయమున్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా కొన్ని నిమిషాల్లోనే వినోద్ ఊపిరి విడిచాడు. విషయం తల్లిదండ్రులకు తెలపడంతో హుటాహుటిన వచ్చి గుండెలు బాదుకున్నారు. క్షవరం చేయించుకునేందుకు సాయంత్రం తన స్నేహితుడితో కలిసి వినోద్ బయటకు వెళ్లాడని, రాత్రి 10 గంటలకు వచ్చాడని కొందరంటుంటే...సాయంత్రం 6.30 గంటలకు భోజనం చేసి విశ్రమించాడని ఇంకొందరంటున్నారు. మధ్యాహ్నం తర్వాత కడుపునొప్పంటూ బాధపడ్డాడంటూ భిన్నకథనాలు వెలువడుతున్నాయి. బయటకు వెళ్లినప్పుడు ఏవైనా పాములాంటి విషపూరితమైనవి కాటేశాయా..? అసలేం జరిగిందనేది మిస్టరీగా మారింది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మృతికిగల కారణాలు తెలుస్తాయని సిద్దిపేట రూరల్ సీఐ ప్రసన్నకుమార్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
వినోద్‌కు విద్యార్థుల వీడ్కోలు
హాస్టల్‌లో సీనియర్ విద్యార్థి అకాల మరణం తోటి విద్యార్థులను తీవ్రంగా కలిచివేసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళుతూ మధ్యలో తోర్నాల హాస్టల్‌లో కాసేపు ఉంచారు. అక్కడి బాలలు వినోద్ శవాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. తోటి మిత్రుడికి అంతిమ వీడ్కోలు పలికారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణం
ప్రభుత్వమూ, దానిని నడిపించే యం త్రాంగమూ కోమాలో ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మార్క శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహించారు. హాస్టళ్ల నిర్వహణ అధ్వానంగా ఉందనడానికి వినోద్ ఆకస్మిక మృతే కారణమని, అధికారుల నిర్లక్ష్యానికి ఓ చురుకైన విద్యార్థి బలయ్యాడని వాపోయారు. ఆ రాత్రి వార్డెన్‌సహా సిబ్బంది ఎవరున్నా...వినోద్ బతికేవాడని పేర్కొన్నారు. బడుగూ బలహీన వర్గాల వసతి గృహాలు బాగోలేవని తాము ఎంత మొత్తుకున్నా...యంత్రాంగానికి చీమకుట్టినట్టయినా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె వెంకట్‌రెడ్డి, ప్రతినిధులు భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్, రమేశ్, నరేశ్ తదితరులు ఆర్‌డీఓ ఆఫీసులో విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.
అధికారుల ఆరా...
తోర్నాల ఘటనపై జిల్లా అధికారులు ఆరా తీస్తున్నారు. బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి బా లచందర్ ఇక్కడికి వచ్చి ప్రాథమిక విచారణ జరిపారు. సంఘటన పూర్వాపరాల గురించి వార్డెన్ బాలయ్యను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఆర్డీఓ ఆదేశం మేరకు తహశీల్దారు కూడా ఏరియా ఆస్పత్రిని సందర్శించి ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేశా రు.
విమర్శలు సరికాదు.. సత్వరం స్పందించాను...
నేను గుర్రాలగొంది బీసీ హాస్టల్ వసతిగృహ సంక్షేమాధికారిని. ఏడాది కిందట నాకు తోర్నాల వసతి గృహం అదనపు బాధ్యతలిచ్చారు. వినోద్ పరిస్థితి గురించి నాకు తెలిసిన వెంటనే కారులో వెళ్లి వైద్యశాలకు తీసుకొచ్చాను. ఆ టైంలో హాస్టల్‌లో ఔట్ సోర్సింగ్ వాచ్‌మెన్ ఉన్నాడు. జరిగిన ఘటన దురదృష్టకరం. నా ప్రయత్నం నేను చేశాను. విమర్శలు సరికాదు.
- బాలయ్య, వసతి గృహ సంక్షేమాధికారి
అనుమానాస్పదస్థితిలో విద్యార్థి మృతి
Published Wed, Aug 28 2013 1:21 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement