BC Welfare Organisation
-
ఐక్యతతోనే అధికారం
ఇందూరు, న్యూస్‌లైన్ : ఐక్యమత్యమే మనకు రాజ్యాధికారాన్ని తెచ్చి పెడుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీలు ఐక్యతతో మెలగకపోతే ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో బీసీ గర్జన నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ మధుయాష్కీ, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌లు సోనియాగాంధీకి సన్నిహితంగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలాగైతే సాధించారో.. బీసీ సబ్ ప్లాన్‌ను అలాగే తీసుకురావాలని సూచించారు. బీసీల రిజర్వేషన్లు, సీట్లు తగ్గించేందుకు సీఎం, పంచాయతీ రాజ్ మంత్రి కుట్రలు పన్నారని, వారితో కొట్లాడి 24 శాతం ఉన్న రిజర్వేషన్లను 34 శాతానికి పెం చేలా చేశానని తెలిపారు. సర్పంచ్‌లకు రూ. 20 వేల వేత నం, చెక్ పవర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ల కు చెక్‌పవర్ ఇవ్వకపోతే పది వేల మంది సర్పంచ్‌లతో హైదరాబాద్ ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సర్పంచ్‌లకు సూచించారు. ప్రతి గ్రామంలో బీసీ సంఘాలను ఏర్పాటు చేసుకుని రాజ్యాధికారం కోసం పాటుపడాలన్నారు. బీసీలదీ ఆకలి పోరాటం కాదని, ఆత్మగౌరవ పోరాటమని గుర్తుంచుకోవాలన్నారు. ఏడాది క్రితమే ‘తెలంగాణ’ రాజ్యంగబద్ధంగా ఏడాది క్రితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయిందని ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని సోనియాగాంధీ సమయం చూసి ప్రకటించారన్నారు. 2009 డిసెంబర్ తొమ్మిది ప్రకటనను కూడా వెనక్కు తీసుకోలేదని, కేవలం పెండింగ్‌లో పెట్టారని పేర్కొన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్ర ప్రక్రియ ఆగబోదన్నారు. ప్రస్తుతం బీసీల్లో మార్పు వచ్చిందని, అధికారం కోసం పోరాడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలు అత్యధికంగా సీట్లు సాధించడం ఖాయమన్నారు. బీసీలు ఏకం అవుతుంటే విడగొట్టడానికి అగ్రకులాలు ప్రయత్నిస్తాయని, వాటిని అధిగమించి ముందుకు సాగాలని సూచించారు. మహిళా సర్పంచ్‌లు పదవిలో రాణించి, గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. కార్యక్రమంలో సుమారు నాలుగు వందల మంది బీసీ సర్పంచ్‌లను సన్మానించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, నాయకులు రత్నాకర్, శ్రీనివాస్ గౌడ్, అంజనేయులు, భూమన్న, వసుంధర తదితరులు పాల్గొన్నారు. నిరంతరం పోరాడాలి బీసీల ఆధిపత్యం పెరగాలంటే నిరంతరం పోరాడాలి. చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలంటే సర్పంచులైన మీరు గ్రామ స్థాయి నుంచి ఒత్తిడి తేవాలి. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయిపోయింది. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగదు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ముఖ్యమంత్రే. తెలంగాణలో ఆ పదవి ఖాళీగా ఉంది. -మధుయాష్కీగౌడ్, ఎంపీ బీసీల వల్లే ఈ స్థాయికి.. బీసీల వల్లే నేను ఈ స్థాయికి చేరాను. గత నాలుగు పర్యాయాలు బాల్కొండ ఎమ్మెల్యేగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఎన్నికయ్యారు. నేను 2009లో ఎన్నికల్లో నిలబడగానే బీసీలందరూ ఐక్యమయ్యారు. నన్ను గెలిపించారు. బీసీలు అన్ని నియోజకవర్గాల్లో ఐక్యమవ్వాలి. సీఎంతో మాట్లాడి సర్పంచ్‌లకు చెక్‌పవర్ వచ్చేలా చూస్తా. -ఈరవత్రి అనిల్, ప్రభుత్వ విప్ సబ్‌ప్లాన్ కోసం ధర్నాకు సిద్ధం బీసీ సబ్ ప్లాన్ కోసం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సర్పంచ్‌లకు అతి తక్కువ వేతనం ఇస్తున్నారు. దీనిని పెంచాలి. బీసీ సబ్‌ప్లాన్ సాధించేందుకు, సర్పంచ్ల వేతనం పెంపుదల, చెక్‌పవర్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తాను. -యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ శాసనసభాపక్ష నేత ప్రథమ పౌరులు మీరు గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచే. గ్రామాల అభివృద్ధికి కృషి చేయండి. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కోసం పాటుపడండి. గ్రామాల్లో రెండు పూటలా తినలేనివారు ఎందరో ఉన్నారు. వారి ఆకలి తీర్చండి. మీకు రూ. 20 వేల వేతనం ఇప్పించేలా మేం కృషి చేస్తాం. -వి.గంగాధర్ గౌడ్, ఎమ్మెల్సీ చెక్పవర్కోసం కృషి.. దేశానికి రాష్ర్టపతిలా గ్రామానికి సర్పంచ్‌లు ప్రథమ పౌరులు. అలాంటి మీకు చెక్ పవర్ లేకపోవడం బాధాకరమైన విషయం. చెక్ పవర్ కోసం కృషి చేస్తాను. బీసీల్లో పోటీతత్వం పెరగాలి. రాజకీయంగా ముందడగు వేయాలి. ఐక్యంగా సాగి రాజ్యాధికారం సాధించుకుందాం. -మహేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర గిడ్డంగుల అభివృద్ధి మండలి చైర్మన్ -
అనుమానాస్పదస్థితిలో విద్యార్థి మృతి
సిద్దిపేట, న్యూస్‌లైన్: హాస్టల్ విద్యార్థుల ఆలనా పాలన ఎవరికీ పట్టడంలేదు. ఇందుకు తోర్నాల ఘటనే నిదర్శనం. ఉన్నతాధికారుల నిఘా లోపం, అధికారుల అలసత్వం.. పదిహేనేళ్ల బాలుడిని బలితీసుకుంది. సిద్దిపేట మండలం తోర్నాలలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో మంగళవారం తడ్కపల్లి వినోద్‌గౌడ్(15) అనే టెన్త్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. దుబ్బాక మండలం ధర్మాజీపేటకు చెందిన తడ్కపల్లి అంజాగౌడ్, పుష్ప దంపతుల కుమారుడు వినోద్‌గౌడ్ సిద్దిపేట మండలం తోర్నాల బీసీ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే హాస్టల్ భవనం పైఅంతస్తులో తోటి విద్యార్థులతో కలిసి నిద్రించాడు. ఏమైందో ఏమో కాని తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో విలవిల్లాడుతుండగా, పక్క విద్యార్థి మేలుకువ వచ్చి చూసి వినోద్ ఏదో ఆపదలో ఉన్నట్లు గ్రహించాడు. ఆ సమయంలో వసతిగృహ సంక్షేమాధికారి(వార్డెన్), ఇతర ప్రభుత్వపరమైన ఉద్యోగులు ఎవరూ లేరు. మహేశ్ అనే విద్యార్థి ఫోన్లో తెలుపడంతో వార్డెన్ బాలయ్య సిద్దిపేట నుంచి కారులో 4.15 గంటలకు హాస్టల్‌కు చేరుకొని అదే వాహనంలో ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. డ్యూటీ డాక్టర్ ప్రాథమిక చికిత్స చేశారు. వెంటిలేటర్ సౌకర్యం లేనందున హైదరాబాద్‌కు త్వరగా తరలించాలని సూచించారు. అయితే స్థానికంగా వెంటిలేటర్ సదుపాయమున్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా కొన్ని నిమిషాల్లోనే వినోద్ ఊపిరి విడిచాడు. విషయం తల్లిదండ్రులకు తెలపడంతో హుటాహుటిన వచ్చి గుండెలు బాదుకున్నారు. క్షవరం చేయించుకునేందుకు సాయంత్రం తన స్నేహితుడితో కలిసి వినోద్ బయటకు వెళ్లాడని, రాత్రి 10 గంటలకు వచ్చాడని కొందరంటుంటే...సాయంత్రం 6.30 గంటలకు భోజనం చేసి విశ్రమించాడని ఇంకొందరంటున్నారు. మధ్యాహ్నం తర్వాత కడుపునొప్పంటూ బాధపడ్డాడంటూ భిన్నకథనాలు వెలువడుతున్నాయి. బయటకు వెళ్లినప్పుడు ఏవైనా పాములాంటి విషపూరితమైనవి కాటేశాయా..? అసలేం జరిగిందనేది మిస్టరీగా మారింది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మృతికిగల కారణాలు తెలుస్తాయని సిద్దిపేట రూరల్ సీఐ ప్రసన్నకుమార్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. వినోద్‌కు విద్యార్థుల వీడ్కోలు హాస్టల్లో సీనియర్ విద్యార్థి అకాల మరణం తోటి విద్యార్థులను తీవ్రంగా కలిచివేసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళుతూ మధ్యలో తోర్నాల హాస్టల్లో కాసేపు ఉంచారు. అక్కడి బాలలు వినోద్ శవాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. తోటి మిత్రుడికి అంతిమ వీడ్కోలు పలికారు. అధికారుల నిర్లక్ష్యమే కారణం ప్రభుత్వమూ, దానిని నడిపించే యం త్రాంగమూ కోమాలో ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మార్క శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహించారు. హాస్టళ్ల నిర్వహణ అధ్వానంగా ఉందనడానికి వినోద్ ఆకస్మిక మృతే కారణమని, అధికారుల నిర్లక్ష్యానికి ఓ చురుకైన విద్యార్థి బలయ్యాడని వాపోయారు. ఆ రాత్రి వార్డెన్సహా సిబ్బంది ఎవరున్నా...వినోద్ బతికేవాడని పేర్కొన్నారు. బడుగూ బలహీన వర్గాల వసతి గృహాలు బాగోలేవని తాము ఎంత మొత్తుకున్నా...యంత్రాంగానికి చీమకుట్టినట్టయినా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె వెంకట్‌రెడ్డి, ప్రతినిధులు భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్, రమేశ్, నరేశ్ తదితరులు ఆర్డీఓ ఆఫీసులో విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. అధికారుల ఆరా... తోర్నాల ఘటనపై జిల్లా అధికారులు ఆరా తీస్తున్నారు. బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి బా లచందర్ ఇక్కడికి వచ్చి ప్రాథమిక విచారణ జరిపారు. సంఘటన పూర్వాపరాల గురించి వార్డెన్ బాలయ్యను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఆర్డీఓ ఆదేశం మేరకు తహశీల్దారు కూడా ఏరియా ఆస్పత్రిని సందర్శించి ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేశా రు. విమర్శలు సరికాదు.. సత్వరం స్పందించాను... నేను గుర్రాలగొంది బీసీ హాస్టల్ వసతిగృహ సంక్షేమాధికారిని. ఏడాది కిందట నాకు తోర్నాల వసతి గృహం అదనపు బాధ్యతలిచ్చారు. వినోద్ పరిస్థితి గురించి నాకు తెలిసిన వెంటనే కారులో వెళ్లి వైద్యశాలకు తీసుకొచ్చాను. ఆ టైంలో హాస్టల్లో ఔట్ సోర్సింగ్ వాచ్మెన్ ఉన్నాడు. జరిగిన ఘటన దురదృష్టకరం. నా ప్రయత్నం నేను చేశాను. విమర్శలు సరికాదు. - బాలయ్య, వసతి గృహ సంక్షేమాధికారి -
ఆర్.కృష్ణయ్యకు మండల్ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఆ పార్టీ బీసీలకు వ్యతిరేకమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ సమన్వయ సమితి, సోషలిస్టు ఎంప్లాయీస్ అసోసియేషన్, తెలంగాణ అధికారులు, ఉద్యోగుల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ ప్రదాత బీపీ మండల్ 95వ జయంతి సభ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత బండారు దత్తా త్రేయ, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, సభాధ్యక్షుడు జి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆర్.కృష్ణయ్యకు మండల్ అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందజేసి, సన్మానించారు. అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. బీసీలను భిక్షగాళ్లుగా చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశంలో బీసీలు 70 కోట్ల మంది ఉన్నారని, వారికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు లేదని ప్రశ్నించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు స్ఫూర్తి ప్రదాత బీపీ మండల్‌యేనని ఆర్.కృష్ణయ్య కొనియాడారు. బీసీల కోసం 30 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్న ఆర్.కృష్ణయ్యకు మండల్ అవార్డు ఇవ్వడం హర్షదాయకమని దత్తాత్రేయ పేర్కొన్నారు. సభలో సీనియర్ పాత్రికేయుడు దుర్గం రవీందర్ రచించిన ‘ఓబీసీ రిజర్వేషన్ల ఆద్యుడు బీపీ మండల్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, సేవ జాతీయ కార్యదర్శి రాజీవ్‌రాజు (యూపీ), బీసీ నాయకుడు గుజ్జ కృష్ణ, ఎర్ర సత్యనారాయణ, పెరిక సురేష్, అజయ్‌కుమార్, నీలం వెంకటేష్, రాంకోటి, దేవేందర్, కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. -
చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లకు మోడీ హామీ: కృష్ణయ్య
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేయాలన్న తమ విజ్ఞప్తిపై గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్ వద్ద ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో పలు బీసీ సంఘాలు మోడీని కలిశాయి. బీజేపీ మేనిఫెస్టోలో బీసీల డిమాండ్లను చేర్చాలని ఆయా సంఘాల నేతలు మోడీని కోరారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, రాజ్యాంగాన్ని సవరించి బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బీసీల అభివృద్ధికి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, రూ. 50 వేల కోట్లతో ప్రత్యేక సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ డిమాండ్లన్నింటినీ మేనిఫెస్టోలో చేర్చాలన్న తమ విజ్ఞప్తికి మోడీ సానుకూలంగా స్పందించారని ఆర్.కృష్ణయ్య తెలిపారు. 35 ఏళ్లుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేయడం ప్రశంసనీయమంటూ మోడీ కొనియాడినట్లు తెలిపారు. మోడీని కలిసిన వారిలో జె.శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, ర్యాగ రమేష్, ఎ.రామ్‌కోటి ముదిరాజ్, పెరిక సురేష్ తదితరులు ఉన్నారు.