చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లకు మోడీ హామీ: కృష్ణయ్య
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేయాలన్న తమ విజ్ఞప్తిపై గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్ వద్ద ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో పలు బీసీ సంఘాలు మోడీని కలిశాయి. బీజేపీ మేనిఫెస్టోలో బీసీల డిమాండ్లను చేర్చాలని ఆయా సంఘాల నేతలు మోడీని కోరారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, రాజ్యాంగాన్ని సవరించి బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
బీసీల అభివృద్ధికి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, రూ. 50 వేల కోట్లతో ప్రత్యేక సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ డిమాండ్లన్నింటినీ మేనిఫెస్టోలో చేర్చాలన్న తమ విజ్ఞప్తికి మోడీ సానుకూలంగా స్పందించారని ఆర్.కృష్ణయ్య తెలిపారు. 35 ఏళ్లుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేయడం ప్రశంసనీయమంటూ మోడీ కొనియాడినట్లు తెలిపారు. మోడీని కలిసిన వారిలో జె.శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, ర్యాగ రమేష్, ఎ.రామ్‌కోటి ముదిరాజ్, పెరిక సురేష్ తదితరులు ఉన్నారు.