బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి కాదా? | r krishnaiah article on budget 2022 allocation for backward | Sakshi
Sakshi News home page

బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి కాదా?

Published Sat, Feb 26 2022 1:03 AM | Last Updated on Sat, Feb 26 2022 1:04 AM

r krishnaiah article on budget 2022 allocation for backward - Sakshi

దేశ జనాభాలో 56 శాతంగా ఉన్న బీసీలు అభివృద్ధి చెందితే దేశం సగానికిపైగా అభివృద్ధి చెందినట్లే. కానీ వారి అభ్యున్నతి నిర్లక్ష్యానికి గురైంది. బీసీల సర్వతోముఖాభివృద్ధికి మండల్‌ కమిషన్‌ 40 సిఫార్సులు చేసింది. కానీ అందులో కేవలం రెండు మూడు సిఫార్సులు మాత్రమే ఇప్పటివరకు అమలుకు నోచుకున్నాయి. విద్య, ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేశారు. జాతీయ బీసీ కార్పోరేషన్‌ ఏర్పాటు చేశారు. మిగతా సిఫార్సులు అమలుచేసినప్పుడు మాత్రమే బీసీల అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సంగతిని బాగా గుర్తించిన ఏపీ ప్రభుత్వం బీసీల అభివృద్ధికి రాజీలేని చర్యలు తీసు కుంటున్నది. 56 బీసీ కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ నామినేటెడ్‌ పోస్టుల్లో వారి వాటా వారికి ఇవ్వడం వంటి ఎన్నో చర్యలు చేపట్టింది.

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన 39 లక్షల 45 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌లో బీసీలకు బిచ్చమేసినట్లు 1400 కోట్లు కేటాయించి దేశం లోని 56 శాతం జనాభాగల బీసీలను అవమాన పర్చారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కూడా ఈ దఫా 20 శాతం వరకు నిధుల కేటాయింపు తగ్గించి సామజిక న్యాయానికి తూట్లు పొడిచింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం కేటాయించిన ఈ 1,400 కోట్ల రూపాయలు 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు పంచితే ప్రతి రాష్ట్రానికి రూ. 40 కోట్లు కూడా రావు. ఈ నిధులతో దేశంలో 70 కోట్ల మంది బీసీలకు పంచడానికి బిస్కెట్లు కూడా రావు. గతంలో పాలించిన ప్రభుత్వాలు బీసీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. బీసీ వర్గానికి చెందిన మోదీ ప్రధానమంత్రిగా ఉన్న బీజేపీ ప్రభుత్వమైనా బీసీల విద్యా, ఉద్యోగ, ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని ఆశించాం. కానీ గతం కంటే పరిస్థితులు మరింత అన్యాయంగా తయారవుతున్నాయి. ఇంకొక వైపు బీసీ సంక్షేమానికి ప్రతి రాష్ట్రం 5 వేల నుంచి 20 వేల కోట్ల రూపా యల వరకు బడ్జెట్‌ కేటాయిస్తుంటే...  కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రా నికి 40 కోట్లు మాత్రమే కేటాయించడం సిగ్గుచేటు.  

రాజ్యాంగబద్ధంగా నియమించిన మండల్‌ కమిషన్‌ బీసీల సర్వ తోముఖాభివృద్ధికి 40 సిఫార్సులు చేయగా కేవలం రెండు మూడు సిఫార్సులను మాత్రమే పట్టించుకున్నారు. విద్య, ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేశారు. జాతీయ బీసీ కార్పొ రేషన్‌ ఏర్పాటు చేశారు. ఆర్థికపరమైన సిఫార్స్‌లు దాదాపు 14 ఉంటే ఇంత వరకు ఒక్క సిఫార్సు కూడా అమలు చేయలేదు. ఒక్క స్కీమ్‌ అమలుకు కూడా బడ్జెట్‌ కేటాయించడం లేదు. మండల్‌ కమిషన్‌ బీసీ విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌లు, ఫీజుల మంజూరు, ప్రత్యేక హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. మండల్‌ కమిషన్‌ ప్రకారం 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ప్రారంభించి 29 సంవత్సరాలు గడుస్తున్నా ఆర్థికపరమైన స్కాలర్‌ షిప్‌ల వంటి స్కీముల అమలుకు బడ్జెట్‌ కేటాయించకుండా బీసీలకు అన్యాయం చేస్తోంది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే జీఎస్టీ పన్నులు, ఆదాయ పన్నులు, ఇతర పన్నుల రూపంగా కేంద్ర బడ్జెట్‌కు బీసీలు 50 శాతంకు పైగా పన్నులు చెల్లిస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌ ఆదాయంలో సింహ భాగం బీసీలదే. కానీ బడ్జెట్‌లో బీసీలకు ఒక శాతం కూడా కేటాయించకుండా అన్యాయం చేస్తున్నారు. 

 అత్యంత వెనుకబడిన కులాలు, సంచారజాతులను ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చేయవలసిన రాజ్యాంగ బాధ్య తను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోంది. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రైవేటీకరణల వంటివాటివల్ల సమస్త కులవృత్తులు యాంత్రీకరణకు గురయ్యాయి. దీంతో జీవనాధారమైన కుల వృత్తులు కార్పొరేట్‌ సంస్థల పరమవ్వడంతో ఆయా వృత్తులవారు బజారున బడ్డారు. శ్రమ విభజన వల్ల ఏర్పడిన కులవృత్తుల మూలంగా... కొన్ని వేల సంవత్సరాలుగా కుల వృత్తులు చేస్తూ విద్యా, విజ్ఞానానికి దూరంగా నెట్టివేయబడ్డారు అధిక శాతంగా ఉన్న బీసీలు. గిట్టుబాటుకాని కులవృత్తుల మూలంగా మెజార్టీ ప్రజలు ఆర్థి కంగా చితికిపోయారు. దీనికి తోడు యాంత్రీకరణ, కార్పొరేటీకరణ, పారిశ్రామికీకరణతో కులవృత్తులు, చేతి వృత్తులు దెబ్బతిన్నాయి. ఈ కులాలకు ఆకలిచావులు శరణ్యమైనాయి. సామాజికరంగంలో, ఆర్థిక రంగంలో వివక్షతలు, అసమానతలు తొలగాలంటే ఆర్థికంగా చితికి పోయిన ఈ చేతివృత్తులు, కులవృత్తుల వారికి  ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి సబ్సిడీ రుణాలు ఇవ్వడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత. స్వాతంత్య్రం వచ్చి 74 సంవత్సరాలు గడిచినా ఈ కులాల అభివృద్ధికి కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చర్యలు తీసు కోలేదు. బడ్జెట్‌ కేటాయించలేదు. బడ్జెట్‌ కేటాయింపులతోనే సమాజం లోని ఆర్థిక అసమానతలు తగ్గి సమసమాజం ఏర్పడుతుంది. 

కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమాన్ని చూడటానికి ఇంత వరకు  ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదు. బీసీ జనాభా లెక్కలు తీయడానికి అంగీకరించడం లేదు. కేంద్రంలో 74 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలు వంటి వారి అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. కాని 56 శాతం జనాభా గల బీసీల అభివృద్దికి ప్రత్యేకించిన శాఖ లేకపోవడం అన్యాయం కాదా? జనాభా ప్రకారం రిజర్వేషన్‌ లభించడం లేదు. బడ్జెట్‌ లేదు... మరి బీసీలను ఎలా అభివృద్ధి చేస్తారు?  
పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, రాజ్యాంగాన్ని సవరించి చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలనీ; బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలనీ, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలనీ గత 30 ఏళ్లుగా బీసీ సంఘాలు పోరాడుతున్నా కేంద్రం అంగీకరించడం లేదు. పంచాయతీరాజ్‌ సంస్థల్లో జనాభా నిష్పత్తి ప్రకారం బీసీ రిజర్వేషన్లను 50 శాతంకు పెంచి... ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలనీ ఉద్యమాలు చేస్తుంటే ఉలుకుపలుకు లేదు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ మాది రిగా... బీసీలకూ సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్ట్‌ను తీసుకువచ్చి ఈ కులాలకు రక్షణ కల్పించి ఆత్మవిశ్వాసం పెంచవలిసిన అవసరం ఉంది. 95 శాతం ఉద్యోగావకాశాలు గల ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనీ,  సుప్రీంకోర్టు–హైకోర్టు జడ్జీల నియామకాలలో కూడా ఈ వర్గాల వారికి రిజర్వేషన్లు అమలు చేయాలనీ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పోరాడుతున్నా... ఉలుకూపలుకూ లేదు. బీసీ, విద్యా, ఉపాధి, శిక్షణ, స్వయం ఉపాధి పథకాలకు కేంద్ర బడ్జెట్‌ తగు మేరకు కేటాయించడం లేదు. అలాగే బీసీ సబ్‌–ప్లాన్‌ ఏర్పాటు చేసి ఈ కులాలను ఆదుకోవాలని బీసీ లోకమంతా కోడై కూస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. దేశంలోని 70 కోట్ల మంది బీసీలను అభివృద్ధి చేయకుండా భారత్‌ అగ్రదేశంగా తయారవుతుందా?

ఆదర్శం ఆంధ్రప్రదేశ్‌
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏటా బీసీలకు 20 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించి బడ్జెట్‌ కేటాయింపుల్లో దేశంలోనే అగ్ర భాగాన ఉంది. అంతేకాదు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు...  కార్పొరేషన్లు, ప్రభుత్వరంగ సంస్థల నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం కోటా కేటాయించి దేశానికి ఆదర్శంగా నిలిచారు. అలాగే కాంట్రాక్టు పనులలో, పారిశ్రామిక పాలసీలో భాగంగా బలహీనవర్గాలకు 50 శాతం కోటా కల్పించి ఈ వర్గాలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తున్నారు. అలాగే ప్రతి కులానికీ ఒక కార్పొ రేషన్‌ చొప్పున 56 బీసీ కుల కార్పొరేషన్లను మంజూరు చేసి, పాలక మండళ్ళు ఏర్పాటు చేసి ఈ కులాలలో నాయకత్వం పెంచారు. రజకులకు, నాయి బ్రాహ్మణు లకు, దర్జీలకు, మత్స్యకారులకు ఇలా అన్ని కులాలకు రూ. 10 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. 

ప్రతి ఒక్కరూ చదువుకుంటే చైతన్యవంతమైన జ్ఞాన సమాజం ఏర్పడుతుందని ‘అమ్మ ఒడి’ పథకం కింద పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 15 వేలు వేయడం నిజంగా ఆశ్చర్యకరం– ఆదర్శవంతం. ఇలాంటి పథకం దేశంలోనే కాదు... ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. ఈ పథకం వల్ల ప్రతి పిల్లవాడు చదువుకునే అవకాశం కలుగుతోంది. ప్రతి ఒక్కరు చదువుకుంటే అజ్ఞానం– అమాయకత్వం లేని నేర రహిత సమాజం ఏర్పడుతుంది. మానవ వనరులు సమగ్రంగా వినియోగింపబడతాయి. 

రాజ్యాధికారంలో బీసీలకు వాటా కల్పించాలనే ఉద్దేశంతో జగన్‌ మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ పార్లమెంటు సభ్యుల ద్వారా పార్ల మెంటులో బీసీ బిల్లు పెట్టి చరిత్ర కెక్కారు. 74 సంవత్సరాల భారత దేశ పార్లమెంటరీ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ బీసీ బిల్లు పెట్టలేదు. పార్లమెంటులో 8 రాజకీయ పార్టీలు బీసీలు నాయకత్వం వహించేవి ఉన్నా... ఏ పార్టీ ఇటువంటి బిల్లు పెట్టలేదు.

వ్యాసకర్త: ఆర్‌. కృష్ణయ్య
అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం    
మొబైల్‌ : 90000 09164 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement