backward class
-
వారి తర్వాత.. కాంగ్రెస్‌లో బీసీ సీఎం లేరు: నిశికాంత్ దుబే
సాక్షి,న్యూఢిలీ: దేశంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా లేదని.. కానీ వారికి ఎంతో చేసినట్లుగా ప్రచారం చేసుకుంటుందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే అన్నారు. ఆయన బుధవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లుపై మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎప్పుడు వెన్నుదన్నుగా లేదని, 1990లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ మండల్ కమిషన్ సిఫార్సులను వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఓబీసీకి చెందిన సీతారం కేసరి గతంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పని చేశారని తెలిపారు. ఇటీవల జరిగిన రాజస్తాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమితో బీపీ ముఖ్యమంత్రులుగా అశోక్ గహ్లోత్, భూపేష్ బాఘేల్ అవకాశం కోల్పోయారని తెలిపారు. వారి తర్వాత కాంగ్రెస్‌లో బీసీ సీఎం ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రుల ఎంపికలో కూడా బీసీలకు తాము సముచిత స్థానం కల్పిస్తున్నామంటూ కాంగ్రెస్ అసత్యాలు చెబుతోందని నిశికాంత్ అన్నారు. అయితే.. తాజాగా తెలంగాణలో సీఎంగా ప్రకటించిన రేవంత్‌రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ చెందిన సుఖ్విందర్ సింగ్ సుఖు బీసీలా? అని నిశికాంత్ సూటిగా ప్రశ్నించారు. కాగా.. జమ్ము కశ్మీర్ రిజర్వేషన్(సవరణ) బిల్లు ఆ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తుందని తెలిపారు. -
బీసీలకు శాపంగా జాతీయ విద్యా విధానం.. దేశవ్యాప్తంగా బీసీ పోరు!
సాక్షి, హైదరాబాద్: బీసీలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే మండల్ కమిషన్ నిర్దేశించినట్టుగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో, పదోన్నతుల్లో తప్పకుండా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సూరజ్ మండల్ డిమాండ్ చేశారు. దేశంలో బీసీలు సహా కులాల వారీగా జనాభా ఎంత ఉందన్న స్పష్టత వచ్చేలా జనగణన చేయాలని.. ఈ రెండు అంశాల అమలు కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామని తెలిపారు. ఆ దిశగానే ఈ నెల 11న హైదరాబాద్‌లో బీసీ సదస్సును నిర్వహించి, అందులో లేవనెత్తిన అంశాలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని.. వచ్చే నెలలో హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించబోతున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌లో బీసీ సదస్సు కోసం వచి్చన సూరజ్ మండల్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. బిహార్ సీఎంగా పనిచేసి బీసీల కోసం ఉద్యమించిన నేత బిందేశ్వర్ ప్రసాద్ మండల్ (బీపీ మండల్) మనవడిగా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తాను కృషి చేస్తున్నట్టు చెప్పారు. సూరజ్ మండల్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ఏపీ తరహా స్ఫూర్తిని అనుసరించాలి.. ‘‘చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉన్నా ఆచరణలోకి రాలేదు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపుల్లో వైఎస్సార్సీపీ తీసుకున్న నిర్ణయం హర్షించదగినది. బీసీ ల్లోని పలు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పంథా అనుసరిస్తానని, బీసీలకు ప్రత్యేక ప్రాధా న్యత ఇస్తానని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించడం శుభపరిణామం. ఇదే స్ఫూర్తిని దేశ ప్రధాని సహా ఇతర రాష్ట్రాల సీఎంలు, అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తే బీసీలకు తగిన న్యాయం జరుగుతుంది. బీసీలకు శాపంగా జాతీయ విద్యా విధానం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం బీసీల పాలిట శాపంలా మారబోతోంది. ఆ పాలసీ పేరిట ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫీజులను అడ్డగోలుగా పెంచేశారు. అరకొర ఆదాయ కేటగిరీలో ఉన్న బీసీలు ఈ పెరిగిన ఫీజులతో కేంద్ర విద్యా సంస్థల్లో చదువుకోవడంకష్టమే. ఆ సీట్లు చివరికి అగ్రవర్ణాలకే అందుతాయి. అందుకే ఎన్ఈపీలో మార్పులు చేయాలని, ఫీజులు తగ్గించాలని కోరినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం అత్యంత మూర్ఖంగా నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీలు అన్ని విధాలా నష్టపోయారు. కేంద్రంలో కనీసం బీసీ మంత్రిత్వ శాఖ లేదు. ఎన్సీబీసీ చైర్మన్, సభ్యులను సకాలంలో నియమించకుండా కాలయాపన చేసి బీసీల హక్కులతో ఆటలాడుతున్నారు. కులాల వారీగా జనగణన అవసరం జనగణనలో కులాల వారీగా లెక్కలు తేల్చాలని ఏళ్లుగా ఉద్యమిస్తున్నాం. అన్ని వర్గాల నుంచి ఈ డిమాండ్ వస్తుండటంతో కేంద్రం జనగణన ప్రక్రియనే వాయిదా వేసింది. జనాభాలో కులాల వారీగా సంఖ్య తేలితే రిజర్వేషన్లు, ఇతర సంక్షేమ పథకాల అమలుకు మార్గం సుగమం అవుతుంది. ఈ అంశం కేంద్ర ప్రభుత్వానికి నచ్చడం లేదు. జనాభాలో అగ్రవర్ణాల సంఖ్య ఎంతో తేల్చకుండానే 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసింది. బీజేపీ పాలనలో అగ్రవర్ణాలకు ఒక విధంగా, అణగారిన వర్గాలకు ఒక విధంగా న్యాయం ఉంటుందనిపిస్తోంది. -
బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి కాదా?
దేశ జనాభాలో 56 శాతంగా ఉన్న బీసీలు అభివృద్ధి చెందితే దేశం సగానికిపైగా అభివృద్ధి చెందినట్లే. కానీ వారి అభ్యున్నతి నిర్లక్ష్యానికి గురైంది. బీసీల సర్వతోముఖాభివృద్ధికి మండల్ కమిషన్ 40 సిఫార్సులు చేసింది. కానీ అందులో కేవలం రెండు మూడు సిఫార్సులు మాత్రమే ఇప్పటివరకు అమలుకు నోచుకున్నాయి. విద్య, ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేశారు. జాతీయ బీసీ కార్పోరేషన్ ఏర్పాటు చేశారు. మిగతా సిఫార్సులు అమలుచేసినప్పుడు మాత్రమే బీసీల అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సంగతిని బాగా గుర్తించిన ఏపీ ప్రభుత్వం బీసీల అభివృద్ధికి రాజీలేని చర్యలు తీసు కుంటున్నది. 56 బీసీ కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో వారి వాటా వారికి ఇవ్వడం వంటి ఎన్నో చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన 39 లక్షల 45 వేల కోట్ల రూపాయల బడ్జెట్లో బీసీలకు బిచ్చమేసినట్లు 1400 కోట్లు కేటాయించి దేశం లోని 56 శాతం జనాభాగల బీసీలను అవమాన పర్చారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కూడా ఈ దఫా 20 శాతం వరకు నిధుల కేటాయింపు తగ్గించి సామజిక న్యాయానికి తూట్లు పొడిచింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం కేటాయించిన ఈ 1,400 కోట్ల రూపాయలు 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు పంచితే ప్రతి రాష్ట్రానికి రూ. 40 కోట్లు కూడా రావు. ఈ నిధులతో దేశంలో 70 కోట్ల మంది బీసీలకు పంచడానికి బిస్కెట్లు కూడా రావు. గతంలో పాలించిన ప్రభుత్వాలు బీసీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. బీసీ వర్గానికి చెందిన మోదీ ప్రధానమంత్రిగా ఉన్న బీజేపీ ప్రభుత్వమైనా బీసీల విద్యా, ఉద్యోగ, ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని ఆశించాం. కానీ గతం కంటే పరిస్థితులు మరింత అన్యాయంగా తయారవుతున్నాయి. ఇంకొక వైపు బీసీ సంక్షేమానికి ప్రతి రాష్ట్రం 5 వేల నుంచి 20 వేల కోట్ల రూపా యల వరకు బడ్జెట్ కేటాయిస్తుంటే... కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రా నికి 40 కోట్లు మాత్రమే కేటాయించడం సిగ్గుచేటు. రాజ్యాంగబద్ధంగా నియమించిన మండల్ కమిషన్ బీసీల సర్వ తోముఖాభివృద్ధికి 40 సిఫార్సులు చేయగా కేవలం రెండు మూడు సిఫార్సులను మాత్రమే పట్టించుకున్నారు. విద్య, ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేశారు. జాతీయ బీసీ కార్పొ రేషన్ ఏర్పాటు చేశారు. ఆర్థికపరమైన సిఫార్స్‌లు దాదాపు 14 ఉంటే ఇంత వరకు ఒక్క సిఫార్సు కూడా అమలు చేయలేదు. ఒక్క స్కీమ్ అమలుకు కూడా బడ్జెట్ కేటాయించడం లేదు. మండల్ కమిషన్ బీసీ విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు, ఫీజుల మంజూరు, ప్రత్యేక హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. మండల్ కమిషన్ ప్రకారం 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ప్రారంభించి 29 సంవత్సరాలు గడుస్తున్నా ఆర్థికపరమైన స్కాలర్ షిప్‌ల వంటి స్కీముల అమలుకు బడ్జెట్ కేటాయించకుండా బీసీలకు అన్యాయం చేస్తోంది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే జీఎస్టీ పన్నులు, ఆదాయ పన్నులు, ఇతర పన్నుల రూపంగా కేంద్ర బడ్జెట్‌కు బీసీలు 50 శాతంకు పైగా పన్నులు చెల్లిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ ఆదాయంలో సింహ భాగం బీసీలదే. కానీ బడ్జెట్లో బీసీలకు ఒక శాతం కూడా కేటాయించకుండా అన్యాయం చేస్తున్నారు. అత్యంత వెనుకబడిన కులాలు, సంచారజాతులను ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చేయవలసిన రాజ్యాంగ బాధ్య తను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోంది. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రైవేటీకరణల వంటివాటివల్ల సమస్త కులవృత్తులు యాంత్రీకరణకు గురయ్యాయి. దీంతో జీవనాధారమైన కుల వృత్తులు కార్పొరేట్ సంస్థల పరమవ్వడంతో ఆయా వృత్తులవారు బజారున బడ్డారు. శ్రమ విభజన వల్ల ఏర్పడిన కులవృత్తుల మూలంగా... కొన్ని వేల సంవత్సరాలుగా కుల వృత్తులు చేస్తూ విద్యా, విజ్ఞానానికి దూరంగా నెట్టివేయబడ్డారు అధిక శాతంగా ఉన్న బీసీలు. గిట్టుబాటుకాని కులవృత్తుల మూలంగా మెజార్టీ ప్రజలు ఆర్థి కంగా చితికిపోయారు. దీనికి తోడు యాంత్రీకరణ, కార్పొరేటీకరణ, పారిశ్రామికీకరణతో కులవృత్తులు, చేతి వృత్తులు దెబ్బతిన్నాయి. ఈ కులాలకు ఆకలిచావులు శరణ్యమైనాయి. సామాజికరంగంలో, ఆర్థిక రంగంలో వివక్షతలు, అసమానతలు తొలగాలంటే ఆర్థికంగా చితికి పోయిన ఈ చేతివృత్తులు, కులవృత్తుల వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి సబ్సిడీ రుణాలు ఇవ్వడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత. స్వాతంత్య్రం వచ్చి 74 సంవత్సరాలు గడిచినా ఈ కులాల అభివృద్ధికి కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చర్యలు తీసు కోలేదు. బడ్జెట్ కేటాయించలేదు. బడ్జెట్ కేటాయింపులతోనే సమాజం లోని ఆర్థిక అసమానతలు తగ్గి సమసమాజం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమాన్ని చూడటానికి ఇంత వరకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదు. బీసీ జనాభా లెక్కలు తీయడానికి అంగీకరించడం లేదు. కేంద్రంలో 74 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలు వంటి వారి అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. కాని 56 శాతం జనాభా గల బీసీల అభివృద్దికి ప్రత్యేకించిన శాఖ లేకపోవడం అన్యాయం కాదా? జనాభా ప్రకారం రిజర్వేషన్ లభించడం లేదు. బడ్జెట్ లేదు... మరి బీసీలను ఎలా అభివృద్ధి చేస్తారు? పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, రాజ్యాంగాన్ని సవరించి చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలనీ; బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలనీ, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలనీ గత 30 ఏళ్లుగా బీసీ సంఘాలు పోరాడుతున్నా కేంద్రం అంగీకరించడం లేదు. పంచాయతీరాజ్ సంస్థల్లో జనాభా నిష్పత్తి ప్రకారం బీసీ రిజర్వేషన్లను 50 శాతంకు పెంచి... ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలనీ ఉద్యమాలు చేస్తుంటే ఉలుకుపలుకు లేదు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాది రిగా... బీసీలకూ సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్ట్‌ను తీసుకువచ్చి ఈ కులాలకు రక్షణ కల్పించి ఆత్మవిశ్వాసం పెంచవలిసిన అవసరం ఉంది. 95 శాతం ఉద్యోగావకాశాలు గల ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనీ, సుప్రీంకోర్టు–హైకోర్టు జడ్జీల నియామకాలలో కూడా ఈ వర్గాల వారికి రిజర్వేషన్లు అమలు చేయాలనీ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పోరాడుతున్నా... ఉలుకూపలుకూ లేదు. బీసీ, విద్యా, ఉపాధి, శిక్షణ, స్వయం ఉపాధి పథకాలకు కేంద్ర బడ్జెట్ తగు మేరకు కేటాయించడం లేదు. అలాగే బీసీ సబ్–ప్లాన్ ఏర్పాటు చేసి ఈ కులాలను ఆదుకోవాలని బీసీ లోకమంతా కోడై కూస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. దేశంలోని 70 కోట్ల మంది బీసీలను అభివృద్ధి చేయకుండా భారత్ అగ్రదేశంగా తయారవుతుందా? ఆదర్శం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏటా బీసీలకు 20 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి బడ్జెట్ కేటాయింపుల్లో దేశంలోనే అగ్ర భాగాన ఉంది. అంతేకాదు, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు... కార్పొరేషన్లు, ప్రభుత్వరంగ సంస్థల నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం కోటా కేటాయించి దేశానికి ఆదర్శంగా నిలిచారు. అలాగే కాంట్రాక్టు పనులలో, పారిశ్రామిక పాలసీలో భాగంగా బలహీనవర్గాలకు 50 శాతం కోటా కల్పించి ఈ వర్గాలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తున్నారు. అలాగే ప్రతి కులానికీ ఒక కార్పొ రేషన్ చొప్పున 56 బీసీ కుల కార్పొరేషన్లను మంజూరు చేసి, పాలక మండళ్ళు ఏర్పాటు చేసి ఈ కులాలలో నాయకత్వం పెంచారు. రజకులకు, నాయి బ్రాహ్మణు లకు, దర్జీలకు, మత్స్యకారులకు ఇలా అన్ని కులాలకు రూ. 10 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. ప్రతి ఒక్కరూ చదువుకుంటే చైతన్యవంతమైన జ్ఞాన సమాజం ఏర్పడుతుందని ‘అమ్మ ఒడి’ పథకం కింద పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 15 వేలు వేయడం నిజంగా ఆశ్చర్యకరం– ఆదర్శవంతం. ఇలాంటి పథకం దేశంలోనే కాదు... ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. ఈ పథకం వల్ల ప్రతి పిల్లవాడు చదువుకునే అవకాశం కలుగుతోంది. ప్రతి ఒక్కరు చదువుకుంటే అజ్ఞానం– అమాయకత్వం లేని నేర రహిత సమాజం ఏర్పడుతుంది. మానవ వనరులు సమగ్రంగా వినియోగింపబడతాయి. రాజ్యాధికారంలో బీసీలకు వాటా కల్పించాలనే ఉద్దేశంతో జగన్ మోహన్‌రెడ్డి వైఎస్సార్సీపీ పార్లమెంటు సభ్యుల ద్వారా పార్ల మెంటులో బీసీ బిల్లు పెట్టి చరిత్ర కెక్కారు. 74 సంవత్సరాల భారత దేశ పార్లమెంటరీ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ బీసీ బిల్లు పెట్టలేదు. పార్లమెంటులో 8 రాజకీయ పార్టీలు బీసీలు నాయకత్వం వహించేవి ఉన్నా... ఏ పార్టీ ఇటువంటి బిల్లు పెట్టలేదు. వ్యాసకర్త: ఆర్. కృష్ణయ్య అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మొబైల్ : 90000 09164 -
‘ఆ శాఖను బలవంతంగా రుద్దేవారు’
సాక్షి, హైదరాబాద్: గతంలో పశుసంవర్థక శాఖను బలవంతంగా అంటగట్టేవారంటూ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పద్దులపై చర్చకు ఆయన సమాధానాలు ఇచ్చే సందర్భంగా మాట్లాడుతూ.. ‘నేను 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశాను. ఎవరికో ఒకరికి ఓ మంత్రిత్వ శాఖ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేవారు. అందులో కనీసం నిధులు కూడా ఉండేవి కావు. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక దాని రూపురేఖలే మారిపోయాయి. భారీగా నిధులు ఇస్తున్నారు. ఇప్పుడు అది ప్రధాన శాఖగా మారింది’ అని తలసాని పేర్కొన్నారు. దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా.. తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు మాత్రం కేసీఆర్ సీఎం అయ్యాకే స్వాతంత్య్రం వచ్చినట్లని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జీవాలకు ప్రత్యేకంగా అంబులెన్సులు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గతంలో ప్రభుత్వాలు విజయ డెయిరీని దివాలా తీయిస్తే ఇప్పుడు దాన్ని పటిష్టం చేసి ఆదాయాన్ని పెంచినట్లు చెప్పారు. -
దళితుల కోసం ప్రత్యేక వర్సిటీ
సాక్షి, హైదరాబాద్: దళితుల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీని ఏర్పాటు చేసే ఆలోచన ముఖ్యమంత్రికి ఉందని, త్వరలో అది ఏర్పాటయ్యే అవకాశముందని ఎస్సీ అభివృద్ధి, సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కూడా దీన్ని ఏర్పాటు చేయాలని సీఎంను కోరారని సభ దృష్టికి తెచ్చారు. పద్దులపై చర్చలో భాగంగా ఎస్సీ, బీసీ, మైనారిటీ సంక్షేమ విషయాలపై పలువురు సభ్యుల సందేహాలను నివృత్తి చేస్తూ కొప్పుల వివరాలు వెల్లడించారు. గురుకుల పాఠశాలల్లో ఉండేందుకు గతంలో ఇష్టపడేవారు కాదని, కానీ ప్రస్తుతం వాటిలో సీట్ల కోసం పెద్దపోటీ నెలకొందన్నారు. కల్యాణలక్ష్మి, ఉపాధి రుణాలతో ఆయా కుటుం బాలకు ఆసరాగా ఉంటుండగా, వారి పిల్లలకు నాణ్యమైన విద్యనందించి ప్రపంచంలో ఎక్కడైనా పోటీని తట్టుకునేలా నిలిచేందుకు దోహదం చేస్తున్నట్లు పేర్కొన్నారు. విదేశాల్లో నాణ్యమైన, ఉన్నత విద్యను పొందేందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు. -
దశ తిరిగేనా?
► న్యాయానికి దూరంగా బీసీలు ► మూడేళ్లుగా నీరసిస్తున్న సంక్షేమం ► సమన్యాయం, సరిపడా నిధుల శూన్యం ► బీసీ శాఖ మంత్రి అచ్చెన్న పైన జిల్లావాసుల ఆశలు వెనుకబడిన జిల్లాల జాబితాలో శ్రీకాకుళం పేరు ప్రథమంగా ఉంటుంది. సుమారు 80 శాతం ప్రజలు బీసీ కుటుంబాలకు చెందిన వారే. అయితే వారికి న్యాయం మాత్రం జరగడంలేదు. అన్ని జిల్లాలతో పాటే ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది తప్పా.. బీసీ జిల్లాగా, బీసీ జనాభా ప్రాతిపదికన మాత్రం ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదు. గడచిన మూడేళ్లుగా బీసీ సంక్షేమం కుంటుపడింది. సంక్షేమ రుణాలు, వసతి గృహాలు, ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంటు, బీసీ సబ్ ప్లాన్ ఇతర నిధులు సరిపడినంతగా లేక జిల్లా వాసులు అవస్థలు పడుతున్నారు. టీడీపీ ప్రభుత్వ మత్రివర్గ విస్తరణ, మార్పుల్లో భాగంగా జిల్లాకు చెందిన కింజరాపు అచ్చెన్నాయుడుకి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించారు. ఈ నేపథ్యంలో జిల్లా వాసిగా బీసీ కుటుంబాలకు మేలు జరిగేలా నిధులు కురిపిస్తారా..లేదా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో వెనుకబడిన వర్గాలకు చెందినవారు మంత్రి అచ్చెన్నపై అనేక ఆశలు పెట్టుకున్నారు. తమ ఆశలు నెరవేరుస్తారని కలలుగంటున్నారు. అయితే వీరి ఆశలు ఎంతవరకూ నెరవేరుతాయో అనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే వెనుకబడిన జిల్లాలో సమస్యలు అనేకం పేరుకుపోయి ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఈ సందర్భంగా ప్రస్తావించుకుందాం. ► బీసీ స్టడీ సర్కిల్ వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు శాశ్వత భవనం లేదు. దీంతో అద్దె భవనంలోనే కొనసాగిస్తున్నారు. వీటికి ప్రత్యేక స్థలం, భవనం కల్పించాల్సి ఉంది. ► జ్యోతిరావు పూలే పేరిట బీసీ సంక్షేమ ఆడిటోరియం నిర్మాణం చేయాల్సి ఉంది. స్థలంతో పాటు నిధులు కూడా కావాలి. వీటి కోసం జిల్లా బీసీ సంఘాలు పోరాటాలు చేస్తున్న ఇప్పటికీ చర్యలు లేవు. ► బీసీ సబ్ ప్లాన్ నిధులు జిల్లాకు అధికంగా కేటాయించలేదు. రాష్ట్రంలో 8,600 కోట్లు కేటాయించినా, బీసీ జనాభా ప్రాతిపదికన జిల్లాకు చేటాయించడం లేదు. అన్ని జిల్లాలకు ఒకే రీతిలో కేటాయింపులు చేయడంతో జిల్లాలో బీసీ అభివృద్ధి కుంటుపడుతుంది. ► బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరులో అధికార పార్టీ జోక్యం పెరగడంతో వాస్తవ లబ్ధిదారులు నష్టపోతున్నారు. వచ్చిన రుణ యునిట్లు జన్మభూమి కమిటీల పెత్తనంతో వారి అనుయాయులకు సిఫార్సు చేస్తుండడం, బ్యాంకర్లు కూడా సహకరించకపోడవంతో రుణ లక్ష్యాలు నెరవేరని పరిస్థితి. ► జిల్లాలో 78 శాతం బీసీలు న్నారు. వీరిలో 75 శాతం మంది కూలి పనులు, వలస కూలీలుగానే జీవనం సాగిస్తున్నారు. దేశంలో ఎక్కడ ప్రమాదం జరిగినా..అందులో జిల్లాకు చెందిన బీసీలు ఉంటారు. వారి పరిస్థితి దయనీయంగా ఉంది. అటువంటి వారిని ఆదుకునేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాల్సిఉంది. ► బీసీ సంక్షేమానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. వసతి గృహాలను ఎత్తివేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 12 వసతి గృహాలను గడచిన రెండేళ్లలో ఎత్తివేశారు. వీటి స్థానంలో గురుకులాలు ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చినా, ఇప్పటి వరకు చర్యల్లేవు. బీసీ జనాభా ప్రతిపదికన ప్రతి మండలంలోనూ రెండు గురుకులాలకు తక్కువ లేకుండా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ గురుకులాలు ఇంటరీ్మడియెట్ వరకు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ► జిల్లా కేంద్రంతో పాటు కళాశాల వసతి గృహాలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలి. ప్రస్తుత అవసరాల దృష్ట్యా మరిన్ని వసతి గృహాలు పెంచాలి. వాటిలో అన్ని కార్పొరేట్ సదుపాయాలు కల్పించాలి. ► బీసీ కుల సంఘాలకు ఎటువంటి బ్యాంకు సెక్యూరిటీ లేకుండా రుణాలు మంజూరు చేయాలి. ప్రతి కులానికి కనీసం వందకు తక్కువ లేకుండా సంఘాలు ఉండాలి. దీనికి కావాలి్సన నిధులు జనాభా ప్రాతిపదికగా కేటాయించాల్సి ఉంది. ► బీసీ విద్యార్థులకు ప్రభుత్వ కార్పొరేట్ కళాశాలలో ప్రవేశాలకు ప్రస్తుతం ఉన్న సీట్లను పెంచాలి. జనాభా ప్రతిపదికగా జిల్లాకు కనీసం వెయ్యి మందికి కార్పొరేట్ చదువుల అవకాశం ప్రతి సంవత్సరం కల్పించాలి. ► ఇలాంటి పరిస్థితిలో జిల్లాకు చెందిన శాసనసభ్యుడు బీసీ సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతులు చేపట్టిన నేపథ్యంలో వెనుకబడిన సామాజిక వర్గం పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయో చూడాలి. జనాభా ప్రతిపదికన నిధులు కేటాయించాలి జిల్లాలో బీసీ కులాలు ఎక్కువగా ఉన్నారు. అన్ని జిల్లాలతో కాకుండా వెనుబడిన జాతులు ఉన్న ఈ జిల్లాకు అదనంగా బీసీ సంక్షేమా నిధులు, రుణాలకు ఎక్కువ యూనిట్లు, సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలి, జిల్లాలో బీసీలు దారిద్య్రరేఖకు తక్కువగా సుమారుగా 70 శాతం వరకు ఉన్నారు. వారిని ప్రభుత్వం ఆదుకొవాల్సి ఉంది. జిల్లాకు చెందిన వ్యక్తి ఈ శాఖకు మంత్రి అయినందున మరిన్ని నిధులు తెచ్చి బీసీలను ఆదుకోవాలి. –బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు–పి చంద్రపతిరావు వలసలు నివారించాలి మన జిల్లాకు చెందిన బీసీ కులాల వారు పోట్టకూటి కోసం వలసలు వెళ్తున్నారు. వారి సంక్షేమానికి ప్రత్యేక నిధులు సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గడిచిన మూడేళ్లుగా టీడీపీ ప్రభుత్వం బీసీ వలస కూలీల దుర్భర జీవితాలను పట్టించుకొలేదు. ఈసారి జిల్లాకు చెందిన మంత్రికి బీసీల సంక్షేమం చూసే అవకాశం వచ్చింది. బీసీ కులాల వారు పోట్టకూటి కోసం వలసలు వెళ్లకుండా ఉపాధి అవకాశాలు కల్పించి నివారణ చర్యలు చేపట్టాలి. –డీపీ దేవ్, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ముఖ్యకార్యదర్శి -
ఇక బీసీలకు కల్యాణలక్ష్మి పథకం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపుచేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు మైనారిటీలకు షాదీముబారక్, గిరిజనులకు కల్యాణలక్ష్మీ పథకం పేరుతో ఉన్న ఇస్తున్న ఈ పథకాన్ని ఇక బీసీలకు ఇవ్వనున్నారు. ఏడాది ఆదాయం రూ.2 లక్షలకు లోబడి ఉన్న వెనకబడిక కులాలకు చెందిన కుటుంబాలకు కల్యాణలక్ష్మీ పథకం వర్తింపు చేస్తారు. 18 సంవత్సరాలు నిండి వివాహం చేసుకోబోయే బీసీ యువతులకు ఈ పథకాన్ని అందిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వివాహం చేసుకునే వారికి ప్రభుత్వం పథకాన్ని వర్తింపు చేయనున్నారు. కల్యాణలక్ష్మీ పథకం కింద ప్రభుత్వం రూ.51 వేలను అందిస్తున్న విషయం తెలిసిందే. -
బీసీలపై యూపీఏ చిన్నచూపు
హైదరాబాద్, న్యూస్‌లైన్: బీసీల అభివృద్ధిపై కేంద్రం లోని యూపీ ఏ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆదివారమిక్కడ బీసీ సంఘం కార్యాలయంలో 36 బీసీ ఉద్యోగుల సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెం బర్ 15న జరిగే బీసీ ఉద్యోగుల చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీల సమస్యలపై అనేక పోరాటాలు చేశామని, గత 30 ఏళ్లలో 24 సార్లు ప్రధానమంత్రులతో చర్చలు జరిపినా ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని విమర్శించారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 లక్షల 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.