దశ తిరిగేనా? | backward class is away to law | Sakshi
Sakshi News home page

దశ తిరిగేనా?

Published Wed, Apr 5 2017 11:04 AM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

దశ తిరిగేనా?

దశ తిరిగేనా?

► న్యాయానికి దూరంగా బీసీలు
► మూడేళ్లుగా నీరసిస్తున్న సంక్షేమం
► సమన్యాయం, సరిపడా నిధుల శూన్యం
► బీసీ శాఖ మంత్రి అచ్చెన్న పైన జిల్లావాసుల ఆశలు

వెనుకబడిన జిల్లాల జాబితాలో శ్రీకాకుళం పేరు ప్రథమంగా ఉంటుంది. సుమారు 80 శాతం ప్రజలు బీసీ కుటుంబాలకు చెందిన వారే. అయితే వారికి న్యాయం మాత్రం జరగడంలేదు. అన్ని జిల్లాలతో పాటే ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది తప్పా.. బీసీ జిల్లాగా, బీసీ జనాభా ప్రాతిపదికన మాత్రం ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదు. గడచిన మూడేళ్లుగా బీసీ సంక్షేమం కుంటుపడింది. సంక్షేమ రుణాలు, వసతి గృహాలు, ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంటు, బీసీ సబ్‌ ప్లాన్‌ ఇతర నిధులు సరిపడినంతగా లేక జిల్లా వాసులు అవస్థలు పడుతున్నారు. టీడీపీ ప్రభుత్వ మత్రివర్గ విస్తరణ, మార్పుల్లో భాగంగా జిల్లాకు చెందిన కింజరాపు అచ్చెన్నాయుడుకి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించారు. ఈ నేపథ్యంలో జిల్లా వాసిగా బీసీ కుటుంబాలకు మేలు జరిగేలా నిధులు కురిపిస్తారా..లేదా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌:  జిల్లాలో వెనుకబడిన వర్గాలకు చెందినవారు మంత్రి అచ్చెన్నపై అనేక ఆశలు పెట్టుకున్నారు. తమ ఆశలు నెరవేరుస్తారని కలలుగంటున్నారు. అయితే వీరి ఆశలు ఎంతవరకూ నెరవేరుతాయో అనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే వెనుకబడిన జిల్లాలో సమస్యలు అనేకం పేరుకుపోయి ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఈ సందర్భంగా ప్రస్తావించుకుందాం.
బీసీ స్టడీ సర్కిల్‌ వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు శాశ్వత భవనం లేదు. దీంతో అద్దె భవనంలోనే కొనసాగిస్తున్నారు. వీటికి ప్రత్యేక స్థలం, భవనం కల్పించాల్సి ఉంది.  
►  జ్యోతిరావు పూలే పేరిట బీసీ సంక్షేమ ఆడిటోరియం నిర్మాణం చేయాల్సి ఉంది. స్థలంతో పాటు నిధులు కూడా కావాలి. వీటి కోసం జిల్లా బీసీ సంఘాలు పోరాటాలు చేస్తున్న ఇప్పటికీ చర్యలు లేవు.  
►  బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులు జిల్లాకు అధికంగా కేటాయించలేదు. రాష్ట్రంలో 8,600 కోట్లు కేటాయించినా, బీసీ జనాభా ప్రాతిపదికన జిల్లాకు చేటాయించడం లేదు. అన్ని జిల్లాలకు ఒకే రీతిలో కేటాయింపులు చేయడంతో జిల్లాలో బీసీ అభివృద్ధి కుంటుపడుతుంది.
►  బీసీ కార్పొరేషన్‌ రుణాల మంజూరులో అధికార పార్టీ జోక్యం పెరగడంతో వాస్తవ లబ్ధిదారులు నష్టపోతున్నారు. వచ్చిన రుణ యునిట్లు జన్మభూమి కమిటీల పెత్తనంతో వారి అనుయాయులకు సిఫార్సు చేస్తుండడం, బ్యాంకర్లు కూడా సహకరించకపోడవంతో రుణ లక్ష్యాలు నెరవేరని పరిస్థితి.
►  జిల్లాలో 78 శాతం బీసీలు న్నారు. వీరిలో 75 శాతం మంది కూలి పనులు, వలస కూలీలుగానే జీవనం సాగిస్తున్నారు. దేశంలో ఎక్కడ ప్రమాదం జరిగినా..అందులో జిల్లాకు చెందిన బీసీలు ఉంటారు. వారి పరిస్థితి దయనీయంగా ఉంది. అటువంటి వారిని ఆదుకునేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాల్సిఉంది.
►  బీసీ సంక్షేమానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. వసతి గృహాలను ఎత్తివేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 12 వసతి గృహాలను గడచిన రెండేళ్లలో ఎత్తివేశారు. వీటి స్థానంలో గురుకులాలు ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చినా, ఇప్పటి వరకు చర్యల్లేవు. బీసీ జనాభా ప్రతిపదికన ప్రతి మండలంలోనూ రెండు గురుకులాలకు తక్కువ లేకుండా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ గురుకులాలు ఇంటరీ్మడియెట్‌ వరకు ఉండేలా చర్యలు తీసుకోవాలి.
►  జిల్లా కేంద్రంతో పాటు కళాశాల వసతి గృహాలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలి. ప్రస్తుత అవసరాల దృష్ట్యా మరిన్ని వసతి గృహాలు పెంచాలి. వాటిలో అన్ని కార్పొరేట్‌ సదుపాయాలు కల్పించాలి.
►  బీసీ కుల సంఘాలకు ఎటువంటి బ్యాంకు సెక్యూరిటీ లేకుండా రుణాలు మంజూరు చేయాలి. ప్రతి కులానికి కనీసం వందకు తక్కువ లేకుండా సంఘాలు ఉండాలి. దీనికి కావాలి్సన నిధులు జనాభా ప్రాతిపదికగా కేటాయించాల్సి ఉంది.
►  బీసీ విద్యార్థులకు ప్రభుత్వ కార్పొరేట్‌ కళాశాలలో ప్రవేశాలకు ప్రస్తుతం ఉన్న సీట్లను పెంచాలి. జనాభా ప్రతిపదికగా జిల్లాకు కనీసం వెయ్యి మందికి కార్పొరేట్‌ చదువుల అవకాశం ప్రతి సంవత్సరం కల్పించాలి.
►  ఇలాంటి పరిస్థితిలో జిల్లాకు చెందిన శాసనసభ్యుడు బీసీ సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతులు చేపట్టిన నేపథ్యంలో వెనుకబడిన సామాజిక వర్గం పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయో చూడాలి.
జనాభా ప్రతిపదికన నిధులు కేటాయించాలి
జిల్లాలో బీసీ కులాలు ఎక్కువగా ఉన్నారు. అన్ని జిల్లాలతో కాకుండా వెనుబడిన జాతులు ఉన్న ఈ జిల్లాకు అదనంగా బీసీ సంక్షేమా నిధులు, రుణాలకు ఎక్కువ యూనిట్లు, సబ్‌ ప్లాన్‌ నిధులు కేటాయించాలి, జిల్లాలో బీసీలు దారిద్య్రరేఖకు తక్కువగా సుమారుగా 70 శాతం వరకు ఉన్నారు. వారిని ప్రభుత్వం ఆదుకొవాల్సి ఉంది. జిల్లాకు చెందిన వ్యక్తి ఈ శాఖకు మంత్రి అయినందున మరిన్ని నిధులు తెచ్చి బీసీలను ఆదుకోవాలి.        –బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు–పి చంద్రపతిరావు
వలసలు నివారించాలి
మన జిల్లాకు చెందిన బీసీ కులాల వారు పోట్టకూటి కోసం వలసలు వెళ్తున్నారు. వారి సంక్షేమానికి ప్రత్యేక నిధులు సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గడిచిన మూడేళ్లుగా టీడీపీ ప్రభుత్వం బీసీ వలస కూలీల దుర్భర జీవితాలను పట్టించుకొలేదు. ఈసారి జిల్లాకు చెందిన మంత్రికి బీసీల సంక్షేమం చూసే అవకాశం వచ్చింది.  బీసీ కులాల వారు పోట్టకూటి కోసం వలసలు వెళ్లకుండా ఉపాధి అవకాశాలు కల్పించి నివారణ చర్యలు చేపట్టాలి.                  –డీపీ దేవ్, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ముఖ్యకార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement