సాక్షి,న్యూఢిలీ: దేశంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా లేదని.. కానీ వారికి ఎంతో చేసినట్లుగా ప్రచారం చేసుకుంటుందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే అన్నారు. ఆయన బుధవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లుపై మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎప్పుడు వెన్నుదన్నుగా లేదని, 1990లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ మండల్ కమిషన్ సిఫార్సులను వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఓబీసీకి చెందిన సీతారం కేసరి గతంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పని చేశారని తెలిపారు.
ఇటీవల జరిగిన రాజస్తాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమితో బీపీ ముఖ్యమంత్రులుగా అశోక్ గహ్లోత్, భూపేష్ బాఘేల్ అవకాశం కోల్పోయారని తెలిపారు. వారి తర్వాత కాంగ్రెస్‌లో బీసీ సీఎం ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రుల ఎంపికలో కూడా బీసీలకు తాము సముచిత స్థానం కల్పిస్తున్నామంటూ కాంగ్రెస్ అసత్యాలు చెబుతోందని నిశికాంత్ అన్నారు.
అయితే.. తాజాగా తెలంగాణలో సీఎంగా ప్రకటించిన రేవంత్‌రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ చెందిన సుఖ్విందర్ సింగ్ సుఖు బీసీలా? అని నిశికాంత్ సూటిగా ప్రశ్నించారు. కాగా.. జమ్ము కశ్మీర్ రిజర్వేషన్(సవరణ) బిల్లు ఆ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment