సాక్షి, హైదరాబాద్: బీసీలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే మండల్ కమిషన్ నిర్దేశించినట్టుగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో, పదోన్నతుల్లో తప్పకుండా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సూరజ్ మండల్ డిమాండ్ చేశారు. దేశంలో బీసీలు సహా కులాల వారీగా జనాభా ఎంత ఉందన్న స్పష్టత వచ్చేలా జనగణన చేయాలని.. ఈ రెండు అంశాల అమలు కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామని తెలిపారు.
ఆ దిశగానే ఈ నెల 11న హైదరాబాద్‌లో బీసీ సదస్సును నిర్వహించి, అందులో లేవనెత్తిన అంశాలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని.. వచ్చే నెలలో హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించబోతున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌లో బీసీ సదస్సు కోసం వచి్చన సూరజ్ మండల్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. బిహార్ సీఎంగా పనిచేసి బీసీల కోసం ఉద్యమించిన నేత బిందేశ్వర్ ప్రసాద్ మండల్ (బీపీ మండల్) మనవడిగా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తాను కృషి చేస్తున్నట్టు చెప్పారు. సూరజ్ మండల్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
ఏపీ తరహా స్ఫూర్తిని అనుసరించాలి..
‘‘చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉన్నా ఆచరణలోకి రాలేదు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపుల్లో వైఎస్సార్‌సీపీ తీసుకున్న నిర్ణయం హర్షించదగినది. బీసీ ల్లోని పలు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పంథా అనుసరిస్తానని, బీసీలకు ప్రత్యేక ప్రాధా న్యత ఇస్తానని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం శుభపరిణామం. ఇదే స్ఫూర్తిని దేశ ప్రధాని సహా ఇతర రాష్ట్రాల సీఎంలు, అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తే బీసీలకు తగిన న్యాయం జరుగుతుంది.
బీసీలకు శాపంగా జాతీయ విద్యా విధానం
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం బీసీల పాలిట శాపంలా మారబోతోంది. ఆ పాలసీ పేరిట ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫీజులను అడ్డగోలుగా పెంచేశారు. అరకొర ఆదాయ కేటగిరీలో ఉన్న బీసీలు ఈ పెరిగిన ఫీజులతో కేంద్ర విద్యా సంస్థల్లో చదువుకోవడంకష్టమే. ఆ సీట్లు చివరికి అగ్రవర్ణాలకే అందుతాయి. అందుకే ఎన్‌ఈపీలో మార్పులు చేయాలని, ఫీజులు తగ్గించాలని కోరినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం అత్యంత మూర్ఖంగా నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీలు అన్ని విధాలా నష్టపోయారు. కేంద్రంలో కనీసం బీసీ మంత్రిత్వ శాఖ లేదు. ఎన్‌సీబీసీ చైర్మన్, సభ్యులను సకాలంలో నియమించకుండా కాలయాపన చేసి బీసీల హక్కులతో ఆటలాడుతున్నారు.
కులాల వారీగా జనగణన అవసరం
జనగణనలో కులాల వారీగా లెక్కలు తేల్చాలని ఏళ్లుగా ఉద్యమిస్తున్నాం. అన్ని వర్గాల నుంచి ఈ డిమాండ్ వస్తుండటంతో కేంద్రం జనగణన ప్రక్రియనే వాయిదా వేసింది. జనాభాలో కులాల వారీగా సంఖ్య తేలితే రిజర్వేషన్లు, ఇతర సంక్షేమ పథకాల అమలుకు మార్గం సుగమం అవుతుంది. ఈ అంశం కేంద్ర ప్రభుత్వానికి నచ్చడం లేదు. జనాభాలో అగ్రవర్ణాల సంఖ్య ఎంతో తేల్చకుండానే 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసింది. బీజేపీ పాలనలో అగ్రవర్ణాలకు ఒక విధంగా, అణగారిన వర్గాలకు ఒక విధంగా న్యాయం ఉంటుందనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment