హైదరాబాద్: ‘కాంగ్రెస్ పార్టీ తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోలో బీసీల ప్రస్తావన ఏది? బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వాగ్దానం మేనిఫెస్టోలో ఎందుకు లేదు?’ అని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ధ్వజమెత్తారు. మంగళవారం ఇక్కడ బీసీ భవన్‌లో సంఘం ముఖ్యనాయకుల సమావేశం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి అన్నిపార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిస్తున్నాయి కానీ బీసీల రాజకీయ రిజర్వేషన్ల గురించి ఏ ఒక్క పార్టీ మాట్లాడటం లేదని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా ఇంకా ఈ దేశంలో బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంద న్నారు. ఇటీవల సీపీఐ. సీపీఎం, డీఎంకే, సమాజ్‌వాది, ఆర్‌జేడీ పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోల్లో నూ బీసీల ప్రస్తావన లేదన్నారు.
బీసీ ప్రధాని ఉన్నా న్యాయం సున్నా?
ప్రధాని నరేంద్ర మోదీ బీసీ అయినా, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎక్కడా స్పష్టమైన హామీ ఇవ్వలేదని విమర్శించారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రూ.2 లక్షల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు, పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ప్రధాన డిమాండ్లను నెరవేర్చలేదని ఆరోపించారు. త్వరలో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పర్యటించి బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు నీల వెంకటేశ్, సి.రాజేందర్ తదితరులు పాల్గోన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో బీసీల ఊసేది?
Published Wed, Apr 3 2019 3:50 AM | Last Updated on Wed, Apr 3 2019 3:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment