ఇందూరు, న్యూస్‌లైన్ : ఐక్యమత్యమే మనకు రాజ్యాధికారాన్ని తెచ్చి పెడుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీలు ఐక్యతతో మెలగకపోతే ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో బీసీ గర్జన నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ మధుయాష్కీ, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌లు సోనియాగాంధీకి సన్నిహితంగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలాగైతే సాధించారో.. బీసీ సబ్ ప్లాన్‌ను అలాగే తీసుకురావాలని సూచించారు.
బీసీల రిజర్వేషన్లు, సీట్లు తగ్గించేందుకు సీఎం, పంచాయతీ రాజ్ మంత్రి కుట్రలు పన్నారని, వారితో కొట్లాడి 24 శాతం ఉన్న రిజర్వేషన్లను 34 శాతానికి పెం చేలా చేశానని తెలిపారు. సర్పంచ్‌లకు రూ. 20 వేల వేత నం, చెక్ పవర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పంచ్‌ల కు చెక్‌పవర్ ఇవ్వకపోతే పది వేల మంది సర్పంచ్‌లతో హైదరాబాద్ ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సర్పంచ్‌లకు సూచించారు. ప్రతి గ్రామంలో బీసీ సంఘాలను ఏర్పాటు చేసుకుని రాజ్యాధికారం కోసం పాటుపడాలన్నారు. బీసీలదీ ఆకలి పోరాటం కాదని, ఆత్మగౌరవ పోరాటమని గుర్తుంచుకోవాలన్నారు.
ఏడాది క్రితమే ‘తెలంగాణ’
రాజ్యంగబద్ధంగా ఏడాది క్రితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయిందని ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని సోనియాగాంధీ సమయం చూసి ప్రకటించారన్నారు. 2009 డిసెంబర్ తొమ్మిది ప్రకటనను కూడా వెనక్కు తీసుకోలేదని, కేవలం పెండింగ్‌లో పెట్టారని పేర్కొన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్ర ప్రక్రియ ఆగబోదన్నారు. ప్రస్తుతం బీసీల్లో మార్పు వచ్చిందని, అధికారం కోసం పోరాడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలు అత్యధికంగా సీట్లు సాధించడం ఖాయమన్నారు. బీసీలు ఏకం అవుతుంటే విడగొట్టడానికి అగ్రకులాలు ప్రయత్నిస్తాయని, వాటిని అధిగమించి ముందుకు సాగాలని సూచించారు. మహిళా సర్పంచ్‌లు పదవిలో రాణించి, గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. కార్యక్రమంలో సుమారు నాలుగు వందల మంది బీసీ సర్పంచ్‌లను సన్మానించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, నాయకులు రత్నాకర్, శ్రీనివాస్ గౌడ్, అంజనేయులు, భూమన్న, వసుంధర తదితరులు పాల్గొన్నారు.
నిరంతరం పోరాడాలి
బీసీల ఆధిపత్యం పెరగాలంటే నిరంతరం పోరాడాలి. చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలంటే సర్పంచులైన మీరు గ్రామ స్థాయి నుంచి ఒత్తిడి తేవాలి. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయిపోయింది. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగదు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ముఖ్యమంత్రే. తెలంగాణలో ఆ పదవి ఖాళీగా ఉంది.
-మధుయాష్కీగౌడ్, ఎంపీ
బీసీల వల్లే ఈ స్థాయికి..
బీసీల వల్లే నేను ఈ స్థాయికి చేరాను. గత నాలుగు పర్యాయాలు బాల్కొండ ఎమ్మెల్యేగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఎన్నికయ్యారు. నేను 2009లో ఎన్నికల్లో నిలబడగానే బీసీలందరూ ఐక్యమయ్యారు. నన్ను గెలిపించారు. బీసీలు అన్ని నియోజకవర్గాల్లో ఐక్యమవ్వాలి. సీఎంతో మాట్లాడి సర్పంచ్‌లకు చెక్‌పవర్ వచ్చేలా చూస్తా.
-ఈరవత్రి అనిల్, ప్రభుత్వ విప్
సబ్‌ప్లాన్ కోసం ధర్నాకు సిద్ధం
బీసీ సబ్ ప్లాన్ కోసం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సర్పంచ్‌లకు అతి తక్కువ వేతనం ఇస్తున్నారు. దీనిని పెంచాలి. బీసీ సబ్‌ప్లాన్ సాధించేందుకు, సర్పంచ్‌ల వేతనం పెంపుదల, చెక్‌పవర్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తాను.
-యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ శాసనసభాపక్ష నేత
ప్రథమ పౌరులు మీరు
గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచే. గ్రామాల అభివృద్ధికి కృషి చేయండి. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కోసం పాటుపడండి. గ్రామాల్లో రెండు పూటలా తినలేనివారు ఎందరో ఉన్నారు. వారి ఆకలి తీర్చండి. మీకు రూ. 20 వేల వేతనం ఇప్పించేలా మేం కృషి చేస్తాం.
-వి.గంగాధర్ గౌడ్, ఎమ్మెల్సీ
చెక్‌పవర్‌కోసం కృషి..
దేశానికి రాష్ర్టపతిలా గ్రామానికి సర్పంచ్‌లు ప్రథమ పౌరులు. అలాంటి మీకు చెక్ పవర్ లేకపోవడం బాధాకరమైన విషయం. చెక్ పవర్ కోసం కృషి చేస్తాను. బీసీల్లో పోటీతత్వం పెరగాలి. రాజకీయంగా ముందడగు వేయాలి. ఐక్యంగా సాగి రాజ్యాధికారం సాధించుకుందాం.
-మహేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర గిడ్డంగుల అభివృద్ధి మండలి చైర్మన్
ఐక్యతతోనే అధికారం
Published Sat, Oct 26 2013 2:17 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM
Advertisement
Advertisement