టీడీపీ నేతపై రెండో భార్య కృష్ణవేణి ఫిర్యాదు
మొదటి భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదంటూ కృష్ణవేణితో పెళ్లి
పిల్లలు పుట్టాక ఆమెను నిర్లక్ష్యం చేసిన బొల్లినేని
కేసు హైదరాబాద్ సీసీఎస్‌కు బదిలీ
సాక్షి, హైదరాబాద్: టీడీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే, కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యపై క్రిమినల్ కేసు నమోదైంది. రెండో భార్యకు పుట్టిన సంతానం మెదటి భార్య, సమీప బంధువులకు జన్మించినట్లు నకిలీ పత్రాలు సృష్టించారన్నది ఆరోపణ. వీటి ఆధారంగా బర్త్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్టులు కూడా తీసుకున్నారు. విషయం తెలుసుకున్న రెండో భార్య కృష్ణవేణి రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేశారు.
బొల్లినేని కృష్ణయ్యతో పాటు ఆయన సమీప బంధువులు లోటస్ హాస్పిటల్ యజమానులు హేమ, ప్రసాద్‌లనూ నిందితులుగా చేరుస్తూ కేసు నమోదైంది. నేరం మొత్తం నగరంలో జరిగినట్లు దర్యాప్తులో తేలడంతో కేసును దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సీసీఎస్‌కు బదిలీ చేశారు. విశాఖపటా్ననికి చెందిన కృష్ణవేణి 2003లో నాంపల్లిలోని మెడ్విన్ ఆస్పత్రిలో పని చేస్తుండగా కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్‌గా ఉన్న కృష్ణయ్యతో పరిచయమైంది.
తన భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదంటూ కృష్ణవేణిని నమ్మించిన కృష్ణయ్య 2004 ఫిబ్రవరిలో ఆమెను వివాహం చేసుకున్నారు. వీళ్లు బంజారాహిల్స్‌లో కాపురం పెట్టారు. కొన్నిరోజుల తర్వాత ఇంటికి తీసుకెళ్లడంతోపాటు బంధువులకూ భార్యగా పరిచయం చేస్తానంటూ నమ్మబలికారు. వీరికి 2004లో కుమారుడు అర్జున్ జన్మించాడు. కృష్ణయ్య, కృష్ణవేణి తల్లిదండ్రులుగా బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నారు. 2006లో అనారోగ్య కారణాలు చెప్పిన కృష్ణయ్య తన కుమారుడిని తనతో తీసుకెళ్లారు.
తర్వాత ఇద్దరు కుమార్తెలు...
2006లో కృష్ణవేణి కుమార్తె కృష్ణ వైష్ణవికి జన్మనిచ్చింది. రెండేళ్ల తర్వాత వివిధ కారణాలు చెప్పిన కృష్ణయ్య వైష్ణవినీ తీసుకెళ్లిపోయారు. వీరికి 2011లో రెండో కుమార్తె శ్రీనిక పుట్టింది. ఆ తర్వాత నుంచి కృష్ణయ్య... కృష్ణవేణి వద్దకు రావడం మానేశారు. కుమారుడు, మొదటి కుమార్తె వివరాలను కూడా ఆమెకు తెలియనీయలేదు. కృష్ణవేణి ఎన్నిసార్లు కోరినా అర్జున్, వైష్ణవిలను చూపించడానికి సుముఖత చూపలేదు.
ప్రతి నెలా కృష్ణవేణికి నిర్ణీత మొత్తం చెల్లిస్తూ వచ్చారు. 2016లో ఆమెను ఖాజాగూడలో ఉన్న తన విల్లాలోకి మార్చారు. తనతోపాటు తన పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వాలని కృష్ణవేణి కోరారు. దీంతో ఆయన వీళ్లు నివసిస్తున్న విల్లాను మాత్రం శ్రీనిక పేరుతో బదిలీ చేశారు. ఆ తర్వాత నుంచి కృష్ణవేణిని పట్టించుకోవడం మానేశారు.
తన కుమారుడిని కలవడానికి అనేక ప్రయత్నాలు చేసిన కృష్ణవేణి ఎట్టకేలకు 2021లో కలవగలిగారు. ఆమె తన తల్లి అని తెలుసుకున్న అర్జున్ షాక్ అవడంతోపాటు తండ్రి కృష్ణయ్య తన మొదటి భార్యనే తన తల్లిగా నమ్మించినట్లు చెప్పాడు. ఈమె అర్జున్‌ను కలుస్తున్న విషయం తెలుసుకున్న కృష్ణయ్య మానుకోవాలని బెదిరించారు.
నకిలీ పత్రాలు సృష్టించి..
2022లో విదేశాలకు వెళ్లిన అర్జున్ ఇక్కడకు వచ్చినప్పుడు తల్లిని కలిసేవారు. వైష్ణవి తన సోదరి అని తల్లి కృష్ణవేణి ద్వారా తెలుసుకున్నాడు. ఆమె కృష్ణయ్య సమీప బంధువులైన హేమ, ప్రసాద్‌ల కుమార్తెగా పెరుగుతున్నట్లు చెప్పాడు. కృష్ణయ్య తదితరులు అర్జున్, వైష్ణవిలకు సంబంధించి కొన్ని నకిలీ పత్రాలు సృష్టించి, ధ్రువీకరణలు పొందినట్లు కృష్ణవేణి గుర్తించారు.
వీటి ఆధారంగానే జీహెచ్‌ఎంసీ నుంచి బర్త్ సర్టిఫికెట్లు, రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం నుంచి పాస్‌పోర్టులు పొందినట్లు తెలుసుకున్నారు. ఈ ఆధారాలన్నీ పొందుపరుస్తూ రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు కొట్టేయాలంటూ కృష్ణయ్య కోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. తొలుత చీటింగ్, ఆపై అదనపు ఆధారాలతో ఫోర్జరీ కేసుగా మారింది. సీసీఎస్ పోలీసులు కేసును రీ–రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment