గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఇందుకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. 25 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 5 వేలకే నోటిఫికేషన్‌ను విడుదల చేయడం సరికాదన్నారు.
తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట బీఈడీ, టీఆర్‌టీ అభ్యర్థులు భారీగా ఆందోళనకు దిగారు. కొన్నేళ్లుగా ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం లేదని ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రూ.వేల కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం ఉపాధ్యాయులను భర్తీ చేయడానికి మాత్రం ఎందుకు ఆలోచిస్తుందని ప్రశ్నించారు.
భారీగా తరలివచ్చిన అభ్యర్థులు...
మెగా డీఎస్సీని ప్రకటించాలని కోరుతూ.. బీఈడీ, డీఈడీ అభ్యర్థులు పెద్ద ఎత్తున విద్యా శాఖ కార్యాలయం ముట్టడికి యత్నించారు. అసెంబ్లీ నుంచి కొంతమంది, అబిడ్స్ నుంచి కొంతమంది అభ్యర్థులు ఏకకాలంలో దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నా రు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
పోలీసులతో వాగ్వాదం, తోపు లాట జరగడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఆందోళనలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వినర్ గుజ్జకృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment