సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగానే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకా గాందీలతోపాటు కీలక నేతలను రంగంలోకి దింపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వారు వారం రోజుల పాటు ఇక్కడే మకాం వేసి, జిల్లాల్లో విస్తృతంగా పర్యటించేలా షెడ్యూల్ రూపొందిస్తోంది. ఈ నెల 15న నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో 16వ తేదీ నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలనూ ప్రచార బరిలోకి దింపాలని భావిస్తోంది. అయితే భారీ సభలు కాకుండా రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌ల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది.
అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించేలా..
ఈ నెల 16 తర్వాత రాహుల్, ప్రియాంకా గాందీలతో రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా షెడ్యూల్ తయారవుతోంది. పెద్ద సభలను ఏర్పాటుచేసి ప్రజలను అక్కడికి తీసుకురావడం కంటే ప్రజల వద్దకే వెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు టీపీసీసీ సిద్ధమైంది. అన్ని కొత్త జిల్లాల్లో ఇద్దరు అగ్రనేతలతో రోడ్‌షోలు చేయించాలని, అక్కడే కార్నర్ మీటింగ్‌ల ద్వారా కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సిద్ధరామయ్య, అశోక్‌గెహ్లోత్, సుఖ్విందర్‌సింగ్ సుక్కు, భూపేశ్ బఘేల్‌లను కూడా ఎన్నికల ప్రచారానికి తీసుకురానుంది. హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేసిన పథకాల గురించి వారు వివరించనున్నట్టు టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇక కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి నేతలను ప్రచార భాగస్వాములను చేయనుంది.
ఈ ప్రచారమంతాపూర్తయ్యాక చివరిగా ఏఐసీసీ అగ్రనేత, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోగానీ, ఉత్తర తెలంగాణలోని కీలక ప్రాంతంలోగానీ భారీ బహిరంగ సభ నిర్వహించి, పోలింగ్ మూడ్‌లోకి వెళ్లిపోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
నేడు కామారెడ్డిలో బీసీ గర్జన సభ
కాంగ్రెస్ పార్టీ శుక్రవారం కామారెడ్డిలో బీసీ గర్జన సభ నిర్వహించనుంది. నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి గా నామినేషన్ వేయనున్నారు. ఆ కార్యక్రమం ముగిశాక బీసీ గర్జన సభ నిర్వహించనున్నారు. దీనిలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ సభలో పాల్గొంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన స్పష్టమైన ప్రకటన చేస్తారని.. బీఆర్‌ఎస్ ఆరోపణలకు తగిన విధంగా బదులిస్తారని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment