రాడ్డుతో తలపై బాది.. ఆపై గొంతుకోసి ఒకరు
కూరగాయల కత్తితో గొంతుకోసి మరొకరు
మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఘటనలు
గండేడ్/ మహమ్మదాబాద్/త్రిపురారం: మద్యానికి బానిసలై కన్న తల్లులనే కడతేర్చారు ఆ కుమారులు. మద్యానికి డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతో ఒకరు, తనకు విడాకులిచ్చిన యువతి మళ్లీ పెళ్లి చేసుకుంటే కుటుంబ సభ్యులు ఆ వేడుకకు వెళ్లారన్న కక్షతో మరో వ్యక్తి మద్యం మత్తులో విచక్షణ మరచి.. జన్మనిచ్చి న అమ్మలనే చంపుకున్నారు.
రాడ్డుతో తలపై కొట్టి, కత్తితో గొంతుకోసి..
మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలం సల్కర్‌పేట్‌కు చెందిన వెంకటమ్మ(55), కోయిల్‌కొండ మండలం కొత్లాబాద్‌కు చెందిన టంకర రాములు పెళ్లయిన తర్వాత ముంబైకి వలస వెళ్లారు. ఈ క్రమంలో కొంతకాలం తర్వాత రాములు మృతిచెందాడు. దీంతో ఆమె కుమారుడు కృష్ణయ్యతో కలసి అక్కడే ఉంటూ మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగించేది. రెండేళ్ల క్రితం అక్కడ ఇంటిని అమ్ముకుని పుట్టినిల్లయిన సల్కర్‌పేట్‌కు చేరుకుంది. అయితే ఆమె కుమారుడు కృష్ణయ్య మద్యానికి బానిసయ్యాడు.
మద్యానికి డబ్బుల కోసం తల్లిని వేధించడంతోపాటు ఇల్లు అమ్మిన డబ్బులు ఎక్కడ పెట్టావని నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వకపోవడంతో కోపంతో కృష్ణయ్య ఇనుపరాడ్డుతో వెంకటమ్మ తలపై కొట్టాడు. అంతటితో ఆగక కత్తి తీసుకొని గొంతుకోయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లి ఇంటి కొద్దిదూరంలో పడేశాడు.
ఆదివారం తెల్లవారుజామున తన మేనమామ రాములుకు ఫోన్ చేసి అమ్మ చనిపోయిందని, ఎవరో చంపేశారని చెప్పా డు. దీంతో రాములు పోలీసులకు సమాచారం అందించారు. డీఎ స్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహం పడేసిన ప్రదేశం నుంచి కొద్ది దూరం వరకు గడ్డిపై రక్తం పడి ఉండడంతో, అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూశారు. ఇల్లు కడిగి ఉండడంతో అనుమానం వచ్చి కృష్ణయ్యను గట్టిగా నిలదీయగా డబ్బుల కోసం తానే తల్లిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
తల్లిని గొంతుకోసి చంపి, కొడుకు ఆత్మహత్య
నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రానికి చెందిన రావిరాల చినవీరయ్య, సాయమ్మ భార్యాభర్తలు. వీరికి శ్రీను, శివకుమార్ అనే కుమారులు, పద్మ అనే కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు శివకుమార్ తల్లిదండ్రుల వద్దే ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, శివకుమార్‌కు అక్క పద్మ కుమార్తె మేఘనతో వివాహం జరిగింది.
మద్యానికి బానిసైన శివకుమార్ తరచూ భార్యతో గొడవ పడుతుండడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇటీవల వీరు విడాకులు తీసుకున్నారు. కాగా, మేఘనకు శనివారం హైదరాబాద్‌లో రెండో వివాహం జరిపించారు. ఈ పెళ్లికి తండ్రి, అన్న హాజరుకావడంతో ఆగ్రహానికి గురైన శివకు మార్ రాత్రి బాగా మద్యం సేవించి ఇంటికి వెళ్లి తల్లితో గొడవ పడ్డాడు.
తర్వాత తల్లి నిద్రిస్తుండగా.. కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం భయపడి శివకుమార్ కూడా కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం చినవీరయ్య ఇంటికి తిరిగివచ్చేసరికి భార్య, కుమారుడు రక్తపుమడుగులో పడి ఉండటం గమనించాడు. వీరయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment