ఆర్‌డీఎస్‌ఎస్‌పై ఇంధన శాఖ ప్రత్యేక దృష్టి
డిస్కంలలో పనుల వేగవంతానికి చర్యలు
మొదటిదశ పనులకు ఇప్పటికే టెండర్లు పూర్తి
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కసరత్తు
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థల ఆధునీకరణ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్) ద్వారా రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్)ల్లో పనుల వేగవంతానికి రాష్ట్ర ఇంధన శాఖ చర్యలు చేపట్టింది. విద్యుత్ పంపిణీ, సరఫరాకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, ప్రస్తుత వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు రీవాంప్డ్ డి్రస్టిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ఉపయోగపడుతుంది.
పాత నెట్‌వర్క్‌ను పునర్వ్యవస్థీకరించడం ద్వారా వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేయడం ఈ పథకం ముఖ్యఉద్దేశం. ఈ పథకంలో ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ వ్యవస్థను బాగుచేసి, కొత్త పరికరాలతో ఆధునీకరించేందుకు ప్రణాళికలను ఇప్పటికే అధికారులు రూపొందించారు. దీనివల్ల వినియోగదారులకు, ముఖ్యంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని అధికారులు భావిస్తున్నారు.
కొత్త కొత్తగా కరెంట్ వ్యవస్థ
విద్యుత్ ప్రమాదాలు జరగడానికి, విద్యుత్ సరఫరా నష్టాలు రావడానికి ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు బలంగా లేకపోవడం, ఓవర్ లోడ్ కావడమే ప్రధాన కారణమవుతుంది. ఆర్‌డీఎస్‌ఎస్‌లో భాగంగా వాటిని గుర్తించి లోడ్ సరిచేస్తారు. ఒకే ఫీడర్‌పై వ్యవసాయ, ఇతర సర్వీసులు ఉన్న చోట వాటిని వేరు చేసి, వ్యవసాయానికి ప్రత్యేక లైన్లు అందుబాటులోకి తెస్తారు. తద్వారా వ్యవసాయ బోర్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా విద్యుత్ సరఫరా జరుగుతుంది.
గృహాలకు నిరంతర సరఫరాకు విఘాతం రాకుండా ఉంటుంది. అదే విధంగా ప్రకృతి విపత్తులు సంభవించినపుడు దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను బాగుచేయడానికి కూడా ఇందులో నిధులు కేటాయించారు.
మొదటి దశలో రాష్ట్రంలో 30 శాతం ఓవర్ లోడ్ అయిన ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను సరిచేసి, అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేయడం, 33కేవీ, 11కేవీ, ఎల్‌టీ లైన్లలో 200 కిలోమీటర్ల మేర పాత కండక్టర్లు మార్చడం, సాంకేతిక సంబంధిత (ఐటీ) పనులు, తుపాన్లు వంటి ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభవించే ప్రాంతంలో భూగర్భ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయడం వంటి పనులను డిస్కంలు చేపడుతున్నాయి.
ఏడాదిన్నరలోపే పెట్టుబడి వెనక్కి
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, బ్రేకర్ల జీవితకాలం 25 ఏళ్లుగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. వినియోగ సమయం పెరిగేకొద్దీ కోర్ సాచురేషన్, వైండింగ్ ఇన్సులేషన్ డ్యామేజ్, ఆయిల్ నాణ్యత లోపించడం కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లలో నష్టాలు పెరుగుతాయి.
పాత ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయటం వల్ల సమస్యలు తగ్గుతాయి. స్టార్‌రేటెడ్ ట్రాన్స్‌ఫార్మర్ల వినియోగం ద్వారా సుమారు 20 నుంచి 25 శాతం మేరకు సాంకేతిక నష్టాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. పెట్టిన పెట్టుబడి ఏడాదిన్నరలోపే వెనక్కి వస్తుంది. నాణ్యమైనవి కొనడం వల్ల ఇతర డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లతో పోల్చితే ఫెయిల్యూర్ శాతం చాలా తక్కువగా ఉంటుంది.
వచ్చే ఏడాదికల్లా మొదటిదశ పూర్తి
ఆర్డీఎస్‌ఎస్ పథకం తొలి దశలో పాతవైపోయిన పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు,డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, బ్రేకర్లు మార్చడం ద్వారా నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, వ్యవసాయ విద్యుత్తు ఫీడర్లు విభజన, తుపాను ప్రభావిత ప్రాంతంలో భూగర్భ విద్యుత్ కేబుల్స్ ఏర్పాటు, స్మార్ట్ మీటర్లు టెండర్ల ప్రక్రియను దశల వారీగా చేపట్టి, పనులను సంబంధిత గుత్తే దారులకు అప్పగించారు.
రెండవ దశ విద్యుత్ వ్యవస్థ ఆధునికరణకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్‌సీ) తనిఖీ కోసం డిస్కంలు పంపించాయి. అక్కడి నుంచి క్లియరెన్స్ రాగానే డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను తయారు చేసి డిపార్ట్‌మెంటల్ రివ్యూ కమిటీ (డీఆర్‌సీ), రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం కోసం ఇంధన శాఖకు పంపుతాయి.
ఆర్డీఎస్‌ఎస్ పనులను డిస్కంలు నిరీ్ణత సమయంలో పూర్తి చేస్తే కేంద్ర ప్రభుత్వ గ్రాంటు లభిస్తుంది. మొదటి దశ పనులు ఇప్పటికే ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పనులను పూర్తి చేయడానికి 2025 వరకూ గడువు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment