13 సర్కిళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం
ఆర్థిక భారం లేకుండా ఉన్న సిబ్బందినే సర్దుబాటు
‘సాక్షి’ కథనంతో సర్కారులో వచ్చిన కదలిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల్లో కొత్తగా 13 సర్కిళ్లు(జిల్లా కార్యాలయాలు) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. గత ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలు చేసింది. కొత్తగా వచ్చిన జిల్లాలకు ఇన్చార్జ్లను నియమించింది.
అనంతరం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ, జిల్లాల్లో సర్కిల్, డివిజన్, ఏఈ కార్యాలయాల ఏర్పాటుతోపాటు వాటికి అధికారులు, సిబ్బందిని నియమించడంపై దృష్టి సారించలేదు. దీంతో దాదాపు 1.92 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులకు మూడు డిస్కంలు పాత పద్ధతిలోనే విద్యుత్ పంపిణీ, బిల్లుల జారీ వంటి అన్ని కార్యకలాపాలు కొనసాగిçÜ్తున్నాయి.
చివరికి సర్కిళ్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్‌లు ఆగస్టు 21వ తేదీన, ఏపీసీపీడీసీల్ అదే నెల 27న ప్రభుత్వాన్ని కోరాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
‘సాక్షి’ కథనంతో కదలిక
ఈ నేపథ్యంలో ‘కొత్త సర్కిళ్లు ఎంతెంత దూరం?’ శీర్షికతో గత నెల 30న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఆ కథనంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఇంధన శాఖ అధికారులతో నివేదికలు తెప్పించుకుని చర్చించింది. తాజాగా 13 కొత్త సర్కిల్స్ ఏర్పాటుకు అనుమతిచ్చింది. రాష్ట్రంలోని మూడు డిస్కంలలో సుమారు 23 వేల మంది శాశ్వత సిబ్బంది పనిచేస్తున్నారు.
ఎటువంటి ఆర్థక భారం పడకుండా ఇప్పుడు ఉన్నవారినే పాత, కొత్త సర్కిళ్లకు సర్దుబాటు చేయాల్సిందిగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. ఈ ప్రక్రియను పూర్తిచేసి ప్రభుత్వానికి తుది ప్రతిపాదనలను పంపాలని సీఎండీలకు సూచించారు. కొత్త సర్కిళ్లు ఏర్పడితే ప్రజలకు విద్యుత్ సేవలు మరింత చేరువవుతాయి. అదేవిధంగా ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి.
దూరం(కిలో మీటర్లు), హెచ్‌టీ సర్వీసులు, ఎల్‌టీ సర్వీసులు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, వాటి సామర్థ్యం, సబ్ స్టేషన్ల సంఖ్య, నెలకు వచ్చే సగటు ఆదాయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ సర్కిళ్ల విస్తరణకు చర్యలు చేపట్టాలని డిస్కంలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment