సాక్షి, అమరావతి: నెల్లూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ ప్రణాళికకు దక్షిణ మధ్య రైల్వే ఆమోదం తెలిపింది. ఈ మేరకు టెండర్లను ఖరారు చేసింది. దేశంలో ప్రధాన రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా మన రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడ, నెల్లూరు రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. ఇప్పటికే తిరుపతి రైల్వే స్టేషన్‌లో రూ.360 కోట్లతో అభివృద్ధి ప్రణాళికను ఆమోదించారు. తాజాగా రూ.102కోట్లతో నెల్లూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి ప్రణాళికను దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది.
ప్రస్తుతం నెల్లూరు రైల్వే స్టేషన్‌కు రోజూ సగటున 30వేల మంది ప్రయాణికులు వచ్చి, వెళుతుంటారు. భవిష్యత్‌లో ప్రయాణికుల రద్దీ మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా స్టేషన్‌లో వసతులను మెరుగుపరిచేందుకు రూ.102కోట్లతో ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా నెల్లూరు రైల్వే స్టేషన్‌కు పశ్చిమ వైపు కొత్తగా జీ+2 భవనం నిర్మిస్తారు. తూర్పు వైపు రైల్వే స్టేషన్ భవనాన్ని జీ+1గా విస్తరిస్తారు.
ప్లాట్‌ఫారాలు 1, 2, 3, 4లను అభివృద్ధి చేసి, కొత్తగా ఫ్లోరింగ్, పైకప్పులు నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న సబ్ వేను రైల్వేస్టేషన్ తూర్పు, పశ్చిమ దిశల నుంచి ప్లాట్‌ఫాం–4తో అనుసంధానిస్తారు. రక్షిత మంచినీటి వ్యవస్థను, వాటర్ ట్రీట్‌మెంట్, సివరేజ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ పనులను 21 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రయాణికులకు మరింత మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో నెల్లూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ ప్రణాళికను రూపొందించామని దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జ్ జీఎం అరుణ్‌కుమార్ జైన్ చెప్పారు.
నెల్లూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు పచ్చజెండా
Published Wed, Sep 7 2022 4:04 AM | Last Updated on Wed, Sep 7 2022 4:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment