Nellore Railway station
-
రైలు పట్టాలపై మృత్యు ఘోష
ప్రమాదవశాత్తు పట్టాలు దాటే క్రమంలో కొందరు..ఆర్థిక పరిస్థితులు, కుటుంబ కలహాలతో మరికొందరు..రైల్లో నుంచి జారిపడి ఇంకొందరు ప్రాణాలు విడుస్తున్నారు. ఇలా నిత్యం ఏదోక రూపంలో రైలు పట్టాలపై మృత్యు ఘోష వినిపిస్తోంది. రైలు ప్రమాదాల్లో గుర్తించిన మృతదేహాలు బంధువులకు చేరుతున్నా..గుర్తింపులేనివి కుటుంబ సభ్యుల కడచూపునకు నోచుకోకపోవడం విషాదకరం. నెల్లూరు(క్రైమ్): నెల్లూరు రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో 444 కిలోమీటర్ల మేర రైలు మార్గం విస్తరించి ఉంది. నిత్యం సుమారు 120 రైళ్ల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. రైల్వే ప్రయాణికులు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం..ప్రమాదాల నివారణ చర్యల్లో రైల్వే అధికారుల ఉదాసీనత వెరసి నిత్యం ఏదోక చోట నిండు ప్రాణాలు రైలు చక్రాల కింద నలుగుతున్నాయి. రైలు ప్రమాదాల్లో ఎలాగోలా గుర్తించిన మృతదేహాలు బంధువులకు చేరుతున్నా...గుర్తింపులేనివి అనాథ శవాలుగా మిగిలిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు మాసాంతం వరకు నెల్లూరు రైల్వే సబ్‌డివిజన్ పరిధిలో రైలు పట్టాలపై జారిపడి, బలవన్మరణం, సహజ రూపాల్లో 229 మంది మృతి చెందారు. దీనిని బట్టి చూస్తే నెలకు సగటున 28 మందికిపైగా రైలు పట్టాలపై మృత్యువాత పడుతున్నారు. నెల్లూరు రైల్వే సబ్‌డివిజన్ పరిధిలోని చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు పరిధిలో చిన్న, పెద్ద రైల్వేస్టేషన్లు కలిపి 55 ఉన్నాయి. వీటి పరిధిలో ప్రతిరోజూ ఏదోక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రైలు పట్టాలు దాటుతూ, రైల్లో నుంచి జారిపçడి, రైలు కిందపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య క్రమేపి పెరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టు మాసాంతం వరకు రైల్లో నుంచి ప్రమాదవశాత్తు జారిపడి 107మంది మృతి చెందారు. ప్రేమ విఫలమై, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో 110 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 12 మంది అనారోగ్యం, ఇతర కారణాలతో మృతి చెందారు. మొత్తంగా వివిధ కారణాలతో 229 మంది మృతి చెందారు. అందులో 122 మంది వివరాలు లభ్యం కాగా వారి మృతదేహాలను రైల్వే పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన 107 మంది వివరాలు లభ్యం కాకపోవడంతో అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించారు. గుర్తింపు కష్టతరం.. నెలకు సగటన 28 మంది రైలు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారు. వారి మృతదేహాలు ఛిద్రమై గుర్తుపట్టలేని విధంగా మారుతుంటాయి. అనేక సందర్భాల్లో మృతదేహాలు రైలుపట్టాల పక్కనున్న ముళ్ల పొదలు, పిచ్చిమొక్కల మధ్యన పడితే కొన్నిరోజుల వరకు ఎవరూ గుర్తించలేరు. అలాంటి పరిస్థితుల్లో మృతదేహాల గుర్తింపు, తరలింపు మరింత దారుణంగా ఉంటుంది. అయిన వారు సైతం మృతదేహాలను గుర్తుపట్టడం కష్టతరమే. నిబంధనల ప్రకారం గుర్తుతెలియని మృతదేహాలను 72గంటల పాటు మార్చురీలో భద్రపరచాల్సి ఉంటుంది. అప్పటికీ మృతుడి సంబం«దీకులు ఎవ్వరూ రాకపోతే రైల్వే పోలీసులే దగ్గరుండి ఖననం చేయిస్తారు. సంబంధీకుల కడసారి చూపునకు కూడా నోచుకోక ఎంతోమంది అనాథలుగా కాలగర్భంలో కలిసిపోతున్నారు. అధికశాతం ప్రమాదాలకు నిర్లక్ష్యమే కారణంగా నిలుస్తోంది. కదిలే రైలు నుంచి ఎక్కడం, దిగడం, ఫుట్‌బోర్డు ప్రయాణం, అటు, ఇటు గమనించకుండా అజాగ్రత్తగా రైలుపట్టాలు దాటడం, తదితరాలు కారణాలుగా నిలుస్తున్నాయి. కొనఊపిరితో ఉన్న కాపాడలేని పరిస్థితి సాధారణంగా రహదారిపై జరుగుతున్న ప్రమాదాలు అందరికి కనిపిస్తుంటాయి. రోడ్డు ప్రమాదం జరిగితే ఆయ్యో అంటూ ప్రజలు పరుగులు తీసి అవసరమైన సాయం అందిస్తారు. కానీ రైలు పట్టాలపై జరిగే ఘటనలు చాలా వరకు ఎవ్వరికి కనిపించవు. ప్రమాదవశాత్తు కొందరు.జీవితంపై విరక్తి చెంది మరికొందరు ఇలా ఎందరో రైలు చక్రాల కింద నలిగి తనువు చాలిస్తున్నారు. రైలు పట్టాలపై జరిగే ప్రమాదాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. లోకో పైలెట్, కీమెన్లు, ట్రాక్మెన్లు స్టేషన్‌మాస్టర్ దృష్టికి తీసుకొస్తే ఆయన రైల్వే పోలీసులకు సమాచారం అందిస్తారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేస్తారు. లోకోపైలెట్, కీమెన్లు, ట్రాక్మెన్లు గుర్తించకపోతే అంతే సంగతులు. జనసంచారం కలిగిన ప్రాంతాల్లో రైలు ప్రమాదంలో తీవ్రగాయాలైన వారికి సకాలంలో వైద్యసేవలు అందించే అవకాశం ఉంది. జన సంచారం లేని ప్రాంతాల్లో తీవ్రగాయాల పాలైన వారిని కాపాడుకోలేని పరిస్థితి. కొన ఊపిరితో ఉన్నా ఎవరూ చూడక, వైద్య అందక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు. -
నెల్లూరు రైల్వేస్టేషన్‌కు ఆధునిక హంగులు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక సౌకర్యాలు, సరికొత్త హంగులతో నెల్లూరు రైల్వేస్టేషన్ అందుబాటులోకి రానుంది. ఈ స్టేషన్ ద్వారా రోజూ సుమారు 30 వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ దృష్ట్యా నెల్లూరు రైల్వేస్టేషన్‌ను రూ.102 కోట్లతో అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. గత ఆగస్టులో ఎస్సీఎల్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ సంస్థకు పనులు అప్పగించింది. 2024 మే నెలకల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్టేషన్లో పశ్చిమం వైపు ఉన్న జీ+2 భవనం, తూర్పు వైపు ఉన్న జీ+1 భవన నిర్మాణాలను పొడిగిస్తూ ప్రత్యేక ఆకర్షణతో ఆధునికీకరించడం, ప్లాట్‌ఫాం నంబర్ 1, 2, 3, 4 నుంచి తూర్పు, పశ్చిమంలోని అరైవల్ బ్లాక్‌కు చేరుకునేలా సబ్వే నిర్మాణాలు, ప్రయాణికులకు మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సరఫరా, నీటి శుద్ధి, భూగర్భ, ఓవర్ హెడ్ ట్యాంకుల ఏర్పాటు, మురుగు నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణాలు చేపట్టనున్నారు. స్టేషన్ ఆవరణలోని కోర్టు, రైల్వే పోలీసుల కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా కార్యాలయాల కోసం తాత్కాలిక నిర్మాణాలు పూర్తి చేశారు. శాశ్వత నిర్మాణాలకు మార్కింగ్ పనులు చేశారు. ప్లాట్‌ఫాం నంబర్ 1లో కవర్ ఓవర్ ప్లాట్ ఫాంలను ఏర్పాటు చేసేందుకు పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యింది. పనులను పర్యవేక్షిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్ తెలిపారు. (క్లిక్ చేయండి: వలంటీర్ మారినా ఫోన్ నంబర్ మారదు) -
నెల్లూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు పచ్చజెండా
సాక్షి, అమరావతి: నెల్లూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ ప్రణాళికకు దక్షిణ మధ్య రైల్వే ఆమోదం తెలిపింది. ఈ మేరకు టెండర్లను ఖరారు చేసింది. దేశంలో ప్రధాన రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా మన రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడ, నెల్లూరు రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. ఇప్పటికే తిరుపతి రైల్వే స్టేషన్లో రూ.360 కోట్లతో అభివృద్ధి ప్రణాళికను ఆమోదించారు. తాజాగా రూ.102కోట్లతో నెల్లూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి ప్రణాళికను దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది. ప్రస్తుతం నెల్లూరు రైల్వే స్టేషన్‌కు రోజూ సగటున 30వేల మంది ప్రయాణికులు వచ్చి, వెళుతుంటారు. భవిష్యత్‌లో ప్రయాణికుల రద్దీ మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా స్టేషన్లో వసతులను మెరుగుపరిచేందుకు రూ.102కోట్లతో ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా నెల్లూరు రైల్వే స్టేషన్‌కు పశ్చిమ వైపు కొత్తగా జీ+2 భవనం నిర్మిస్తారు. తూర్పు వైపు రైల్వే స్టేషన్ భవనాన్ని జీ+1గా విస్తరిస్తారు. ప్లాట్‌ఫారాలు 1, 2, 3, 4లను అభివృద్ధి చేసి, కొత్తగా ఫ్లోరింగ్, పైకప్పులు నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న సబ్ వేను రైల్వేస్టేషన్ తూర్పు, పశ్చిమ దిశల నుంచి ప్లాట్‌ఫాం–4తో అనుసంధానిస్తారు. రక్షిత మంచినీటి వ్యవస్థను, వాటర్ ట్రీట్మెంట్, సివరేజ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ పనులను 21 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రయాణికులకు మరింత మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో నెల్లూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ ప్రణాళికను రూపొందించామని దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జ్ జీఎం అరుణ్‌కుమార్ జైన్ చెప్పారు. -
రైల్వేస్టేషన్లో ప్రత్యేక భద్రత
నెల్లూరు(సెంట్రల్): రొట్టెల పండగను పురస్కరించుకొని నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్లో 100 మందికి పైగా పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. 'ఈ సారైనా భద్రత కల్పిస్తారా?' అనే శీర్షికన సాక్షిలో సోమవారం ప్రచురితమైన కథనానికి రైల్వే ఉన్నతాధికారులు స్పందించారు. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది జరిగే రొట్టెల పండగకు నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్లో భద్రత కోసం డీఎస్పీ, ఒంగోలు , చీరాల జీఆర్పీ నుంచి ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్సైలు, ఆరుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, మరో 90 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. నెల్లూరు ఆర్పీఎఫ్ సీఐతో పాటు మరో ఇద్దరు ఎస్సైలు, ప్రస్తుతం ఉన్న 21 మంది సిబ్బందితో పాటు అదనంగా మరో 10 మంది ఆర్పీఎఫ్ సిబ్బందిని భద్రతకు నియమించారు. రైల్వేస్టేషన్లో నెల్లూరు ఆర్పీఎఫ్ సీఐ రవిశంకర్, ఒంగోలు జీఆర్పీ సీఐ దశరథరామారావు ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు చేశారు. ఎలాంటి అసౌకర్యం ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. -
రైల్వేస్టేషన్లో చెత్తవేస్తే జరిమానా
సీఎంఎం సత్యనారాయణ నెల్లూరు(సెంట్రల్) : రైల్వేస్టేషన్లో ప్రయాణికులు నిబంధనలకు విరుద్ధంగా చెత్త వేస్తే రూ.500 వరకు జరిమానా విధిస్తామని సికింద్రాబాద్ డివిజన్ చీఫ్ మెటీరియల్ మేనేజర్ (సీఎంఎం) సత్యనారాయణ అన్నారు. నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్లో గురువారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వారంరోజుల పాటు దేశంలోని అన్ని రైల్వేస్టేషన్లలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రయాణికులకు స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఆ తర్వాత కూడా ఎవరైనా స్టేషన్లో చెత్త వేస్తే జరిమానా వేస్తామని చెప్పారు. అంతకుముందు స్వచ్ఛ నాటిక ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ టికెట్ మేనేజర్ సాగర్, రమేష్, మునీర్, నాయక్, ఇన్చార్జి ఎస్ఎస్ కుమార్ పాల్గొన్నారు. -
భద్రత..ఎంత?
రైల్వేస్టేషన్లో కనిపించని మెటల్ డిటెక్టర్లు, స్కానర్లు తనిఖీలు శూన్యం మేలుకోని భద్రతా అధికారులు ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలో నిత్యం ఎక్కడో ఒకచోట ఉగ్రవాద ఆత్మాహుతి దాడులు, బాంబు పేలుళ్లు జరుగుతున్న నేపథ్యంలో నెల్లూరు ప్రజలకు భద్రత కరువైంది. తాజాగా నెల్లూరు నడిబొడ్డున ఉన్న జిల్లా న్యాయస్థానం ఆవరణలో బాంబు పేలడంతో నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నిత్యం వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు భద్రత ఎంత అనేది ప్రశ్నార్థకంగా మారింది. నెల్లూరు(సెంట్రల్): రైల్వే స్టేషన్లోకి ప్రవేశించే ప్రయాణికులను స్కాన్ చేయాల్సిన మెటల్ డిటెక్టర్లు, ప్రయాణికుల వెంట తీసుకుని వచ్చే సామగ్రిని తనిఖీ చేయాల్సిన స్కానర్లు నెల్లూరు రైల్వేస్టేషన్లో లేకపోవడం మన భద్రత వ్యవస్థలోని లోపాలకు నిదర్శనం. ప్రధానంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యంత తొక్కిసలాట జరిగే రైల్వేస్టేషన్‌గా నెల్లూరును గుర్తించారు. కాని భద్రతలో ఇంకా మేలుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ నుంచి వేల మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రైల్వేస్టేషన్ సమీపంలోని సౌత్‌స్టేషన్ నుంచి కూడా నిత్యం ఉద్యోగులు, వ్యాపారులు ఎంతో మంది రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో అయితే నెల్లూరు స్టేషన్ కిటకిటలాడుతోంది. వీటికి తోడు ఉన్నతాధికారులు, వీఐపీలు స్టేషన్‌కు వస్తుంటారు. ప్రయాణికులు, వీఐపీల భద్రత దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఆ విధంగా చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. . భద్రత నిల్ నిబంధనల ప్రకారం ప్రయాణికులు ఎవరైనా టికెట్ తీసుకుని రైల్వేస్టేషన్‌లోకి అడుగుపెడితే అతని పూర్తి భద్రతను రైల్వే స్టేషన్ అధికారులు చూసుకోవాలి. రైల్వే స్టేషన్లోకి రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఒక్కో దానిలో రెండు మెటల్ డిటెక్టర్లు ఉండాలి. ప్రతి మెటల్ డిటెక్టర్ వద్ద ఇద్దరు సంబంధిత పోలీసులు ఉండాలి. వచ్చిన వారిని పరికరం ద్వారా పంపించే విధంగా చెబుతూ వారి వెంట తెచ్చుకున్న సామగ్రిని తనిఖీలు చేయాల్సింది. అంతే కాకండా స్టేషన్ ప్లాట్ చివరి ప్రాంతాల వైపుల నుంచి ఎవరు వస్తున్నారు అనే నిఘా ఏర్పాటు చేసి వారు ఏమి తీసుకుని వస్తున్నారో గమనిస్తుండాలి. కాని వీటిలో ఏ ఒక్కటి జరుగుతున్నట్లు లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏడాదిగా మరమ్మతులకు గురికావడంతో పక్కన పెట్టారని అధికారులు చెబుతుండటం గమనార్హం. మరో నెల రోజుల్లో నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా జరిగే రొట్టెల పండగ దృష్ట్యా భక్తులు వేల సంఖ్యలో స్టేషన్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక నైనా ప్రయాణికుల భద్రత దృష్ట్యా భద్రత పరికరాలు ఏర్పాటు చేయాలని పలువరు ప్రయాణికులు కోరుతున్నారు. త్వరలోనే ఏర్పాటు చేస్తాం : సంబంధిత ఆర్పీఎఫ్ అధికారులతో మాట్లాడుతున్నాం. ప్రయాణికుల భద్రతకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. మెటల్ డిటెక్టర్లు మరమ్మతుల కోసం తీసుకెళ్లినట్లు అ«ధికారులు చెప్పారు. వాటిని ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడుతాం. – ఆంథోని జయరాజ్, రైల్వే స్టేషన్ ఎస్ఎస్ -
స్వచ్ఛభారత్‌లో నెల్లూరు రైల్వే స్టేషన్ ఫస్ట్
నెల్లూరు(సెంట్రల్) ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రైల్వే స్టేషన్లలో నెల్లూరు రైల్వేస్టేషన్‌కు స్వఛ్చ భారత్‌లో ప్రథమ స్థానం లభించింది. విజయవాడ నుంచి తడ వరకు ఉన్న మొత్తం రైల్వే స్టేషన్లను కొన్ని నెలల క్రితం కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక బృందం తనిఖీలు నిర్వహించింది. అందులో నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌కు ప్రథమ స్థానం ఇచ్చారు. ఈ సందర్భంగా స్టేషన్ మేనేజర్ ఆథోని జయరాజ్ మాట్లాడుతూ దేశంలో 407 ప్రధాన రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారన్నారు. బృందం పరిశీలించిన అనంతరం నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ 28వ స్టేషన్‌గా నిలించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. స్టేషన్లలో సౌకర్యాల కల్పనలోతో పాటు ప్రయాణికులకు ఇచ్చే అన్ని సౌకర్యాలపై పరిశీలించి నివేదిక తయారు చేశారని తెలిపారు. అందులో కేంద్రం పరిశీలించి నెల్లూరును ఏపీలో నంబర్–1 స్టేషన్‌గా పేర్కొనిందన్నారు. -
దైవదర్శనానికి వెళుతూ.. మృత్యు ఒడిలోకి..
రెలైక్కబోతూ కిందపడి వ్యక్తి మృతి నెల్లూరు రైల్వేస్టేషన్లో ఘటన మృతుడు తిరుమలగిరి వాసి రేగొండ : మండలంలోని తిరుమలగిరి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి బయల్దేరిన ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కబోతూ కిందపడి మృతిచెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు రైల్వేస్టేషన్లో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తిరుమలగిరికి చెందిన మాచర్ల రాజు(35) హ నుమాన్ మాలధారణ వేసుకొని 41 రోజుల దీక్ష చేశాడు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మాల విరమణ కోసం కుటుంబ సమేతంగా విజయవాడకు సోమవారం వెళ్లాడు. మంగళవారం విజయవాడలోని కనదుర్గమ్మ ఆల యంలో మాల విరమణ చేశాడు. అనంతరం రాజు కుమారుడు వెంకటేష్ తల నీలాలను తిరుపతిలో తీసేందుకు విజయవాడ నుంచి కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. ఈ క్రమంలోనే పిల్లలకు దాహం వేస్తుందని చెప్పడంతో రాజు నెల్లూరు రైలు స్టేషన్లో రైలు ఆగగానే రైలు దిగి వెళ్లాడు. రాజు నీళ్ల బాటిల్ తీసుకోవడంలో కొంతజాప్యం జరిగింది. దీంతో రైలు కదలడంతో రాజు పరుగెత్తుకుంటూ వచ్చి ఎక్కేందుకు ప్రయత్నించాడు. రైలు వేగం పెరగడంతో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యూరుు. వెంటనే రాజు కుటుంబ సభ్యులు చైన్ లాగి రైలు ఆపి నెల్లూరు ఆస్పత్రిలో చేర్పించగా గంటలోనే మృతిచెందాడని భార్య రజిత రోదిస్తూ తెలిపింది. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, తల్లి ఉన్నారు. -
ప్రాణం నిలిపిన టీటీఈ సమయస్ఫూర్తి
నెల్లూరు: చెన్నై నుంచి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వెళ్లే సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి టీటీఈ సమయస్ఫూర్తి ప్రయాణికుడి నిండు ప్రాణాన్ని కాపాడింది. కాకినాడ పోర్టు ఉద్యోగి బెన్నెట్ సింగ్ (ఎస్-1, 46) సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై నుంచి తిరిగివస్తున్నారు. ఆయన నెల్లూరు స్టేషన్లో అల్పాహారాన్ని కొనుక్కోవడానికి దిగారు. ఆ వెంటనే రైలు కదిలిపోవడాన్ని గమనించి ఆదరా బాదరాగా పరుగెత్తుకెళ్లి రాడ్‌ను పట్టుకుని మెట్లపై నిల్చుని ఉండిపోయారు. తలుపు రాకపోవడంతో రక్షించమంటూ హాహాకారాలు చేశారు. దీన్ని గమనించిన ప్రయాణికులు తలుపు తెరవడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. చెయిన్ లాగి రైలును ఆపడానికి ఎవరూ సాహసించలేదు. ఒకరిద్దరు ప్రయత్నించినా బోగీలో ఉన్న పోలీసులు చెయిన్ లాగడానికి వీల్లేదని అడ్డుపడ్డారు. తదుపరి స్టేషన్ వరకూ ఓపిక పట్టమని ప్రయాణికునికి వారు సలహా ఇచ్చారు. ఈలోగా అటుగా వచ్చిన టీటీఈ వి. భగవాన్ విషయం తెలుసుకుని చెయిన్లాగి రైలును ఆపారు. బతుకుజీవుడా అనుకుంటూ వేరే ద్వారం గుండా ఆయన లోపలికి చేరుకున్నారు. ఇదంతా అయ్యేసరికి 45 నిమిషాలకుపైగా సమయం పట్టింది. రైలు వేగం అందుకున్నాక తనకు ప్రాణాలపై ఆశ పోయిందని బెన్నెట్సింగ్ అన్నారు. విషయం తెలిసిన వెంటనే చెయిన్లాగి తనను కాపాడిన టీటీఈ భగవాన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కనీసం బోగీ తలుపులు ఎలా ఉన్నాయో కూడా చూసుకోకుండా రైళ్లు నడపడం సరికాదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
నెల్లూరు రైల్వే స్టేషన్‌కు ఏ1 హోదా ఇవ్వాలి
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరు (సెంట్రల్): నెల్లూరు రైల్వేస్టేషనును మోడల్‌గా తీర్చిదిద్ది ఏ1 హోదా కల్పించాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. రైల్వే బడ్జెట్ ముందు పార్లమెంట్ సభ్యులతో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు శ్రీవాస్తవ విజయవాడలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో నెల్లూరు, తిరుపతి ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్‌లు జిల్లాలోని రైల్వే సమస్యలపై మాట్లాడారు. ఎంపీ మేకపాటి మాట్లాడుతూ నెల్లూరు రైల్వేస్టేషన్ నుంచి దూరప్రాంతాలకు ప్రతిరోజు వేలమంది ప్రయాణాలు సాగిస్తుంటారన్నారు. ఈ రైల్వేస్టేషన్‌ను మోడల్ రైల్వేస్టేషనుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతేకాకుండా నెల్లూరు సమీపంలోని బిట్రగుంటలో రైల్వేశాఖకు సంబంధించిన స్థలం చాలా ఉందన్నారు. ఈ స్థలంలో రైల్వే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను వినియోగించుకుంటారన్నారు. కానీ గతంలో ఉన్న సమయాన్ని మార్చి ప్రస్తుతం చాలా లేటుగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలు సమయం గతంలో ఉన్న మాదిరిగానే నడపాలని పేర్కొన్నారు. నడికుడి-కాళహస్తి రైల్వేలైన్ పనులను చేపట్టాలన్నారు. పుణ్యక్షేత్రాలను కలిపే విధంగా రైళ్లను నడపాలి: ఎంపీ వరప్రసాద్ ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, షిర్డీలను కలుపుతూ రైలును నడపాలని ఎంపీ వరప్రసాద్ కోరారు. అంతేకాకుండా ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరలో ప్రారంభించే ఆంధ్ర ఎక్స్‌ప్రెస్ తిరుపతి నుంచి ప్రారంభమై ఢిల్లీ వెళ్లే విధంగా చూడాలన్నారు. గూడూరు నుంచి సికింద్రాబాద్ వరకు సింహపురి ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం నడుస్తుందన్నారు. అలాకాకుండా తిరుపతి నుంచి సింహపురి ఎక్స్‌ప్రెస్ ప్రారంభమయ్యే విధంగా చూడాలన్నారు. గూడూరు పెద్ద రైల్వే జంక్షన్ కాబట్టి ఆ రైల్వేస్టేషనులో అదనపు ప్లాట్‌ఫారాలు వేస్తే ప్రయాణికుల రద్దీ తగ్గుతుందన్నారు. అంతేకాకుండా గూడూరులో రైల్వేస్టేషన్‌ను ఆనుకుని ఉన్న రైల్వే స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఉపయోగకరంగా ఉండటంతో పాటు రైల్వేకు కూడా ఆదాయం వస్తుందన్నారు. రేణిగుంట వద్ద లోకో షెడ్ ఏర్పాటుచేయాలని కోరారు. కాళహస్తి సమీపంలోని ఆకుర్తి, వెంకటగిరి సమీపంలోని పలుస్టేషన్లలో రైళ్లు ఆపనందు వల్ల కొన్నేళ్ల నుంచి అవి ఖాళీగా ఉన్నాయన్నారు. ఆ స్టేషన్లలో రైళ్లు ఆపితే కొంతవరకు ఆయా ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వెంకటగిరి, గూడూరు ప్రాంతాల్లోని రైతులు ఎక్కువగా నిమ్మకాయలు ఎగుమతులు చేస్తుంటారని వీరికి ఉపయోగకరంగా ఉండే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తే ఎంతో ఉపయోగం అన్నారు. -
నెల్లూరు రైల్వేస్టేషన్‌ను ఆధునీకరిస్తాం
నెల్లూరు : కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శనివారం నెల్లూరు రైల్వేస్టేషన్లో ఎస్కలేటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైల్వేలైన్‌ను మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. బిట్రగుంటలో రైల్వే ప్రాజెక్ట్‌కు కృషి చేస్తామని వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ కార్యకర్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మంత్రి కామినేని శ్రీనివాస్, దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ పాల్గొన్నారు. -
యువకుడి గొంతు కోసిన హిజ్రాలు
నెల్లూరు జిల్లాలో హిజ్రాల ఆగడాలు రోజురోజూకు అధికమవుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటలో రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికుడిని హిజ్రాలు నగదు డిమాండ్ చేశారు. అందుకు అతడు నిరాకరించాడు. దాంతో హిజ్రాల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నగదు అడిగితే ఇవ్వవా అంటూ ప్రయాణికుడి గొంతు కోశారు. దాంతో అతడు రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. అతడి వద్ద ఉన్న బంగారాన్ని హిజ్రాలు దోచుకుని, అక్కడి నుంచి పరారైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సహాయం కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని పోలీసులకు సూచించారు. దాంతో అతడిని నెల్లూరు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు పూడేరుకు చెందిన చిట్టిబాబుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.