రైల్వేస్టేషన్లో ప్రత్యేక భద్రత
నెల్లూరు(సెంట్రల్): రొట్టెల పండగను పురస్కరించుకొని నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్లో 100 మందికి పైగా పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. 'ఈ సారైనా భద్రత కల్పిస్తారా?' అనే శీర్షికన సాక్షిలో సోమవారం ప్రచురితమైన కథనానికి రైల్వే ఉన్నతాధికారులు స్పందించారు. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది జరిగే రొట్టెల పండగకు నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్లో భద్రత కోసం డీఎస్పీ, ఒంగోలు , చీరాల జీఆర్పీ నుంచి ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్సైలు, ఆరుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, మరో 90 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. నెల్లూరు ఆర్పీఎఫ్ సీఐతో పాటు మరో ఇద్దరు ఎస్సైలు, ప్రస్తుతం ఉన్న 21 మంది సిబ్బందితో పాటు అదనంగా మరో 10 మంది ఆర్పీఎఫ్ సిబ్బందిని భద్రతకు నియమించారు. రైల్వేస్టేషన్లో నెల్లూరు ఆర్పీఎఫ్ సీఐ రవిశంకర్, ఒంగోలు జీఆర్పీ సీఐ దశరథరామారావు ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు చేశారు. ఎలాంటి అసౌకర్యం ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.