ప్రాణం నిలిపిన టీటీఈ సమయస్ఫూర్తి
నెల్లూరు: చెన్నై నుంచి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వెళ్లే సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి టీటీఈ సమయస్ఫూర్తి ప్రయాణికుడి నిండు ప్రాణాన్ని కాపాడింది. కాకినాడ పోర్టు ఉద్యోగి బెన్నెట్ సింగ్ (ఎస్-1, 46) సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై నుంచి తిరిగివస్తున్నారు. ఆయన నెల్లూరు స్టేషన్‌లో అల్పాహారాన్ని కొనుక్కోవడానికి దిగారు. ఆ వెంటనే రైలు కదిలిపోవడాన్ని గమనించి ఆదరా బాదరాగా పరుగెత్తుకెళ్లి రాడ్‌ను పట్టుకుని మెట్లపై నిల్చుని ఉండిపోయారు.
తలుపు రాకపోవడంతో రక్షించమంటూ హాహాకారాలు చేశారు. దీన్ని గమనించిన ప్రయాణికులు తలుపు తెరవడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. చెయిన్ లాగి రైలును ఆపడానికి ఎవరూ సాహసించలేదు. ఒకరిద్దరు ప్రయత్నించినా బోగీలో ఉన్న పోలీసులు చెయిన్ లాగడానికి వీల్లేదని అడ్డుపడ్డారు. తదుపరి స్టేషన్ వరకూ ఓపిక పట్టమని ప్రయాణికునికి వారు సలహా ఇచ్చారు. ఈలోగా అటుగా వచ్చిన టీటీఈ వి. భగవాన్ విషయం తెలుసుకుని చెయిన్‌లాగి రైలును ఆపారు.
బతుకుజీవుడా అనుకుంటూ వేరే ద్వారం గుండా ఆయన లోపలికి చేరుకున్నారు. ఇదంతా అయ్యేసరికి 45 నిమిషాలకుపైగా సమయం పట్టింది. రైలు వేగం అందుకున్నాక తనకు ప్రాణాలపై ఆశ పోయిందని బెన్నెట్‌సింగ్ అన్నారు. విషయం తెలిసిన వెంటనే చెయిన్‌లాగి తనను కాపాడిన టీటీఈ భగవాన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కనీసం బోగీ తలుపులు ఎలా ఉన్నాయో కూడా చూసుకోకుండా రైళ్లు నడపడం సరికాదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.