
యువకుడి గొంతు కోసిన హిజ్రాలు
నెల్లూరు జిల్లాలో హిజ్రాల ఆగడాలు రోజురోజూకు అధికమవుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటలో రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికుడిని హిజ్రాలు నగదు డిమాండ్ చేశారు. అందుకు అతడు నిరాకరించాడు. దాంతో హిజ్రాల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నగదు అడిగితే ఇవ్వవా అంటూ ప్రయాణికుడి గొంతు కోశారు. దాంతో అతడు రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. అతడి వద్ద ఉన్న బంగారాన్ని హిజ్రాలు దోచుకుని, అక్కడి నుంచి పరారైయ్యారు.
స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సహాయం కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని పోలీసులకు సూచించారు. దాంతో అతడిని నెల్లూరు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు పూడేరుకు చెందిన చిట్టిబాబుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.