నెల్లూరు రైల్వే స్టేషన్‌కు ఏ1 హోదా ఇవ్వాలి | No 1 status to nellore railway station | Sakshi
Sakshi News home page

నెల్లూరు రైల్వే స్టేషన్‌కు ఏ1 హోదా ఇవ్వాలి

Published Wed, Jan 7 2015 2:51 AM | Last Updated on Thu, Aug 9 2018 4:39 PM

నెల్లూరు రైల్వే స్టేషన్‌కు ఏ1 హోదా ఇవ్వాలి - Sakshi

నెల్లూరు రైల్వే స్టేషన్‌కు ఏ1 హోదా ఇవ్వాలి

ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
 
నెల్లూరు (సెంట్రల్): నెల్లూరు రైల్వేస్టేషనును మోడల్‌గా తీర్చిదిద్ది ఏ1 హోదా కల్పించాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. రైల్వే బడ్జెట్ ముందు పార్లమెంట్ సభ్యులతో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు శ్రీవాస్తవ విజయవాడలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో నెల్లూరు, తిరుపతి ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్‌లు జిల్లాలోని రైల్వే సమస్యలపై మాట్లాడారు.

ఎంపీ మేకపాటి మాట్లాడుతూ నెల్లూరు రైల్వేస్టేషన్ నుంచి దూరప్రాంతాలకు ప్రతిరోజు వేలమంది ప్రయాణాలు సాగిస్తుంటారన్నారు. ఈ రైల్వేస్టేషన్‌ను మోడల్ రైల్వేస్టేషనుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతేకాకుండా నెల్లూరు సమీపంలోని బిట్రగుంటలో రైల్వేశాఖకు సంబంధించిన స్థలం చాలా ఉందన్నారు.

ఈ స్థలంలో రైల్వే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను వినియోగించుకుంటారన్నారు. కానీ గతంలో ఉన్న సమయాన్ని మార్చి ప్రస్తుతం చాలా లేటుగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.


ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని  సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలు సమయం గతంలో ఉన్న మాదిరిగానే నడపాలని పేర్కొన్నారు. నడికుడి-కాళహస్తి రైల్వేలైన్ పనులను చేపట్టాలన్నారు.
 
పుణ్యక్షేత్రాలను కలిపే విధంగా రైళ్లను నడపాలి: ఎంపీ వరప్రసాద్
ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, షిర్డీలను కలుపుతూ రైలును నడపాలని ఎంపీ వరప్రసాద్ కోరారు. అంతేకాకుండా ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరలో ప్రారంభించే ఆంధ్ర ఎక్స్‌ప్రెస్ తిరుపతి నుంచి ప్రారంభమై ఢిల్లీ వెళ్లే విధంగా చూడాలన్నారు. గూడూరు నుంచి సికింద్రాబాద్ వరకు సింహపురి ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం నడుస్తుందన్నారు. అలాకాకుండా తిరుపతి నుంచి సింహపురి ఎక్స్‌ప్రెస్ ప్రారంభమయ్యే విధంగా చూడాలన్నారు.

గూడూరు పెద్ద రైల్వే జంక్షన్ కాబట్టి ఆ రైల్వేస్టేషనులో అదనపు ప్లాట్‌ఫారాలు వేస్తే ప్రయాణికుల రద్దీ తగ్గుతుందన్నారు. అంతేకాకుండా గూడూరులో రైల్వేస్టేషన్‌ను ఆనుకుని ఉన్న రైల్వే స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఉపయోగకరంగా ఉండటంతో పాటు రైల్వేకు కూడా ఆదాయం వస్తుందన్నారు. రేణిగుంట వద్ద లోకో షెడ్ ఏర్పాటుచేయాలని కోరారు.

కాళహస్తి సమీపంలోని ఆకుర్తి, వెంకటగిరి సమీపంలోని పలుస్టేషన్లలో రైళ్లు ఆపనందు వల్ల కొన్నేళ్ల నుంచి అవి ఖాళీగా ఉన్నాయన్నారు. ఆ స్టేషన్లలో రైళ్లు ఆపితే కొంతవరకు ఆయా ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వెంకటగిరి, గూడూరు ప్రాంతాల్లోని రైతులు ఎక్కువగా నిమ్మకాయలు ఎగుమతులు చేస్తుంటారని వీరికి ఉపయోగకరంగా ఉండే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తే ఎంతో ఉపయోగం అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement