పురుషాధిపత్య సమాజంలో మహిళలు సామాజిక అణచివేతకు, లింగ వివక్షకు గురి అవుతున్నారనేది ఎవరూ కాదనలేని సత్యం. అయితే తాజాగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) విడుదల చేసిన నివేదిక మరింత ఆందోళనకు గురిచేసింది. దళిత మహిళలపై జరుగుతున్న లైంగిక, శారీరక దాడులు, వివక్షకు తోడు వారిని కులం కూడా కాటేస్తోందని యూఎన్ అధ్యయనం వెల్లడించింది. వారు నివసించే మురికివాడల్లోని పారిశుధ్యలేమి, అనారోగ్య పరిస్థితులు, అందుబాటులో లేని వైద్య సదుపాయాలు దళిత మహిళల ఆయుర్దాయాన్ని మింగేస్తున్నాయని తెలిపింది.
ఆధిపత్యకులాలలోని మహిళలతో పోలిస్తే దళిత మహిళ కనీసం 15ఏళ్లు (14.6)ముందుగానే కన్నుమూస్తోందని ఐరాస నివేదిక తేల్చింది. దళిత మహిళ సగటున 39.5 ఏళ్లకే చనిపోతోంటే.. ఇతర కులాల మహిళల్లో ఇది 54.1 గా ఉంది. అంతేకాదు సామాజిక హోదా, ఇతర అంశాలు సమానంగా ఉన్నప్పటికీ కూడా ఈ గ్యాప్ 11 సంవత్సరాలుగా ఉంది. ఐక్యరాజ్యసమితి 2015 లో '2030 నాటికి జెండర్ ఈక్వాలిటీ' సాధించాలనే ఎజెండాను ఆమోదించిన రెండు సంవత్సరాల అనంతరం ఈ నివేదికను వెల్లడించింది.
పేదరిక నిర్మూలన, ఆహారం, నీరు, పారిశుధ్యం, ఆరోగ్యం, భూమి, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం లాంటి 17 రకాల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్‌డీజీ) అమలులో సవాళ్లను ఈ అధ్యయనం పరిశీలించింది. దాదాపు 89 దేశాల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్ పేరుతో నిర్వహించిన అధ్యయనం ఈ విషయాలను ప్రకటించింది. సమాజంలో వెనుకబడి ఉన్న మహిళలు, బాలికలు తరచూ లింగ అసమానతలతోపాటు ఇంకా పలురకాల కష్టాలు అనుభవిస్తున్నారు. నిరుపేద కుటుంబాలలో నివసించే స్త్రీలు తమ పని సమయములో 24శాతం వంట చెఱకు, నీరు, ఆహారం, గృహ అవసరాలకోసం వినియోగిస్తుండగా, ధనిక కుటుంబాలలోని మహిళలు దీంట్లో సగ భాగాన్ని అంటే 12శాతం సమయాన్ని అలాంటి పనులకు కేటాయిస్తున్నారట.
భారతదేశంలో 20-24 ఏళ్ల వయస్సులో ధనిక వర్గాలనుంచి వచ్చిన యువతులతో పోలిస్తే గ్రామీణ పేద యువతుల్లో పాఠశాలకు వెడుతున్నవారి సంఖ్య 21.8 రెట్లు తక్కువగా ఉంది. అలాగే 18 ఏళ్ళలోపు పెళ్లిళ్లు గ్రామీణ ఐదు రెట్లు ఎక్కువ. కౌమార దశలోనే తల్లులుగా మారుతున్న వారి సంఖ్య 5.8రెట్లు ఎక్కువ. సాంఘిక సోపానక్రమంలో తక్కువ విద్య, తక్కువ హోదా ఉన్న మహిళ మరింత శ్రమదోపిడీకి గురవుతుందనీ, భూమిలేని, షెడ్యూల్డ్ కులాలు, తెగల నుంచి వచ్చి ఉంటే ఈ దోపిడీ ఇంకా తీవ్రంగా ఉంటుందని నివేదిక పేర్కొంది.
1990ల ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా మొత్తం అక్షరాస్యత రేటు, పాఠశాలలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, లింగ, సామాజిక అసమానతలు ఇప్పటికీ ఉన్నాయని నివేదించింది. ఇందుకు జనాభాలో 16.6శాతంగా ఉన్న షెడ్యూల్డ్ తెగలు 8.6శాతంగా ఉన్న షెడ్యూల్డ్ కులాల అక్షరాస్యత రేటు భారతీయ సగటు అక్షరాస్యత రేటు కంటే తక్కువగా ఉండటాన్ని నిదర్శనంగా పేర్కొంది. ఎస్.టి. మహిళల అక్షరాస్యత రేటు ఇప్పటికీ 50శాతం కంటే తక్కువగా, ఎస్సీ మహిళల్లో 57శాతం కంటే తక్కువగా ఉందని చెప్పింది. అందరికీ అభివృద్ధి అనే లక్ష్యాన్ని సాధించాలంటే మహిళల ముందస్తు పురోగతి ప్రాధాన్యతను యూఎన్ నివేదిక నొక్కి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment