ఆకాశంలో సగం.. భద్రత శూన్యం | Attcks On Women In India | Sakshi
Sakshi News home page

ఆకాశంలో సగం.. భద్రత శూన్యం

Published Wed, Aug 29 2018 3:12 AM | Last Updated on Wed, Aug 29 2018 3:12 AM

Attcks On Women In India - Sakshi

ఏ దేశం, ఏ రాష్ట్రం వర్ధిల్ల డానికైనా స్త్రీయే ప్రధాన కారణం. స్త్రీని గౌరవించిన రాష్ట్రాలు, దేశాలు, స్త్రీకి ప్రాధాన్యమిచ్చిన అన్ని వ్యవస్థలు వర్ధిల్లుతూ వచ్చాయి. అయితే ఈనాడు దేశంలోనూ, రాష్ట్రంలోనూ స్త్రీల ఉత్పత్తి శక్తిపై తీవ్రమైన దాడి జరుగుతుంది. స్త్రీని కేవలం గృహిణిగా మార్చి వారిని ద్వితీయులుగా పురుషుల మీద ఆధారపడి బ్రతికేవారిగా మార్చివేసి, టి.వి.సీరియల్స్‌ చూసి ముచ్చటించుకొనే వారిగా నెట్టివేశారు. మధ్య తరగతి స్త్రీలంటే పనీపాటాలేని వారు అన్నట్లు తేల్చివేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో స్త్రీలపై దాడులు, దమనకాండలు, అరాచకాలు, గృహ హింస నిరంతర దుష్క్రియగా మారింది. స్త్రీల రక్షణ మీద, స్త్రీలకు పని కల్పించడం మీద చంద్రబాబుకు చూపులేదు. స్త్రీ విద్యపై నిరంతరం గొడ్డలివేటు పడుతూ వుంది. కుటుంబం, మత సాంప్రదాయం, పురుష పెత్తనంతో పాటు ప్రభుత్వం స్త్రీ విద్యకు పూర్తిగా విరుద్ధంగా పనిచేస్తుంది. ఆరు, ఏడు తరగతుల్లోనే అమ్మాయిలు ఎందుకు డ్రాప్‌ ఔట్‌ అవుతున్నారనే కనీస ఆలోచన లేని ప్రభుత్వాలు స్త్రీ విద్యకు అడుగడుగునా ముళ్ళ కంచె వేస్తున్నాయి.

ఇక దళిత స్త్రీలు వ్యవసాయ కూలీలుగా ఆర్థిక పేదరికాన్ని ఎంత అనుభవిస్తున్నారో కులాధిపత్యం దారుణ అణచివేతను అంతకంటే ఎక్కువ అనుభవిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ కార్మికులైన దళిత స్త్రీలు ఊరిబయట పూరిగుడిసెల్లో బతుకుతున్నారు. వారికి ఇళ్లస్థలాలు లేవు. పోషకాహార లోపం వల్ల బలహీనులవుతున్నారు. పగలంతా చెమటోడ్చి, పొలాల్లో పనిచేస్తే దళిత స్త్రీలకు మరీ తక్కువ కూలి ఇస్తున్నారు. వ్యవసాయ పునాది దెబ్బతినడంతో దళిత స్త్రీలు ఇతర జిల్లాలకు వెళ్ళి కూలి చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు భూస్వాములు వాళ్ళ చావిళ్ళలో కుక్కి పశువులతో సమానంగా చూస్తున్న ఘటనలు గుండెలను తొలిచివేస్తాయి. చంద్రబాబుకు సమాజాన్ని లోతుగా చూడటం రాదు. ఆయన ఉపరితలం మనిషి.  ఆయన కళ్ళ ముందు మెరిసే జిలుగు వెలుగులను చూసి సమాజమంతా ఇలాగే వుందని అనుకుంటాడు. అనేక గృహాల్లో జరుగుతున్న హింస, నెత్తుటి చారల వెనుక ఆయన నిర్వహిస్తున్న మందు షాపుల బార్లు వున్నాయని ఆయనకు తెలియదా!. అనేక దుర్వ్యసనాలకు కాణాచిగా రాష్ట్రాన్ని దుర్గంధపూరితంగా మార్చివేస్తున్న చంద్రబాబు స్త్రీ హింసను సామాన్యంగా తీసుకోవడం ఆశ్చర్యమేస్తుంది. గృహ హింస నిరోధక చట్టం 2005 ఏ పోలీస్‌ స్టేషన్‌ సరైన పద్ధతిలో అమలు జరపడం లేదు.

మరోవైపున ఇండ్లలో పనిచేసే అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. వీరు లైంగిక వేధింపులకే గాక, యజమానురాళ్ళ వేధింపులకు కూడా గురవుతున్నారు. ప్రభుత్వం అనేక విషయాల్లో ఇంటింటికీ తిరిగి లెక్కలు తీస్తుంది కానీ ఈ ఇండ్లలో పనిచేస్తున్న బాలకార్మికుల గురించి, వారి వేధింపుల గురించిన ఏ విధమైన సమాచారం ప్రభుత్వానికి లేదు. సినీరంగంలో చిన్నచిన్న వేషాలు వేసి జీవిస్తున్న యువతుల మీద కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. వారిలో వున్న కళను గుర్తించకుండా వారి దగ్గరకు పనికోసం వచ్చిన జూనియర్‌ ఆర్టిస్టులను వేధిస్తున్నారు. జూనియర్‌ ఆర్టిస్టులకు హెల్త్‌ కార్డులు లేవు, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ లేదు, వారి జీవితానికి భద్రత లేదు. వారిని వేధిస్తున్నవారు పెద్ద పెద్ద ధనవంతులు అవ్వడంతో, బడా పెట్టుబడిదారులు కావడంతో వారి కేసును తీసుకొనే పోలీస్‌ స్టేషన్‌ లేదు. ఒకవేళ తీసుకున్నా ఆ పలుకుబడిగల నిర్మాతల, దర్శకుల ఒత్తిడితో ఆ కేసు నిలవదు. వారికి నిర్దిష్ట పారితోషికం లేదు. అభద్రతలో వారు జీవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వారిపై శ్రమదోపిడీ, శారీరక దోపిడీ జరుగుతుంది.    

రాష్ట్రంలో వృత్తికారులైన స్త్రీల విషయం మరీ దయనీయంగా మారిపోయింది. చేనేతను ధ్వంసంచేసి కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తూ పవర్‌లూమ్‌ మగ్గాలను ప్రోత్సహించడంతో చేనేత స్త్రీల బతుకులను చంద్రబాబు దెబ్బతీశారు. ఇక కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి స్త్రీలు పనిలేక వ్యవసాయ కూలీలుగా మారినా వారి పరిస్థితి కూడు, గూడు లేని స్థితికి నెట్టబడింది. గిరిజన ప్రాంతాల్లోనైతే ఊళ్ళకు ఊళ్ళు మంచాలెక్కాయి. రెండు మందు బిళ్ళలిచ్చే దిక్కు లేకుండా పోయింది. అసలు రాష్ట్రంలో పాలన వుందో, పడకేసిందో తెలియని పరిస్థితి. చంద్రబాబు చూపు ధనవంతులపైన, సొంత కులం పైనే ఉంటోంది. రాష్ట్రంలో స్త్రీ అణచివేతలు అన్ని రంగాల్లో పెరిగిపోతున్న ఈ దశలో స్త్రీలు కూడా ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు దృష్టి సారించాలి. ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా చంద్రబాబును గద్దె నుంచి దించివేయడం కూడా స్త్రీ ఉద్యమంలో భాగమే. తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సాంస్కృతిక ఆర్థిక రాజ కీయ విప్లవానికి స్త్రీ నడుం కట్టాల్సివుంది. స్త్రీ మేలుకున్నప్పుడే దేశానికి నిజమైన విముక్తి.


వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, వ్యవస్థాపక
అధ్యక్షుడు, నవ్యాంధ్రపార్టీ ‘ 98497 41695

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement