అభిప్రాయం
భారతదేశ వ్యాప్తంగా దళిత, బహుజన స్త్రీ విద్యపై తీవ్రమైన వివక్ష కొనసాగుతోంది. నిజానికి గురుకుల హాస్టల్స్‌లోనూ, జనరల్ హాస్టల్స్‌లోనూ విద్యార్థినులు నిరంతరం అనారోగ్యానికి గురి అవుతున్నారు. దీనికి కారణం పౌష్టికాహార లోపం, శుభ్రతగా ఉండే పరిస్థితుల లేమి, సరైన మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేకపోవడం. అందుకే పిల్లలు రక్త హీనతతో శక్తి లేక కళావిహీనంగా ఉంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరి సంరక్షణ విషయంలో సరైన బడ్జెట్‌ను రూపొందించ లేకపోతున్నాయి. వీరిపట్ల ఎంతో అశ్రద్ధ కనబడుతోంది. వార్డెన్స్‌ను శాశ్వతంగా నియమించకపోవడం, హాస్టల్స్‌కు సొంత భవనాలు లేకపోవడం, విద్యార్థినుల సంఖ్యకు తగినట్లుగా గదులు లేకపోవడం లాంటి ఎన్నో కారణాలు బాలికలకు మెరుగైన చదువును నిరాకరిస్తున్నాయి.
తల్లిదండ్రులు వలస కూలీలుగా వెళ్తుండగా, ఇంట్లో ఆలనా పాలనా లేని జీవన వ్యవస్థలో దళిత బాలికలు ఎంతో సంక్షోభాన్ని అనుభవి స్తున్నారు. దీనికి తోడు ఉద్యోగుల దోపిడీ విధానాలు కూడా పిల్లల నోటికాడి కూడును దొంగిలించే పరిస్థితులు వచ్చాయి. ఇస్తున్న కొద్దిపాటి సామాన్లనే వార్డెన్లు పరిగ్రహించటం, రాత్రుళ్లు కనీసం గర్ల్స్ హాస్టల్స్‌లో కూడా వార్డెన్లు నిద్రించకపోవడం, విద్యార్థులను సొంత పనులకు వాడుకోవడం లాంటి ఎన్నో లొసుగులు ఉన్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు గన్‌మెన్ వెంట తిరుగుతూ ఉంటారు. బాలికల హాస్టల్స్‌కు కనీసం ఒక గార్డ్ కూడా కాపలా ఉండడు.
సౌకర్యాలు కల్పించకూడదా?
విద్యకు ఆహారం, వసతి ముఖ్యం. ప్రభుత్వం ప్రతి మూడు జిల్లాలకైనా ఒక స్పెషల్ కలెక్టర్‌ను వెయ్యాల్సి ఉంది. ఆయనకు కొన్ని టాస్క్ ఫోర్స్ టీములను అప్పగించాల్సి ఉంది. ఈ సంవత్సరం హాస్టళ్ళలో అత్యాచారాల సంఖ్య పెరిగింది. ప్రతి మహిళా పోలీస్ స్టేషన్‌కు ఆ ప్రాంతంలో వున్న బాలికల హాస్టల్ రక్షణ బాధ్యతను అప్ప గించాల్సి ఉంది. తెలంగాణలో ఎన్నిసార్లు గురుకుల విద్యార్థినులు కలుషిత ఆహారంతో ఆసుపత్రుల పాలయ్యారు? రెండు రాష్ట్రాల లోనూ నాసిరకం బియ్యాన్ని గురుకుల పాఠశాలలకు సరఫరా చేస్తు న్నారు. దీనికి కారణం వీళ్ళలో గూడుకుట్టుకున్న కులతత్వం అని చెప్పక తప్పదు.
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి పథకం ఇస్తానని చెప్పి దళిత విద్యార్థుల్లో విద్య పెరుగుతుందనే ఆ పథకం మీద గొడ్డలివేటు వేశారు. అమరావతి నిర్మాణం, పోలవరం అనే పాట పాడుతూ, ప్రపంచ బ్యాంకుల నుండి అప్పులు తెస్తూ మహా నగరాన్ని నిర్మిస్తాననే మాటతో ఏపీ ముఖ్యమంత్రి ప్రజల్ని నమ్మి స్తున్నారు. దళిత బహుజన విద్యార్థుల్ని విద్యాశక్తికి పనికిరాకుండా మానసిక దౌర్భల్యానికి గురిచెయ్యాలనే పెద్ద ప్రయత్నం జరుగుతోంది.
దళిత బహుజనుల జీవన వ్యవస్థల మీద దెబ్బ కొట్టాలనే ప్రయ త్నంతోనే ‘అమ్మఒడి’కి ‘తల్లి దీవెన’ అని పేరు పెట్టి దాన్ని నిర్వీర్యం చేయాలని రోజుకొక ప్రకటన చేస్తున్నారు. గిరిజనుల హాస్టళ్ళకు ఆహార, ఆహార్య, రక్షణలను కలిగించకుండా, తల్లిదండ్రులకు తమ పిల్లలను చదివించాలనే ఆసక్తిని పోగొడుతున్నారు. నిజానికి ఇది ఒక పద్ధతి ప్రకారమే అగ్రకులాధిపత్యం చేయిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇవ్వగలిగి కూడా ఇవ్వలేకపోవడా నికి కారణం ఏమిటి? తల్లిదండ్రులు వలస కూలీలుగా వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ఆటోలో 25 మంది వరకు ఎక్కి, ప్రమాదాల్లో చనిపోయి, పిల్లలు అనాథలవుతున్న స్థితి మనకు కనబడుతుంది. ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే బహుజన స్త్రీలలో మొబిలిటీ పెరుగుతుందనీ, వారు దూర ప్రాంత పనులకు వెళ్ళగలుగుతారనీ అంచనా వేసే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యాన్ని దాటవేస్తోంది.
కుటుంబాల్లో సంక్షోభం
ఈ సందర్భంగా దళితవాడల పరిస్థితిని ఒకసారి చూద్దాం. రెండు రాష్ట్రాలలోని అన్ని జిల్లాలలో దళితవాడలు మురుగు నీరుతో, జబ్బులతో కునారిల్లుతున్నాయి. గ్రామ రాజ్యాన్ని పునరుద్ధరిస్తానంటున్న ఏపీ ఉపముఖ్యమంత్రి దళితవాడలకు ఇంతవరకు ఇళ్ళ స్థలాల విషయంగానీ, ఉపాధిని ఇచ్చే కుటీర పరిశ్రమల విషయంగానీ ఎత్తడం లేదు. దళిత వాడల్లో మద్యపానంతో పురుషులు ఎక్కువ మంది మరణిస్తూ స్త్రీలు విధవరాళ్లు అవుతున్నారు.
గ్రామాలు సంక్షో భంలో, కుటుంబాలు వైరుధ్యాలతో కొట్టుమిట్టాడుతుంటే నోరు మెదపడం లేదు. దళిత బహుజన విద్యార్థినులు పేరెంట్స్ మీటింగ్‌కు పిలిస్తే సగంమంది విడిపోయిన భార్యాభర్తలు వస్తున్న విషయాలు వీరికి తెలిసి కూడా, ఈ కుటుంబ సంక్షోభం విద్యార్థుల భవిష్యత్తుపై గొడ్డలి వేటు అని తెలుసుకోలేకపోతున్నారు. రెండు రాష్ట్రాల్లో మద్యం తాగేవారి సంఖ్య విపరీతంగా పెరగడం ఎంత బాధకరమో అర్థం చేసుకోలేకపోతున్నారు.
ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా స్త్రీ ఆర్థికాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం జీవగర్ర. మగవాళ్లు తాగి జుట్టు పట్టుకొని ఆడవాళ్లను, ఆఖరికి తల్లిని కూడా కొట్టి ఇళ్ళల్లోంచి తరుముతున్న దారుణాలు చూస్తున్నాం. ఈ సామాజిక సంక్షోభాన్ని ప్రభుత్వం నివారించడానికి ప్రయత్నించడం లేదు. పైగా అనేక రకాల మత్తు పదార్థాలను విచ్చల విడిగా పాఠశాల పరిసర ప్రాంతాల్లోనూ, దళిత వాడల్లోనూ అమ్ముతూ ఉన్నా కూడా ప్రభుత్వాలు కళ్ళప్పగించి చూడటం ఆశ్చర్యం వేస్తుంది.
ఫూలే ఆశయాలు మరిచారా?
తెలంగాణలో అయితే అసెంబ్లీలో ప్రతిపక్షం హాస్టళ్లలోని దుర్భ రమైన పరిస్థితులను ఎత్తిచూపినా ప్రభుత్వం దాటవేసే చర్యలను చేస్తున్నదే తప్ప వాటిని నిజంగా నివారించే చర్యలు చేపట్టడం లేదు. అసలు హాస్టల్స్‌లో రగ్గులు పంచి, పిల్లలను చలి నుండి కాపాడాలనే ఉద్దేశం కూడా లేకుండా జీవిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం భారతదేశంలోనే దళిత బహు జన విద్యపైన గొడ్డలివేటు పడుతోంది.
దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు కోట్లకు పడగలెత్తిన వారున్నారు. కనీసం తమ నియోజక వర్గాల్లో కూడా విద్యార్థులకు దుప్పట్లు పంచడం గానీ, శక్తిమంతమైన ఆహారాన్ని కల్పించడం కోసం పాలు, గుడ్లు, పండ్లు, పప్పులు వంటివి పంచిపెట్టడం గానీ చెయ్యడం లేదు. దీనికంతటికీ కారణం వీళ్లు స్వార్థ పూరితమైన జీవితంతో మహాత్మ ఫూలే జీవితానుసరణను, ఆయన సిద్ధాంతాలను, ఆశయాలను మరచిపోయి అగ్రవర్ణాలతో సంపాదనలో పోటీ పడటమే.
మహాత్మా ఫూలే 1848లోనే బ్రిటిష్ ప్రభుత్వానికి బహుజన స్త్రీల మీదే కాక మొత్తం స్త్రీలకే విద్య రావాలనే విషయం మీద ఎన్నో ఉత్తరాలు రాశారు. అంబేడ్కర్ తన జీవితం మొత్తం దళిత బహు జనుల విద్యకోసం పోరాడారు. ఆనాడు ఎలాగైతే అగ్రవర్ణాల్లో దళిత బహుజనులు చదువుకోకూడదనే దురుద్దేశం ఉండిందో, అది ఇప్పటికీ కొనసాగుతోందని అర్థం అవుతోంది. ఒక పదవ తరగతి విద్యార్థిని ఏడు సబ్జెక్టులు చదవాలంటే, పాఠాలు వినాలంటే, పరీక్షలు రాయా లంటే ఎంత శక్తి కావాలి, ఎంత ఆహారం తినాలి అని ప్రభుత్వాలకు తెలియదా!
మహాత్మా ఫూలే చెప్పినట్లు మన గ్రామాలను మనమే పునర్ నిర్మించుకునే సందర్భం వచ్చింది. అంబేడ్కర్, పెరియార్ రామ స్వామి నాయకర్ స్వీయ వ్యవస్థల ద్వారా విద్య సంస్కరణలను చేసు కోవాలనీ, విద్యా వ్యవస్థలను నిర్మించుకోవాలనీ చెప్పిన విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. మన పిల్లల భవిష్యత్తుకు మనమే మార్గం వేసుకోవాలి. ముఖ్యంగా చర్చిల్లో కేవలం ప్రార్థనలే కాకుండా విద్యా బోధనలకు అవకాశం కల్పించాలని కోరాలి. దళిత బహుజన సామాజిక సంఘాలు, స్వీయ సామాజిక విద్యా పునర్జీవనం కోసం పాటుపడాలి. ఆత్మ గౌరవ పోరాటాలతోనే సమసమాజ నిర్మాణం సాధ్యం.
విద్యే జీవన వ్యవస్థలకు సోపానం. విద్య మానవ వ్యక్తిత్వ వికాసానికి పునాది. విద్య మానవాభ్యుదయానికి నాంది. విద్యా పునాదుల మీదే నూత్న సమాజం రూపొందుతుంది. అందుకే అంబే డ్కర్ దళితులకు విద్యా విప్లవ నినాదాన్ని ఇచ్చారు. అందునా బాలికా విద్య సామాజిక భవితవ్యానికి వారధి. అంబేడ్కర్ మార్గంలో నడుద్దాం. నూత్న సమాజాన్ని నిర్మిద్దాం.
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment