అభిప్రాయం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి ఏడు నెలల పాలన పూర్తి చేసుకుంది. పాలనపై తనదైన ముద్ర వేయ డానికి ఇది సరిపడ సమయంగానే భావించ వచ్చు. అందునా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం కాబట్టి 7 నెలలు గణనీయమైన సమయంగానే పరిగణించాలి.
ముందుగా, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల అమలు విషయానికి వస్తే పెద్దగా చెప్పుకోడానికి ఏమీలేదు. ‘నీకు 15,000... నీకు 15,000’గా పాపులర్ అయిన ‘తల్లికి వందనం’ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరానికి ఇస్తామని తాజగా ప్రకటించి మరో వాయిదా వేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ పథకం మునుపు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ‘అమ్మ ఒడి’కి పేరు మార్పు పథకం.
అంటే, ఉన్న పథకానికి తిలోదకాలు ఇచ్చి కొత్త పథకం ఇవ్వకుండా ‘అప్పు రేపు’ తరహా గోడ మీద రాత గారడీ చేయడమే! ‘దీపం’ పథకాన్ని చంద్రబాబు మార్కు చాకచక్యంతో ముందుగానే అరకొరగా అమలు చేసే ప్రణా ళిక సిద్ధం చేశారు. ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి ఇస్తాము అన్న హామీపై నోరు మెదపట్లేదు. అలాగే, ప్రతి మహిళకూ సంవత్సరానికి రూ. 18,000 ఇస్తా మంటూ చేసిన వాగ్దానమూ అటకెక్కినట్టే ఉంది.
మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉగాదికి అని వస్తున్న వార్తల్లో నిజం ఎంతో వేచి చూడాలి. రైతులకు వాగ్దానం చేసిన సంవత్సరానికి 20 వేల రూపాయల పథకం రేపో మాపో అని దాటేస్తున్నారు – ఇది కూడా గత ప్రభుత్వం ఇచ్చిన పథకమే అయినప్పటికీ వారు ఇచ్చిన రూ. 13,500 కూడా గడచిన సంవత్సరానికి ఇంకా ఇవ్వనేలేదు. వెరసి, ‘సూపర్ సిక్స్’ హమీలలో ఒక్కటి కూడా చిత్త శుద్ధితో అమలు చెయ్యలేదు అనేది సుస్పష్టం.
‘నాడు–నేడు’ పథకం ద్వారా పెక్కు ప్రభుత్వ బడులను జగన్ ప్రభుత్వం ఆధునీకరించి, మరుగుదొడ్ల నిర్వహణకై ప్రత్యేక నిధులు కేటాయించి, పిల్లలకి స్వచ్ఛమైన వాతావరణం కల్పిస్తూ అధ్యాపకులకీ, పిల్లల తల్లి–తండ్రులకీ పర్యవేక్షణ అప్పజెబితే, లోకేష్ అధ్యాపకులకు ఉపశమనం పేరిట పర్యవేక్షణ పద్ధతికి తూట్లు పొడిచారు. పేద పిల్లలకు ఇంగ్లీషు చదువు చెప్పించి విప్లవాత్మకమైన మార్పులు జగన్ తెస్తే, మాతృ భాష పేరుతో సదస్సులు పెట్టి తమ అస్మదీయులైన మాజీల నోటితో ఆ పథకానికి తెర దించే కార్యక్రమం మొదలు పెట్టారు.
బుడమేరు వరద తీవ్రతను ముందుగానే అంచనా వేయలేక పోవటం, ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించలేకపోవటంలో ప్రభుత్వ అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపించింది. అధికార లెక్కల ప్రకారంగానే 45 మంది చనిపోయారంటే ధన, ప్రాణ నష్టం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోచ్చు. ప్రభుత్వంలో ఉన్నవారే అత్యంత సున్నితమైన తిరుపతి లడ్డూ వివాదానికి తెరలేపటం చాలా దిగజారుడు చర్యగా నిలిచిపోతుంది. ఆ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన సనాతన ధర్మ పరిరక్షణ హావభావ కేళి రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక చెరగని మచ్చగా మిగిలిపోతుంది.
పవన్ కల్యాణ్ ప్రతి విషయానికీ గత ప్రభుత్వానిదే బాధ్యత అనడం ఒక రివాజుగా పెట్టుకున్నారు. అది ఎంత చవకబారు స్థాయికి చేరిందో ఇటీవల జరిగిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఈవెంట్‌కి వచ్చి రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన ఇద్దరు యువకుల ఉదంతం చెబుతుంది. కనీసం ఆ కుర్రాళ్లు చనిపోయిన రహదారి తీరు ఎలా ఉందో తెలుసుకోకుండా జగన్ రోడ్లు బాగు చేయకపోబట్టే వారు చనిపోయారు అని ఒక ఉప ముఖ్యమంత్రి అనడం సిగ్గు చేటు.
మరుసటి రోజు స్వయానా ఆయనే వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించిన చిత్రాలలో చక్కని రోడ్డు కనిపిస్తూనే ఉంది. పై పెచ్చు యువతను బైక్ స్టంట్లు చేయమని, సైలెన్సర్‌లు తీసేసి రచ్చ చేయమని ఒక సినీ వేదిక పైనుంచి పిలుపు నివ్వడం అత్యంత హేయమైన చర్య. రాష్ట్రంలో జరిగిన ప్రతిపక్ష కార్య కర్తల బహిరంగ హత్యలు, నేతల అరెస్టులు ఒక ఎత్తయితే, సోషల్ మీడియా కార్యకర్తలపై పెట్టిన వేల కొలది కేసులు బహుశా రాష్ట్ర చరిత్రలోనే కనివిని ఎరుగం.
చంద్రబాబు వాగ్దానాలు నీటిమూటలనే విషయం ఇప్పుడు కళ్ళు తెరిచి పరిశీలించగలిగే ఎవరికైనా అర్థమవుతుంది. ‘సూపర్ సిక్స్’ అని హమీ ఇచ్చిన వారికే వాటిపై విశ్వాసం లేదు అనేది ఇప్పుడు అందరికీ విదితమయ్యింది. అయితే, ఇవన్నీ తెలిసే ఈ రాష్ట్ర ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారా? సామాజిక సమీకరణాలే తప్ప ప్రభుత్వ పనితీరు కానీ, వాగ్దానాల అమలుపై నమ్మకం గానీ మన రాష్ట్రంలో ప్రాధాన్యత సంత రించుకోవా? రానున్న కాలం ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.
డా‘‘ జి. నవీన్
వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు
naveen.prose@gmail.com
Comments
Please login to add a commentAdd a comment