Girls education
-
బాలికా విద్యపై ఇంకా వివక్షా?
భారతదేశ వ్యాప్తంగా దళిత, బహుజన స్త్రీ విద్యపై తీవ్రమైన వివక్ష కొనసాగుతోంది. నిజానికి గురుకుల హాస్టల్స్‌లోనూ, జనరల్ హాస్టల్స్‌లోనూ విద్యార్థినులు నిరంతరం అనారోగ్యానికి గురి అవుతున్నారు. దీనికి కారణం పౌష్టికాహార లోపం, శుభ్రతగా ఉండే పరిస్థితుల లేమి, సరైన మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేకపోవడం. అందుకే పిల్లలు రక్త హీనతతో శక్తి లేక కళావిహీనంగా ఉంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరి సంరక్షణ విషయంలో సరైన బడ్జెట్‌ను రూపొందించ లేకపోతున్నాయి. వీరిపట్ల ఎంతో అశ్రద్ధ కనబడుతోంది. వార్డెన్స్‌ను శాశ్వతంగా నియమించకపోవడం, హాస్టల్స్‌కు సొంత భవనాలు లేకపోవడం, విద్యార్థినుల సంఖ్యకు తగినట్లుగా గదులు లేకపోవడం లాంటి ఎన్నో కారణాలు బాలికలకు మెరుగైన చదువును నిరాకరిస్తున్నాయి.తల్లిదండ్రులు వలస కూలీలుగా వెళ్తుండగా, ఇంట్లో ఆలనా పాలనా లేని జీవన వ్యవస్థలో దళిత బాలికలు ఎంతో సంక్షోభాన్ని అనుభవి స్తున్నారు. దీనికి తోడు ఉద్యోగుల దోపిడీ విధానాలు కూడా పిల్లల నోటికాడి కూడును దొంగిలించే పరిస్థితులు వచ్చాయి. ఇస్తున్న కొద్దిపాటి సామాన్లనే వార్డెన్లు పరిగ్రహించటం, రాత్రుళ్లు కనీసం గర్ల్స్ హాస్టల్స్‌లో కూడా వార్డెన్లు నిద్రించకపోవడం, విద్యార్థులను సొంత పనులకు వాడుకోవడం లాంటి ఎన్నో లొసుగులు ఉన్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు గన్‌మెన్ వెంట తిరుగుతూ ఉంటారు. బాలికల హాస్టల్స్‌కు కనీసం ఒక గార్డ్ కూడా కాపలా ఉండడు.సౌకర్యాలు కల్పించకూడదా?విద్యకు ఆహారం, వసతి ముఖ్యం. ప్రభుత్వం ప్రతి మూడు జిల్లాలకైనా ఒక స్పెషల్ కలెక్టర్‌ను వెయ్యాల్సి ఉంది. ఆయనకు కొన్ని టాస్క్ ఫోర్స్ టీములను అప్పగించాల్సి ఉంది. ఈ సంవత్సరం హాస్టళ్ళలో అత్యాచారాల సంఖ్య పెరిగింది. ప్రతి మహిళా పోలీస్ స్టేషన్‌కు ఆ ప్రాంతంలో వున్న బాలికల హాస్టల్ రక్షణ బాధ్యతను అప్ప గించాల్సి ఉంది. తెలంగాణలో ఎన్నిసార్లు గురుకుల విద్యార్థినులు కలుషిత ఆహారంతో ఆసుపత్రుల పాలయ్యారు? రెండు రాష్ట్రాల లోనూ నాసిరకం బియ్యాన్ని గురుకుల పాఠశాలలకు సరఫరా చేస్తు న్నారు. దీనికి కారణం వీళ్ళలో గూడుకుట్టుకున్న కులతత్వం అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి పథకం ఇస్తానని చెప్పి దళిత విద్యార్థుల్లో విద్య పెరుగుతుందనే ఆ పథకం మీద గొడ్డలివేటు వేశారు. అమరావతి నిర్మాణం, పోలవరం అనే పాట పాడుతూ, ప్రపంచ బ్యాంకుల నుండి అప్పులు తెస్తూ మహా నగరాన్ని నిర్మిస్తాననే మాటతో ఏపీ ముఖ్యమంత్రి ప్రజల్ని నమ్మి స్తున్నారు. దళిత బహుజన విద్యార్థుల్ని విద్యాశక్తికి పనికిరాకుండా మానసిక దౌర్భల్యానికి గురిచెయ్యాలనే పెద్ద ప్రయత్నం జరుగుతోంది. దళిత బహుజనుల జీవన వ్యవస్థల మీద దెబ్బ కొట్టాలనే ప్రయ త్నంతోనే ‘అమ్మఒడి’కి ‘తల్లి దీవెన’ అని పేరు పెట్టి దాన్ని నిర్వీర్యం చేయాలని రోజుకొక ప్రకటన చేస్తున్నారు. గిరిజనుల హాస్టళ్ళకు ఆహార, ఆహార్య, రక్షణలను కలిగించకుండా, తల్లిదండ్రులకు తమ పిల్లలను చదివించాలనే ఆసక్తిని పోగొడుతున్నారు. నిజానికి ఇది ఒక పద్ధతి ప్రకారమే అగ్రకులాధిపత్యం చేయిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇవ్వగలిగి కూడా ఇవ్వలేకపోవడా నికి కారణం ఏమిటి? తల్లిదండ్రులు వలస కూలీలుగా వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ఆటోలో 25 మంది వరకు ఎక్కి, ప్రమాదాల్లో చనిపోయి, పిల్లలు అనాథలవుతున్న స్థితి మనకు కనబడుతుంది. ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే బహుజన స్త్రీలలో మొబిలిటీ పెరుగుతుందనీ, వారు దూర ప్రాంత పనులకు వెళ్ళగలుగుతారనీ అంచనా వేసే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యాన్ని దాటవేస్తోంది.కుటుంబాల్లో సంక్షోభంఈ సందర్భంగా దళితవాడల పరిస్థితిని ఒకసారి చూద్దాం. రెండు రాష్ట్రాలలోని అన్ని జిల్లాలలో దళితవాడలు మురుగు నీరుతో, జబ్బులతో కునారిల్లుతున్నాయి. గ్రామ రాజ్యాన్ని పునరుద్ధరిస్తానంటున్న ఏపీ ఉపముఖ్యమంత్రి దళితవాడలకు ఇంతవరకు ఇళ్ళ స్థలాల విషయంగానీ, ఉపాధిని ఇచ్చే కుటీర పరిశ్రమల విషయంగానీ ఎత్తడం లేదు. దళిత వాడల్లో మద్యపానంతో పురుషులు ఎక్కువ మంది మరణిస్తూ స్త్రీలు విధవరాళ్లు అవుతున్నారు. గ్రామాలు సంక్షో భంలో, కుటుంబాలు వైరుధ్యాలతో కొట్టుమిట్టాడుతుంటే నోరు మెదపడం లేదు. దళిత బహుజన విద్యార్థినులు పేరెంట్స్ మీటింగ్‌కు పిలిస్తే సగంమంది విడిపోయిన భార్యాభర్తలు వస్తున్న విషయాలు వీరికి తెలిసి కూడా, ఈ కుటుంబ సంక్షోభం విద్యార్థుల భవిష్యత్తుపై గొడ్డలి వేటు అని తెలుసుకోలేకపోతున్నారు. రెండు రాష్ట్రాల్లో మద్యం తాగేవారి సంఖ్య విపరీతంగా పెరగడం ఎంత బాధకరమో అర్థం చేసుకోలేకపోతున్నారు.ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా స్త్రీ ఆర్థికాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం జీవగర్ర. మగవాళ్లు తాగి జుట్టు పట్టుకొని ఆడవాళ్లను, ఆఖరికి తల్లిని కూడా కొట్టి ఇళ్ళల్లోంచి తరుముతున్న దారుణాలు చూస్తున్నాం. ఈ సామాజిక సంక్షోభాన్ని ప్రభుత్వం నివారించడానికి ప్రయత్నించడం లేదు. పైగా అనేక రకాల మత్తు పదార్థాలను విచ్చల విడిగా పాఠశాల పరిసర ప్రాంతాల్లోనూ, దళిత వాడల్లోనూ అమ్ముతూ ఉన్నా కూడా ప్రభుత్వాలు కళ్ళప్పగించి చూడటం ఆశ్చర్యం వేస్తుంది.ఫూలే ఆశయాలు మరిచారా?తెలంగాణలో అయితే అసెంబ్లీలో ప్రతిపక్షం హాస్టళ్లలోని దుర్భ రమైన పరిస్థితులను ఎత్తిచూపినా ప్రభుత్వం దాటవేసే చర్యలను చేస్తున్నదే తప్ప వాటిని నిజంగా నివారించే చర్యలు చేపట్టడం లేదు. అసలు హాస్టల్స్‌లో రగ్గులు పంచి, పిల్లలను చలి నుండి కాపాడాలనే ఉద్దేశం కూడా లేకుండా జీవిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం భారతదేశంలోనే దళిత బహు జన విద్యపైన గొడ్డలివేటు పడుతోంది. దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు కోట్లకు పడగలెత్తిన వారున్నారు. కనీసం తమ నియోజక వర్గాల్లో కూడా విద్యార్థులకు దుప్పట్లు పంచడం గానీ, శక్తిమంతమైన ఆహారాన్ని కల్పించడం కోసం పాలు, గుడ్లు, పండ్లు, పప్పులు వంటివి పంచిపెట్టడం గానీ చెయ్యడం లేదు. దీనికంతటికీ కారణం వీళ్లు స్వార్థ పూరితమైన జీవితంతో మహాత్మ ఫూలే జీవితానుసరణను, ఆయన సిద్ధాంతాలను, ఆశయాలను మరచిపోయి అగ్రవర్ణాలతో సంపాదనలో పోటీ పడటమే.మహాత్మా ఫూలే 1848లోనే బ్రిటిష్ ప్రభుత్వానికి బహుజన స్త్రీల మీదే కాక మొత్తం స్త్రీలకే విద్య రావాలనే విషయం మీద ఎన్నో ఉత్తరాలు రాశారు. అంబేడ్కర్ తన జీవితం మొత్తం దళిత బహు జనుల విద్యకోసం పోరాడారు. ఆనాడు ఎలాగైతే అగ్రవర్ణాల్లో దళిత బహుజనులు చదువుకోకూడదనే దురుద్దేశం ఉండిందో, అది ఇప్పటికీ కొనసాగుతోందని అర్థం అవుతోంది. ఒక పదవ తరగతి విద్యార్థిని ఏడు సబ్జెక్టులు చదవాలంటే, పాఠాలు వినాలంటే, పరీక్షలు రాయా లంటే ఎంత శక్తి కావాలి, ఎంత ఆహారం తినాలి అని ప్రభుత్వాలకు తెలియదా! మహాత్మా ఫూలే చెప్పినట్లు మన గ్రామాలను మనమే పునర్ నిర్మించుకునే సందర్భం వచ్చింది. అంబేడ్కర్, పెరియార్ రామ స్వామి నాయకర్ స్వీయ వ్యవస్థల ద్వారా విద్య సంస్కరణలను చేసు కోవాలనీ, విద్యా వ్యవస్థలను నిర్మించుకోవాలనీ చెప్పిన విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. మన పిల్లల భవిష్యత్తుకు మనమే మార్గం వేసుకోవాలి. ముఖ్యంగా చర్చిల్లో కేవలం ప్రార్థనలే కాకుండా విద్యా బోధనలకు అవకాశం కల్పించాలని కోరాలి. దళిత బహుజన సామాజిక సంఘాలు, స్వీయ సామాజిక విద్యా పునర్జీవనం కోసం పాటుపడాలి. ఆత్మ గౌరవ పోరాటాలతోనే సమసమాజ నిర్మాణం సాధ్యం. విద్యే జీవన వ్యవస్థలకు సోపానం. విద్య మానవ వ్యక్తిత్వ వికాసానికి పునాది. విద్య మానవాభ్యుదయానికి నాంది. విద్యా పునాదుల మీదే నూత్న సమాజం రూపొందుతుంది. అందుకే అంబే డ్కర్ దళితులకు విద్యా విప్లవ నినాదాన్ని ఇచ్చారు. అందునా బాలికా విద్య సామాజిక భవితవ్యానికి వారధి. అంబేడ్కర్ మార్గంలో నడుద్దాం. నూత్న సమాజాన్ని నిర్మిద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
స్త్రీ సాధికారతపై ఇంకా గొడ్డలి వేటా?
దేశంలో, రాష్ట్రాలలో, గ్రామాలలో, స్త్రీ వ్యక్తిత్వం మీద, వారి సాధికారత మీద, వారి జీవన వ్యవస్థల మీద నిరంతర దాడులు జరుగుతూనే ఉన్నాయి. పురుష ప్రపంచం, పితృస్వామిక పాలక వర్గం స్త్రీని కోలుకోలేని దెబ్బతీస్తోంది. ముఖ్యంగా మతోన్మాద భావజాలం, మూఢాచారాల కఠినత్వం భారత దేశంలో స్త్రీల వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నాయి. ఇప్పటికీ స్త్రీకి విద్యా నిరాకరణ జరుగుతోంది. ఇంకా బాల్య వివాహాలతో తల్లిదండ్రులు బాలికల విద్యను హైస్కూల్ స్థాయిలోనే నిలువరిస్తున్నారు. ఇది భారత రాజ్యాంగం స్త్రీలకు కల్పించిన హక్కులను ఉల్లంఘించడమే! స్త్రీల ఆస్తి హక్కుని దెబ్బతీయటం వల్ల వారి వ్యక్తిత్వం మీద దాడి సులభమవుతోంది. స్త్రీ తన సాధికారత కోసం చేస్తున్న పోరాటంలో లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు కలిసి నడవాలి.సొంత తల్లిదండ్రులే బాలుడిని ఒక రకంగా, బాలికను ఒక రకంగా చూసే పరిస్థితులు ఇంకా కొనసాగడం సిగ్గుచేటు. కొన్ని సామాజిక కులాలైతే మూడు దశాబ్దాల పాటు ఆడ శిశువు భ్రూణ హత్యలకు పాల్పడ్డాయి. బాలికలను చదివించకుండా ఎదుగుతున్న మెదళ్లపై ఉక్కుపాదం మోపాయి.అక్షరాస్యతలో నుండి నిజమైన విద్యావంతులు ఆవిర్భ విస్తారు. విద్యావంతుల నుండి మేధావులుగా అభివృద్ధి చెంద డానికి ఎక్కువ అవకాశం ఉంది. స్త్రీలకు తమ శరీరాన్ని గురించిన అవగాహన, ఆరోగ్యం, తినవలసిన ఆహార పదార్థాలు, ఏ పదార్థం ఏ శక్తినిస్తుంది మొదలైన అంశాలు అక్షరాస్యత వల్ల తెలుస్తాయి. చేతివృత్తులు, వ్యాపార రంగాల్లో కూడా స్త్రీ వృద్ధి చెందడానికి అక్షరాస్యత ఉపయుక్తం అయ్యింది.స్త్రీ ఉద్యోగంలోకి ప్రవేశిస్తేనే!స్త్రీల ఆరోగ్యం సమాజ మూఢాచారాల వలన కుంటుబడి మర ణాల రేటు పెరిగింది. అయితే కేరళ, మిజోరం వంటి రాష్ట్రాల్లో స్త్రీలు విద్య, వైద్య రంగాల్లోకి చొరవగా అడుగుపెట్టిన తరువాత ఆ సమా జాల్లో పెద్ద మార్పులు వచ్చాయి. ఉపాధ్యాయులైన స్త్రీలు సమాజంతో అవినాభావ సంబంధాలు కలిగి ఉండటంతో వాళ్ళ ఆలోచన వల్ల సామాజిక స్ఫూర్తి, చైతన్యం పెరిగాయి. భర్తల వేధింపుల్ని, మానసిక హింసని మొదటిగా అడ్డుకుంది డాక్టర్లు, టీచర్లుగా ఉద్యో గాల్లో ప్రవేశించిన మహిళలే.అయితే, స్త్రీల ఆస్తి హక్కుని దెబ్బతీయటం వల్ల వారి వ్యక్తిత్వం మీద దాడి సులభమవుతోంది. ఎన్ని చట్టాలు వచ్చినా వారి ఆస్తి హక్కుకు కుటుంబ సభ్యులు, పాలకులు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. ఆడపిల్లకి ఆస్తి హక్కు కల్పించడంలో హిందూ వారసత్వ (సవరణ) చట్టం–2005 ఒక మైలురాయి వంటిదని చెప్పవచ్చు.వందల సంవత్సరాలుగా సాంప్రదాయ వాదులు, సంఘసంస్కర్తల మధ్య జరిగిన సంఘర్షణల అనంతరం ఆడపిల్లలకు ఆస్తిహక్కులు దక్కాయి. విభిన్న మతాలు, సంస్కృతులున్న మన దేశంలో ఈ ఆస్తి హక్కులన్నవి కుల, మత, ప్రాంతీయ ప్రాతిపదికపై వేరువేరుగా ఉన్నాయి. అదేకాక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఆస్తికి సంబంధించి చట్టాలు చేసే అధికారాలు ఉండటం వల్ల అటువంటి తేడాలు ఉన్నాయి. హక్కులు ఉన్నప్పటికీ...‘చట్టం దృష్టిలో అందరూ సమానులే’ అన్న ప్రాథమిక రాజ్యాంగ న్యాయసూత్రానికి విరుద్ధంగా ఆడపిల్ల ఏ హక్కులు లేకుండా పరా ధీనగా బతుకుతోంది. ఈ వివక్షను 2005 సవరణ చట్టం పూర్తిగా తొలగించిందని చెప్పవచ్చు. 1956 నాటి హిందూ వారసత్వ చట్టం ఒక సమగ్రమైన, సమాన వారసత్వపు హక్కులు కల్పించిన మొదటి చట్టం. 2005 హిందూ వారసత్వ (సవరణ) చట్టం, 1956 చట్టంలోని కొన్ని లొసుగులని తొలగించింది. స్త్రీ సర్వతోముఖాభివృద్ధికి, సాధికా రతకు సంపూర్ణ ఆస్తిహక్కు కలిగి ఉండాలని గుర్తించి, సవరణలు చేసిన సంస్కరణ చట్టం అని దీన్ని చెప్పవచ్చు. 2005 హిందూ వారసత్వ (సవరణ) చట్టం, కేంద్ర ప్రభుత్వం చేత మొత్తం దేశానికంతటికీ వర్తించేలా చేయబడిన చట్టం.దీని ప్రకారం, మగవారితో సమానంగా ఆడవాళ్లకు పుట్టుకతోనే ‘కోపార్సినరీ’ హక్కు ఉంటుంది. ఏ విధంగా కుమారునికి హక్కులు వస్తాయో, అదే విధంగా ఆడపిల్లలకి కూడ హక్కులు వస్తాయని విస్పష్టంగా పేర్కొంది. హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటా యని చెప్పింది. అలాగే వ్యవసాయ భూములలో కూడా హక్కులు యిచ్చింది. ఈ చట్ట ప్రకారం ఏ హక్కులు అడపిల్లకి వచ్చాయో, ఆ హక్కులు ఆమెకి సంపూర్ణమనీ, వీలునామా ద్వారా తన ఆస్తిని వేరొకరికి ఇవ్వడానికి, లేక అమ్ముకోవడానికి గానీ ఆమెకి పూర్తి హక్కులు ఉన్నాయని ఉద్ఘాటించింది. 1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్.టి.రామారావు ప్రభుత్వంలో వచ్చిన హిందూ వారసత్వ చట్టం అవివాహిత కుమార్తెలకు, కుమారులతో సమానంగా పూర్వీకుల ఆస్తిలో హక్కు కల్పించింది. ఆ చట్టం వచ్చేనాటికి వివాహమైన వారికి హక్కు ఇవ్వలేదు. 1985 తర్వాత వివాహం అయిన కూతుళ్ళకు కూడా ఆస్తి హక్కు ఇచ్చారు. ఇంతకు ముందు ఒక్క స్త్రీధనం మీద అంటే వివాహ సమయంలో పుట్టింటి, అత్తింటి వారు బహుమతిగా ఇచ్చే వస్తువులు, కొద్దిపాటి ఆస్తుల మీద మట్టుకే హక్కు కలిగిన ఆడపిల్ల, ఈనాడు అటు పూర్వీకుల ఆస్తిలో సోదరులతో సమానమైన ‘కోపార్సినరీ’ హక్కు, ఇటు తండ్రి వాటాలో లేక స్వార్జితంలో (వీలునామా లేని ఎడల) సమాన వాటా పొందే హక్కు పొందింది. ఈ ఆస్తిహక్కు ఆడపిల్ల సర్వతోముఖాభివృద్ధికి, సాధికారతకి తోడ్పడుతుంది. అయితే, ఆర్థికంగా ఆడపిల్లకు ఆస్తి ఇవ్వకూడదనే ఉద్దేశం అన్ని వైపులా కనిపిస్తుంది. ఇక వారికోసం, వారు వాదించుకునే చట్టాలు తేవడం కోసం ఏ పార్టీ మహిళలకు సముచితమైన సీట్లు ఇవ్వడం లేదు.అందుకే అసెంబ్లీలు, పార్లమెంటు మహిళలు తక్కువగా వుండి వెలవెలబోతున్నాయి. అంతటా నిరాశే...ఇకపోతే ఇటీవల తెలంగాణ గురుకుల పాఠశాలల్లో బాలికల అస్వస్థత చూస్తే, నన్నయ విశ్వవిద్యాలయంలో ఆడపిల్లల అన్నంలో పురుగుల విషయం చూస్తే దేశంలో అన్ని బాలికల హాస్టళ్లలో అశుభ్రమైన, అరుచికరమైన, పౌష్టికాహార రహితమైన వాతావ రణం కనబడుతోందనిపిస్తోంది. పాలక వర్గాల పితృస్వామిక పరి పాలనను విద్యార్థినుల అవస్థలు కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి.ఇక బాలికల మీద, యువతుల మీద నిరంతరం జరుగుతున్న అత్యాచారాలకు అంతం లేదు. పురుషులు, యువకులు, మద్యం,గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కామ వ్యామోహితులవు తున్నారు. ఉచ్చనీచాలు తెలియకుండా కళ్ళు కనిపించని స్థితిలో వయస్సు భేదము లేకుండా మీదికి ఉరుకుతున్నారు. ఇటీవల బాపట్ల జిల్లాలో జరిగిన, ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న అనేక ఘటనలు గుండెల్ని పిండుతున్నాయి. స్త్రీకి రక్షణ, విద్యార్థినులకు రక్షణ లేకుండా పోతోంది. రాత్రిపూట తాగి ఆ తిక్కతో ఇతర దేశాలకు భర్తలు వెళ్ళి భార్యలు ఒంటరిగా ఉన్న ఇళ్ళ మీద పడి తలుపులు పగులగొట్టి అత్యాచారాలు చేస్తున్నా, వస్తువులు తీసుకెళుతున్నా ప్రభుత్వాలు చూసి చూడనట్లుగా ఉంటున్నాయి.ఆరు సంవత్సరముల వయసు పూర్తి అగు వరకు బాల బాలికల ఆరోగ్య పరిరక్షణకు, విద్యా వసతులు కల్పించటానికి ప్రభుత్వం కృషి చేయాలని రాజ్యాంగంలోని 45వ అధికరణ చెబుతోంది. 14 ఏళ్ల వయసు వచ్చువరకు బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్య నేర్పా లన్న సూత్రం గతంలో ఈ అధికరణంలో ఉన్నది. అయితే ఆ ఆదేశిక సూత్రం ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చబడింది. అయితే కేవలం పదాల గారడీ తప్ప పరిస్థితిలో మార్పు లేదు. ఈ అధికరణను రోజూ పాలక వర్గాలు చదువుకోవాలి. ఇక, మత్తు పానీయాలను నిషేధించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అధికరణం 47 చెబుతోంది. ప్రజలను ఆరోగ్య వంతులను చేయటం ద్వారా వారి జీవన ప్రమాణాలను పెంచటం ప్రభుత్వ బాధ్యత.అయినా పితృస్వామ్య పాలక వర్గం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. తమ అభ్యున్నతి కోసం, ఆర్థిక పరిరక్షణ కోసం, రాజ్యాధి కారం కోసం స్త్రీలు చేస్తున్న పోరాటంలో లౌకికవాదులు, ప్రజా స్వామ్యవాదులు కలిసి నడవాలి.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
ఆడపిల్లల చదువుకు ఐదేళ్ల జీతం.. పెద్ద మనసు చాటుకున్న ఎంపీ
పట్నా: బాలికల విద్య కోసం ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకున్న ఆడపిల్లలు పలు రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. అయితే బాలికల విద్య కోసం ఒక ఎంపీ తన ఐదేళ్ల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు.బీహార్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ శాంభవి చౌదరి తన ఐదేళ్ల పదవీకాలంలో వచ్చే జీతాన్ని బాలికల విద్యకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) ఎంపీ శాంభవి చౌదరి తన లోక్‌సభ నియోజకవర్గం సమస్తిపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు తన మొత్తం వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న శాంభవిని అభినందించారు. అలాగే ఆమెను ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపికచేశారు. శాంభవి చౌదరి తన పదవీకాలంలో వచ్చే జీతాన్ని ‘పఢేగా సమస్తిపూర్ తో బఢేగా సమస్తిపూర్’ అనే ప్రచారం ఉద్యమంలో ఉపయోగించనున్నట్లు తెలిపారు. తనకు ప్రతినెలా జీతం రూపంలో వచ్చే డబ్బును ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసిన బాలికల కోసం వెచ్చించనున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: Guru Nanak Jayanti: కార్తీక పౌర్ణమి నాడే గురునానక్ జయంతి ఎందుకు చేస్తారంటే.. -
వెలుగు ప్రదాత: జాన్ క్రిస్టియన్ ఫ్రెడెరిక్ హయ్యర్
ఆడపిల్లలకు చదువెందుకని ప్రశ్నించే రోజుల్లో పట్టుబట్టి బాలికలకు చదువు చెప్పడానికి విద్యాలయాలు స్థాపించిన మిషనరీ జాన్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ హయ్యర్ (1793–1873). ముఖ్యంగా తెలుగునేలపై వెలుగు నింపిన మానవతామూర్తి ఆయన. జర్మనీలోని హెల్మెస్టడ్ ప్రాంతంలో 1793 జూలై 10న జన్మించిన ఈయన అమెరికా వెళ్లి ఫిలడెల్ఫియాలో వేదాంత శాస్త్రం, యూని వర్సిటీ ఆఫ్ మేరీలాండ్‌లో స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుండి వైద్య విద్యలో ఎండీ పట్టా పొందాడు. మెడిసిన్ చదివే రోజుల్లోనే సంస్కృతం నేర్చుకున్నాడు. మిషనరీగా అభిషేకం పొంది దాదాపు 300 పైగా సండే స్కూల్స్ నెలకొ ల్పాడు. హయ్యర్ చురుకుదనాన్ని గమనించిన మెకానిక్స్ బర్గ్‌కు చెందిన ‘ది సెంట్రల్ మిషనరీ సొసైటీ’ వారు భారతదేశానికి మిషనరీగా ఆయన్ని ఎంపిక చేశారు. ఆ విధంగా హయ్యర్ 1842 జూలై 31న గుంటూరు వచ్చాడు. వచ్చిన వెంటనే తెలుగు నేర్చుకుని తొలి పాఠశా లను 1842 నవంబరులో ప్రారంభించాడు. అదీ కేవలం బాలికలకు మాత్రమే. నెల గడిచేసరికి ఎని మిది మంది ముస్లిం బాలికలకు పాఠశాల ప్రవేశం కల్పించాడు. అనంతరం అన్ని వర్గాల వారికి ఏడు పాఠశాలలు నెలకొల్పి బాలికలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. 1844 నాటికి మరో ఎనిమిది పాఠశాలలు ప్రారంభించారు.ఆ కాలంలో ప్రసూతి సమయంలో సరైన వైద్యం లభించక తల్లీ–పిల్లలు మరణించేవాళ్లే ఎక్కువ. అందుకే గుంటూరు కొత్తపేటలో 1843లో ఉచిత వైద్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటుచేశాడు. 1845 నాటికి రాజమండ్రి, భీమవరంలో పాఠశాలలను నెలకొల్పాడు. ఆ పరిసర ప్రాంతాల్లోనే వైద్య శాలలు ప్రారంభించాడు. హయ్యర్ ఒక ఆదర్శమూర్తిగా దర్శనమిస్తాడు. జీవిత భాగస్వామి ఎంపికలో ఇద్దరు పిల్లలున్న మేరీగాష్ అనే వితంతువును వివాహం చేసుకుని కొత్త జీవితం కల్పించాడు. తెలుగు భాషలో మంచి ప్రావీణ్యం సంపాదించి తెలుగులోనూ కీర్తనలు రాశాడని అంటారు. తెలుగు వారికి సేవచేసి విద్య, వైద్యంతో ప్రజల గుండెల్లో నిలిచిన హయ్యర్ 1873లో 80 ఏళ్ల వయసులో పెన్సిల్వేనియాలో మరణించాడు.– ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, తెనాలి -
ఆ ఊరి పేరు ఐఏఎస్ ఫ్యాక్టరీ... స్త్రీ విద్యతో ఆ ఊరి పేరే మారింది!
ఒకప్పుడు ఆ ఊరి పేరు వినబడగానే ‘వామ్మో’ అనుకునేవారు. దొంగతనాలు, అక్రమ మద్యం వ్యాపారానికి పేరు మోసిన రాజస్థాన్‌లోని నయాబస్ గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఆదర్శ గ్రామం అయింది. అమ్మాయిల చదువుకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీనికి కారణం ఈ గ్రామానికి చెందిన మహిళలు ఐపీఎస్ నుంచి జడ్జీ వరకు ఉన్నత ఉద్యోగాలు ఎన్నో చేయడం. జడ్జీగా ఎంపికైన అభిలాష జెఫ్ విజయాన్ని ఊరు ఊరంతా సెలబ్రెట్ చేసుకుంది. ఇప్పుడు ఎంతోమంది అమ్మాయిలకు అభిలాష రోల్ మోడల్...ఒక ఇంట్లో పెద్ద ఉద్యోగం వస్తే... ఆ సంతోషం ఆ ఇంటికి మాత్రమే పరిమితమైపోతుంది. కానీ అభిలాష జెఫ్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆమె జడ్జీగా ఎంపికైన సందర్భం ఊరంతటికీ పండగ అయింది. అభిలాషను వీధుల్లో ఊరేగిస్తూ డీజే, డ్యాన్స్‌లతో ఆమె విజయాన్ని గ్రామస్థులు సెలబ్రెట్ చేసుకున్నారు. ఈ ఊరేగింపులో సంప్రదాయ రాజస్థానీ దుస్తులు ధరించిన మహిళలు ఎక్కువగా ఉన్నారు.ఈ ఊరేగింపులో పాల్గొన్న సరితా మీనా ఇలా అంటుంది... ‘మా అమ్మాయిని పెద్ద చదువులు చదివిస్తాను. ఏదో ఒకరోజు మా అమ్మాయి అభిలాషలాగే పెద్ద ఉద్యోగం చేస్తుంది’ సరితా మీనాలాగే కలలు కన్న తల్లులు, ఎన్ని కష్టాలు వచ్చినా తమ కూతుళ్లను పెద్ద చదువులు చదివిస్తామని ప్రతిజ్ఞ చేసిన తల్లులు ఆ ఊరేగింపులో ఎంతోమంది ఉన్నారు. రాజస్థాన్‌లోని నీమ్ కా ఠాణా జిల్లాలోని నయాబస్ గ్రామంలోని యువతులకు ఆ సంతోషకరమైన రోజు ఒక మలుపు.‘అభిలాషలాంటి అమ్మాయిల వల్ల ఊరికి జరిగిన మేలు ఏమిటంటే ప్రతి ఒక్కరూ తమ కూతుళ్లను పెద్ద చదువులు చదివించాలనుకుంటారు. పది చాలు, పై చదువులు ఎందుకు అనే ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది’ అంటుంది కర్ణిక అనే గృహిణి.అభిలాషకు ముందు అల్కా మీనాను కూడా ఇలాగే ఊరేగించారు. ఈ గ్రామానికి చెందిన అల్కా మీనా ఐపీఎస్ పంజాబ్‌లో డిఐజీగా విధులు నిర్వహిస్తోంది. అల్కా మీనా నుంచి అభిలాష వరకు ఎంతోమంది మహిళలు ఎన్నో అడ్డంకులను అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. విశేషం ఏమిటంటే నయాబస్ను ఇప్పుడు ‘ఐఏఎస్ ఫ్యాక్టరీ’ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఊరి నుంచి ఐఏఎస్‌లాంటి ఉన్నత సర్వీసులకు ఎంపికైన వారు కూడా ఉన్నారు.ఇప్పుడు గ్రామంలో ఎటు చూసినా అల్కా మీనా, అభిలాషలాంటి విజేతల పోస్టర్లు కలర్ ఫుల్‌గా కనిపిస్తాయి. కోచింగ్ సెంటర్ల వారు అంటించిన ఈ పోస్టర్లలో ‘ఇలాంటి విజేతలు మీ ఇంట్లో కూడా ఉన్నారు’ అని ఉంటుంది.ఈ గ్రామంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు వారి ప్రపంచంలో మాత్రమే ఉండిపోకుండా ఎప్పుడూ ఊరితో టచ్‌లో ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిల చదువుకు సంబంధించి చొరవ తీసుకుంటారు. ఒకప్పుడు ఈ ఊళ్లో ఒకే స్కూల్ ఉండేది. అమ్మాయిల సంఖ్య అంతంత మాత్రమే. ఇప్పుడు మాత్రం ‘బాలికల పాఠశాల’తో కలిసి మూడు స్కూల్స్ ఉన్నాయి.చదువు వల్ల నయాబస్ ఆదర్శగ్రామం కావడం ఒక కోణం అయితే, స్త్రీ సాధికారత మరో కోణం. చదువు వల్ల అమ్మాయిలు తమ హక్కుల గురించి తెలుసుకోవడం నుంచి ఆర్థిక భద్రత, ఉన్నత ఉద్యోగం వరకు ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పర్చుకుంటున్నారు. తమ కలలను నిజం చేసుకుంటున్నారు.ఆటల్లోనూ...ఉన్నత చదువు, ఉద్యోగాలలోనే కాదు ఆటల్లో రాణిస్తున్న వారు కూడా నయాబస్లో ఎంతోమంది ఉన్నారు. దీనికి ఉదాహరణ... సలోని మీనా. గత ఏడాది ఇండో–నేపాల్ అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో ఇరవై ఏళ్ల మీనా మూడోసారి స్వర్ణం గెలుచుకొని ఊళ్లో సంబరం నింపింది. రాబోయే ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఆడాలనేది తన లక్ష్యం అని చెబుతుంది మీనా. భవిష్యత్‌కు సంబంధించి సలోని మీనాకు భారీ ప్రణాళికలు ఉన్నాయి. ఊరు అండ ఉంది. ఇంకేం కావాలి! చదువు అనేది వజ్రాయుధం, తిరుగులేని మహా ఉద్యమం అని మరోసారి నయాబస్ గ్రామం విషయంలో నిరూపణ అయింది. ఇల్లే ప్రపంచంగా మారిన ఎంతోమంది అమ్మాయిలు చదువుల తల్లి దయ వల్ల ప్రపంచాన్ని చూస్తున్నారు. ఉన్నత ఉద్యోగాల్లో వెలిగిపోతున్నారు. -
UPSC Results 2024: టాపర్స్
ఆకాశంలో సగం అని చాటడం వేరు.. నిరూపించడం వేరు. నేటి అమ్మాయిలు చదువులో, మేధలో, సమర్థమైన అవకాశాలు అందుకోవడంలో తమ ఆకాశం సగం అని నిరూపిస్తున్నారు. యు.పి.ఎస్.సి. 2023 టాప్ 25 ర్యాంకుల్లో 10 మంది అమ్మాయిలు ఉన్నారు. మన తెలుగు అమ్మాయి అనన్య (3), రుహానీ (5), సృష్టి (6), అన్ మోల్ రాథోడ్ (7), నౌషీన్ (9), ఐశ్వర్యం ప్రజాపతి (10), మేధా ఆనంద్ (13), స్వాతి శర్మ (17), వార్దా ఖాన్ (18), రితికా వర్మ (25). వీరిలో అనన్య, సృష్టి, వార్దా ఖాన్ల కథనాలు ఇప్పటికే అందించాం. మిగిలిన ఏడుగురు ప్రతిభా పరిచయాల గురించిన ఈ కథనం. ‘స్వయం సమృద్ధి, ‘ఆర్థిక స్వాతంత్య్రం’, ‘నిర్ణయాత్మక అధికారిక పాత్ర’, ‘పరిపాలనా రంగాల ద్వారా జనావళికి సేవ’, ‘సామర్థ్యాలకు తగిన స్థానం’, ‘లక్ష్యాలకు తగిన సామర్థ్యం’... ఇవీ నేటి యువతుల విశిష్ట ఆకాంక్షలు, అభిలాషలు, లక్ష్యాలు. అందుకే దేశంలో అత్యంత క్లిష్టతరమైన సివిల్స్ ప్రవేశ పరీక్షల్లో వీరు తలపడుతున్నారు. గెలుస్తున్నారు. నిలుస్తున్నారు. యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో టాప్ 25లో పది ర్యాంకులు అమ్మాయిలు సాధించడం గర్వపడాల్సిన విషయం. మొత్తం 1016 మంది అభ్యర్థులు ఎంపిక కాగా వీరిలో అమ్మాయిలు 352 మంది ఉండటం ముందంజను సూచిస్తోంది. తల్లిదండ్రులకు భారం కాకుండా ఒకవైపు ఉద్యోగాలు చేస్తూ లేదా ఇంటి దగ్గర చదువుకుంటూ వీరిలో చాలామంది ర్యాంకులు సాధించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి టాప్ 3 ర్యాంక్ సాధించి తెలుగు కీర్తి రెపరెపలాడించింది. కోచింగ్ సెంటర్ల మీద ఆధారపడకుండా సొంతగా చదువుకోవడం ఒక విశేషమైతే, మొదటి అటెంప్ట్‌లోనే ఆమె భారీ ర్యాంక్ సాధించడం మరో విశేషం. అలాగే ఢిల్లీకి చెందిన సృష్టి దమాస్ 6వ ర్యాంక్, వార్దా ఖాన్ 18వ ర్యాంక్ సాధించి స్ఫూర్తిగా నిలిచారు. మిగిలిన ఏడుగురు విజేతల వివరాలు. రుహానీ (5వ ర్యాంకు) హర్యానాకు చెందిన రుహానీ హర్యానాలోని గుర్గావ్లోనూ ఢిల్లీలోనూ చదువుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ లెక్చరర్లు. ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన రుహానీ ‘ఇగ్నో’ నుంచి ΄ోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. 2020లో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్‌కు ఎంపికయ్యి నీతి ఆయోగ్‌లో మూడేళ్లు పని చేసింది. కాని ఐ.ఏ.ఎస్ కావడం ఆమె లక్ష్యం. మరో అటెంప్ట్‌లో ఆమె ఐ.పి.ఎస్.కు ఎంపికయ్యింది. హైదరాబాద్‌లో శిక్షణ ΄÷ందుతూ ఆఖరుసారిగా 6వ అటెంప్ట్‌లో టాప్ ర్యాంక్ సాధించింది. పేద వర్గాల ఆర్థిక స్థితిని మెరుగు పర్చడం తన లక్ష్యం అంటోంది రుహానీ. అన్మోల్ రాథోడ్ (7వ ర్యాంకు) జమ్ము నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉద్రానా అనే మారుమూల పల్లె అన్మోల్ది. తండ్రి బ్యాంక్ మేనేజర్, తల్లి ప్రిన్సిపాల్. ఇంటర్ వరకూ జమ్ములో చదువుకున్నా గాంధీనగర్‌లో బి.ఏ.ఎల్.ఎల్.బి. చేసింది. 2021లో చదువు పూర్తయితే అదే సంవత్సరం సివిల్స్ రాసింది. కాని ప్రిలిమ్స్ దాటలేక΄ోయింది. 2022లో మళ్లీ ప్రయత్నిస్తే 2 మార్కుల్లో ఇంటర్వ్యూ వరకూ వెళ్లే అవకాశం ΄ోయింది. 2023లో మూడవసారి రాసి 7వ ర్యాంక్ ΄÷ందింది. అయితే ఈలోపు ఆమె ‘జమ్ము కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్’ ΄ోటీ పరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికైంది. ఆ ఉద్యోగ శిక్షణ తీసుకుంటూనే సివిల్స్ సాధించింది.‘రోజుకు ఎనిమిది గంటలు చదివాను. చిన్నప్పటి నుంచి నాకు తగాదాలు తీర్చడం అలవాటు. రేపు కలెక్టర్‌ను అయ్యాక ప్రజల సమస్యలను తీరుస్తాను’ అంటోందామె. నౌషీన్ (9వ ర్యాంకు) ‘మాది ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్. కాని ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల అక్కడి విద్యార్థుల రాజకీయ, సామాజిక అవగాహన స్థాయి నన్ను ఆశ్చర్యపరిచి సివిల్స్ రాసేలా పురిగొల్పింది. 2020 నుంచి ప్రయత్నించి నాలుగో అటెంప్ట్‌లో 9వ ర్యాంక్ సాధించాను. చరిత్రలో ఈ రెండు ఘటనలు జరగక΄ోయి ఉంటే బాగుండేదని వేటి గురించి అనుకుంటావ్ అంటూ నన్ను ఇంటర్వ్యూలో అడిగారు– రెండు ప్రపంచ యుద్ధాలు జరక్క΄ోయి ఉంటే బాగుండేదని, ఆసియా–ఆఫ్రికా దేశాలు వలసవాద పాలన కిందకు రాకుండా ఉంటే బాగుండేదని చె΄్పాను. నా జవాబులు బోర్డ్‌కు నచ్చాయి’ అని తెలిపింది నౌషీన్. ‘ఐ.ఏ.ఎస్. ఆఫీసర్‌గా పని చేయడం గొప్ప బాధ్యత. చాలా మంది జీవితాల్లో మార్పు తేవచ్చు’ అందామె. ఐశ్వర్యం ప్రజాపతి (10వ ర్యాంకు) లక్నోకు చెందిన ఐశ్వర్యం ప్రజాపతి రెండో అటెంప్ట్‌లో 10వ ర్యాంక్ సాధించింది. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఉత్తరాఖండ్’లో చదువుకున్న ఐశ్వర్యం ఒక సంవత్సరం పాటు విశాఖపట్నం ఎల్ అండ్ టిలో ట్రయినీగా పని చేసింది. ‘నేను ఇన్ని గంటలు చదవాలి అని లెక్కపెట్టుకోని చదవలేదు. చదివినంత సేపు నాణ్యంగా చదవాలి అనుకున్నాను. నన్ను కలెక్టర్‌గా చూడాలన్నది మా అమ్మానాన్నల కల. సాధిస్తానని తెలుసుకాని ఇంత మంచి ర్యాంక్ వస్తుందనుకోలేదు. ఎవరైనా సరే తమకు ఏది నచ్చుతుందో ఆ దారిలో వెళ్లినప్పుడే సాధించాలన్న మోటివేషన్ వస్తుంది’ అని తెలిపిందామె. మేధా ఆనంద్ (13వ ర్యాంకు) ‘మా అమ్మ ఆగ్రాలో బ్యాంక్ ఉద్యోగం చేస్తుంది. కలెక్టర్ ఆఫీసు మీదుగా వెళ్లినప్పుడల్లా నా కూతురు కూడా ఒకరోజు కలెక్టర్ అవుతుంది అనుకునేది. నాతో అనేది. నా లక్ష్యం కూడా అదే. కాలేజీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి సివిల్స్ రాయాలని తర్ఫీదు అయ్యాను. సెకండ్ అటెంప్ట్‌లో 311వ ర్యాంక్ వచ్చింది. కాని నేను సంతృప్తి చెందలేదు. ప్రస్తుతం నేను నార్త్ రైల్వేస్‌లో పని చేస్తున్నాను. పని చేస్తూనే 50 లోపు ర్యాంక్ కోసం కష్టపడ్డాను. కాని 13వ ర్యాంక్ వచ్చింది. నేటి మహిళల్లోని సామర్థ్యాలు పూర్తిగా సమాజానికి ఉపయోగపడటం లేదు. వారికి ఎన్నో అడ్డంకులున్నాయి. వాటిని దాటి వారు ముందుకు రావాలి. కలెక్టర్ అయ్యాక నేను స్త్రీలు ముఖ్యభూమికగా ఆర్థిక వికాసం కోసం కృషి చేస్తాను’ అని తెలిపింది మీరట్‌కు చెందిన మేధా ఆనంద్. స్వాతి శర్మ (17వ ర్యాంకు) జెంషడ్‌పూర్‌కు చెందిన స్వాతి శర్మ తను సాధించిన 17 ర్యాంక్‌తో జార్ఖండ్‌లో చాలామంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తానని భావిస్తోంది. ‘మా రాష్ట్రంలో అమ్మాయిలకు ఇంకా అవకాశాలు దొరకాల్సి ఉంది’ అంటుందామె. అంతేకాదు కలెక్టరయ్యి దిగువ, గిరిజన వర్గాల మహిళల అభ్యున్నతికి పని చేయాలనుకుంటోంది. ‘ఎం.ఏ. ΄÷లిటికల్ సైన్స్ చదివాను. ఆ చదువే ఐ.ఏ.ఎస్. చదవమని ఉత్సాహపరిచింది. ఢిల్లీలో సంవత్సరం ఆరు నెలలు కోచింగ్ తీసుకున్నాను. రెండు మూడుసార్లు విఫలమయ్యి నాకు నేనే తర్ఫీదు అయ్యి ఇప్పుడు 17వ ర్యాంక్ సాధించాను. మా నాన్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, అమ్మ గృహిణి. బాగా చదువుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే పిల్లలు తల్లిదండ్రులకిచ్చే కానుక’ అంది స్వాతి శర్మ. రితికా వర్మ (25వ ర్యాంకు) ‘ఎన్నో సమస్యలున్న బిహార్ రాష్ట్రం కోసం పని చేయాల్సింది చాలా ఉంది. మాది పాట్నా. మా నాన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో మేనేజర్. ప్రస్తుతం మేము గుంటూరులో ఉంటున్నాం. ఢిల్లీలో బిఎస్సీ మేథ్స్ చదివిన నేను సివిల్స్ ద్వారా పేదల కోసం పని చేయాలని నిశ్చయించుకున్నాను. నాకు సాహిత్యం అంటే ఆసక్తి ఉంది. బిహార్‌లో పేదలకు భూమి సమస్య, పని సమస్య ఉన్నాయి. తక్కువ వేతనాల వల్ల పల్లెల నుంచి నిరవధికంగా వలస సాగుతోంది. కలెక్టర్‌గా నేను వీరి కోసం పని చేయాలనుకుంటున్నాను’ అని తెలిపింది రితికా వర్మ. -
విద్యాప్రవీణ
మద్యానికి బానిసై తండ్రి చనిపోయాడు. కష్టాల మధ్య పెరిగిన ప్రవీణ పశువుల కాపరిగా పనిచేసింది. కూలిపనులు చేసింది. చదువు ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఆ ఆత్మవిశ్వాసమే ప్రవీణను 23 సంవత్సరాల వయసులో సర్పంచ్‌ని చేసింది. బాలికల విద్య నుంచి స్త్రీ సాధికారత వరకు ఎన్నో విషయాలపై స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తోంది ప్రవీణ. రాజస్థాన్‌లోని పలి జిల్లా సగ్దార గ్రామానికి చెందిన ప్రవీణ తన గ్రామంలోనే కాదు చుట్టుపక్కల ఎన్నో గ్రామాల ప్రజలకు స్ఫూర్తిదాయక మహిళగా మారింది. మూడోక్లాసులో ఉన్నప్పుడు ప్రవీణను చదువు మానిపించారు. దీంతో తనకు ఇష్టమైన చదువుకు దూరం అయింది. చదువుకు దూరం అయిన ప్రవీణ పశువులను మేపడం నుంచి కూలిపనుల వరకు ఎన్నో చేసింది. రెండు సంవత్సరాల తరువాత ఆమె జీవితాన్ని మార్చే సంఘటన జరిగింది. తమ ఊరికి నలభై కిలోమీటర్ల దూరం లో ఉన్న గ్రామంలోని రెసిడెన్షియల్ స్కూల్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ (కేజీబీవి)లో చదువుకునే అవకాశం వెదుక్కుంటూ వచ్చింది. అయితే మొదట్లో కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ఒక ఫీల్డ్ వర్కర్ కృషివల్ల ఎట్టకేలకు బడిలో ప్రవీణను చేర్పించడానికి ఒప్పుకున్నారు. స్కూల్ చదువు వల్ల ఆత్మవిశ్వాసం పెరగడం మాత్రమే కాదు, ఆడపిల్లలు చదువుకోవడం వల్ల ఎంత మేలు జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకోగలిగింది ప్రవీణ. చదువు పూర్తయిన తరువాత ఒక కన్స్ట్రక్షన్ వర్కర్‌తో ప్రవీణ పెళ్లి జరిగింది. ‘చదువుకున్న అమ్మాయి’గా అత్తగారి ఇంట్లో ప్రవీణకు తగిన గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. తాను తీసుకునే నిర్ణయాలకు అండగా నిలబడేవారు. ‘సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటున్నాను’ అన్నప్పుడు అందరూ అండగా నిలబడ్డారు. కొంతమంది మాత్రం వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. అయితే అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లింది. సర్పంచ్‌గా విజయం సాధించింది. చదువు విలువ తెలిసిన ప్రవీణ సర్పంచ్ అయిన రోజు నుంచి బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇంటింటికి వెళ్లి చదువుకోవడం వల్ల ఆడపిల్లలకు కలిగే ఉపయోగాల గురించి ప్రచారం చేసేది. బాల్యవివాహాలు జరగకుండా అడ్డుకునేది. ‘అప్పుడెప్పుడో మా అమ్మాయిని చదువు మానిపించాం. ఇప్పుడు తిరిగి బడిలో చేర్చాలనుకుంటున్నాం’ అంటూ ఎంతోమంది తల్లిదండ్రులు ప్రవీణ సలహాల కోసం వచ్చేవారు. సర్పంచ్‌గా ఆడపిల్లలకు ప్రత్యేకంగా స్కూలు కట్టించింది ప్రవీణ. బాలికల విద్య కోసం పనిచేస్తున్న సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ప్రవీణ ఏదైనా గ్రామానికి వెళ్లినప్పుడు ఉపాధ్యాయులు తమ స్కూలుకు తీసుకువెళ్లి ఆడపిల్లలకు పరిచయం చేసేవారు. ‘చదువుకోకపోతే ప్రవీణ కూలిపనులు చేస్తూ ఉండిపోయేది. చదువుకోవడం వల్ల ఆమెలో ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆ ఆత్మవిశ్వాసమే ప్రవీణను సర్పంచ్‌ను చేసి పదిమందికి ఉపయోగపడే మంచి పనులు చేసేలా చేసింది. మీరు బాగా చదువుకుంటే సర్పంచ్ మాత్రమే కాదు కలెక్టర్ కూడా కావచ్చు’... ఇలాంటి మాటలు ఎన్నో చెప్పేవారు. ఆడపిల్లల చదువు కోసం పనిచేస్తున్న‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థ తమ ప్రచార చిత్రాలలో ప్రవీణ ఫొటోలను ఉపయోగించుకుంటుంది. దీంతో ఎన్నో గ్రామాలకు ఆమె సుపరిచితం అయింది. ‘ఏదైనా గ్రామానికి వెళ్లినప్పుడు స్కూల్లో చదివే అమ్మాయిలతో మాట్లాడుతుంటాను. మీ గురించి ఫీల్డ్ వర్కర్స్ మా పేరెంట్స్‌కు చెప్పి స్కూల్‌కు పంపించేలా ఒప్పించారు... అని ఎంతోమంది అమ్మాయిలు అన్నప్పుడు గర్వంగా అనిపించేది. ఆడపిల్లల విద్యకు సంబంధించి భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాను’ అంటుంది ప్రవీణ. -
Safeena Husain: ఆర్మీ ఆఫ్ జెండర్ చాంపియన్స్
పేదరికంలో పుట్టిన దిల్లీకి చెందిన సఫీనా హుసేన్ చదువును నమ్ముకొని ఉన్నత స్థాయికి చేరింది. లండన్‌లో చదువుకున్న సఫీనా అమెరికాలో ఉద్యోగం చేసింది. ఆ తరువాత మన దేశానికి తిరిగి వచ్చి పేదింటి ఆడపిల్లలు బడి బాట పట్టడానికి ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. ఎన్నో రాష్ట్రాలలో వేలాదిమంది ఆడపిల్లలు చదువుకోగలిగేలా చేసింది. తాజాగా... ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో కృషి చేస్తున్న వారికి ‘వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఫర్ ఎడ్యుకేషన్, ఖతర్’ వారు ఇచ్చే ‘వైజ్’ప్రైజ్‌కు ఎంపికైంది. ఈ ప్రైజుకు ఎంపికైన ఫస్ట్ ఇండియన్ సఫీనా హుసేన్ గురించి... ‘అబ్బాయిని స్కూలుకు పంపిస్తున్నారు కదా. మరి అమ్మాయిని ఇంటిపనులకే పరిమితం చేస్తున్నారేమిటి?’ అని అడిగినప్పుడు ఆ ఇంటిపెద్ద నవ్వుతూ ఇచ్చిన సమాధానం.... ‘ఆడపిల్లలకు చదువెందుకు. ఏదో ఒకరోజు పెళ్లి చేయాల్సిందే కదా’ ఇంచుమించు ప్రతి ఇంటి నుంచి ఇలాంటి సమాధానమే వినిపించింది. ‘ఆడపిల్లలకు విద్య’ అనే నినాదం ప్రాధాన్యతకు నోచుకోని ఎన్నో ప్రాంతాలను చూసింది సఫీనా. దీనికి పేదరికం ఒక కారణం అయితే, ఆర్థికస్థాయి బాగున్నా ‘ఆడపిల్లకు చదువెందుకు’ అనే నిర్లిప్తత మరోకారణం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటి ఆడపిల్ల బడికి వెళ్లాలనే లక్ష్యంతో ‘ఎ డ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది సఫీనా. ‘ఒక సమస్య గురించి మాట్లాడేటప్పుడు దానితో మమేకం కావాలి’ అంటున్న సఫీనాకు పేదరికం అనేది అపరిచిత సమస్య కాదు. దిల్లీలోని ఒక పేదకుటుంబంలో పుట్టింది. ఎన్నో కష్టాల మధ్య కూడా ‘చదువు’ అనే ఆయుధాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆ కుటుంబం నుంచి లండన్‌లో చదువుకున్న తొలి వ్యక్తి అయింది. లండన్ నుంచి అమెరికాకు వెళ్లి స్వచ్ఛంద సేవారంగంలో పని చేసిన సఫీనా 2005లో స్వదేశానికి తిరిగి వచ్చింది. ‘చదువుకోవడం వల్ల నేను ఎంతో సాధించాను. దేశదేశాలు తిరిగాను. చదువుకోకపోతే నా పరిస్థితి ఊహకు కూడా అందనంత దయనీయంగా ఉండేది’ అనుకున్న సఫీనా హుసేన్ పేదింటి ఆడపిల్లల చదువు కోసం తన వంతుగా ఏదైనా చేయాలనుకుంది. ప్రభుత్వ సంస్థల నుంచి వివరాలు సేకరించింది. చదువుకు సంబంధించి జెండర్–గ్యాప్ ఉన్న 26 జిల్లాల గురించి తెలుసుకుంది. అందులో తొమ్మిది రాజస్థాన్‌లో ఉన్నాయి. రాజస్థాన్‌లో ఆడపిల్లల చదువుకు దూరంగా ఉన్న ప్రాంతాలను మొదట ఎంపిక చేసుకుంది సఫీనా బృందం. గ్రామానికి చెందిన స్వచ్ఛంద సేవకులతో ‘ఆర్మీ ఆఫ్ జెండర్ చాంపియన్స్’ను ఏర్పాటు చేసి ‘దయచేసి మీ అమ్మాయిని స్కూల్‌కు పంపించండి’ అంటూ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ‘ఆడపిల్లలకు చదువు’ అనే అంశంపై గ్రామ సమావేశాలు ఏర్పాటు చేశారు. సఫీనా ఆమె బృందం కృషి వృథా పోలేదు. ఎన్నో గ్రామాల్లో ఎంతోమంది ఆలోచన తీరులో మార్పు వచ్చింది. తమ ఇంటి ఆడపిల్లలను స్కూలుకు పంపించడం ప్రారంభించారు. చాలా బడులలో ఆడపిల్లల కోసం టాయిలెట్ సదుపాయాలు లేవు. అలాంటి బడులలో ప్రత్యేక టాయిలెట్లు నిర్మించేలా చేశారు. బడిలో అకాడమిక్ పాఠాలు మాత్రమే కాకుండా లైఫ్స్కిల్స్కు సంబంధించిన పాఠాలు కూడా చెప్పేవారు. ‘ఆడపిల్లలకు చదువు దూరం కావడం అనేది ఆర్థిక సమస్యతో ముడిపడి ఉన్న అంశం కాదు. అది పితృస్వామిక భావజాలానికి సంబంధించింది. మేము పనిచేసిన కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఇంటి ఆడపిల్ల కంటే గొర్రెలు, మేకలను విలువైన ఆస్తిగా భావించడం చూశాం. ముందు వారి ఆలోచన తీరులో మార్పు తీసుకు రావాలనుకున్నాం. అది అంత తేలిక కాదని తెలిసినా రంగంలోకి దిగాం. ప్రభుత్వ సంస్థల నుంచి లోకల్ వాలెంటీర్స్ వరకు కలిసి పనిచేశాం. అయితే మేము నిరాశతో వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి రాలేదు’ అంటుంది సఫీనా. ‘ఆడపిల్లలకు చదువు అందని ప్రాంతాలు ఏమిటి?’ అనే అంశంపై ఒకప్పుడు ప్రభుత్వ సంస్థల డాటాపైన ఆధారపడిన సఫీనా బృందం ఇప్పుడు డాటా ఎనాలటిక్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలాంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. జియో–ట్యాగ్డ్ టార్గెట్ విలేజెస్ నుంచి మొబైల్ ఫోన్స్‌లో డాటా సేకరిస్తున్నారు. తమ పనితీరును మరింత మెరుగుపరుచుకొని ఉత్తమఫలితాలు సాధించడానికి వారికి ఇది ఉపయోగపడుతుంది. గతాన్ని గట్టిగా గుర్తు పెట్టుకున్న సఫీనా హుసేన్ ఎన్నో రాష్ట్రాలలో ఎంతోమంది పేదింటి అమ్మాయిల ఉజ్వల భవిష్యత్ కోసం ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ద్వారా కృషి చేస్తోంది. అయినా వెనకడుగు వేయలేదు ‘ఎడ్యుకేట్ గర్ల్స్’తో తొలి అడుగులు వేసినప్పుడు ‘మీలాగే చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు’ అని నిరుత్సాహపరిచారు కొందరు. అయితే అలాంటి మాటలను మేము సీరియస్‌గా తీసుకోలేదు. ‘ఫలితం వచ్చేవరకు మా ప్రయత్నం’ అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. బయటి వాళ్లు చెప్పే మాటల కంటే తమ ఊరి వాళ్లు చెప్పే మాటలకే గ్రామస్థులు ప్రాధాన్యత ఇస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో స్థానికులతో కలిసి ఆర్మీ ఆఫ్ జెండర్ ఛాంపియన్స్‌ను ప్రారంభించి ఆడపిల్లల విద్యకు సంబంధించి ఇంటింటి ప్రచారం నిర్వహించాం. – సఫీనా హుసేన్, ఫౌండర్, ఎడ్యుకేట్ గర్ల్స్ -
Savitribai Phule: మహిళా విద్యకు తొలి వెలుతురు
‘సావిత్రిబాయి ఫూలే ప్రతిరోజూ సంచిలో అదనంగా చీర పెట్టుకుని స్కూల్‌కు వెళ్లేవారు. దారిలో ఎవరో ఒకరు ఆమె మీద పేడ విసిరితే కడుక్కుని కట్టుకోవడానికి’ అని రాస్తుంది రీతా రామస్వామి గుప్తా. నిమ్న వర్గాల ఆడపిల్లల విద్యకు జీవితాన్ని అంకితం చేసిన సావిత్రిబాయి ఫూలేమీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. కాని రచయిత్రి రీతా రామస్వామి మరిన్ని జీవిత చిత్రాలను సేకరించి తెచ్చిన పుస్తకం ‘సావిత్రిబాయి పూలే’ తాజాగా విడుదలైంది. రీతా రామస్వామి గురించి, పుస్తకంలో ఉన్న విశేషాల గురించి... ‘ఇవాళ బాలికల విద్య అనగానే ప్రపంచానికి మలాలా పేరు గుర్తుకొస్తుంది. కాని బాలికల విద్య కోసం జీవితాన్ని అర్పించిన తొలి మహిళ సావిత్రిబాయి పూలే. మన దేశంలో ఆమె తొలి మహిళా ఉపాధ్యాయిని. ఆడపిల్లల చదువును ప్రచారం చేయడానికి ఆమె ఎదుర్కొన్న వ్యతిరేకత అంతా ఇంతా కాదు’ అంటుంది రీతా రామస్వామి గుప్తా. గతంలో నటుడు సంజీవ్ కుమార్‌పై రాసిన బయోగ్రఫీతో పాఠకులకు తెలిసిన రీతా రామస్వామి ఆ తర్వాత ‘రంగ్ దే బసంతి’ దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రాతో కలిసి అతని జీవిత సంగ్రహం రాసింది. ‘ఇలా ఇంకొన్ని పుస్తకాలు రాయాలనుకుంటుండగా నా 18 ఏళ్ల కుమార్తె– అమ్మా... ఎందుకు నువ్వు ఎప్పుడూ మగవాళ్ల గురించే రాస్తావు. నువ్వు రాయదగ్గ స్త్రీలు లేరా? అని ప్రశ్నించింది. ఆ ప్రశ్న నన్ను ఆలోచింపచేసింది. దానికి జవాబే నా కొత్త పుస్తకం– సావిత్రిబాయి పూలే.. హర్ లైఫ్.. హర్ రిలేషన్షిప్స్.. హర్ లెగసీ’ అంది రీతా రామస్వామి. హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురణ సంస్థ నుంచి ఈ పుస్తకం తాజాగా విడుదలైంది. బలహీనులకు అందని విద్య ‘బ్రిటిష్ వారు 1813లో క్రైస్తవ మిషనరీల ద్వారా మన దేశంలో పాశ్చాత్య విద్యకు అంకురార్పణ చేశారు. అయితే వారి ఉద్దేశాలు వేరే. తమ వ్యవహారాల కోసం ఇంగ్లిష్ తెలిసిన కొంతమంది ఉద్యోగులు అవసరం కనుక పై వర్గాల వారికి చదువు నేర్పిస్తే వారి నుంచి కింది వర్గాల వారికి చదువు అందుతుంది అని భావించారు. కాని పై వర్గాలకు మొదలైన చదువు కింది వర్గాల వరకూ చేరలేదు. కింది వర్గాల వారికి పాఠశాలల్లో అనుమతి లేని పరిస్థితి. అంటరానితనం విస్తృతంగా ఉండేది. ఇక చదువుకు ఆడపిల్లలు నిషిద్ధం చేయబడ్డారు. ప్రభుత్వ టీచర్లకు ఇంగ్లిష్ వచ్చి ఉండాలన్న నియమం కూడా బ్రిటిష్ ప్రభుత్వం పెట్టింది. వీటన్నింటినీ దాటి సావిత్రిబాయి పూలే టీచర్ అయ్యింది. జ్యోతిబా పూలేతో కలిసి 1848లో బ్రిటిష్‌వారితో సంబంధం లేని, మిషనరీలతో సంబంధం లేని బాలికల తొలి పాఠశాలను మొదలెట్టింది. దిగువ వర్గాల బాలికల విద్య కోసం పోరాడింది’ అంటుంది రీతా రామస్వామి. ఆ ఇద్దరు ‘సావిత్రిబాయి పూలే హర్ లైఫ్, హర్ రిలేషన్షిప్స్, హర్ లెగసీ’... పుస్తకంలో రీతా రామస్వామి కేవలం సావిత్రిబాయి పూలే గురించే రాయలేదు. ఆమెను ఆదర్శంగా తీసుకుని బాలికల విద్య కోసం తోడైన తొలి ముస్లిం ఉపాధ్యాయిని ఫాతిమా షేక్ గురించీ... సావిత్రి, ఫాతిమా కలిసి మహరాష్ట్రలో బాలికల విద్య కోసం స్కూళ్లు స్థాపించి నిర్వహించడానికి పడిన ఆరాటం గురించి కూడా రాసింది. ‘ఫాతిమ షేక్ తొలి క్వాలిఫైడ్ ముస్లిం ఉమెన్ టీచర్ మన దేశంలో. ఆమె సావిత్రిబాయి పూలేకి బాసటగా నిలిచింది. ఒక దశలో సావిత్రిబాయి సుదీర్ఘకాలం జబ్బు పడితే స్కూళ్ల నిర్వహణభారం మోసింది. ఆ వివరాలన్నీ నా పుస్తకంలో ఉన్నాయి’ అని తెలిపింది రీతా రామస్వామి. ఎన్నెన్నో అవమానాలు ‘దిగువ వర్గాల వారిలో ఆడపిల్లలకు చదువెందుకు అనే భావన విపరీతంగా ఉండేది. వాళ్లకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేసేవారు. కాని వారి ఇళ్లకు వెళ్లి బడికి పంపమని కోరేది సావిత్రి. వారు శాపనార్థాలు పెట్టేవారు. దారిన పోతూ ఉంటే రాళ్లు విసిరేవారు. దానికి తోడు పేద వర్గాల వారిని చదివిస్తున్నందుకు అగ్రవర్ణాలు కక్ష కట్టి సావిత్రిబాయి మీద పేడనీళ్లు చల్లేవారు. అందుకని ఆమె స్కూలుకు వెళుతున్నప్పుడు తన సంచిలో చీర అదనంగా పెట్టుకునేది. ఎవరైనా పేడ నీళ్లు చల్లినా వెరవకుండా స్కూలుకు వెళ్లి చీర మార్చుకుని పాఠాలు చెప్పేది. ఆమె స్ఫూర్తి నేటికీ కొనసాగడం వల్ల మన దేశంలో బాలికల విద్య గణనీయంగా పెరిగింది. చదువులో ఉద్యోగాల్లో అమ్మాయిలు గొప్పగా రాణిస్తున్నారు. వారంతా తప్పక తెలుసుకోవాల్సిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే’ అంది రీతా రామస్వామి. -
Vijaya Gupta K: విశ్రాంత జీవితమూ విలువైనదే!
ఆమె రోజుకు ఆరు గంటలు పని చేస్తారు. ఇందులో ప్రత్యేకత ఏముంటుంది? నిజమే. ఆమె వయసు డెబ్బయ్. ఇదీ ఆమె ప్రత్యేకత. తన కోసమే కాదు... సమాజానికీ పనిచేస్తారు. ‘సృజనాత్మకత మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఇష్టమైన పని దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజూ విలువైనదే... సద్వినియోగం చేసుకోవాలి’ అంటూన్న విజయాగుప్తా పరిచయం. ఇది స్క్రీన్ ఎరా. టీవీ స్క్రీన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్ ఫోన్. ఇరవై నాలుగ్గంటల్లో పద్నాలుగు గంటలు స్క్రీన్‌తోనే గడిపేస్తున్నారు. స్క్రీన్ మీద పని చేయాల్సిన ఉద్యోగులకు తప్పదు. మరి ఖాళీగా ఉంటూ సమయం ఎలా గడపాలో తెలియక స్క్రీన్‌కి అంకితమయ్యే వాళ్లు మాత్రం తప్పనిసరిగా తమ ఇరవై నాలుగ్గంటలనూ ఒకసారి విశ్లేషించుకోవాలని చెబుతున్నారు హైదరాబాద్, హిమాయత్ నగర్‌కు చెందిన విజయాగుప్తా కోట్రికె. తనకిష్టమైన వ్యాపకం కోసం ఇంట్లో ఒక గదిని వర్క్ స్టేషన్‌గా మార్చుకున్నారామె. ఎనిమిదేళ్ల వయసులో గ్రీటింగ్ కార్డు తయారు చేసిన సృజనాత్మకమైన ఆమె విజయ ప్రస్థానం ఇది. జీవితం ఇచ్చిన గిఫ్ట్ ‘‘మా నాన్న ఉద్యోగ రీత్యా నేను పుట్టినప్పుడు చెన్నైలో ఉన్నాం. ఆ తర్వాత హైదరాబాద్‌కి బదిలీ. ముగ్గురు అక్కలు, ముగ్గురు అన్నలతో మొత్తం ఏడుగురం. ఇంట్లో ఎవరూ ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండేవారు కాదు. పెళ్లి పత్రికల వెనుక ఖాళీ పేజీ మీద బొమ్మలు గీసి, పత్రిక మీద ఉండే కొన్ని బొమ్మలను కత్తిరించి అతికించి సొంతంగా గ్రీటింగ్ కార్డు తయారు చేశాను. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలతో విరామం వచ్చింది. పిల్లలు పెద్దయ్యి, నాక్కొంత విరామం వచ్చేటప్పటికి యాభై ఏళ్లు నిండాయి. అప్పుడు అనుకోకుండా ఒక వరలక్ష్మీవ్రతంలో వాళ్లిచ్చిన రిటర్న్ గిప్టులు చూసినప్పుడు నాలోని సృజనాత్మక కోణం నిద్రలేచింది. ఆ సందర్భం... జీవితం నాకిచ్చిన గిఫ్ట్ అనే చెప్పాలి. ఇక అప్పటి నుంచి రకరకాల ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాను. ఇప్పుడు రెండు వందలకు పైగా క్రియేటివ్ పీస్‌లను తయారు చేస్తున్నాను. నాకు ఎగ్జిబిషన్లకు వెళ్లడం అలవాటు. కొన్నా కొనకపోయినా సరే... ఎగ్జిబిషన్లకు వెళ్లేదాన్ని. ఏ ప్రాంతం ఏ హస్తకళలకు ప్రసిద్ధి అనేది అవగతమైంది. అలా ఉదయ్పూర్కెళ్లి అక్కడి కళాకారుల పనితీరును తెలుసుకున్నాను. నేను బీఏ హిందీ లిటరేచర్ స్టూడెంట్‌ని కావడంతో భాష సమస్య రాలేదు. మావారి సలహాతో నేను చేస్తున్న పనిని రిజిస్టర్ చేశాను. నాకు వచ్చిన ఆర్డర్లకు పని చేసివ్వడంతోపాటు పని నేర్చుకుంటామని వచ్చే మహిళలకు ఉచితంగా నేర్పిస్తున్నాను. ఇదీ రొటీన్! ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచిన తర్వాత రెండు గ్లాసుల వేడి నీటిని తాగుతాను. అరగంట వాకింగ్, మరో అరగంట డాక్టర్ సూచించిన ఎక్సర్సైజ్లు. ఎనిమిదింటికి కాఫీ లేదా టీ, ఓ గంట సేపు ఫోన్లో మెసేజ్ లు చెక్ చేసుకుని నా క్లయింట్ల నుంచి ఆర్డర్లు, ఇతర సందేహాలకు రిప్లయ్ ఇస్తాను. పదిగంటలకు వంట, పూజ పూర్తి చేసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. రెండు గంటలు విశ్రాంతి. మధ్యాహ్న భోజనం తర్వాత మా వారు బయటకు వెళ్లినప్పటి నుంచి నా గదిలో పని మొదలు పెడితే ఏడు గంటల వరకు కొనసాగుతుంది. రాత్రి ఎనిమిదిన్నరకు భోజనం. కొద్దిసేపు టీవీలో వార్తా విశేషాలు, గేమ్ షోలు కొద్దిసేపు టీవీ చూడడం పది గంటలకు నిద్ర. వారంలో మూడు రోజులు మా వాసవీ మహిళా సంఘం కార్యకలాపాలతో ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో ఉంటాను. హడావుడిగా పరుగులు ఉండవు, కానీ పనిలో ఉంటాను. మా అబ్బాయి, అమ్మాయి కూడా హైదరాబాద్‌లోనే ఉంటారు. వాళ్లు మా ఇంటికి వచ్చే ముందు ‘రేపు నీ పనులేంటమ్మా? మేము ఎప్పుడు రావచ్చు’ అని అడుగుతారు. పిల్లలు వాళ్ల ఉద్యోగాలు, వ్యాపారాల్లో, వాళ్ల పిల్లల చదువులతో బిజీగా ఉంటారు. పిల్లలు మన కోసం టైమ్ ఎప్పుడిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటే ఈ వయసులో తరచూ నిరాశ ఎదురవుతుంటుంది. అందుకే నా టైమ్‌ని సహాయం అవసరమైన బాలికల చదువు, ఉపాధి కల్పనలో నిమగ్నం చేసుకుంటాను. లాభనష్టాల్లేకుండా నడిచే బాలికల హాస్టల్ నిర్వహణ, మహిళా సంఘం కార్యకలాపాలు సంయుక్తంగా చూసుకుంటాం. సహాయం అవసరమై వచ్చిన వాళ్లకు హాస్టల్లో వసతి ఇచ్చి, మహిళా సంఘం తరఫున స్కిల్ డెవలప్మెంట్, వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇస్తాం. ఉడాన్ సర్వీస్ ఆర్గనైజేషన్‌లోనూ మెంబర్ని. దేశరక్షణలో ప్రాణాలు వదిలిన సైనికుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం పూర్తిగా అందనప్పుడు మా సంస్థ నుంచి వాళ్ల పిల్లల చదువు కోసం స్కూల్ ఫీజులు చెల్లిస్తాం. ఇదే మంచి సమయం! నా వయసు మహిళలకు నేను చెప్పగలిగిందొక్కటే... విశ్రాంత జీవితం శాపం కాదు, ఇది ఒక వరం. పిల్లలు మన మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా చూసుకోవాలని కోరుకోకూడదు. ఎవరికి వాళ్లు తమకంటూ ఒక వ్యాపకాన్ని వృద్ధి చేసుకోవాలి. పుస్తకాలు చదవడం కావచ్చు, పూజలు, సత్సంగాలు, ఆలయాల సందర్శనం... ఏదైనా కావచ్చు. మనిషికి సోషల్ లైఫ్ ఉండాలి. ఇంటినుంచి బయటకు వస్తే పరిచయాలు పెరుగుతాయి. భావ సారూప్యం కలిగిన వాళ్లతో స్నేహం ఏర్పడుతుంది. అప్పుడు జీవితంలో ప్రతిరోజూ సంతోషకరంగానే గడుస్తుంది’’ అన్నారు విజయా గుప్తా కోట్రికె. – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
రెక్కలు విరిచేస్తున్నారు..
అఫ్గానిస్తాన్‌లో చదువుకునే అమ్మాయిలు భయపడినంతా జరిగింది. ఏదో ఒక రోజు ఉన్నత విద్యకి తాము దూరమవుతామని మహిళల ఆందోళనలు నిజమయ్యాయి. యూనివర్సిటీల్లో ఇక మహిళలకి ప్రవేశం లేదని తాలిబన్లు హుకుం జారీ చేశారు. అంతర్జాతీయంగా వస్తున్న అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ, అఫ్గాన్ మహిళలు కన్న కలల్ని కల్లలు చేస్తూ వారి హక్కుల్ని నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్నారు. తాలిబన్ల తాజా ఆదేశాలను వ్యతిరేకిస్తూ కాబూల్‌లో అమ్మాయిలు నిరసన ప్రదర్శనలకి దిగితే వాటిని ఉక్కుపాదంతో అణిచివేశారు. యూనివర్సిటీల దగ్గర తాలిబన్ బలగాలు భారీగా మోహరించి అమ్మాయిలు రాకుండా అడ్డుకుంటున్నారు. గత ఏడాది అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోయాక 2021, ఆగస్టు 15న తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు మహిళలకు అండగా ఉంటామని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఈ ఏడాదిన్నర కాలంలో మహిళల పరిస్థితి మరింత దుర్భరంగా మారిపోయింది. ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమైపోతున్నారు. రోజుకో కొత్త నిర్ణయంతో తాలిబన్లు మహిళల్ని తీవ్ర నిరాశ నిస్పృహలకి గురి చేయడంతో ఎందరో కుంగుబాటు సమస్యలతో బాధపడుతున్నారు. ఉన్నత విద్యకు అమ్మాయిల్ని దూరం చేయడంపై అమెరికా తీవ్ర స్థాయిలో మండిపడింది. అఫ్గాన్‌లో తాలిబన్లు మానవీయ సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని విమర్శించింది. కాబూల్ యూనివర్సిటీ బయట అమ్మాయిలు ఏడుస్తూ, ఒకరినొకరు ఓదార్చుకుంటున్న దృశ్యాలు మనసుని పిండేస్తున్నాయి. అఫ్గాన్ మహిళల ఛిద్రమైపోతున్న బతుకు చిత్రం ఎలా ఉందో చూద్దాం. మగతోడు లేకుండా ప్రయాణాలకు నో మగతోడు లేకుండా మహిళలు ఎక్కువ దూరం ప్రయాణాలు చేయకూడదని తాలిబన్లు 2021 డిసెంబర్లో నియంత్రణ విధించారు. మహిళలు ఒంటరిగా 45 మైళ్ల కంటే ఎక్కువ దూరం వెళ్ల కూడదు. అఫ్గాన్ జనాభాలో 10% మందికి ఆస్పత్రికి వెళ్లాలంటే కనీసం రెండు గంటలు ప్రయాణించాలి. అత్యవసర సమయాల్లో కూడా మగవారు లేకపోతే మహిళలకు చికిత్స ఇవ్వడాన్ని కూడా తాలిబన్లు అడ్డుకున్నారు. బురఖా లేకపోతే రాళ్ల దాడులు బురఖా లేకుండా మహిళలు అడుగు బయటకి పెడితే కఠిన శిక్షలు విధించడం మొదలు పెట్టారు. కాబూల్ వంటి నగరాల్లో ఈ నిబంధన గట్టిగా పాటించకపోయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు బురఖా లేకుండా వస్తే వారిని ఈడ్చుకువెళ్లడం, రాళ్లతో దాడి చేయడం వంటి అనాగరిక శిక్షలు విధించారు. 45% బాలికలు డ్రాపవుట్ 2021 సెప్టెంబర్ నుంచి అఫ్గాన్‌లో సెకండరీ స్కూల్స్‌లో అబ్బాయిలకే ప్రవేశం లభిస్తోంది. ఏడో తరగతి నుంచి అమ్మాయిల ప్రవేశాలను నిషేధించారు. పాథమిక, సెకండరీ పాఠశాలల నుంచి 45% మంది అమ్మాయిలు డ్రాపవుట్ అయ్యారు. 26% అమ్మాయిల్లో కుంగుబాటు మహిళల్ని వంటింటికే పరిమితం చేయడానికి తాలిబన్లు కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో వారిని తీవ్ర నిరాశ నిస్పృహల్లోకి నెట్టేసింది. తాలిబన్ల రాక ముందున్న స్వేచ్ఛ కోల్పోవడంతో రెక్కలు తెగిన పక్షుల్లా విలవిలలాడుతున్నారు. అమ్మాయిల్లో 26% మంది మానసిక కుంగుబాటుతో బాధపడుతూ ఉంటే అబ్బాయిల్లో 16% మందికి ఆ సమస్య ఉంది. 27% అమ్మాయిలు ఆందోళన ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటే అబ్బాయిల్లో 18శాతంగా ఉంది. – సాక్షి నేషనల్ డెస్క్ -
Nishitha Rajput: 3 కోట్ల రూపాయలు సేకరించింది.. నువ్వు చల్లంగుండాలమ్మా!
Nishitha Rajput: వడోదరా, గుజరాత్... ఆరోజు నిషిత రాజ్‌పుత్ వాళ్ల ఇంటికి పని మనిషి తన కూతుర్ని తీసుకువచ్చింది. ఆ అమ్మాయి వయసు పద్నాలుగు సంవత్సరాలు. ‘ఏం చదువుతున్నావు?’ అని పలకరింపుగా అడిగింది నిషిత. ఆ అమ్మాయి సమాధానం చెప్పక ముందే వాళ్ల అమ్మ ఇలా అంది ‘ఆడపిల్లకు చదువు ఎందుకమ్మా. ఇంక రెండు సంవత్సరాలు ఆగితే పెళ్లి చేయడమే కదా...’ ఆ అమ్మాయిలో ఎలాంటి స్పందన లేదు. కళ్లలో అంతులేని అమాయకత్వం కనిపించింది. తమ బంధువులలో కూడా అమ్మాయిల చదువు గురించి పెద్దగా ఆలోచించరని పనిమనిషి చెప్పినప్పుడు... ఆ సమయంలో తనకు అనిపించింది ‘ఇలా జరగడానికి వీలులేదు’ అని. చిన్నప్పుడు స్కూల్లో, ఇంట్లో తల్లిదండ్రుల నోట విన్న ‘అన్ని దానాలలో కంటే విద్యాదానం గొప్పది’ అనే మాట తనకు బాగా నచ్చే మాట. ఎందుకంటే చదువు ఎంతోమంది జీవితాల్లో నింపిన వెలుగును తాను స్వయంగా చూసింది. కొన్ని తరాల సామాజిక స్థాయిని మార్చిన చదువు అనే శక్తిని తాను చూసింది. తమ చుట్టుపక్కల ప్రాంతాలలో 150 మంది వరకు అమ్మాయిలు బడికి దూరంగా ఉన్నారు. వారిని బడికి పంపించేలా తల్లిదండ్రులను ఒప్పించింది. ఫీజులో రాయితీ కోసం మహారాణి స్కూల్, శ్రీవిద్యాలయ....మొదలైన స్థానిక పాఠశాలల సహకారం తీసుకుంది. ఈ కృషి తక్కువ కాలంలోనే సత్ఫాలితాలు ఇవ్వడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో తన కార్యక్రమాన్ని మరింత విస్తృతపరచాలనే ఆలోచనకు వచ్చింది నిషిత. ఇందుకు నిధుల సేకరణ అనేది తప్పనిసరి. అయితే అది అంత తేలికైన విషయం కాదు అనేది తనకు తెలుసు. అనుమానాలుంటాయి... అవమానించే మాటలు వినిపిస్తాయి. తాను ఊహించినట్లుగానే జరిగింది. ‘ఎవరో ముక్కూముఖం తెలియని అమ్మాయి కోసం మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి?’ అని ఒకరంటే... ‘మేము ఇచ్చే డబ్బులు దుర్వినియోగం కావని గ్యారెంటీ ఏం ఉంది?’ అంటారు ఇంకొకరు. దీంతో నిధుల సేకరణలో పారదర్శక విధానానికి రూపకల్పన చేసింది నిషిత. అందులో ఒకటి దాతలు రాసే చెక్‌లు స్కూల్ పేరు మీద ఉంటాయి. తాము ఇచ్చే డబ్బు ఏ అమ్మాయి చదువు కోసం వినియోగిస్తున్నారు అనే దాని గురించి పూర్తి వివరాలు ఇస్తారు. ఈ విధానం మంచి ఫలితాన్ని ఇచ్చింది. కొందరు దాతలు తాము చదివిస్తున్న పిల్లల దగ్గరకు వెళ్లి స్వయంగా మాట్లాడేవారు. కేవలం డబ్బు ఇవ్వడమే కాకుండా చదువులో వారు ఎలా రాణిస్తున్నారో తెలుసుకోవడం మంచి విషయం అంటుంది నిషిత. కొందరు దాతలు పేద మహిళలకు కుట్టుమిషన్లు కొనిస్తారు. దీనివల్ల తాము ఉపాధి పొందడమే కాదు పిల్లల చదువుకు ఆసరా అవుతుంది. ‘నా భర్త ఆటో నడుపుతాడు. అయితే అప్పుల వల్ల పిల్లలను చదివించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఎవరో నిషిత గురించి చెప్పారు. వెళ్లి కలిస్తే వెంటనే సహాయం చేశారు. ఆమె చేసిన మేలు మరవలేము’ అంటుంది కృతజ్ఞతాపూర్వకంగా చంద్రిక గోస్వామి. నిషితను నిండు మనసుతో దీవించే వందలాది మందిలో చంద్రిక ఒకరు. ఒక అంచనా ప్రకారం మూడు కోట్ల రూపాయల సేకరణ ద్వారా 34,000 బాలికలు విద్యావంతులు కావడానికి సహకారం అందించింది నిషిత రాజ్‌పుత్. చదవండి: Priyanka Nanda: బాలీవుడ్లో అడుగుపెట్టాలనుకుంది.. కానీ గ్లామర్ ప్రపంచాన్ని వదిలి గ్రామానికి.. సర్పంచ్‌గా పోటీ! View this post on Instagram A post shared by Baisa Nishita Rajput (@rajputnishitabaisa) -
బాలికల చదువులకు బ్రేకులు
సాక్షి, అమరావతి: కోవిడ్‌తో విద్యారంగం తీవ్రంగా నష్టపోగా బాలికల చదువులు మరింత దెబ్బ తింటున్నాయి. పేద కుటుంబాల్లో బాలికా విద్యపై మహమ్మారి పెను ప్రభావమే చూపింది. మహిళా సాధికారితపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఇటీవల పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో బాలికల చదువులపై ఆందోళన వ్యక్తం చేసింది. బడికి వెళ్లే బాలికల్లో సగం మంది కోవిడ్ కారణంగా నష్టపోయారని పేర్కొంది. సగం మంది చదువులపై ప్రభావం.. దేశంలో పాఠశాల స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్యనభ్యసిస్తున్న బాలికలు 32 కోట్ల మంది ఉండగా 16 కోట్ల మంది చదువులపై కరోనా ప్రభావం పడినట్లు నివేదిక వెల్లడించింది. థర్డ్‌వేవ్‌లో మరింత నష్టం వాటిల్లకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించింది. డిజిటల్ బోధన.. ఆన్లైన్ తరగతులు అందుబాటులో లేక గ్రామీణ విద్యార్థులు ఎక్కువగా నష్టపోయారని పేర్కొంది. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ కంటే కౌమార దశకు సంబంధించి సెకండరీ విద్యలో బాలికలు డ్రాపవుట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. యూడైస్ ప్రకారం డ్రాపవుట్లు ఇలా.. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్) గణాంకాల ప్రకారం 2019 – 20లో జాతీయస్థాయిలో డ్రాపవుట్ల రేట్ ప్రాథమిక స్థాయిలో 1.22గా ఉండగా> ప్రాథమికోన్నత స్థాయిలో 2.96గా నమోదైంది. సెకండరీ స్థాయిలో 15.05గా ఉందని కమిటీ పేర్కొంది. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నా కౌమారదశలో విద్యార్థినులు చదువులకు దూరం కావడం ఆందోళన కలిగిస్తోందని కమిటీ పేర్కొంది. ఏపీలో ఎంతో మెరుగ్గా ఆంధ్రప్రదేశ్‌లో బాలికల చదువులపై కోవిడ్ ప్రభావం చూపినా డ్రాపవుట్ల సమస్య తీవ్రం కాకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యలు నివారించగలిగాయి. విద్యార్ధుల చదువులకు ఇబ్బంది కలగకుండా దూరదర్శన్, ఆకాశవాణి ద్వారా బోధనా కార్యక్రమాలను ప్రసారం చేయడమే కాకుండా మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేక తెరలు అమర్చిన వాహనాలను పంపి వీడియో పాఠాల సౌలభ్యం కల్పించింది. స్కూళ్ల మూతతో మధ్యాహ్న భోజన అందక నిరుపేద విద్యార్ధులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముడి సరుకులను ప్రభుత్వం ఇళ్ల వద్దకే పంపింది. పేద విద్యార్థులు చదువుకునేలా ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేసింది. జగనన్న అమ్మ ఒడితోపాటు గోరుముద్ద, విద్యాకానుక లాంటివి ఇందుకు దోహదం చేశాయి. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా యూడైస్ గణాంకాలు చూస్తే బాలికల డ్రాపవుట్ రేట్ ఎలా తగ్గిందో గమనించవచ్చు. ఇతర రాష్ట్రాల్లో డ్రాపవుట్ రేటు 2019 – 20లో పెరగ్గా ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా తగ్గుదల కనిపించడం గమనార్హం. ప్రైమరీతోపాటు అప్పర్ ప్రైమరీ, సెకండరీ స్థాయిల్లో డ్రాపవుట్ల రేట్ తగ్గుదల నమోదైంది. రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో జీరో డ్రాపవుట్ రేట్ కొనసాగుతుండగా సెకండరీలో గతంతో పోలిస్తే పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. ఇంటింటి సర్వే, ప్రోత్సాహకాలతో.. ‘‘బడికి దూరమైన బాలికల స్థితిగతులను ఇంటింటి సర్వే చేయడం ద్వారా పరిశీలించి చదువులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. ప్రత్యేకంగా బాలికల కోసం హాస్టళ్ల ఏర్పాటుతోపాటు చదువులు కొనసాగించేలా ప్రోత్సాహకాలు అందించాలి’’ – పార్లమెంటరీ కమిటీ సిఫారసు -
బాలికా విద్యపై దృష్టిపెట్టండి
వారణాసి: భావి భారత పౌరులైన బాలికల భవిష్యత్‌ను నిర్దేశించే వారి విద్యపై, నైపుణ్యాభివృద్ధిపై ప్రజలు ప్రధానంగా దృష్టిసారించాలని ప్రధాని మోదీ హితవు పలికారు. మంగళవారం వారణాసిలో సద్గురు సదాఫల్దేవ్ విహంగం యోగా సంస్థాన్ 98వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాశీలోని ఉమ్రాహాలో ఉన్న స్వర్వేద్ మహామందిర్ ఆలయంలో సద్గురు సదాఫల్దేవ్, స్వతంత్రదేవ్ మహరాజ్, విజ్ఞాన్‌దేవ్ మహరాజ్‌లకు నివాళులర్పించారు. ‘స్వాతంత్య్ర సంగ్రామంలో సద్గురు సదాఫల్దేవ్ వంటి ఎందరో సాధువులు ఎంతగానో తోడ్పాటునందించారు. కానీ, వారి కృషికి చరిత్రలో సరైన గుర్తింపు లభించ లేదు’అని మోదీ వ్యాఖ్యానించారు. ‘భారత్ అద్భుతమైంది. సమయం అనుకూ లించని వేళా సమకాలిన ప్రపంచ గతిని మార్చే అసమాన సద్గురువులు ఇక్కడ నడయాడారు. స్వాతంత్య్రోద్యమాన్ని ముందుండి నడిపించిన నేతను ‘మహాత్మా’గా ప్రపంచం కీర్తించిం ది’అని మోదీ గాంధీజీని ప్రస్తావించారు. ‘సబ్కా ప్రయాస్’స్ఫూర్తిని అందరూ స్వీకరించాలన్నారు. తమ కుటుంబంతోపాటు సమాజ బాధ్యతను తమదిగా భావించే వారు తోచినంతలో ఒకరిద్దరు నిరుపేద బాలికల విద్య, నైపుణ్యాభివృద్ధి బాధ్యతలను తీసుకో వాలన్నారు. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న వేళ.. స్వపరిపాలన ఎంత ముఖ్యమో సుపరిపాలనా అంతే ప్రధానమన్నారు. సోమవారం అర్ధరాత్రి దాటా క మోదీ కాశీ సుందరీకరణ పనులను స్వయం గా వెళ్లి పర్యవేక్షించారు. బెనారస్ రైల్వేస్టేషన్ నవీకరణ పనులపై ఆరాతీశారు. సుపరిపా లనపై 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కాశీలో చర్చించారు. -
ఉన్నత విద్యకి.. ‘ఆమె’ దూరమేనా ?
వెబ్‌డెస్క్ : స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్లు దాటినా దేశమంతటా మహిళలకు ఉన్నత విద్య అందని ద్రాక్షే అవుతోంది. బాలికలకు ప్రాథమిక విద్య అందివ్వడంలో తల్లిదండ్రులు చూపిస్తున్న శ్రద్ధ ఉన్నత విద్య దగ్గరికి వచ్చే సరికి తగ్గిపోతుంది. ముఖ్యంగా ఉన్నత విద్యకు దూరమవుతున్న అమ్మాయిల శాతం ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటోంది. ఇటీవల నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్హెచ్ఎఫ్ఎస్-5) జారీ ఫలితాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. ప్రాథమిక విద్యలో భేష్ దేశంలో ఉన్న 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సేకరించిన డేటా ఆధారంగా ఎన్హెచ్ఎఫ్ఎస్ ఈ వివరాలు ప్రకటించింది. బాల్య దశలో అమ్మాయిలను పాఠశాలకు పంపేందుకు దాదాపు దేశమంతటా ఒకే రకమైన ఉత్సాహాం కనిపిస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో బాలిలకు 90 శాతం ప్రాథమిక విద్య చదివేందుకు స్కూళ్లకు వెళ్తున్నారు. బీహార్‌లో అతి తక్కువగా 90 శాతం మంది బాలికలు ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తుంటే కేరళ, గోవా రాష్ట్రాల్లో ఇంచుమించు వందశాతం మంది బాలికలకు ప్రాథమిక విద్య అందుతోంది. అందని ద్రాక్షే ప్రాథమిక విద్యలో 90 శాతానికి తగ్గకుండా అమ్మాయిలను స్కూళ్లకి పంపిస్తున్న తల్లిదండ్రులు టెన్త్, ఇంటర్ల తర్వాత ఉన్నత విద్య అందించేందుకు ఇంకా తటపటాయిస్తూనే ఉన్నారు. గుజరాత్, అసోం, పశ్చిమబెంగాల్, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ ప్రాథమిక విద్యతో పోల్చితే కాలేజీలకు వెళ్తున్న అమ్మాయిల శాతం దారుణంగా పడిపోయింది. ముఖ్యంగా గుజరాత్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ 96.4 శాతం మంది అమ్మాయిలు ప్రాథమిక విద్యను అభ్యసిస్తే.. ఉన్నత విద్య దగ్గరికి వచ్చే సరికి కేవలం 45 శాతం అమ్మాయిలే కాలేజీ మెట్లు ఎక్కుతున్నారు. ఇదే తరహా పరిస్థితి పశ్చిమ బెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలైన అసోం, త్రిపుర, నాగాలాండ్‌లలో కూడా నెలకొంది. కేరళ భేష్ అన్నింటా ముందుటే కేరళా మహిళ అక్షరాస్యత విషయంలోనూ అదే ధోరణి కనబరిచింది. ఇక్కడ ప్రాథమిక విద్య 99.5 శాతం మంది బాలికలకు అందుతోంటే ఇంటర్ వరకు వచ్చే సరికి కొంచెం తగ్గి 98.2 శాతానికి చేరుకుంది. ఈ రాష్ట్రంలో 90.8 శాతం మంది అమ్మాయిలు డిగ్రీ ఆపై చదువులకు వెళ్లి ఉన్నతవిద్యావంతులు అవుతున్నారు. ఇంచుమించు ఇవే తరహా ఫలితాలు గోవా కూడా కనబరిచింది. పెద్ద రాష్ట్రాలతో పోల్చితే జమ్ము, కశ్మీర్, సిక్కం రాష్ట్రాలు కూడా మహిళలకు ఉన్నత విద్య అందివ్వడంలో ముందున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఉన్నత విద్యను అందివ్వడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పర్వాలేదనిపించాయి. తెలంగాణలో 98.6 శాతం మంది బాలికలు ప్రాథమిక విద్యలో చేరుతుండగా ఉన్నత విద్య దగ్గరికి వచ్చే సరికి 76.6 శాతం మంది మిగులుతున్నారు. అంటే 22 శాతం మంది ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. ఇక ఏపీలో ప్రాథమిక విద్యలో 99.1 శాతం మంది జాయిన్ అవుతుండగా ఇంటర్, డిగ్రీ దగ్గరికి వచ్చే సరికి 70.2 శాతం మంది మిగులుతున్నారు. ఇక్కడ దాదాపు 30 శాతం మంది ఉన్నత విద్య వరకు రాకుండానే డ్రాప్ అవుతున్నారు. -
Group of Seven: జి ఫర్ గ్రేట్
జి సెవన్ అంటే ‘గ్రేట్’ సెవన్ అనుకుంటాం. కాదు! ‘గ్రూప్’ సెవన్. అయితే లండన్ జి7 ఆర్థిక మంత్రుల సమావేశంలో జరిగిన తాజా నిర్ణయం గురించి వింటే ఈ దేశాలను గ్రూప్ సెవన్ కాదు, గ్రేట్ సెవన్ అనడమే కరెక్ట్ అనిపిస్తుంది. బాలికలు, మహిళల మీదే కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉందని ఏడాదిన్నరగా సర్వేలు చెబుతూ వస్తున్నాయి. సర్వేల వరకు వెళ్లక్కర్లేదు. మన చుట్టూ చూస్తేనే తెలిసిపోతుంది. ఇళ్లలో మహిళలకు పని భారం ఎక్కువైంది. ఉద్యోగాలు చేస్తున్న మహిళలు కంపెనీలకు భారమయ్యారు! బాలికల పరిస్థితి కూడా ఇంతే. బడి గంటలు పోయి, ఇంట్లో పని గంటలు వచ్చేశాయి. ఇక గృహహింస, మహిళల అనారోగ్యాలపై కుటుంబ సభ్యుల అలక్ష్యం, నిరాదరణ ఎప్పుడూ ఉన్నవే. ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయి. మొదట ఈ పరిస్థితులను చక్కబరిస్తే గానీ కరోనా పర్యవసానాలను నివారించలేమని జి7 దేశాల గుర్తించాయి. బాలికలు, మహిళల చదువు, సంక్షేమాల కోసం నిధులను, విధులను భుజానికెత్తుకున్నాయి. ఏటా జి7 దేశాధ్యక్షుల సదస్సు జరగడానికి ముందు జి7 ఆర్థిక మంత్రుల సమావేశం జరుగుతుంది. కష్టకాలంలో కలిసికట్టుగా ఉండటానికి, అభివృద్ధి చెందే దశలో ఉన్న దేశాలను గట్టెక్కించడానికి ఒక జట్టుగా ఏర్పడిన ఏడు పారిశ్రామిక, ధనిక దేశాల బృందమే జి సెవన్. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యు.కె., జపాన్. వీటితో పాటు ఐరోపా సమాఖ్య ఉంటుంది. జి సెవన్ అంటే ‘గ్రేట్’ సెవన్ అనుకుంటాం. కాదు! ‘గ్రూప్’ సెవన్. అయితే లండన్‌లో జి7 ఆర్థిక మంత్రుల సమావేశంలో తాజాగా జరిగిన నిర్ణయం గురించి వింటే ఈ దేశాలను గ్రూప్ సెవన్ కాదు, గ్రేట్ సెవన్ అనడమే కరెక్ట్ అనిపిస్తుంది. వచ్చే రెండేళ్లలో బాలికల చదువు, మహిళల ఉద్యోగాల కోసం.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సుమారు లక్షా పది వేల కోట్ల రూపాయలను సహాయంగా అందివ్వాలని ఏడు దేశాల ఆర్థిక మంత్రులు తీర్మానించారు. వారి సహాయం పొందే దేశాలలో భారత్ కూడా ఉంది. ∙∙ నలభై ఐదేళ్లుగా ఏటా జి7 సదస్సులు జరుగుతున్నాయి. ఏ సదస్సులోనూ ఇంత భారీ ఎత్తున బాలికలు, మహిళల కోసం నిధుల కేటాయింపు లేదు! పైగా ఇది విరాళం వంటి సహాయం. ఈ ఏడు సభ్యదేశాలే తమ కోశాగారం లోంచి తీసి ఇవ్వవలసి ఉంటుంది. అందుకు జి7లోని ఏ దేశమూ కాదనడం ఉండదు కానీ, ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యం మీద, వాక్సిన్లు ఆక్సిజన్ల మీద కదా ధార్మిక దృష్టి ఉండవలసింది! ఆ మాట వాస్తవమే కానీ, ఈ ఆపత్సమయంలో మిగతా కూటములలోని భాగస్వాములుగా జి సెవన్ దేశాలు తాము అందిస్తున్న సహాయ సహకారాలతో పాటు.. జి7 గ్రూపుగా ప్రస్తుత పరిస్థితుల్లో బాలికల చదువును, మహిళల ఉద్యోగాలను ప్రాధాన్యతా అంశాలుగా గుర్తించాయి! జూన్‌లో జరిగే జి 7 దేశాధ్యక్షుల సదస్సులో ఇప్పుడీ జీ7 ఆర్థిక మంత్రుల నిర్ణయానికి ఆమోదముద్ర పడిన అనంతరం నిధులు పంపిణీకి ప్రణాళిక సిద్ధం అవుతుంది. విషయం ఏంటంటే.. ఇది ఒకరు అడిగితే చేస్తున్న సహాయం కాదు. సహాయం చేయవలసిన అవసరాన్ని గుర్తించి అందిస్తున్న స్నేహ హస్తం. ఆడపిల్లలకు ఆరేళ్ల వయసు నుంచి పన్నెండేళ్ల పాటు నాణ్యమైన విద్యను అందించడం, మహిళలకు ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ సహాయం ముఖ్యోద్దేశం. జి7 దేశాల్లోని డి.ఎఫ్.ఐ.లు (డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్) ఈ నిధుల్ని సమీకరించి, ఆర్థికమంత్రిత్వ శాఖలకు సమకూరుస్తాయి. జి7 తాజా సమావేశం మరొక లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకుంది. 2026 నాటికి అల్ప, దిగువ మధ్య తరగతి ఆదాయాలున్న దేశాలలో 4 కోట్ల మంది బాలికలను పాఠశాలల్లో చేర్పించాలి. అలాగే 2 కోట్ల మంది బాలికల్ని వారి పదో ఏట కల్లా చదవడం వచ్చిన వారిలా తీర్చిదిద్దాలి. ఈ రెండు లక్ష్యాలపై కూడా జి సెవన్ మంత్రులు సంతకాలు చేశారు. ∙∙ లండన్‌లో ‘ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్’ (ఎఫ్.సి.డి.వో.) అని విదేశీ ఆర్థిక వ్యవహారాల కార్యాలయం ఒకటి ఉంది. జి7 దేశాల ఆర్థిక మంత్రుల సమన్వయంతో అది పని చేస్తుంది. డబ్బును తెలివిగా ఇన్వెస్ట్ చేసే విషయాన్ని ఎఫ్.సి.డి.వో.నే అడగాలి ఏ దేశమైనా! బాలికల చదువు మీద పెట్టుబడి పెట్టడం వివేకవంతమైన పని అంటుంది ఎఫ్.సి.డి.వో.! ‘‘దేశంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు, దేశ ఆర్థికాభివృద్ధికి వివిధ మార్గాలలో పెట్టుబడులు పెడుతుంటాం. అవి ఎంతవరకు ఫలిస్తాయో, ఎప్పటికి ఫలవంతం అవుతాయో కచ్చితంగా చెప్పలేం. కానీ బాలికల చదువు కోసం ఒక దేశం పెట్టే పెట్టుబడి మాత్రం నమ్మకంగా ఆ దేశంలోని పేదరికాన్ని రూపుమాపుతుంది. ఆ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది’’ అని ఎఫ్.సి.డి.వో. జి7 మంత్రుల తీర్మానానికి మద్దతు పలికింది. ‘నువ్వొక బాలుడిని చదివిస్తే అది అతడికే ఉపయోగం. ఒక బాలికను చదివిస్తే మొత్తం దేశానికే ప్రయోజనం’ అని జేమ్స్ ఎమ్మెన్ అన్న మాటను గుర్తుకు తెచ్చేలా ఈసారి జి7 మంత్రుల నిర్ణయాలు ఉన్నాయి. సోమవారం ప్రారంభమైన ఈ సమావేశాలు ‘గర్ల్స్ ఎడ్యుకేషన్ పొలిటికల్ డిక్లరేషన్’పై ఏడు దేశాలూ సంతకాలు చేయడంతో బుధవారం ముగిశాయి. కరోనా చీకట్లలో కాంతి కిరణం: బాలికల చదువుకు, మహిళల ఉపాధికి జి7 దేశాల లక్షా పది వేల కోట్ల రూపాయల తీర్మానం -
30 వేలమంది అమ్మాయిలకు విద్యాదానం
‘అమ్మాయిలను విద్యావంతులను చేయండి’ అనే నినాదంతో పాటు వారి చదువు కోసం 12 ఏళ్లలో 3.25 కోట్ల నిధిని సమీకరించి, అవసరమైన వారికి అందజేసింది. తన పెళ్లికోసం జమ చేసిన డబ్బు ను కూడా నిరుపేదల చదువుకోసం కేటాయించింది 28 ఏళ్ల నిషితా రాజ్‌పుత్ వడోదర. ‘నా జీవితం పేద అమ్మాయిలను విద్యావంతులను చేయడానికే అంకితం’ అంటున్న నిషిత ఉంటున్నది గుజరాత్. ఆర్థిక లేమి కారణంగా అమ్మాయి ల చదువులు ఆగిపోకూడదన్న ఆమె ఆశయం అందరి అభినందనలు అందుకుంటోంది. ఈ సంవత్సరం 10 వేల మంది బాలికలకు ఫీజులు కట్టి, వారికి ఉన్నత విద్యావకాశాలను కల్పించిన నిషిత 2010లో 151 మంది అమ్మాయిలకు ఫీజులను కట్టడంతో ఈ సాయాన్ని ప్రారంభించింది. ప్రతి యేడాది ఈ సంఖ్యను పెంచుతూ వస్తోంది. గుజరాతీ అయిన నిషిత ఇప్పటి వరకు దాదాపు 30 వేల మంది అమ్మాయిల ఉన్నత విద్యకు ఫీజులు చెల్లించింది. తండ్రి సాయంతో .. ‘నా 12 ఏళ్ల వయస్సులో, నా క్లాస్మేట్ ఒక అమ్మాయి సడన్‌గా స్కూల్ మానేసింది. తను డబ్బు లేక చదువు ఆపేసిందనే విషయం చాలా రోజుల వరకు నాకు తెలియలేదు. ఆ పరిస్థితి మరి ఏ పేద అమ్మాయికీ రాకూడదనుకున్నాను. నా ఆశయానికి మా నాన్న నాకు అండగా నిలిచారు’ అని చెప్పింది నిషిత మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందన్న ప్రశ్నకు సమాధానంగా. నిషిత తండ్రి గులాబ్ సింగ్ వ్వాపారి. తండ్రి సాయంతో మొదట్లో తనకు తెలిసిన అమ్మాయిలకు ఫీజులు చెల్లిస్తూ ఉండేది. సంఖ్య పెరుగుతున్న కొద్దీ డబ్బు అవసరం మరింత పెరుగుతుందని అర్థం అయాక, తెలిసినవారి ద్వారా నిధులను సేకరించడం మొదలుపెట్టింది. అలా ఇప్పటి వరకు దాదాపు 30 వేల మంది అమ్మాయిలకు ఫీజులు చెల్లించింది. ఈ సంవత్సరం 10,000 మంది అమ్మాయిలకు ఫీజులు ఏర్పాటు చేసింది. పెళ్లికి దాచిన డబ్బు చదువులకు.. అమ్మాయిల చదువుకు అవసరమైనప్పుడు తన పెళ్లి కోసం దాచిపెట్టిన లక్షన్నర రూపాయలను 21 మంది అమ్మాయిల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. నిరుపేద అమ్మాయిల చదువుకు ఫీజు చెల్లించడమే కాకుండా, వారికి స్కూల్ బ్యాగులు, పుస్తకాలు,. పండుగ సందర్భాలలో బట్టలు అందజేస్తుంది. టిఫిన్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి, మహిళలకు ఉపాధిని ఇచ్చింది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులకు ఉచితంగా టిఫిన్లు పెట్టే సదుపాయాన్ని కల్పించింది. నిషిత చేసే సేవలో దేశంలోని ప్రముఖులు మాత్రమే కాదు, అమెరికన్ సంస్థలు కూడా జత చేరాయి. ఒక్క అడుగుతో నిషిత మొదలుపెట్టిన ఈ విద్యాదానానికి ఇప్పుడు ఎన్నో అడుగులు జత కలిశాయి. ‘ఈ విద్యాయజ్ఞంలో మేము సైతం...’ అంటూ కదలివస్తున్నాయి. నిషిత లాంటి యువత చేసే మంచి ప్రయత్నాలు ఎంతోమందికి జ్ఞానకాంతిని చూపుతూనే ఉంటాయి. -
విద్యతోనే బాలికల సంరక్షణ
యూనివర్సిటీక్యాంపస్: ‘‘విద్యద్వారానే బాలికల సంరక్షణ సాధ్యమవుతుంది. చదువులేని లోకం చంద్రుడు లేని ఆకాశం లాంటిది. బాలికలు చదువుపైనే పూర్తిస్థాయి దృష్టిసారించాలి. చదువులో విజయం సాధిస్తే ఉన్నత స్థానాలకు చేరుకోగలరు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. అవి ఓటమివైపు పయణింపజేస్తాయి. ద్వేషం, గర్వం, కోపం తదితర గుణాలకు దూరంగా ఉండాలి. కష్టపడి పనిచేస్తే విజయం సాధించగలం. ఇందుకు నా జీవితమే ఉదాహరణ. నేను ఎనిమిదో ఏటనే పదో తరగతి పూర్తి చేయగలిగాను. 13వ ఏట డిగ్రీ, 15 సంవత్సరాలకు పీజీ పూర్తిచేశాను. ఇండియా తరఫున ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ పోటీలకు ఎంపికైన తొలి యువతిని. అమ్మ ఒడినే బడిగా చేసుకుని ఈస్థాయికి ఎదగలిగాను. బాలికల సంరక్షణ అందరి బాధ్యత’’–నైనాజైశ్వాల్, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్, క్రీడాకారిణి -
వారి గుండెల్లో వణుకు మొదలైంది: మలాల
ఇస్లామాబాద్: బాలిక చేతిలో పుస్తకం మత చాందస వాదులకు వణుకు పుట్టిస్తోందని, అందుకనే పాఠశాలలు తగులబెడుతున్నారని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాల యూసఫ్ జాయ్ (21) మండిపడ్డారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్–బాల్టిస్తాన్‌లో గుర్తుతెలియని ఉగ్రవాదులు గురువారం 12 స్కూళ్లను తగలబెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ఆరు బాలికల పాఠశాలలే ఉన్నాయి. ధ్వంసమైన పాఠశాలలను తిరిగి పునరుద్ధరించాలని ఆమె పిలుపునిచ్చారు. భయానికి వెరవకుండా దేశంలోని బాలబాలికలు బాగా చదువుకొని.. విద్య తమ హక్కు అని మత జాఢ్యంలో మునిగితేలుతున్న తీవ్రవాదులకు తెలియజెప్పాలని ఆకాక్షించారు. కాగా, ఉగ్రవాదుల చేతిలో దాడికి గురైన పాఠశాలల్లో ఎక్కువగా నిర్మాణ దశలో ఉన్నవేనని దియామిర్ డివిజన్ పోలీసు కమిషనర్ అబ్దుల్ వహీద్ షా తెలిపారు. The extremists have shown what frightens them most - a girl with a book. We must rebuild these schools immediately, get the students back into their classrooms and show the world that every girl and boy has the right to learn. https://t.co/99J7ZivafC — Malala (@Malala) August 3, 2018 బాలికా విద్యకై ప్రాధాన్యమిస్తాం: ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ కాబోయే ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పాఠశాలల విధ్వంసంపై స్పందించారు. ‘విద్యాలయాలపై ఉగ్ర దాడిని ఖండిస్తున్నాను. ఇలాంటి పిరికిపంద చర్యలను సహించబోను. త్వరలో కొలువుదీరే మా ప్రభుత్వం.. విద్యావ్యవస్థ పటిష్టానికి ప్రాధాన్యం ఇస్తుంది. ముఖ్యంగా బాలికా విద్యకై కృషి చేస్తాం’అన్నారు. ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. పాఠశాలల వద్ద గట్టి భద్రత కల్పిస్తామని అన్నారు. Shocking & condemnable torching of schools in GB, more than half of them girls' schools.This is unacceptable & we will ensure security for schools as we are committed to focusing on education, esp girls' education which is integral to Naya Pakistan. https://t.co/lSlQDjSkeS — Imran Khan (@ImranKhanPTI) August 3, 2018 -
మలాలాతో టెక్ దిగ్గజం భాగస్వామ్యం
టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ బాలికల విద్యకు ప్రోత్సాహం ఇచ్చే దిశగా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇందుకోసం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ నాయకత్వంలోని ది మాలాలా ఫండ్‌కు భారీ మద్దతు ఇవ్వనున్నట్టు సోమవారం తెలిపింది. బాలికల విద్యకు, సమానత్వానికి విశేషంగా కృషి చేస్తున్న మలాలా ఫండ్ సేవలకు విస్తరణకు ఈ పార్టనర్షిప్ తోడ్పడనుంది. అంతేకాదు మలాలాతో భాగస్వామ్యం కుదుర్చుకున్న తొలి టెక్ సంస్థ కూడా ఆపిల్‌నే. అలాగే మలాలా ఫండ్ లీడర్షిప్ కౌన్సిల్లో ఆపిల్ సీఈవో టిమ్ కుక్ కూడా చేరనున్నారు. ప్రతి బాలిక పాఠశాలకు వెళ్లే అవకాశాన్ని కల్పించాలనే మలాలా యూసఫ్ జాయ్ నిబద్ధతలో తాము కూడా భాగస్వామ్యులు కావాలని నిర్ణయించామని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఒక ప్రకటనలో తెలిపారు. ''మలాలా బాలికా విద్య, సమానత్వం కోసం పనిచేస్తున్న ధైర్యం గల న్యాయవాది. మన కాలంలో చాలా ఉత్తేజకరమైన వ్యక్తులలో ఆమె కూడా ఒకరు. ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిల సాధికారిత కోసం ఆమె చేస్తున్న ముఖ్యమైన పనిలో భాగం కావడం సంతోషంగా ఉంది. మనల్ని ఏకం చేయడంలో విద్య గొప్ప సమానమైన శక్తి అని నమ్ముతాం'' అని కుక్ పేర్కొన్నారు. 2013 నుండి, 12 సంవత్సరాల వరకు ఉచిత, సురక్షితమైన, నాణ్యమైన విద్య ప్రతి అమ్మాయి హక్కుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న , ప్రైవేటు, ప్రభుత్వాలు, ఇతర సంస్థలు భాగస్వామ్యంతో మలాలా ఫండ్ పని చేస్తోంది. 130 మిలియన్ల మందికిపైగా బాలికలు పాఠశాలలో దూరంగా ఉండడం వారి కృషి ప్రాముఖ్యతను మరింత పెంచిందని కుక్ వ్యాఖ్యానించారు. అటు ఆపిల్ భాగస్వామ్యంపై మలాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి అమ్మాయి తన సొంత భవిష్యత్తును ఎన్నుకోవడమే తన కల అని ఆమె పేర్కొన్నారు. -
గూడు లేని బడి!
ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా తరగతి గదుల్లేక అవస్థలు - 3 వేల ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులకు ఒకే గది - మరో 6 వేల స్కూళ్లలో 2 గదులతోనే సరి - ఒక్క గదీ దిక్కులేని స్కూళ్లు 68 - చెట్ల కిందే చదువులు.. వర్షమొస్తే సెలవులు - గోడలే బ్లాక్ బోర్డులు.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేవు. దాంతో వరండాలు, చెట్ల కిందే బోధించాల్సి వస్తోంది. పాఠశాలల్లో మౌలిక సదుపా యాల కల్పనకు దాదాపు 20 ఏళ్లుగా ఎన్నో పథకాలను అమలుచేస్తున్నా ఈ పరిస్థితి ఉండడం ఆందోళనకరం. మౌలిక సదుపాయాల కోసం డిపెప్, సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) వంటి పథకాల కింద వేల కోట్ల రూపాయలు వెచ్చించినా విద్యార్థులకు నీడ కల్పించలేకపోతున్నారు. అంతేకాదు ఏటా ఎస్ఎస్ఏ కింద రూ.2 వేల కోట్లు, ఆర్‌ఎంఎస్‌ఏ కింద రూ.500 కోట్లు వెచ్చిస్తున్నా అవసరమైన చోట తరగతి గదులను నిర్మించడం లేదు. దీంతో వర్షాకాలం మొదలైందంటే పాఠశాలలకు సెలవులు తప్పడం లేదు. అవసరమైన చోట మాత్రం లేవు రాష్ట్రంలో 18 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. 68 స్కూళ్లకు ఇప్పటికీ ఒక్క తరగతి గది కూడా లేకపోవడం గమనార్హం. వాస్తవానికి ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు ఐదు గదులు ఉండాలి. కానీ అలాంటివి కేవలం 2,207 మాత్రమే ఉన్నాయి. ఒక్క గది ఉన్న స్కూళ్లు 2,992 ఉండగా, 2 గదులున్న స్కూళ్లు 6,362, మూడు గదులున్నవి 2,918, నాలుగు గదులున్న స్కూళ్లు 1,937 ఉన్నాయి. ఇక అవసరమైన ఐదు గదుల కంటే ఎక్కువ సంఖ్యలో గదులున్న స్కూళ్లు 1,678 ఉండటం గమనార్హం. ఉన్నత పాఠశాలల్లోనూ అంతే.. ప్రాథమిక పాఠశాలలే కాదు ఉన్నత పాఠశాలల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధుల ఒత్తిడితో అవసరం లేని చోట ఇష్టానుసారం తరగతి గదులను మంజూరు చేసిన అధికారులు... అవసరమున్న చోట మాత్రం అదనపు తరగతి గదులను నిర్మించలేదు. దాంతో తరగతి గదుల కొరత ఉన్న హైస్కూళ్లు వేలల్లో ఉన్నట్లు విద్యాశాఖ అంచనా. ఇందుకు ఉదాహరణ నల్లగొండ జిల్లా మునుగోడు ఉన్నత పాఠశాల. 50 ఏళ్ల కింద నిర్మించిన ఈ పాఠశాల ప్రస్తుతం కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. అందులో 420 మంది విద్యార్థులు చదువుతున్నా 4 తరగతి గదులు మాత్రమే బాగున్నాయి. పది తరగతులకు కనీసంగా పది గదులు ఉండాల్సి ఉన్నా.. అదనపు గదుల నిర్మాణాన్ని పట్టించుకోవడమే లేదు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వంటి ప్రముఖులు చదువుకున్న ఈ స్కూళ్లో ఉన్న నాలుగు గదుల్లో నాలుగు తరగతులు, ఆరుబయట ఐదు తెలుగు మీడియం, ఐదు ఇంగ్లిషు మీడియం తరగతుల బోధనను కొనసాగించాల్సి వస్తోంది. అదేకాదు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరు నాగారం జెడ్పీ ఉన్నత పాఠశాలదీ అదే పరిస్థి«తి. అక్కడ మొత్తం 545 మంది విద్యార్థులుండగా.. సరిపడ గదుల్లేవు. వాస్తవానికి 16 గదులున్నా.. 8 గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. మిగతా 8 గదులే విద్యా బోధనకు అనువుగా ఉండటంతో ఆరుబయట కూడా బోధన కొనసాగించాల్సి వస్తోంది. భద్రాద్రిలో అధికం.. విద్యాశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఒక్క తరగతి గదీ లేని ప్రాథమిక పాఠశాలలు 68 ఉండగా.. అందులో 13 స్కూళ్లు భద్రాద్రి జిల్లాలోనే ఉన్నాయి. మహబూబాబాద్‌లో 9 పాఠశాలలు, జనగాం, రంగారెడ్డి జిల్లాల్లో 6 చొప్పున ఒక్క తరగతి గదీలేని స్కూళ్లున్నాయి. ఇక ఒక్క తరగతి గదితోనే కొనసాగుతున్న స్కూళ్లు అత్యధికంగా నల్లగొండలో 236 ఉండగా, మహబూబ్‌నగర్ జిల్లాలో 196, మహబూబాబాద్ జిల్లాలో 180 స్కూళ్లు ఉన్నాయి. భద్రాద్రిలో 141, రంగారెడ్డిలో 137 స్కూళ్లు ఒక్క తరగతి గదితోనే కొనసాగు తున్నాయి. 2 గదులతో కొనసాగుతున్న పాఠశాలలు అత్య«ధికంగా నల్లగొండ జిల్లాలో 382 ఉండగా, భద్రాద్రిలో 371, మహబూబా బాద్‌లో 319, మహబూబ్‌నగర్‌లో 311, ఖమ్మంలో 306, జయ శంకర్ జిల్లాలో 270 పాఠశాలలు ఉన్నాయి. ఇక మూడు గదులున్న పాఠశాలలు అత్యధికంగా నల్లగొండలో 223, సంగారెడ్డిలో 171, సూర్యాపేటలో 138, ఖమ్మంలో 134, భద్రాద్రిలో 131 స్కూళ్లున్నాయి. నాలుగు తరగతి గదులున్నవి అత్యధికంగా రంగారెడ్డిలో 121, సూర్యాపేటలో 109 స్కూళ్లు ఉన్నాయి. ఇక ఐదు తరగతి గదులున్న పాఠశాలలు అత్యధికంగా నిజమాబాద్‌లో 140 ఉండగా, సిద్దిపేటలో 123 ఉన్నాయి. ఐదు కంటే ఎక్కువ తరగతి గదులున్న స్కూళ్లు అత్య«ధికంగా హైదరాబాద్‌లో 153, సంగారెడ్డిలో 121, రంగారెడ్డిలో 111 ఉన్నాయి. బాలికల విద్యకు నిధులు పెంచాలి కేంద్రానికి కేబ్ సబ్‌కమిటీ సూచన సాక్షి, హైదరాబాద్: దేశంలో విద్యను ముఖ్యంగా బాలికల విద్యను ప్రోత్సహించేం దుకు కేటాయింపులు పెంచాల్సిన అవసర ముందని కేబినెట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ (కేబ్) సబ్ కమిటీ అభిప్రాయప డింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చైర్మన్‌గా ఈ సబ్ కమిటీ గువహటిలో రెండో సమావేశం శుక్రవారం జరిగింది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ప్రాముఖ్యం గురించి ఈ సమావేశంలో చర్చించారు. ప్రస్తు తం కేజీబీవీలకు 8వ తరగతి వరకే కేంద్రం ఆర్థిక సాయం అందిస్తోందని, వీటిని 12వ తరగతి వరకు విస్తరించి కేంద్రమే పూర్తిగా ఆర్థిక సాయం చేయాలని ప్రతిపాదించింది. బాలికల కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో అధ్యయనం చేయాల్సిన అసవర ముందని అభిప్రాయపడింది. పాఠశాలల్లో టాయిలెట్స్ లేకపోవడం వల్ల కూడా డ్రాపౌట్స్ పెరుగుతున్నాయని పేర్కొంది. బాలికలకు హెల్త్ చెకప్ చేయించి హెల్త్ కార్డులందించాలని, హెల్త్ కిట్లు ఇవ్వాలని సూచించింది. వచ్చే నెలలో ఢిల్లీలో బాలికల విద్య, ఆరోగ్యం, భద్రతపై పనిచేస్తున్న వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పాఠశాలల్లో బాలిక సంఖ్య తగ్గడానికి గల కారణాలు క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు సీనియర్ అధికారులతో ఓ కమిటీ నియమించాలని నిర్ణయించింది. సమావేశంలో అసోం మంత్రి హేమంత బిస్వా శర్మ, జార్ఖండ్ మంత్రి నీరా యాదవ్, సభ్య కార్యదర్శి కేంద్ర మానవ వనరుల శాఖ అదనపు కార్యదర్శి రీనారాయ్, తెలంగాణ విద్యాశాఖ స్పెషల్ సీఎస్ రంజీవ్ ఆర్ ఆచార్య, కేంద్ర పాఠశాల విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సావిత్రి పాల్గొన్నారు. -
మారాలి.. మార్చాలి
► స్వశక్తితో రాణించాలి ► అప్పుడే సాధికారత సాధ్యం ► స్త్రీ శిశు సంక్షేమానికి పెద్దపీట ► కలెక్టర్ భారతి హోళికేరి సాక్షి, మెదక్ : ఎవరో వస్తారని ఎదురుచూడకుండా మహిళలు స్వశక్తితో అన్నిరంగాల్లో రాణించేందుకు పట్టుదలతో కృషి చేయాలని అప్పుడే సంపూర్ణ మహిళా సాధికారత సాధ్యం అవుతుందని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మహిళాదినోత్సవం పురస్కరించుకుని ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ జిల్లాలోని మహిళలందరికీ శుభాకాంక్షలు మాట్లాడుతూ జిల్లాలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె మాటల్లో.. ‘బి బోల్డ్ ఫర్ ఛేంజ్’ అన్న నినాదంతో మహిళలు ముందుకు సాగాలి.. మెదక్ జిల్లాలో యాభై శాతానికిపైగా మహిళలు ఉన్నారు. వీరిని విస్మరించి జిల్లా, రాష్ట్ర అభివృద్ధి సాధించలేం. మహిళలను భాగస్వాములను చేసినప్పుడే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుంది. జిల్లాలోని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. ఇందుకోసం ఎవరికి వారే ప్రేరణ పొందుతూ, ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటూ తాము ఎన్నుకున్న రంగాల్లో ఎదగాలి. ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. కలెక్టర్‌గా జిల్లాలోని మహిళా శిశు సంక్షేమానికి పెద్దపీట వేయటం జరుగుతుంది. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల విషయంలో. ప్రతి విద్యార్థిని చదివేలా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో 8, 9, 10 తరగతి విద్యార్థులకు స్వఛ్చంద సంస్థల ద్వారా ఉన్నతవిద్యలో రాణించేందుకు అవసరమన శిక్షణ అందజేస్తాము. ఏప్రిల్‌లో ప్రత్యేక శిక్షన తరగతులు నిర్వహించాలనుకుంటున్నాము. ప్రసవాలు వందశాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేలా చర్యలు చేపడుతున్నాం. కౌడిపల్లి పీహెచ్సీలో ప్రయోగాత్మకంగా వందశాతం ప్రసవాలు నార్మల్ ప్రసవాలు జరిగేలా చూస్తున్నాము. ఇది క్రమంగా మెదక్ జిల్లా అంతటా అమలు చేస్తాము. బాలికా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. మహిళలకు సంబంధించి విద్య, వైద్య రంగాల్లో రాణించేలా చూస్తున్నాం. మహిళా రైతులు ఎదిగేందుకు చర్యలు చేపడుతున్నాం. త్వరలో సేంద్రియ వ్యవసాయం, ఆహార ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై శిక్షణ ఇప్పించనున్నాం అని అన్నారు. -
భూమి పుత్రికలు
సురక్ష పేదింటి బాలికల పేరిట బెంగాల్ ప్రభుత్వం భూమి పట్టాలను మంజూరు చేయడంతో వారి జీవితానికి భరోసా ఏర్పడి క్రమంగా అక్కడ మైనర్ బాలికల వివాహలు తగ్గుముఖం పడుతున్నాయి. పదిహేనేళ్ల వయసున్న అమ్మాయిలు ప్రతి ఐదుగురిలో ఒకరికి పెళ్లి జరుగుతోంది. కాదు కాదు... పెళ్లి బంధంలోకి నెట్టివేతకు గురవుతున్నారు. అది కూడా, వాళ్లకంటే పదేళ్లకు పైగా వయసున్నవారు తాళి కడుతున్నారు. ఇది పశ్చిమబెంగాల్లోని మారుమూల గ్రామాల దుఃస్థితి. చిన్న వయసులోనే పెళ్లి... కుటుంబభారం, గర్భం మోయడం, పిల్లల్ని కనడం – ఈ చట్రంలో బందీలవుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం లేకపోవడంతో పిల్లల్ని కనలేకపోవడం, కన్నా ఆ పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం... ఇదీ పరిస్థితి. యునిసెఫ్ సర్వే చేసి నివేదిక ప్రకటించే వరకు అక్కడి గ్రామీణ మహిళ జీవితం ఇంతే. బాలికల విద్య, ఆరోగ్యం మీద సర్వే చేసిన యునిసెఫ్ పశ్చిమ బెంగాల్‌లోని మారుమూల గ్రామాలు తీవ్రమైన దారిద్య్రాన్ని అనుభవిస్తున్నాయని, ఆ ప్రభావం బాలికలు, మహిళల మీద పడుతోందని తెలిపింది. చదువులేకపోవడం, బాల్యవివాహాలు, పోషకాహార లోపం, లైంగిక హింస, ట్రాఫికింగ్ భూతాల నడుమ మహిళలు బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారని నివేదిక హెచ్చరించింది. యునిసెఫ్ హెచ్చరికతో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నిద్ర లేచింది. ఎందుకిలా జరుగుతోందని ఆరాలు తీసింది. ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే కట్నం ఇవ్వాలి. అమ్మాయి వయసు పెరిగే కొద్దీ మగపెళ్లి వారు ఎక్కువ కట్నం డిమాండ్ చేస్తారు. చిన్న పిల్ల అయితే తక్కువ కట్నంతో చేసుకుంటారు, కొంతమంది కట్నం లేకుండానూ చేసుకుంటారు. అందుకే పన్నెండేళ్లు నిండితే చాలు... స్కూలుకు పోతున్న అమ్మాయిని ఇంట్లో కూలేసి, పుస్తకాలు అటకెక్కించి, పుస్తెల తాడు మెళ్లో వేస్తున్నారు. అత్తవారింటికి పంపేసి తమ బరువు తీరిందని, తల్లితండ్రులుగా తమ బాధ్యతను కచ్చితంగా నిర్వర్తించామని ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈ ధోరణి ఇలాగే కొసాగితే ఆడపిల్లకు భవిష్యత్తే ఉండదని, ఏదో ఒకటి చేయకపోతే జరిగే అనర్థానికి కొన్ని తరాలు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని తలచిన బెంగాల్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ఒక చిన్న ప్రయత్నంతో... ఈ సమస్యకు పెద్ద పరిష్కారం చూపించింది. దాంతో ఇప్పుడు ఆ గ్రామాల్లో బాలికల ముఖాలు ఆనందంతో వెలుగుతున్నాయి. నిజానికి ఈ అద్భుతం జరగడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నం చాలా చిన్నదే. అయితే అది వైవిధ్యమైంది. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను వ్యవసాయం మీద ఆధారపడిన భూమిలేని పేదవారికి పంపిణీ చేయడం మామూలుగా జరిగేపని. ఇప్పుడు ఆ భూములను బాలికలకు ఇస్తున్నారు. వారి పేరుతోనే పట్టాలు జారీ చేస్తున్నారు. వ్యవసాయం, కూరగాయల పెంపకంలో వారికి శిక్షణ ఇప్పించి, మెలకువలు నేర్పే పనిని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. ఇప్పుడు బాలికలున్న ప్రతి ఇంటి పెరడూ కూరగాయల మొక్కలతో పచ్చగా ఉంది. ఇంటి అవసరాలకు పోను మిగిలిన వాటిని బయట విక్రయిస్తున్నారు. కొంతమంది అమ్మాయిలు ఆ డబ్బును పై చదువులకు సద్వినియోగం చేసుకుంటు న్నారు. ఒకప్పుడు ఆ గ్రామాల్లో ఆడపిల్ల అంటే తల మీద భారం అన్నట్లు ఉండేవారు తల్లితండ్రులు. అందుకే పన్నెండేళ్లు నిండితే చాలు... పెళ్లి చేసి భారాన్ని వదిలించుకున్నట్లు భావించేవారు. ఇప్పుడా గ్రామాల్లో తల్లిదండ్రులకు ఆడపిల్ల అంటే ఖర్చు కాదు... ఆస్తి! కట్నం కోసం కష్టపడక్కర్లేదు. కట్నం డబ్బు అల్లుడి దోసిట్లో పోసి తమ బిడ్డకు వేళకింత కడుపునిండా తిండి పెట్టమని వేడుకోవాల్సి అగత్యం లేదిప్పుడు. అమ్మాయి భూమి మీద హక్కు ఎప్పటికీ ఆ అమ్మాయిదే. తాను కడుపు నిండా తినగలుగుతుంది. నలుగురికి అన్నం పెట్టగలుగుతుంది. ఆరోగ్యకరమైన బిడ్డల్ని కనగలుగుతుంది. -
సంక్రాంతికి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్
హైదరాబాద్ : సంక్రాంతి పండుగకు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు మంత్రి చందులాల్ చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెలలో ఆగాఖాన్ ఫౌండేషన్ సహకారంతో పతంగుల ఉత్సవం చేపడుతున్నామన్నారు. కైట్ ఫెస్టివల్ ద్వారా వచ్చే నిధులను బాలికల విద్యను ప్రోత్సహించేందుకు వినియోగిస్తామని తెలిపారు. దేశ, విదేశీ కంపెనీలు ఈ పండుగలో పాల్గొంటాయన్నారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్లోను పతంగుల పండగ నిర్వహిస్తామని చందులాల్ వెల్లడించారు. -
ఉమ్మడి రాష్ట్రంలో బాలికల విద్యకు అన్యాయం
30 ఏళ్లలో కేవలం 134 మాత్రమే ఏడాదిలోనే 160 బాలికల గురుకులాలు ఏర్పాటు తాజాగా జిల్లాకు మూడు డిగ్రీ గురుకులాలు మంజూరు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట రూరల్ : ఉమ్మడి రాష్ట్రంలో బాలికల విద్యకు తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బాలికల విద్య కోసం 1985 నుంచి 2015 వరకు 30 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 134 పాఠశాలలు ఏర్పాటు చేస్తే తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఈ ఏడాదిలోనే 160 బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలు మంజూరు చేసి, వారి విద్యాభివృద్ధికి దోహదపడుతున్నట్టు చెప్పారు. ఆదివారం మండలంలోని మిట్టపల్లి, ఎల్లుపల్లి శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో డార్మిటరీ హాల్, తల్లిదండ్రులకు విశ్రాంతి భవనం, డిజిటల్ ల్యాబ్, క్లాస్ రూంలను ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో 30 మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలు మంజూరైనట్టు చెప్పారు. ఇందులో మూడు కళాశాలలు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డిలకు మం జూరైనట్టు చెప్పారు. అంతకు ముందు మండలంలోని పుల్లూర్ బండ శ్రీ లకీ‡్ష్మనరసింహస్వామి ఆలయ ఆవరణలో ఆదివారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డిలు మొక్కలు నాటారు.