30 వేలమంది అమ్మాయిలకు విద్యాదానం | Social Worker Nishita Rajput Of Vadodara Crowd Sourced 3.25 Crores to educate 30,000 underprivileged girls | Sakshi
Sakshi News home page

30 వేలమంది అమ్మాయిలకు విద్యాదానం

Published Tue, Feb 16 2021 12:00 AM | Last Updated on Tue, Feb 16 2021 5:29 AM

Social Worker Nishita Rajput Of Vadodara Crowd Sourced 3.25 Crores to educate 30,000 underprivileged girls - Sakshi

విద్యార్థినులకు పుస్తకాలు, చెక్కులు అందిస్తున్న నిషితా రాజ్‌పుత్‌

‘అమ్మాయిలను విద్యావంతులను చేయండి’ అనే నినాదంతో పాటు వారి చదువు కోసం 12 ఏళ్లలో 3.25 కోట్ల నిధిని సమీకరించి, అవసరమైన వారికి అందజేసింది. తన పెళ్లికోసం జమ చేసిన డబ్బు ను కూడా నిరుపేదల చదువుకోసం కేటాయించింది 28 ఏళ్ల నిషితా రాజ్‌పుత్‌ వడోదర. ‘నా జీవితం పేద అమ్మాయిలను విద్యావంతులను చేయడానికే అంకితం’ అంటున్న నిషిత ఉంటున్నది గుజరాత్‌. ఆర్థిక లేమి కారణంగా అమ్మాయి ల చదువులు ఆగిపోకూడదన్న ఆమె ఆశయం  అందరి అభినందనలు అందుకుంటోంది. ఈ సంవత్సరం 10 వేల మంది బాలికలకు ఫీజులు కట్టి, వారికి ఉన్నత విద్యావకాశాలను కల్పించిన నిషిత 2010లో 151 మంది అమ్మాయిలకు ఫీజులను కట్టడంతో ఈ సాయాన్ని ప్రారంభించింది. ప్రతి యేడాది ఈ సంఖ్యను పెంచుతూ వస్తోంది. గుజరాతీ అయిన నిషిత ఇప్పటి వరకు దాదాపు 30 వేల మంది అమ్మాయిల ఉన్నత విద్యకు ఫీజులు చెల్లించింది.  

తండ్రి సాయంతో ..
 ‘నా 12 ఏళ్ల వయస్సులో, నా క్లాస్‌మేట్‌ ఒక అమ్మాయి సడన్‌గా స్కూల్‌ మానేసింది. తను డబ్బు లేక చదువు ఆపేసిందనే విషయం చాలా రోజుల వరకు నాకు తెలియలేదు. ఆ పరిస్థితి మరి ఏ పేద అమ్మాయికీ రాకూడదనుకున్నాను. నా ఆశయానికి మా నాన్న నాకు అండగా నిలిచారు’ అని చెప్పింది నిషిత మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందన్న ప్రశ్నకు సమాధానంగా.  నిషిత తండ్రి గులాబ్‌ సింగ్‌ వ్వాపారి. తండ్రి సాయంతో మొదట్లో తనకు తెలిసిన అమ్మాయిలకు ఫీజులు చెల్లిస్తూ ఉండేది. సంఖ్య పెరుగుతున్న కొద్దీ డబ్బు అవసరం మరింత పెరుగుతుందని అర్థం అయాక, తెలిసినవారి ద్వారా నిధులను సేకరించడం మొదలుపెట్టింది. అలా ఇప్పటి వరకు దాదాపు 30 వేల మంది అమ్మాయిలకు ఫీజులు చెల్లించింది. ఈ సంవత్సరం 10,000 మంది అమ్మాయిలకు ఫీజులు ఏర్పాటు చేసింది. 

పెళ్లికి దాచిన డబ్బు చదువులకు..
అమ్మాయిల చదువుకు అవసరమైనప్పుడు తన పెళ్లి కోసం దాచిపెట్టిన లక్షన్నర రూపాయలను 21 మంది అమ్మాయిల పేరిట ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసింది. నిరుపేద అమ్మాయిల చదువుకు ఫీజు చెల్లించడమే కాకుండా, వారికి స్కూల్‌ బ్యాగులు, పుస్తకాలు,. పండుగ సందర్భాలలో బట్టలు అందజేస్తుంది. టిఫిన్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి, మహిళలకు ఉపాధిని ఇచ్చింది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులకు ఉచితంగా టిఫిన్లు పెట్టే సదుపాయాన్ని కల్పించింది. నిషిత చేసే సేవలో దేశంలోని ప్రముఖులు మాత్రమే కాదు, అమెరికన్‌ సంస్థలు కూడా జత చేరాయి. ఒక్క అడుగుతో నిషిత మొదలుపెట్టిన ఈ విద్యాదానానికి ఇప్పుడు ఎన్నో అడుగులు జత కలిశాయి. ‘ఈ విద్యాయజ్ఞంలో మేము సైతం...’ అంటూ కదలివస్తున్నాయి. నిషిత లాంటి యువత చేసే మంచి ప్రయత్నాలు ఎంతోమందికి జ్ఞానకాంతిని చూపుతూనే ఉంటాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement