Nishitha
-
శ్రీమిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా–2023 'రన్నరప్' గా నిర్మల్ యువతి
సాక్షి, ఆదిలాబాద్: ఫ్యాషన్‌రంగంపై మక్కువతో అందులో ఎదుగుతున్న నిర్మల్ యువతి అరుదైన స్థానంలో నిలిచింది. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన శ్రీమిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా–2023శ్రీ పోటీల్లో జిల్లా కేంద్రానికి చెందిన నిషిత తిరునగరి ఒక్క మార్కు తేడాలో రన్నరప్‌గా నిలిచింది. స్థానిక ఈద్గాంకు చెందిన సరళ, మనోహర్‌స్వామి దంపతుల కూతురు నిషిత బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చదివింది. భవిష్యత్తుపై తనకున్న నమ్మకం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఫ్యాషన్‌రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె 18రాష్ట్రాల మహిళలు, యువతులకు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్‌డిఫెన్స్ కోర్సును నేర్పిస్తుండడం గమనార్హం. ఢిల్లీలో జరిగిన పోటీల్లో నిషిత రన్నరప్‌గా నిలువడంపై కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: అలనాడే పాన్ ఇండియా నటుడు అక్కినేని -
Nishitha Rajput: 3 కోట్ల రూపాయలు సేకరించింది.. నువ్వు చల్లంగుండాలమ్మా!
Nishitha Rajput: వడోదరా, గుజరాత్... ఆరోజు నిషిత రాజ్‌పుత్ వాళ్ల ఇంటికి పని మనిషి తన కూతుర్ని తీసుకువచ్చింది. ఆ అమ్మాయి వయసు పద్నాలుగు సంవత్సరాలు. ‘ఏం చదువుతున్నావు?’ అని పలకరింపుగా అడిగింది నిషిత. ఆ అమ్మాయి సమాధానం చెప్పక ముందే వాళ్ల అమ్మ ఇలా అంది ‘ఆడపిల్లకు చదువు ఎందుకమ్మా. ఇంక రెండు సంవత్సరాలు ఆగితే పెళ్లి చేయడమే కదా...’ ఆ అమ్మాయిలో ఎలాంటి స్పందన లేదు. కళ్లలో అంతులేని అమాయకత్వం కనిపించింది. తమ బంధువులలో కూడా అమ్మాయిల చదువు గురించి పెద్దగా ఆలోచించరని పనిమనిషి చెప్పినప్పుడు... ఆ సమయంలో తనకు అనిపించింది ‘ఇలా జరగడానికి వీలులేదు’ అని. చిన్నప్పుడు స్కూల్లో, ఇంట్లో తల్లిదండ్రుల నోట విన్న ‘అన్ని దానాలలో కంటే విద్యాదానం గొప్పది’ అనే మాట తనకు బాగా నచ్చే మాట. ఎందుకంటే చదువు ఎంతోమంది జీవితాల్లో నింపిన వెలుగును తాను స్వయంగా చూసింది. కొన్ని తరాల సామాజిక స్థాయిని మార్చిన చదువు అనే శక్తిని తాను చూసింది. తమ చుట్టుపక్కల ప్రాంతాలలో 150 మంది వరకు అమ్మాయిలు బడికి దూరంగా ఉన్నారు. వారిని బడికి పంపించేలా తల్లిదండ్రులను ఒప్పించింది. ఫీజులో రాయితీ కోసం మహారాణి స్కూల్, శ్రీవిద్యాలయ....మొదలైన స్థానిక పాఠశాలల సహకారం తీసుకుంది. ఈ కృషి తక్కువ కాలంలోనే సత్ఫాలితాలు ఇవ్వడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో తన కార్యక్రమాన్ని మరింత విస్తృతపరచాలనే ఆలోచనకు వచ్చింది నిషిత. ఇందుకు నిధుల సేకరణ అనేది తప్పనిసరి. అయితే అది అంత తేలికైన విషయం కాదు అనేది తనకు తెలుసు. అనుమానాలుంటాయి... అవమానించే మాటలు వినిపిస్తాయి. తాను ఊహించినట్లుగానే జరిగింది. ‘ఎవరో ముక్కూముఖం తెలియని అమ్మాయి కోసం మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి?’ అని ఒకరంటే... ‘మేము ఇచ్చే డబ్బులు దుర్వినియోగం కావని గ్యారెంటీ ఏం ఉంది?’ అంటారు ఇంకొకరు. దీంతో నిధుల సేకరణలో పారదర్శక విధానానికి రూపకల్పన చేసింది నిషిత. అందులో ఒకటి దాతలు రాసే చెక్‌లు స్కూల్ పేరు మీద ఉంటాయి. తాము ఇచ్చే డబ్బు ఏ అమ్మాయి చదువు కోసం వినియోగిస్తున్నారు అనే దాని గురించి పూర్తి వివరాలు ఇస్తారు. ఈ విధానం మంచి ఫలితాన్ని ఇచ్చింది. కొందరు దాతలు తాము చదివిస్తున్న పిల్లల దగ్గరకు వెళ్లి స్వయంగా మాట్లాడేవారు. కేవలం డబ్బు ఇవ్వడమే కాకుండా చదువులో వారు ఎలా రాణిస్తున్నారో తెలుసుకోవడం మంచి విషయం అంటుంది నిషిత. కొందరు దాతలు పేద మహిళలకు కుట్టుమిషన్లు కొనిస్తారు. దీనివల్ల తాము ఉపాధి పొందడమే కాదు పిల్లల చదువుకు ఆసరా అవుతుంది. ‘నా భర్త ఆటో నడుపుతాడు. అయితే అప్పుల వల్ల పిల్లలను చదివించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఎవరో నిషిత గురించి చెప్పారు. వెళ్లి కలిస్తే వెంటనే సహాయం చేశారు. ఆమె చేసిన మేలు మరవలేము’ అంటుంది కృతజ్ఞతాపూర్వకంగా చంద్రిక గోస్వామి. నిషితను నిండు మనసుతో దీవించే వందలాది మందిలో చంద్రిక ఒకరు. ఒక అంచనా ప్రకారం మూడు కోట్ల రూపాయల సేకరణ ద్వారా 34,000 బాలికలు విద్యావంతులు కావడానికి సహకారం అందించింది నిషిత రాజ్‌పుత్. చదవండి: Priyanka Nanda: బాలీవుడ్లో అడుగుపెట్టాలనుకుంది.. కానీ గ్లామర్ ప్రపంచాన్ని వదిలి గ్రామానికి.. సర్పంచ్‌గా పోటీ! View this post on Instagram A post shared by Baisa Nishita Rajput (@rajputnishitabaisa) -
30 వేలమంది అమ్మాయిలకు విద్యాదానం
‘అమ్మాయిలను విద్యావంతులను చేయండి’ అనే నినాదంతో పాటు వారి చదువు కోసం 12 ఏళ్లలో 3.25 కోట్ల నిధిని సమీకరించి, అవసరమైన వారికి అందజేసింది. తన పెళ్లికోసం జమ చేసిన డబ్బు ను కూడా నిరుపేదల చదువుకోసం కేటాయించింది 28 ఏళ్ల నిషితా రాజ్‌పుత్ వడోదర. ‘నా జీవితం పేద అమ్మాయిలను విద్యావంతులను చేయడానికే అంకితం’ అంటున్న నిషిత ఉంటున్నది గుజరాత్. ఆర్థిక లేమి కారణంగా అమ్మాయి ల చదువులు ఆగిపోకూడదన్న ఆమె ఆశయం అందరి అభినందనలు అందుకుంటోంది. ఈ సంవత్సరం 10 వేల మంది బాలికలకు ఫీజులు కట్టి, వారికి ఉన్నత విద్యావకాశాలను కల్పించిన నిషిత 2010లో 151 మంది అమ్మాయిలకు ఫీజులను కట్టడంతో ఈ సాయాన్ని ప్రారంభించింది. ప్రతి యేడాది ఈ సంఖ్యను పెంచుతూ వస్తోంది. గుజరాతీ అయిన నిషిత ఇప్పటి వరకు దాదాపు 30 వేల మంది అమ్మాయిల ఉన్నత విద్యకు ఫీజులు చెల్లించింది. తండ్రి సాయంతో .. ‘నా 12 ఏళ్ల వయస్సులో, నా క్లాస్మేట్ ఒక అమ్మాయి సడన్‌గా స్కూల్ మానేసింది. తను డబ్బు లేక చదువు ఆపేసిందనే విషయం చాలా రోజుల వరకు నాకు తెలియలేదు. ఆ పరిస్థితి మరి ఏ పేద అమ్మాయికీ రాకూడదనుకున్నాను. నా ఆశయానికి మా నాన్న నాకు అండగా నిలిచారు’ అని చెప్పింది నిషిత మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందన్న ప్రశ్నకు సమాధానంగా. నిషిత తండ్రి గులాబ్ సింగ్ వ్వాపారి. తండ్రి సాయంతో మొదట్లో తనకు తెలిసిన అమ్మాయిలకు ఫీజులు చెల్లిస్తూ ఉండేది. సంఖ్య పెరుగుతున్న కొద్దీ డబ్బు అవసరం మరింత పెరుగుతుందని అర్థం అయాక, తెలిసినవారి ద్వారా నిధులను సేకరించడం మొదలుపెట్టింది. అలా ఇప్పటి వరకు దాదాపు 30 వేల మంది అమ్మాయిలకు ఫీజులు చెల్లించింది. ఈ సంవత్సరం 10,000 మంది అమ్మాయిలకు ఫీజులు ఏర్పాటు చేసింది. పెళ్లికి దాచిన డబ్బు చదువులకు.. అమ్మాయిల చదువుకు అవసరమైనప్పుడు తన పెళ్లి కోసం దాచిపెట్టిన లక్షన్నర రూపాయలను 21 మంది అమ్మాయిల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. నిరుపేద అమ్మాయిల చదువుకు ఫీజు చెల్లించడమే కాకుండా, వారికి స్కూల్ బ్యాగులు, పుస్తకాలు,. పండుగ సందర్భాలలో బట్టలు అందజేస్తుంది. టిఫిన్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి, మహిళలకు ఉపాధిని ఇచ్చింది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులకు ఉచితంగా టిఫిన్లు పెట్టే సదుపాయాన్ని కల్పించింది. నిషిత చేసే సేవలో దేశంలోని ప్రముఖులు మాత్రమే కాదు, అమెరికన్ సంస్థలు కూడా జత చేరాయి. ఒక్క అడుగుతో నిషిత మొదలుపెట్టిన ఈ విద్యాదానానికి ఇప్పుడు ఎన్నో అడుగులు జత కలిశాయి. ‘ఈ విద్యాయజ్ఞంలో మేము సైతం...’ అంటూ కదలివస్తున్నాయి. నిషిత లాంటి యువత చేసే మంచి ప్రయత్నాలు ఎంతోమందికి జ్ఞానకాంతిని చూపుతూనే ఉంటాయి. -
కట్నం వేధింపులకు గర్భిణి బలి
మియాపూర్, న్యూస్‌లైన్ : ‘నిర్భయ’ కేసులో నిందితులకు కఠిన శిక్షలు విధిస్తూ న్యాయస్థానాలు తీర్పు వెలువరిస్తున్నా మహిళపై వేధింపులు ఆగడం లేదు. వరకట్నం వేధింపులు తాళలేక నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ సుధీర్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్జిల్లా గోదావరిఖనికి చెందిన నిశిత(24)ను ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన శ్రీనివాస్‌కు ఇచ్చి మూడున్నరేళ్ల క్రితం వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో కట్నకానుకలను ఇచ్చారు. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. నిశిత ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. ప్రైవేట్బ్యాంక్లో పనిచేస్తున్న శ్రీనివాస్ మియాపూర్‌లోని జనప్రియ అపార్టుమెంట్స్‌లో భార్య, తన తల్లి రాజేశ్వరితో కలిసి ఉం టున్నాడు. ఇదిలా ఉండగా, అదనపు కట్నం తీసుకురావాలని కొంతకాలంగా అత్తింటి వారు నిశితను వేధిస్తున్నారు. వీటిని తాళలేక నిశిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గం టలకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే ఆమె చనిపోయి ఉంది. వారి సమాచారం మేరకు కూకట్పల్లి ఏసీపీ మల్లారెడ్డి, సీఐ సుధీర్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కట్న వేధింపులు తాళలేకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మతురాలి తల్లిదండ్రులు పేర్కొన్నారు. పోలీసులు ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.