మియాపూర్, న్యూస్‌లైన్ : ‘నిర్భయ’ కేసులో నిందితులకు కఠిన శిక్షలు విధిస్తూ న్యాయస్థానాలు తీర్పు వెలువరిస్తున్నా మహిళపై వేధింపులు ఆగడం లేదు. వరకట్నం వేధింపులు తాళలేక నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ సుధీర్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌జిల్లా గోదావరిఖనికి చెందిన నిశిత(24)ను ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన శ్రీనివాస్‌కు ఇచ్చి మూడున్నరేళ్ల క్రితం వివాహం జరిపించారు.
పెళ్లి సమయంలో కట్నకానుకలను ఇచ్చారు. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. నిశిత ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. ప్రైవేట్‌బ్యాంక్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్ మియాపూర్‌లోని జనప్రియ అపార్టుమెంట్స్‌లో భార్య, తన తల్లి రాజేశ్వరితో కలిసి ఉం టున్నాడు. ఇదిలా ఉండగా, అదనపు కట్నం తీసుకురావాలని కొంతకాలంగా అత్తింటి వారు నిశితను వేధిస్తున్నారు. వీటిని తాళలేక నిశిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గం టలకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే ఆమె చనిపోయి ఉంది. వారి సమాచారం మేరకు కూకట్‌పల్లి ఏసీపీ మల్లారెడ్డి, సీఐ సుధీర్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కట్న వేధింపులు తాళలేకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మతురాలి తల్లిదండ్రులు పేర్కొన్నారు. పోలీసులు ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కట్నం వేధింపులకు గర్భిణి బలి
Published Sat, Sep 14 2013 3:35 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
Advertisement