పెదకాకాని: జీవితాంతం తోడు ఉండాల్సిన భర్త, కన్న తల్లిలా ఆదరించాల్సిన అత్తల వేధింపులు భరించలేక ఓ వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పలపాడు గ్రామంలో చోటు చేసుకుంది. కట్నం తీసుకురావాలంటూ చీటికి మాటికి వారు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ఏడాదిన్నర కన్నబిడ్డను కూడా వదిలి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన కావూరు రాఘవేంద్రరావుకు మూడేళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ప్రభావతితో వివాహం అయింది. వారి దాంపత్యజీవితం ఆరంభంలో సాఫీగానే సాగింది.
వారికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. కొంతకాలంగా అత్త మల్లేశ్వరి పుట్టింటి నుంచి కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేస్తోంది. భర్త రాఘవేంద్రరావు సైతం తల్లి మాటలకే వత్తాసు పలకడంతో ప్రభావతి ఎవరికీ చెప్పుకోలేని వేదన అనుభవించింది. ఈ నేపథ్యంలో ఈనెల 10 వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగింది. చికిత్స కోసం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ప్రభావతి(24) గురువారం రాత్రి మృతి చెందింది. మృతురాలి మరణవాగ్మూలం, ఆమె తల్లి రామతులశమ్మ ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ పి.శేషగిరిరావు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment