Nishitha Rajput: వడోదరా, గుజరాత్... ఆరోజు నిషిత రాజ్‌పుత్ వాళ్ల ఇంటికి పని మనిషి తన కూతుర్ని తీసుకువచ్చింది. ఆ అమ్మాయి వయసు పద్నాలుగు సంవత్సరాలు. ‘ఏం చదువుతున్నావు?’ అని పలకరింపుగా అడిగింది నిషిత. ఆ అమ్మాయి సమాధానం చెప్పక ముందే వాళ్ల అమ్మ ఇలా అంది ‘ఆడపిల్లకు చదువు ఎందుకమ్మా. ఇంక రెండు సంవత్సరాలు ఆగితే పెళ్లి చేయడమే కదా...’
ఆ అమ్మాయిలో ఎలాంటి స్పందన లేదు. కళ్లలో అంతులేని అమాయకత్వం కనిపించింది. తమ బంధువులలో కూడా అమ్మాయిల చదువు గురించి పెద్దగా ఆలోచించరని పనిమనిషి చెప్పినప్పుడు... ఆ సమయంలో తనకు అనిపించింది ‘ఇలా జరగడానికి వీలులేదు’ అని. చిన్నప్పుడు స్కూల్లో, ఇంట్లో తల్లిదండ్రుల నోట విన్న ‘అన్ని దానాలలో కంటే విద్యాదానం గొప్పది’ అనే మాట తనకు బాగా నచ్చే మాట.
ఎందుకంటే చదువు ఎంతోమంది జీవితాల్లో నింపిన వెలుగును తాను స్వయంగా చూసింది. కొన్ని తరాల సామాజిక స్థాయిని మార్చిన చదువు అనే శక్తిని తాను చూసింది. తమ చుట్టుపక్కల ప్రాంతాలలో 150 మంది వరకు అమ్మాయిలు బడికి దూరంగా ఉన్నారు. వారిని బడికి పంపించేలా తల్లిదండ్రులను ఒప్పించింది. ఫీజులో రాయితీ కోసం మహారాణి స్కూల్, శ్రీవిద్యాలయ....మొదలైన స్థానిక పాఠశాలల సహకారం తీసుకుంది.
ఈ కృషి తక్కువ కాలంలోనే సత్ఫాలితాలు ఇవ్వడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో తన కార్యక్రమాన్ని మరింత విస్తృతపరచాలనే ఆలోచనకు వచ్చింది నిషిత. ఇందుకు నిధుల సేకరణ అనేది తప్పనిసరి. అయితే అది అంత తేలికైన విషయం కాదు అనేది తనకు తెలుసు. అనుమానాలుంటాయి... అవమానించే మాటలు వినిపిస్తాయి. తాను ఊహించినట్లుగానే జరిగింది. ‘ఎవరో ముక్కూముఖం తెలియని అమ్మాయి కోసం మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి?’ అని ఒకరంటే... ‘మేము ఇచ్చే డబ్బులు దుర్వినియోగం కావని గ్యారెంటీ ఏం ఉంది?’ అంటారు ఇంకొకరు.
దీంతో నిధుల సేకరణలో పారదర్శక విధానానికి రూపకల్పన చేసింది నిషిత. అందులో ఒకటి దాతలు రాసే చెక్‌లు స్కూల్ పేరు మీద ఉంటాయి. తాము ఇచ్చే డబ్బు ఏ అమ్మాయి చదువు కోసం వినియోగిస్తున్నారు అనే దాని గురించి పూర్తి వివరాలు ఇస్తారు. ఈ విధానం మంచి ఫలితాన్ని ఇచ్చింది. కొందరు దాతలు తాము చదివిస్తున్న పిల్లల దగ్గరకు వెళ్లి స్వయంగా మాట్లాడేవారు. కేవలం డబ్బు ఇవ్వడమే కాకుండా చదువులో వారు ఎలా రాణిస్తున్నారో తెలుసుకోవడం మంచి విషయం అంటుంది నిషిత.
కొందరు దాతలు పేద మహిళలకు కుట్టుమిషన్లు కొనిస్తారు. దీనివల్ల తాము ఉపాధి పొందడమే కాదు పిల్లల చదువుకు ఆసరా అవుతుంది. ‘నా భర్త ఆటో నడుపుతాడు. అయితే అప్పుల వల్ల పిల్లలను చదివించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఎవరో నిషిత గురించి చెప్పారు.
వెళ్లి కలిస్తే వెంటనే సహాయం చేశారు. ఆమె చేసిన మేలు మరవలేము’ అంటుంది కృతజ్ఞతాపూర్వకంగా చంద్రిక గోస్వామి. నిషితను నిండు మనసుతో దీవించే వందలాది మందిలో చంద్రిక ఒకరు. ఒక అంచనా ప్రకారం మూడు కోట్ల రూపాయల సేకరణ ద్వారా 34,000 బాలికలు విద్యావంతులు కావడానికి సహకారం అందించింది నిషిత రాజ్‌పుత్.
Comments
Please login to add a commentAdd a comment