రెక్కలు విరిచేస్తున్నారు.. | Taliban says women banned from universities in Afghanistan | Sakshi
Sakshi News home page

రెక్కలు విరిచేస్తున్నారు..

Published Thu, Dec 22 2022 4:06 AM | Last Updated on Thu, Dec 22 2022 4:06 AM

Taliban says women banned from universities in Afghanistan - Sakshi

కాబూల్‌ వర్సిటీ ముందు విద్యార్థినుల అడ్డగింత

అఫ్గానిస్తాన్‌లో చదువుకునే అమ్మాయిలు భయపడినంతా జరిగింది. ఏదో ఒక రోజు ఉన్నత విద్యకి తాము దూరమవుతామని మహిళల ఆందోళనలు నిజమయ్యాయి. యూనివర్సిటీల్లో ఇక మహిళలకి ప్రవేశం లేదని తాలిబన్లు హుకుం జారీ చేశారు. అంతర్జాతీయంగా వస్తున్న అభ్యంతరాలను బేఖాతర్‌ చేస్తూ,  అఫ్గాన్‌ మహిళలు కన్న కలల్ని కల్లలు చేస్తూ వారి హక్కుల్ని నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్నారు. తాలిబన్ల తాజా ఆదేశాలను వ్యతిరేకిస్తూ కాబూల్‌లో అమ్మాయిలు నిరసన ప్రదర్శనలకి దిగితే వాటిని ఉక్కుపాదంతో అణిచివేశారు.

యూనివర్సిటీల దగ్గర తాలిబన్‌ బలగాలు భారీగా మోహరించి అమ్మాయిలు రాకుండా అడ్డుకుంటున్నారు. గత ఏడాది అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోయాక 2021, ఆగస్టు 15న తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు మహిళలకు అండగా ఉంటామని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఈ ఏడాదిన్నర కాలంలో మహిళల పరిస్థితి మరింత దుర్భరంగా మారిపోయింది. ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమైపోతున్నారు.

రోజుకో కొత్త నిర్ణయంతో తాలిబన్లు మహిళల్ని తీవ్ర నిరాశ నిస్పృహలకి గురి చేయడంతో ఎందరో కుంగుబాటు సమస్యలతో బాధపడుతున్నారు. ఉన్నత విద్యకు అమ్మాయిల్ని దూరం చేయడంపై అమెరికా తీవ్ర స్థాయిలో మండిపడింది. అఫ్గాన్‌లో తాలిబన్లు మానవీయ సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని విమర్శించింది. కాబూల్‌ యూనివర్సిటీ బయట అమ్మాయిలు ఏడుస్తూ, ఒకరినొకరు ఓదార్చుకుంటున్న దృశ్యాలు మనసుని పిండేస్తున్నాయి. అఫ్గాన్‌ మహిళల ఛిద్రమైపోతున్న బతుకు చిత్రం ఎలా ఉందో చూద్దాం.

మగతోడు లేకుండా ప్రయాణాలకు నో  
మగతోడు లేకుండా మహిళలు ఎక్కువ దూరం ప్రయాణాలు చేయకూడదని తాలిబన్లు 2021 డిసెంబర్‌లో నియంత్రణ విధించారు. మహిళలు ఒంటరిగా 45 మైళ్ల కంటే ఎక్కువ దూరం వెళ్ల కూడదు. అఫ్గాన్‌ జనాభాలో 10% మందికి ఆస్పత్రికి వెళ్లాలంటే కనీసం రెండు గంటలు ప్రయాణించాలి. అత్యవసర సమయాల్లో కూడా మగవారు లేకపోతే మహిళలకు చికిత్స ఇవ్వడాన్ని కూడా తాలిబన్లు అడ్డుకున్నారు.  

బురఖా లేకపోతే రాళ్ల దాడులు
బురఖా లేకుండా మహిళలు అడుగు బయటకి పెడితే కఠిన శిక్షలు విధించడం మొదలు పెట్టారు. కాబూల్‌ వంటి నగరాల్లో ఈ నిబంధన గట్టిగా పాటించకపోయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు బురఖా లేకుండా వస్తే వారిని ఈడ్చుకువెళ్లడం, రాళ్లతో దాడి చేయడం వంటి అనాగరిక శిక్షలు విధించారు.  

45% బాలికలు డ్రాపవుట్‌
2021 సెప్టెంబర్‌ నుంచి అఫ్గాన్‌లో సెకండరీ స్కూల్స్‌లో అబ్బాయిలకే ప్రవేశం లభిస్తోంది. ఏడో తరగతి నుంచి అమ్మాయిల ప్రవేశాలను నిషేధించారు. పాథమిక, సెకండరీ పాఠశాలల నుంచి 45% మంది అమ్మాయిలు డ్రాపవుట్‌ అయ్యారు.

26% అమ్మాయిల్లో కుంగుబాటు
మహిళల్ని వంటింటికే పరిమితం చేయడానికి తాలిబన్లు కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో వారిని తీవ్ర నిరాశ నిస్పృహల్లోకి నెట్టేసింది. తాలిబన్ల రాక ముందున్న స్వేచ్ఛ కోల్పోవడంతో రెక్కలు తెగిన పక్షుల్లా విలవిలలాడుతున్నారు. అమ్మాయిల్లో 26% మంది మానసిక కుంగుబాటుతో బాధపడుతూ ఉంటే అబ్బాయిల్లో 16% మందికి ఆ సమస్య ఉంది. 27% అమ్మాయిలు ఆందోళన ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటే అబ్బాయిల్లో 18శాతంగా ఉంది. 

    – సాక్షి నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement