బాలికల చదువులకు బ్రేకులు | Epidemic had major impact on girls education in poor families | Sakshi
Sakshi News home page

బాలికల చదువులకు బ్రేకులు

Published Fri, Jan 28 2022 3:27 AM | Last Updated on Fri, Jan 28 2022 2:35 PM

Epidemic had major impact on girls education in poor families - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌తో విద్యారంగం తీవ్రంగా నష్టపోగా బాలికల చదువులు మరింత దెబ్బ తింటున్నాయి. పేద కుటుంబాల్లో బాలికా విద్యపై మహమ్మారి పెను ప్రభావమే చూపింది. మహిళా సాధికారితపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఇటీవల పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో బాలికల చదువులపై ఆందోళన వ్యక్తం చేసింది. బడికి వెళ్లే బాలికల్లో సగం మంది కోవిడ్‌ కారణంగా నష్టపోయారని పేర్కొంది. 

సగం మంది చదువులపై ప్రభావం..
దేశంలో పాఠశాల స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్యనభ్యసిస్తున్న బాలికలు 32 కోట్ల మంది ఉండగా 16 కోట్ల మంది చదువులపై కరోనా ప్రభావం పడినట్లు నివేదిక వెల్లడించింది. థర్డ్‌వేవ్‌లో మరింత నష్టం వాటిల్లకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించింది. డిజిటల్‌ బోధన.. ఆన్‌లైన్‌ తరగతులు అందుబాటులో లేక గ్రామీణ విద్యార్థులు ఎక్కువగా నష్టపోయారని పేర్కొంది. ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ కంటే కౌమార దశకు సంబంధించి సెకండరీ విద్యలో బాలికలు డ్రాపవుట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.

యూడైస్‌ ప్రకారం డ్రాపవుట్లు ఇలా..
యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ (యూడైస్‌) గణాంకాల ప్రకారం 2019 – 20లో జాతీయస్థాయిలో డ్రాపవుట్ల రేట్‌ ప్రాథమిక స్థాయిలో 1.22గా ఉండగా> ప్రాథమికోన్నత స్థాయిలో 2.96గా నమోదైంది. సెకండరీ స్థాయిలో 15.05గా ఉందని కమిటీ పేర్కొంది. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నా కౌమారదశలో విద్యార్థినులు చదువులకు దూరం కావడం ఆందోళన కలిగిస్తోందని కమిటీ పేర్కొంది. 

ఏపీలో ఎంతో మెరుగ్గా
ఆంధ్రప్రదేశ్‌లో బాలికల చదువులపై కోవిడ్‌ ప్రభావం చూపినా డ్రాపవుట్ల సమస్య తీవ్రం కాకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యలు నివారించగలిగాయి. విద్యార్ధుల చదువులకు ఇబ్బంది కలగకుండా దూరదర్శన్, ఆకాశవాణి ద్వారా బోధనా కార్యక్రమాలను ప్రసారం చేయడమే కాకుండా మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేక తెరలు అమర్చిన వాహనాలను పంపి వీడియో పాఠాల సౌలభ్యం కల్పించింది. స్కూళ్ల మూతతో మధ్యాహ్న భోజన అందక నిరుపేద విద్యార్ధులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముడి సరుకులను ప్రభుత్వం ఇళ్ల వద్దకే పంపింది. పేద విద్యార్థులు చదువుకునేలా ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేసింది. జగనన్న అమ్మ ఒడితోపాటు గోరుముద్ద, విద్యాకానుక లాంటివి ఇందుకు దోహదం చేశాయి. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా యూడైస్‌ గణాంకాలు చూస్తే బాలికల డ్రాపవుట్‌ రేట్‌ ఎలా తగ్గిందో గమనించవచ్చు. ఇతర రాష్ట్రాల్లో డ్రాపవుట్‌ రేటు 2019 – 20లో పెరగ్గా ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా తగ్గుదల కనిపించడం గమనార్హం. ప్రైమరీతోపాటు అప్పర్‌ ప్రైమరీ, సెకండరీ స్థాయిల్లో డ్రాపవుట్ల రేట్‌ తగ్గుదల నమోదైంది. రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో జీరో డ్రాపవుట్‌ రేట్‌ కొనసాగుతుండగా సెకండరీలో గతంతో పోలిస్తే పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది.

ఇంటింటి సర్వే, ప్రోత్సాహకాలతో..
‘‘బడికి దూరమైన బాలికల స్థితిగతులను ఇంటింటి సర్వే చేయడం ద్వారా పరిశీలించి చదువులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. ప్రత్యేకంగా బాలికల కోసం హాస్టళ్ల ఏర్పాటుతోపాటు చదువులు కొనసాగించేలా ప్రోత్సాహకాలు అందించాలి’’
– పార్లమెంటరీ కమిటీ సిఫారసు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement